చంద్ర శేఖరయ్య గారి కవితా చంద్ర హారం
శ్రీ బి చంద్ర శేఖరయ్య గారితో నాకు ముఖ పరిచయం లేదు .కాని వారు నా చిరునామాకు తమ మినీ కవితా సంపుటి ‘’చంద్ర హారం ‘’పంపగా ఇవాళే చేరింది .వెంటనే చదివాను .అందులోని కొన్ని మచ్చు తునకలను మీకు పరిచయం చేయాలనే ఈ ప్రయత్నం .
వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైనశ్రీ చంద్ర శేఖరయ్య ప్రవృత్తి మాత్రం సాహితీ వ్యాసంగం .’’తెలుగు కళలకు వెలుగు సంతకం పలమనేరు రచయితల సంఘం ,తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి’’ లో ముఖ్య పాత్ర ధారి . గొప్ప కవి ,రచయితా లబ్ధ ప్రతిస్టులు .అయిన శ్రీ పలమనేరు బాలాజీ ఈ కవిని అభినందిస్తూ’’ సంఘం జీవితం ,వ్యక్తిత్వ వికాసం ,జనన మరణాలు సంస్కారం మానవ సంబంధాలు రైతు ,విద్యార్ధి, సాహిత్యం మొదలైన సామాజిక అంశాలపై రాసిన ఈ కవితలతో కవితా లోకం లోకి తొలిఅడుగులు వేస్తున్నారని’’ ఆశీర్వ దించారు .’’అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా విధి నిర్వహిస్తున్న ఈకవి రచయితగా వెలుగు లోకి రావటం అభినందనీయం ‘’అన్నారు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు ,’’ఉపాధ్యాయ ‘’సంపాదకులు శ్రీ పి తులసీనాధం నాయుడు .ఈ కవితాసంపుటిని తమ తలిదండ్రులు స్వర్గీయ శ్రీమతి వీరమ్మ ,శ్రీ వి బసవయ్య గార్లకు అంకితమిచ్చి ఋణం తీర్చుకొన్నారు కవిగారు .ఒక రకంగా వారిద్దరికీ ఇది 163 రకాల స్వర్ణ పుష్ప ‘’కవితా చంద్ర హారమే ‘’.
‘’ ఆశించేది జీత౦ –అర్పించేది జీవితం ‘’అంటూ చక్కని తాత్వికతను ఒలకపోశారు .ఆఫీస్ ఉద్యోగాలపై కొరడా ఝలిపిస్తూ ‘’నిద్ర లేచి ఆఫీస్ కు వెడితే ఉదయం –మెలకువ వచ్చి ఇంటికి వెడితే సాయంత్రం ‘’అని వ్యంగ్య౦ గా అన్నారు .’’పుట్టినిల్లు జన్మ భూమి –మెట్టినిల్లు పుణ్య భూమి ‘’అంటూ అందరినీ ఉద్దేశించే చెప్పారు . దాంపత్యం లో సరిగమలపై చెణుకుతూ’’’’పొద్దున్న పోరు రాత్రికి రాజీ – సమాంతర రేఖలే జీవన సరళి ‘’అని ,’’వాటాలు కుదిరాయి –చర్చలు ఫలప్రదం ‘’అంటూ రాజకీయ బేర సారాలపై మరో చెణుకు విసిరారు .కరెంట్ కొత్త కూడా హాయిని, ఉల్లాసాన్ని ఇస్తుందని చమత్కరిస్తూ ‘’పండు వెన్నెల పరిచయం –కరెంటు కోతకు ధాంక్స్ ‘’అంటారు .హీరో వర్షిప్ పై మరో వ్యంగ్యం –‘’ఇంటి నిండా నాయకుల ఫోటోలు –అమ్మా నాన్నలవి ?ఆల్బం లో వెతకాలి ‘’.మంచి పుస్తకం పై మంచి కవిత –‘’వెతకటానికి- గంటలు –చదవటానికి నిమిషాలు ‘’.సామాజిక బాధ్యతా గుర్తు చేస్తూ చేసిన హెచ్చరికే –‘’సమాజం నీకు రుణపడితే ప్రమోదం –సమాజానికి నీవు రుణ పడితే ప్రమాదం ‘’.మనిషికి స్నానం ఉల్లాసాన్నిస్తే జ్ఞానం ఉత్త్తేజాన్నిస్తుందని మంచి బోధ .
ఎంత విజయం సాధించినా మూలాలు మరచి పోవద్దని చెబుతూ –‘’విజయం వెనుక కృషి –చెట్టుకింది వేరు ‘’అన్నారు .అన్యోన్య దాంపత్యం పై మరో చురక –‘’బయట కాంబినేషన్ –ఇంట్లో డామినేషన్ –అన్యోన్యత ‘’.సెల్ ఫోన్ సత్య హరిశ్చంద్రుని బద్ధ శత్రువు గా కనిపించింది కవి హృదయానికి .పెళ్లి మీద మరో వ్యంగ్యాస్త్రమే –‘’స్వేచ్చగా ఎగిరే రెండు పక్షుల్ని –ఒకటిగా కట్టి పడేసే –పెళ్లి ‘’.ఆక్సిజన్ లాంటి అవకాశాన్ని వెతుక్కొని అభాండం లాంటి కలుషితం నుండి తప్పుకోవాలని హితవు .’’క్రాంతికి బులెట్ –శాంతికి బ్యాలెట్ ‘’అని శాంతి కరువైతే బులెట్ వాడకం తప్పదనే భావన చేశారు .’’చిత్త శుద్ది లక్ష్య సిద్ధికి రాచబాట ‘’అంటూ ,నాడు క్విట్ ఇండియా ఉద్యమం నేడు వెల్కం ఇండియా స్వాగతం అంటారు .మాటలు పటిక బెల్లం అని చేతలు పక్కలో బల్లెం అని నేటి కుహనా రాజకీయ వేత్తల ప్రవర్తనపై చీదరింపు .కళ పై వ్యాఖ్యానిస్తూ ‘’ఆవిర్భ విస్తే కళకళ –అనుకరిస్తే వెల వెల ‘’అని అనుకరణ అభ్యాసం వరకే కాని ఎప్పుడూ కాదని సృజనే యే కళకైనా పరమార్ధమని కళా మర్మజ్నునిలా బోధించారు .పర్యావరణ స్పృహ బాగా ఉన్న ఈ కవి –‘’పెంపొందిస్తే రక్షిస్తుంది –నశింప జేస్తే శిక్షిస్తుంది ‘’అని పౌర ధర్నాన్ని తెలియ జేశారు .నిజాన్ని గురించి చెబుతూ –‘’గొడ్డలిలా వేరు చేయ వద్దు –సూదిలా దగ్గరకు చేర్చు ‘’అని కలిసి ఉంటె కలదు సుఖం అని హిత బోధ చేశారు .’’తరువును పరి రక్షిస్తే కరువు పారి పోతుంది ‘’అని సూక్ష్మ౦గా చెప్పారు. వన సంరక్షణ అత్యంత అవసరమని తెలియ జేస్తూ .నీటిని వృధా చేస్తే మిగిలేది కన్నీరే అనేది మరో హెచ్చరిక .పుస్తకానికి విలువ ఇస్తే విజ్ఞానం విస్మరిస్తే అజ్ఞానం పెరుగుతుందని ధర్మ సూక్ష్మం చెప్పారు .
నేటి సంసారాలలో వికృతి ఎలా ఉందొ చెప్పే కవిత –‘’అయ్య గారింట్లో అగ్ని ప్రమాదం –అల్లుడు ,కోడలు మృతి –కొడుకు ,కూతురు క్షేమం ‘’ఇంటికి వచ్చిన కోడలు అల్లుడూ మసి అయ్యారని ,ఇంటివారైన కొడుకు కూతురు క్షుషీ అని అర్ధం ‘’మోసానికి శ్వాస –దురాశ ‘’గొప్ప కవిత అల్పాక్షరాల్లో అనంతమైన వివరణ .వివక్షతపై స్పందిస్తూ –కుండ మైల పడితే విసిరి కొట్టటం అదే బిందె అయితే కడిగి దాచుకోవటమే వివక్షత అంటారు కవి .ఆడపిల్ల అవనికే చేటు అని భావించి భ్రూణ హత్యలు చేయిస్తున్న సమాజం పై –‘’గర్భస్థ శిశువు మగ అయితే అండం –ఆడ అయితే పిండం ‘’అని బహు చక్కగా చెప్పారు .వ్యాపారికి అతి వృష్టి అనా వ్రుస్టీ అన్నీ సీజనే అంటారు .నేలా నీరు అగ్నీ అన్నీ కొంటున్నాం ఇక గాలి మాత్రమే మిగిలింది ‘అయినా ఫాన్లతో ,ఎ.సి.లతో దాన్నీ కొంటూనే ఉన్నామన్న సంగతి కవి మర్చి పోయి ఉంటారు .’’మృత్యువు మనిషిని స్ప్రుశిస్తే –అవయవ దానం తో మనసు మరణాన్ని జయించింది ‘’అని మరణానంతర జీవితాన్ని గొప్పగా చెప్పారు .నేటి మనిషి అల్పత్వాన్ని తెలియ జేస్తూ –‘’నాకు నేనే నచ్చను-నిన్నెలా మెచ్చుకొంటాను ?’’అన్నారు .కృతజ్ఞత చూపిస్తే ‘’మనిషి ‘’అవుతాడని కృతఘ్నత చూపితే ‘’మహిషి ‘’అవుతాడని సత్యం ఆవిష్కరించారు .ముష్టి వాడిని చీదరించుకొని అన్నదానానికి విరాళాలిచ్చే ప్రబుద్ధుల గురించిచెప్పారు .చదువు చెప్పి పరీక్షిస్తే ‘’గురువు ‘’అని ,పరీక్ష పెట్టి గుణ పాఠం నేర్పితే ‘’ప్రభువు ‘’ అని గురు బోధ చేశారు .పుట్టిన బిడ్డ కూడా మనకు కర్తవ్య బోధ చేస్తుందట –‘’పుట్టిన బిడ్డ నేర్పుతోంది –పిడికిలి బిగించి కదలమని ‘’అని పిడికిలి బిగించి పుట్టిన శిశువు మనకు హిత బోధ చేస్తుందని చెప్పటం కవి నిశిత పరిశీలనకు దృష్టాంతం .మరో తాత్విక కవిత –‘’అమ్మ ఋణం తీర్చుకోవటమంటే –ఆకాశాన్ని మడిచి జేబులో పెట్టు కోవటమే ‘’చివరి కవిత మానవత్వ పరిమళ వ్యాప్తి కలిగించింది –‘’కొట్లలో వెదికినా –వేలల్లో కూడా మిగలటం లేదు –మానవత్వం ‘’అని వాపోయిన మానవతా హృదయం కవిగారిది .
శ్రీ చంద్ర శేఖరయ్య గారికి మంచి భావుకత ఉంది .మానసు లోని భావాలను తగిన మాటలతో చెప్పగల కవితా శక్తి ఉంది .చక్కని పదబంధం తో చెప్పగల నేర్పు ఉంది .ఈ చంద్ర హారం కవి గారి కవితా సామర్ధ్యానికి పుష్ప హారం .మరిన్ని కవితలు రాసి లబ్ధ ప్రతిస్టితులు కావాలని ఆకాంక్షిస్తున్నాను .వీరికి ఈ మధ్యనే మనం ఆవిష్కరించుకొన్న ‘’మా అన్నయ్య ‘’కవితా సంకలాన్ని బుక్ పోస్ట్ లో పంపిస్తున్నాను .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-16 –ఉయ్యూరు