ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –202
76-స్పోర్టివ్ హ్యూమరిస్ట్ ,అన్ సోషల్ సటైరిస్ట్ గామారిన అమెరికన్ జర్నలిస్ట్ –రింగ్ లార్డేనర్
స్పోర్టివ్ హ్యూమరిస్ట్ గా జీవితం ప్రారంభించి,అసాంఘిక వ్యంగ్య రచయితగా మారిన అమెరికన్ జర్నలిస్ట్ రింగ్ లార్డేనర్ .మొదట రాసిన కధలన్నీ పూర్తీ వినోదం ఇచ్చినవే. తరువాతి రచనలు క్రూరంగా ,చిత్ర హింసగా ,నిరాశగా ,ఆత్మ న్యూనతగా ఉంటాయి .క్రిటిక్ జర్నలిస్ట్ అయిన విలియం బోలితో అతనిని ‘’ అమెరికా తయారు చేసిన అతి గొప్ప నిజాయితీ గల ఆశావాది ‘’(the greatest and sincerest pessimist America has produced )అన్నాడు .6 -3-1885న అమెరికా మిచిగాన్ రాష్ట్రము నైల్స్ లో పుట్టాడు .అసలు పేరు రింగ్ గోల్డ్ విల్మార్ లార్డేనర్ .పెద్దయ్యాక తానె రింగ్ డబ్ల్యు.లార్డేనర్ గా మార్చుకొన్నాడు ..మధ్యలో ఉన్న డబ్ల్యు ను అందరూ ‘’వర్మ్’’అని అపోహ పడుతారని దాన్నీ తీసేసి మిగిలిన పేరు ఉంచుకొన్నాడు .హైస్కూల్ చదువు అయ్యాక మిచిగన్ యూని వర్సిటి లో చేరి ఫుట్ బాల్ ,డెంటిస్ట్రి చదవాలనుకొన్నాడు .మిచిగన్అంటే మరీ ఇంట్లో నే ఉన్నట్లు ఉంటుందనుకొని చికాగో లో ఆర్మర్ ఇన్ స్టి ట్యూట్ లో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ లో మొదటి సెమిస్టర్ తర్వాత అలంకార శాస్త్రంచదివి బయటికొచ్చాడు నిరలంకారంగా .ర్రైల్ రోడ్ పనుల్లో కొంతకాలం ,సరుకు రవాణా ఏజెంట్ గా కొద్దికాలం పనిచేసి ఒక సారి అతి భారీగా ‘’క్రీం చీజ్ ‘’ను తప్పుడు అడ్రస్ కు పంపిస్తే ఉద్యోగం ఊడింది .గాస్ ఆఫీస్ లో బాయ్ లాగా అన్ని పనులు చేస్తూ వారానికి ఆరు డాలర్లు సంపాదించాడు .20 వయసులో ఇతని అన్నకు ఇండియానాలోని సౌత్ బెండ్ లో ‘’టైమ్స్ ‘’లో ఉద్యోగం వస్తే ,దాన్ని ఆతను తిరస్కరిస్తే మనోడు దాన్ని జాక్పాట్ లాఒడిసి పట్టుకొన్నాడు .రెండేళ్ళు అందులో రిపోర్టర్ గా పన్జేసి కోర్టులు ,పోలీస్ స్టేషన్లు ,బాల్ గేమ్స్ ,కొత్త సినిమాల రివ్యూలు ,,వినోద ప్రదర్శనలపై ప్రశంసలు ఒకటేమిటి సకల కళా వల్లభుడుగా అన్నీ రాశాడు .
22 వయసులో ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అయి మంచి పేరు పొందాడు .చికాగో ట్రిబ్యూన్ లో రాసిన ‘’ఇన్ ది వేక్ ఆఫ్ ది న్యూస్ ‘’అందర్నీ ఆకర్షించి ఒక నమూనా గా నిలిచి పోయింది .ఇరవైలలో చికాగో పిచ్చేర్ జాక్ కీఫే పై పరిహాసం ,సరదా కలిపి రాసిన కధలు ‘’ది సాటర్ డే ఈవెనింగ్ పోస్ట్ ‘’లో వస్తే పిచ్చ పిచ్చ గా నచ్చి అది ‘’యు నో మి అల్ ‘’గా పుస్తక రూపం పొందిన తర్వాత మరీ మరీ ఆకర్షణీయమైంది . విరగబడి పగలబడి పొట్ట చేక్కలయ్యేట్లు నవ్వుకొన్నారు చదివి .పాత్రలను అంత గొప్పగా హాస్యం రంగరించి తయారుచేయటం ఆషామాషీ కాదు –మన ముళ్ళపూడి వెంకట రమణ లాగా అంతే ‘’వీజీ ‘’కాదు .దీనిపై హెన్రి ఎల్.మెంకేన్ స్పందిస్తూ ‘’లార్డ్ నర్ తీర్చి దిద్దిన తీరు న భూతో గా ఉంది అమెరికా జనం దీన్ని బాగా అర్ధం చేసుకొని విపరీతంగా ఎంజాయ్ చేశారు ‘’అని రాశాడు .
1911 లో ఇంకా రిపోర్టర్ గానే ఉండగా పాతికేళ్ళ వయసులో ఎల్లిస్ ఆబ్బట్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆరడుగుల అందగాడు ,బలిష్ట మైన శరీరం రెండొందల పౌండ్ల బరువున్నవాడు .తండ్రి కావాలనే ఉబలాటం ఎక్కువ .నలుగురు మగపిల్ల తండ్రి అయ్యాడు .పెద్దకొడుకు జాన్ తండ్రిలాగానే స్పోర్ట్ రైటర్ అయ్యాడు .కామిక్ గాఘాటుగా రాసేవాడు .లార్డ్ నర్ లాగా రాయాలని చాలామంది ప్రయత్నించారుకాని అతని శైలి అందుకోలేక చతికిల పడ్డారు .అది ‘’అననుకరణీయం ‘’అని గ్రహించారు .అతని భాష సామాన్య అమెరికన్ మనిషి మాట్లాడేఇంగ్లీషే .ఆయన రాసే ఇంగ్లీష్ ను ఆయన పేరు మీద ‘’రింగ్లిష్’’అన్నారు .’’హల్లిబుల్స్ ట్రావెల్స్ ‘’,ట్రీట్ ఏం రఫ్ ‘’లు కూడా పూర్తిగా హాస్య రస పానీయాలే .అదే ప్రత్యేకతను సంతరించుకోన్నవే .
30 లోకి అడుగుపెట్టగానే హ్యూమరిస్ట్ స్తైరిస్ట్ గా రూపాంతరం చెందాడు .’’హౌ టు రైట్ షార్ట్ స్టోరీస్ ‘’,’’ది లవ్ నెస్ట్ (ప్రేమగూడు ) లు పూర్తిగా హాస్యాస్పద సంఘటనలతో ,వింత పరిస్థితు లతో కడుపుబ్బా నవ్వు పుట్టిస్తాయి .ఒక ప్రాంతానికి ,ఒక లెవెల్ కు మాత్రమే సంబందినవి కాకుండా అన్ని చోట్లా అన్ని తరహాల వారినీ ఆకర్షింఛి వినోదం పంచాయి .’’అలీబి ఇకి ‘’కూడా బేస్ బాల్ వజ్రం గురించినదే కాని ఇతి వృత్తం అసంబద్ధంగా ఉంటుంది .ఇందులోని ఫ్రాంక్ ఎర్నేల్ ఒక విదూషకుడు( క్లౌన్) కాదు అసలు మనిషే .అనిపిస్తాడు డికెన్స్ పాత్రలలాగా .’హెయిర్ కట్ ‘’ఒక అతి వాగుడు బార్బర్ యొక్క ఇబ్బంది ,చికాకు పరచే స్వగతం అయినా చిన్న పట్ణంలోని నిజజీవిత జోకర్ అనిపిస్తాడు .లవ్ నెస్ట్ పరోక్ష వివరణ .ఒక రిపోర్టర్ ఒక బిజినెస్ మాగ్నెట్ ను ఇంటర్వ్యు చేయటం .పాఠకుడిని బాధించి ,దిగ్భ్రాంతి చెందించి చివరికి కదిలించి స్థానిక భయాన్ని దిగాజారుడును కళ్ళ ముందు నిలుపుతుంది .పదికధలను 1924 లో పుస్తకంగా తెచ్చాడు .హాస్యం నుంచి సీరియస్నెస్ కు అతని ప్రస్థానం కనిపిస్తుంది .తరువాత తనకు తాను తక్కువ చేసుకొన్నాడు .ఈ పది కధలు కధలు ఎలా రాయాలో తెలియ జేసే మార్గ దర్శకత్వ౦ చేస్తాయి . .మిస్టరికద ఎలా ప్రచురింప బడిందో అందరికి మిస్టరీ గానే ఉంది .ఈ కధలలోని జీవులు చెడు పద్ధతులు న్నవారు ,అసహ్యం పుట్టించే తెలివి తక్కువ వాళ్ళు ,మధ్య వయసున్న కౌమారదశవాళ్ళు ,తప్పు చేసి దాక్కొనే నకిలీ వాళ్ళు ,చవకబారువాళ్ళు ,పనికి మాలిన వాళ్ళు .వీళ్ళను చూసి పెద్దగా నవ్వడురచయిత.వాళ్ళపై జాలి ఉంటుంది .అందరూ అన్నిటా శూన్యులే అవటం వింత గొలుపుతుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-7-16 –ఉయ్యూరు