మామేనమామ గుండుగంగయ్య గారి 63ఏళ్ల నాలుగవ కొడుకు విశ్వనాధం జూన్ 27 సోమవారం రాత్రి కొంతకాలంగా కిడ్నీ వ్యాధి తో బాధపడి చనిపోయాడు .వాడిది ఒక వింత కధ . చిన్నప్పటి నుంచి మాటలు రావు .కానీ మంచి అవగాహన ఉండేది .వయసు వచ్చినా పసిపిల్లాడి మనస్తత్వం .చెప్పిన పని చేసేవాడు .మా ఇంటికి ఎప్పుడూ వస్తూ ఉండేవాడు .పిల్లల్ని ఆడించేవాడు .ఎత్తుకొనేవాడు పడేస్తాడేమోనని మా భయం .ఒక రకం గా జడ భరతుడు ,అవధూత . మా మామయ్య అత్తయ్య చాలా బాగా చూసుకునేవారు .మా మామయ్య చని పోయాక వాడి బాధ్యతను మూడవ కొడుకునరసయ్య ఇంటి బాధ్యతలు పొలం వ్యవహారాలతో పాటు వాడి బాధ్యతనూ తీసుకొన్నాడు ..వీడి అక్క చెల్లెల్లు తమ్ముళ్లు కూడా విశ్వనాధానికి సేవ చేసేవారు నరసయ్య కొడు కు కూతుళ్లు నలుగురూ అందరూ వాడిని ”విస్సు బాబాయ్ ”అని ఆత్మీయంగా పిలిచేవారు.వాడి సేవ చేసేవారు .వాడికి స్నానం కూడా ఎవరో ఒకరు చేయించాల్సిందే .అన్నంకూడా కలిపి నోట్లో పెట్టి తినిపించాల్సిందే.. .అయినా ఆడా మగా ఎవ్వరూ వాడినిఏవ గించుకోవటం కానీ విసుక్కోవటం కానీ చేసేవారు కాదు. బాధ్యతగా వాడి సేవ చేసేవారు . అంత ఓర్పుగా వాడికి కుటుంబం అంతా బాసటగా ఉండేవారు ..చురుగ్గా నడిచేవాడు నోటి వెంట ఎప్పుడూ చొంగ కారుతూ ఉండేది ఏదో మాటలు నోటి నుంచి వచ్చేవికాని అర్ధం తెలిసేది కాదు .ఇలాంటి వాళ్ళు మన ఊర్లో మరో ముగ్గురు ఉండేవారు .ఒకరు గోవింద రాజు శ్రీరామ మూర్తి గారబ్బాయి, రెండవ వాడు బూరగడ్డ బసవయ్య గారబ్బాయి మూడవ వాడు మా హిందీమాస్టారు కొడాలి రామారావు గారి అబ్బాయి .ఈ ముగ్గురికంటే విశ్వం చాలా నయం .వాళ్ళు ముగ్గురూ చొక్కా ఎవరైనా తొడిగితే తప్ప ఒంటి మీద ఉండేదికాదు ఎప్పుడూ దిశమొలతోనే రోడ్డు మీద ఉండేవారు .వీడు వాళ్ళకంటే వెయ్యి రెట్లు నయం చొక్కా లాగూ లేకుండా ఎప్పుడూ ఉండేవాడు కాదు .. మాటలు రావు అంతే . మా ఆవిడను అక్కయ్యా నన్ను బావ అని అస్పష్టంగా అనేవాడు .మా పిల్లలకూ వాడు అంటే ఆధరమే .వాళ్ళ ఇల్లు మాఇంటికి ఉత్తరం వైపునే ఉంది మధ్యలో చిన్న సందు ఉంది .సుమారు పదేళ్లక్రితం మా వీధిలోనే రోడ్డుమీద ఇల్లు కట్టుకొని అక్కడే వీడితో సహా ఉంటున్నారు .నరసయ్య నలుగురు కూతుళ్ళకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాడు .కొడుక్కి చేయాలి .మామామయ్య ఆస్థి లో విశ్వనాధానికి కూడా వాటా ఇచ్చాడు . ఆస్థి వాడికి ఉంది అని వీళ్ళు సేవ చేయలేదు .బాధ్యతగా చేశారు .బహుశా ఈ కాలం లో ఇలాంటి వాడి కి కుటుంబం ఇంతగా అండగా ఉండటం ఆశ్చర్యమే కలిగిస్తుంది .దాన్ని మా మామయ్య కొడుకు నర్సింహం ఆచరించిఆదర్శంగా నిలిచాడు .. నరసయ్య పిల్లలు విశ్వం అక్క చెల్లెల్లు అందరూ కలిసి విశ్వనాధానికి ఉత్సాహంగా షష్టి పూర్తి ఉత్సవం జరిపారు .
. విశ్వాన్ని హాస్పిటల్ లో కొంత కాలం ఉంచి కిడ్నీలకు ట్రీట్ మెంట్ ఇప్పించి రెండూ ఫెయిల్ అయ్యాయని,ఒకటి రెండు రోజులే అని డాక్టర్ చెబితే ఆదివారం ఉదయం మా ప్రక్కన ఉన్న వాళ్ళ పాత ఇంట్లో ఉంచి జాగ్రత్త్తగా చూశారు .సోమవారం రాత్రి పదిగంటలకు వాడు వెళ్లి పోయాడు .మంగళ వారం ఉదయం అంత్య క్రియలు జరిపి అప్పటి నుంచే విధి విధానంగా దినవారాలు ఈ పాత ఇంట్లో నే శిల ఉంచి పుల్లేరు గట్టుమీద ఉన్న ఊర తాతయ్య గారు కట్టించిన అపరకర్మల సత్రం లో చేస్తున్నారు . . . . మనమధ్య ఉన్న మనుషుల్లోనూ ఇంతటి సేవాభావం ఉన్న వాళ్లు న్నారని తెలియ జేయటానికే ఇదంతా .మా మామయ్యకు పక్షవాతం వచ్చినప్పుడు నరసయ్య చంటి పిల్లాడికి చేసినట్లు సేవ చేశాడు .విశ్వం తర్వాత వాడు మోహనాయ్ ఏం కామ్ బందరులో చదువుతూ మామామయ్య హాస్పిటల్ లో ఉండగా చూడటానికి వచ్చి ఉయ్యూరు సెంటర్ లో రోడ్డుమీద లారీ ఆక్సిడెంట్ లో చనిపోయాడు . అప్పుడూ ఇలానే సేవ చేసింది కుటుంబం . . వాళ్ళమ్మ అంటే మా అత్తయ్య కూ ఇలాగే సేవచేశాడు ఆవిడ పోయి దాదాపు ఆరేళ్ళుఅయి ఉంటుంది .పోనీ నర్సయ్య ఆరోగ్యమైనా బాగుందా అంటే వాడికీ బి పి ,షుగరు బాగా ఉన్నాయి ..అయినా ఏ లోటు రానీయకుండా తలిదండ్రులకు తమ్ముడికి ఈ విధంగా సేవ చేసి వాడూ వాడికుటుంబం రుణం తీర్చుకొన్నారు .ఇలాంటివాళ్ళు బహు అరుదు . మానవత్వం పరిమళించటం అంటే ఇదేనేమో !ఇవాళ 10 వ రోజు .ధర్మోదకాలు వదిలి వచ్చాను . మానవ సేవే మాధవ సేవ అని నిరూపించాడు నరసయ్య -దుర్గా ప్రసాద్
మామయ్యా . చాలా బాగా రాసావు. కళ్ళమ్మట నీళ్లు ఆగలేదు. వాడు మన అందరికి తెలుసు కదా. ఆ రోజులు గగుర్తుకు వచ్చాయి. వాడి ఆత్మ శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తాము. తెలిసిన వాళ్ళతో షేర్ చేసాను. థాంక్ యూ.