ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -175
67- జర్మన్ జాతీయ భావ సోషలిజం వ్యాప్తి చేసిన -ఆస్వాల్డ్ స్పెంగ్లెర్
ఫ్రీడ్రిక్ నీషే పూర్తిగా పిచ్చివాడు కాకముందే అనేక భవిష్యత్ విషయాల పుస్తకాలు చాలా దూర దృష్టి మేధస్సు తో రాశాడు అవి జనాలను మేలుకోనేట్లు చేశాయి .అతని నిగూఢ భావనలు హిట్లర్ రాజకీయ టెర్రరిజానికి దారితీస్తాయని ,సింగ్లేర్ పూర్తిగా నిరాశ చెంది ‘’ది డిక్లైన్ ఆఫ్ ది వెస్ట్ ‘’రాస్తాడని వినిఉంటే నిశ్చేస్టుడయ్యేవాడు.ఏది ఏమైనా కానీ 19వ శతాబ్దపు అసంబద్ధ ప్రవక్త ,20వ శతాబ్దపు శిష్యులకోసం మార్గం ఏర్పరచి ,నియంత హిట్లర్ మారణ దమన విద్వేష మంత్రాల భయాన్నుంచి ప్రజలను తప్పించి ప్రశాంత భయంకర విపత్తును కళ్ళ ముందు నిలిపాడు .
29-5-1980న మధ్య జర్మనీలోని హార్త్జ్ పర్వతాలలో ఉన్న చిన్నగ్రామం బ్లాన్కేన్ బర్గ్ లో ఆస్వాల్డ్ స్పెంగ్లెర్ జన్మించాడు .అతని వంశ౦ రెండు విభిన్న వ్యక్తిత్వాల సమ్మేళనం .తల్లి వంశం వాళ్ళు వాళ్ళ రక్త౦శ్రేష్టమైనదని అంటారు ,అతని పిన్ని సంప్రదాయ డాన్సర్ ,తండ్రి తండ్రి అంటే తాత బాలెట్ మాస్టర్ .తండ్రి పూర్వీకులు దక్షిణ జర్మనీ నుంచి మూడు వందల ఏళ్ళకు పూర్వమే వచ్చారు .వాళ్ళు ఇంజనీర్లు ,గనుల త్రవ్వక సాంకేతికతలో నిపుణులు .తండ్రి కూడా అదే బాటలో నడిచి గనులు వట్టి పోయి నష్టం కష్టం మిగిలాక మానేసి కుటుంబాన్ని హల్లే కు మార్చాడు .ఆస్వాల్డ్ కు ముగ్గురు చెల్లెళ్ళు .ఇతనొక్కడే మగ పిల్లాడు .హల్లే లో హైస్కూల్ చదువు పూర్తీ చేసి అక్కడే యూని వర్సిటి లో చేరి ,తర్వాత మ్యూనిచ్, బెర్లిన్ వర్సిటీలలో చదివాడు .బెర్లిన్ నుండిప్రాచీన గ్రీక్ ఫిలాసఫర్ హెరాక్లిటస్ పై పరిశోధన చేసి పి.హెచ్ డిపొందినా,అతని అభిరుచి గణితం ,సైన్స్ లమీదే ఉండేది .
23 వ ఏటనే గణితం తోపాటు చరిత్ర జాగ్రఫీలు సారా బ్రికేన్ ,డీసెల్ డార్ఫ్ ,హాంబర్గ్ లలో బోధించాడు.30వ ఏట విశ్రాంతి కోసం సెలవు పెట్టి ,ఒక ఏడాది తర్వాత తనకేమీ రాలేదని గ్రహించాడు . తన అవగాహనా లోపాన్ని గ్రహించి టీచింగ్ కు స్వస్తి చెప్పాడు .బెర్లిన్ వాతావరణం దారుణం గా ఉండటం టో మ్యూనిచ్ వెళ్ళాడు .ఇది అన్నివిధాలా అనుకూలమైన ప్రదేశమని అనుకొన్నాడు .వంశ పారంపర్య ఆస్తి కొంత చేతికి వచ్చింది. దానికి తోడుగా పత్రికలలో రివ్యూలు రాసి డబ్బు సంపాదించాడు .మొదటి ప్రపంచ యుద్ధం అతని ఆర్ధిక స్థితిని దెబ్బ తీసింది .మ్యూనిచ్ లో నీచ పరిసరాలలో హీటింగ్ సౌకర్యం లేనిచిన్న గదిలో ,ఉంటూ ,కూలీల విశ్రాంతి ప్రదేశాలలో దొరికినదేదో తింటూ ,ఎక్కువ భాగం టీ తాగి బతికాడు .చలి నుండి రక్షించుకొనే దుస్తులు లేవు .కొవ్వొత్తి కాంతిలో రాసుకోనేవాడు .అవసర రిఫరెన్స్ పుస్తకాలు కొనటానికి డబ్బులు ఉండేవికావు .తన గదిని వెచ్చ చేసుకోవటానికి బొగ్గులు కొనే తాహతు కూడా ఉండేది కాదు .బుగ్గల ఎముకలు బయటికొచ్చి ,కళ్ళు మొరటుగా మారి తల బులెట్ షేప్ లో ఉండి,తలవెంట్రుకలన్నీ రాలిపోయి దాదాపు బట్ట తల వచ్చేసింది .అతనిది ఉత్తర జర్మనీ రక్తమే అయినా అందరూ స్వచ్చమైన ప్రష్యన్ రకం గా భావించారు .
38వ ఏట స్పెంగ్లెర్ ఎవరో ఎవరికీ తెలియదు .కాని ఆయన రాసిన ‘’ది డిక్లైన్ ఆఫ్ ది వెస్ట్ ‘’పుస్తకం విడుదలై ప్రష్యనిజాన్ని ప్రభావితం చేయటమే కాక ప్రపంచ వ్యాప్త ప్రకంపనలు సృష్టించింది . ఈ పుస్తకం 1918లో విడుదలై మొ. ప్ర .యు .లో జర్మనీ అధికార౦ కోసం చేస్తున్న పోటీ ఆఖరు రోజుల్లో వచ్చింది .డజను భాషల్లోకి అనువాదం పొంది ,అమెరికా ,జపాన్ యూరోపియన్ ,ల లోని చరిత్రకారుల్ని ,విద్యావేత్తలను కలవర పరచింది .ఈ పుస్తకం లో స్పెంగ్లెర్-వాగ్దాన భంగం చేసిన నాగరకత పతనాన్ని ,సర్వ నాశనం చేసి ,పాత భావ సృష్టి చేసే ఒక కొత్త శక్తి ఆవిర్భ విస్తుందని తెలియ జేశాడు .ఫాసిజం ,నేషనల్ సోషలిజం లు పూర్తీ వినాశానానికి పూర్తీ విధానం తో ఉన్నాయని ,ఉపేక్ష చేస్తే ప్రగతి మార్గం మాట దేవుడెరుగు అధోగతి పాలవ్వటం తప్పదని ,దీనితో నాగరకత క్షీణించి పోతుందని హెచ్చరించాడు .ఇప్పుడు తాత్కాలిక విజయం పొందిన వారికి భవిష్యత్తు లేదని ,బహుశా తెల్లజాతి విజేతలను మంగోలియన్ లేక ఆసియాకు చెందినమరొక జాతి ప్రక్కకు తొలగించి అధికారం హస్తగతం చేసుకొంటుందని ,భవిష్యత్తు స్పష్టంగా చెప్పాడు .ఈ పుస్తకం ను మరింత నిర్దుష్టంగా మార్చి 1923లో మళ్ళీ ముద్రించాడు .ఇందులో నీషే చెప్పిన నాగరకత అంటే మానవ జాతి ముసలిదైపోయి ,అంతం చెందటమే అని గుర్తు చేశాడు .పాశ్చాత్య మనిషి నాగరకంగా అభి వృద్ధి చెంది ,బలహీనమై నీరసించి ,స్థిర నిశ్చయం లేక ,ఆత్మ రక్షణ చేసుకోలేని పరిస్థితికి వస్తాడు కనుక తప్పక చావాల్సిందే ‘’అన్నాడు .
ప్రాచీన ,ఆధునిక ప్రపంచాల మధ్య ఉన్న సమాంతర విషయాలను చర్చిస్తూ స్పెంగ్లెర్ తన కృషి ఒక కొత్త ఫిలాసఫీ అని చెప్పి ‘’ఈ కొత్త ఫిలాసఫీ భవిష్యత్తుకు చెందినది .మెటా ఫిజికల్ గా అంతా కోల్పోయి ఊసర క్షేత్రమైన పశ్చిమ దేశాలవారు భరించే టంత కొత్తది .’’అని అన్నాడు.స్పింగ్లేర్ అభిప్రాయం లో ప్రతి సంస్కృతీ వసంత ,వేసవి ,శిశిర ,శీత అనే నాలుగు ఋతువులను దాటాలి .పడమటి దేశాలలో సంస్కృతీ వసంతం అంటే మధ్య యుగపు యుద్ధ పోరాటాలు గొప్ప కేధడ్రిల్ నిర్మాణాలు ,స్వేచ్చా కళా వికసనం ,అరిస్టోక్రసి సృజన లు . సాంస్కృతిక పునర్వికాసం అంటే రినైసేన్స్ ను వేసవి కాలం అన్నాడు .ఈ కాలం లో లియోనార్డో డావిన్సి ,గెలీలియో ,షేక్స్ పియర్ ,అజ్ఞానం నుండి నిరక్షరాస్యత సూపర్ నేచురలిజం నుండి విజ్ఞానం లోకి అక్షరాస్యత లోకి ప్రవేశం .ఇక శిశిరం అంటే సంస్కరణలు ,అరిస్టోక్రాటిక్ కల్చర్ మారిపోయి మధ్యతరగతి సాంప్రదాయ ప్రవేశం ,లోతైన సహజ జ్ఞానాన్ని ఒక ప్రత్యేక మేధావి తనం ఆక్రమి౦చ టం ,విశ్వాసానికి బదులు బలహీనమైన హేతువు పై ఆధార పడటం .19వశతాబ్దిని శీతాకాలం అన్నాడు .ఇది అసంతృప్తి ,వినాశనం .నాగరకత పూర్తీ అయిపోయి దానంతటికి అదే ఆధునిక నగర ,ధన శక్తి ,మూక సమూహ పెత్తనం తో నాశనమై పోయింది అంటాడు .
పడమటి ప్రపంచం విస్తృత నగరాల వలన తప్పనిసరి నాశనాన్ని కోరి తెచ్చుకొన్నది అంటాడు . వస్తువుల అసలు విలువను అది నాశనం చేసింది .కారణం అన్ని రకాల విలువలను డబ్బుతో కొలుస్తున్నారు .సాంస్కృతిక విషయాలు ,సాంఘికాచారాలను ఎక్కడో పట్టణం లో ఉండే జ్ఞానం ఉందనుకొంటున్న కొద్దిమంది వ్యతిరేకిస్తున్నారు .దీనితో అవగాహన లేని వారికీ మిగిలిన వారికి శత్రుత్వం కలుగుతోంది .సిటీ అంటే ఇ౦ పీరియలిజానికి విస్తృతి ,అదే నాగరకతకు అంతం .సంస్కృతీ సంపన్నుడు తన మేధస్సును ఆ౦తరింగికం గా ఉపయోగించుకొంటాడు ,నాగరకుడు బాహిరంగా తన శక్తి సామర్ధ్యాలను ప్రదర్శిస్తాడు .ఇతనిది స్వయంకృత ఓటమికి విస్తృత పరిధి అవుతోంది .విస్తరణ ప్రవ్రుత్తి వినాశ హేతువు .అన్నిటినీ చేతిలో పెట్టుకొని శక్తులను సేవకు వినియోగించుకొంటున్నాడు .ఈ పడమటి ప్రపంచ జనాలకు ఈ విషయం తెలుసో లేదోకాని వారి భవిష్యత్తు శీతాకాలం ,అతి విషాద భరితం ,అనూహ్యంగా ఉంది .మంచి కోరే హక్కు లేదు .కలలు కనే వారు మాత్రమె దీనికి ఏదో పరిష్కారం ఉందని అనుకొంటారు .ఆశావాది పిరికి వాడు .మనం ఈ కాలం లో పుట్టాం .కనుక కడదాకా ధైర్యంగా గమ్యానికి ఈ దారిలోనే ప్రయాణం చేయాలి .వేరే మార్గం లేదు .మన కర్తవ్యంచివరి దాకా కారణం లేకుండా ,ఆశ లేకుండా పట్టుకొని వేలాడటమే’’అంటాడు స్పెంగ్లెర్ .
‘’ కళ విషయానికి వస్తే మనం తూర్పు దేశాల వారి చేతిలో పరాజయమయ్యాం .పాశ్చాత్య సంస్కృతీ దాని నాగరకత తో పతనమైపోయింది .’’we have ruined classicism with soulless sentimentalities and destroyed pure form with multiple but meaningless decorations ‘’అని బాధ పడ్డాడు .’’ఇవాళ మనకేం మిగిలింది ? కృత్రిమ శబ్ద హోరుతో ,రణగొణ ధ్వనులు చెవులు బ్రద్దలయ్యే వాయిద్యాల హోరు అరుపులు తో ఒక నకిలీ సంగీతం, ఇతర దేశాల అసంబద్ధ ప్రభావం తో ,ప్రతి పదేళ్లకోసారి కొత్త శైలి పేరుతొ అసలు శైలే లేని నకిలీ పెయింటింగ్ తప్ప ఏం మిగిలింది మనకు ఏం మిగిలింది ?’’అని ఆవేదన చెందాడు అన్ని రంగాలలో దిగజారిపోతున్నవిలువలు, ప్రమాణాలను చూసి జీర్ణించుకోలేక బాధ పడ్డాడు .’’ఇప్పుడు మనకు అనుకరణ ,వక్రీకరణ ,పగిలిన అద్దం పెంకులు ,పరావర్తనాలకే పరావర్తనాలు మిగిలాయి. మనదైనదేదీ మనకు ఇప్పుడులేదు ‘’అన్నాడు .
ఇవన్నీ అచ్చంగా మన కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి నోటి నుండి వెలువడిన వాక్కుల్లా ,వారి సాహిత్య సర్వస్వ0 లో చెప్పిన విషయాలులాగా అనిపిస్తున్నాయి కదూ .”గ్రేట్ మైండ్స్ థింక్ అలైక్ ”అంటే ఇదే .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-16-ఉయ్యూరు