ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -217
81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్
అనేక మంది నైతిక ప్రవర్తనను అక్షేపించినవాడు , రాజకీయంగా వివాదాస్పదుడు ,ఉంటున్న దేశంనుండి బహిష్కరింప బడినవాడు ,చార్లీ చాప్లిన్ అని మనం పిలిచే చార్లెస్ చాప్లిన్ .విశ్వ వ్యాప్త కీర్తి ప్రతిష్టలు పొందిన ఏకైక నటుడు ముఖ్యంగా హాస్య నటుడు .నవ్వు, జాలి, కరుణ, అమాయకత్వం తో వెండి తెరను ఎకచ్చత్రాదిపత్యంగా యేలినవాడు .ఏది చేసినా ఏది చెప్పినా అత్యంత అతిశయోక్తిగా చెప్పాడు .చార్లీ చాప్లిన్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమైన జనాలను నవ్వి౦ఛినట్లు యే ఇతర నటుడూ నవ్వించ లేదు అన్నది నిర్వివాదాంశం .అంతే కాదు ఆయన ఒక తరానికి చిహ్నమై భాసి౦చాడు .20 వ శతాబ్దిలో అందరివాడు గా అగ్రభాగాన ఉన్నాడు .మూకీచిత్రాల రాజాదిరాజు అయ్యాడు .ప్రేక్షక జనావళికి ఆరాధ్య దైవమయ్యాడు .ఆధునిక కాలం లో ఏకైక విశ్వ పౌరుడుగా గుర్తింపు పొందాడు మాక్స్ ఈస్ట్ మన్ అన్నట్లు ‘’In the history of Great Fame .,no chapter will be more astounding that in which this little modest actor of one role became in three short years known and loved by more men and more races ,and classes of men ,than an one ,even the great religious leaders ever had been before ‘’ అంతటి ప్రతిభా సంపన్నుడు ,ప్రభావ శీలి చాప్లిన్ .
16-4-1889 న లండన్ లో చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్ పుట్టాడు .చాప్లిన్ అనేది పెట్టుకొన్న పేరు అంటారు తండ్రి సంగీత భవన గాయకుడు .తండ్రిపేరుకూడా చార్లెస్ చాప్లిన్ .ఫ్రెంచ్ జ్యూల కు చెందినవాడు తర్వాత ఆంగ్ల దేశీయుడైనాడు .తల్లి హన్నా కొంత ఐరిష్ కొంత స్పెయిన్ దేశాల రక్తం ఉన్నగాయకురాలు డాన్సర్ .పూర్వపు భర్త వల్ల ముగ్గురు మగ పిల్లలను కన్నది .అందులో సిడ్నీ,చార్లీ కంటే నాలుగేళ్ళు పెద్దవాడు .మారుటి తండ్రి పేరే పెట్టుకొన్నాడు .చాప్లిన్ కుటుంబం ఎప్పుడూ ఆర్ధిక చిక్కుల్లో ఉండేది .తండ్రి పెద్ద తాగు బోతు.తల్లికి సంసారం ఏమై పోతుందో అనే దిగులు. ఈ ఇద్దరు పిల్లల్నిబజారులో పాడించి డబ్బు సంపాదించేవాడు తండ్రి .అప్పటికి చార్లీకి మాట ,ఆట ,నడక రాదు .అయినా తండ్రి చెప్పినట్లు చేసేవాడు .అయిదవ ఏట తల్లికి అకస్మాత్తుగా జబ్బు చేస్తే ఆమె బదులు ప్రదర్శన ఇచ్చాడు .ఆ లేత వయసులోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించి ఆతను ఉంటే తప్ప చూడరు అన్న భావన కలిగించాడు .ఎడాది తర్వాత తలి దండ్రులు విడిపోయారు .తండ్రి తాగుడుతో చనిపోయాడు .బాధ దిగులు తల్లి స్టేజి వృత్తిని దెబ్బతీశాయి .ఏమాత్రం ఆర్ధిక స్తోమత లేక గత్యంతరం లేక ఆమె కొడుకు లిద్దర్ని చారిటి హోం లో చేర్చింది..ఆమె ఆరోగ్యం బాగయ్యాక పిల్లల్నిద్దర్ని తెచ్చుకొని కుట్టు పని చేస్తూ పోషించింది .7 వ ఏట చాప్లిన్ బాలల మ్యూజిక్ హాల్ లో నటిస్తూ కొంత సంపాదిస్తూ తల్లికి ఆసరా అయ్యాడు .తర్వాత హీర్న్ బాయ్స్ కాలేజ్ లో రెండేళ్ళు చదివించే ఒప్పందం కుదిరింది .ఇక్కడ చదివిన చదువే ఆయనకు మిగిలింది .మళ్ళీ యే స్కూలు గుమ్మమూ తొక్క లేక పోయాడు చాప్లిన్ .
అన్న సిడ్నీసముద్రం పై ఉద్యోగం తమ్ముడు చాప్లిన్ స్కూల్ చదువులో ఉండగా తల్లికి మానసిక జబ్బు వచ్చింది .మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్లు అయింది ఆకుటుంబ పరిస్తితి .తల్లిని మానసిక హాస్పిటల్ లో చేర్చారు .ఒంటరివాడైన చాప్లిన్ జీవితం వీధుల్లోనే గడిచింది .ఇతరులకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ యేవో కొన్ని పెన్నీలు సంపాదించి బతుకుతున్నాడు .తర్వాత ఎప్పుడో ఈ అనాధ కోటికి పడగ లెత్తినా కూడా డబ్బుకోసం ఇబ్బంది పడ్డాడు .దరిద్రం అంటే భయ పడ్డాడు .హాలీ వుడ్ విలాసాలకు ఎప్పుడూ అర్రులు చాచలేదు .లండన్ లో వీధుల్లో పెన్నీ లేకుండా తిరిగిన రోజులు ఎప్పుడూ ఆయన మనసులోంచి పోలేదు గాఢ ముద్ర వేసి నిలిచే ఉన్నాయి .
సిడ్నీ కొంత డబ్బు సంపాదించి తిరిగి వచ్చాడు తమ్ముడు చాప్లిన్ ను వెదికి పట్టుకొని ఆ డబ్బుతో ఇద్దరూ కలిసి ఏదైనా చేసి తమ ప్రజ్న నిరూపించుకోవాలనుకొన్నాడు .ఒక ఏజెంట్ గా మారి పదేళ్ళ తమ్ముడు చాప్లిన్ కు లండన్ హిప్పోడ్రోంలో నటించే అవకాశం కల్పించాడు కొన్నేళ్ళకే అందులో చాప్లిన్ గొప్ప నటుడుగా ఎదిగి పోయి ఇంగ్లాండ్ లో బాలనటు లలో ప్రముఖుడనిపించుకొన్నాడు .తల్లిని హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చి స్వస్థత హోం లో చేర్చారు కాని ఆమె పరిస్తితి ఏమీ మెరుగు పడలేదు .కొడుకుల్ని గుర్తించ లేని పరిస్తితిలో ఉంది .స్వరం మారి కౌమార దశకు చేరిన చాప్లిన్ ఇక తానూ బాల నటుడిగా కాక అనేక వినోద ప్రదర్శనలతో తన సామర్ధ్యాన్ని నిరూపించుకోవాలని అనుకొన్నాడు ..మూకీ వినోద ప్రదర్శనగ్రూప్ ‘’ఫ్రెడ్ కార్నో కంపెని’’లో చేరి అన్నా తమ్ముళ్ళు రాణించారు .
ఇంకా ఇరవై ఏళ్ళు కూడా రాకుండానే చాప్లిన్ అత్యంత ప్రఖ్యాతిగల హాస్య నటుడుగా అమెరికా వెళ్ళాడు .తానో టూరింగ్ ట్రూప్ లో తాగుడు తో నవ్వించే వికట నటుడుగా అందర్నీ ఆకర్షించాడు .20 ఏళ్ళకే వారానికి 50 డాలర్లు సంపాదించేవాడు .ఇతని నటనా సామర్ధ్యానికి అబ్బుర పడి కీ స్టోన్ ఫిలిమ్స్ వాళ్ళు వారానికి 150డాలర్ల జీతం తో ఆహ్వానించారు .కార్నో కంపెనీతో కాంట్రాక్ట్ పూర్తికాగానే చాప్లిన్ కాలి ఫోర్నియా చేరాడు .అతి వేగంగా అభి వృద్ధి చెందుతున్న చిత్ర పరిశ్రమలో గొప్ప మార్పులు చోటు చేసుకొన్నాయి .మొదట్లో విజయాలు తర్వాతయూరో పియాన్ ల ఆధిపత్యం తో అమెరికన్ స్టుడియోలపై ప్రభావం చూపింది ..విడుదల తగ్గించేశారు .చిన్నసినిమాలు ఫీచర్ సినిమాలపై ద్రుష్టి పెట్టారు .సిసిల్ డిమిల్లీ ,సాన్ గోల్ద్విన్ జెస్సి లాస్కిమొదలైన వాళ్ళు ‘’స్క్వవుమన్ ‘’మొదలైన నాటకాలను సినిమాలుగా మార్చే ప్రయత్నం చేశారు .గ్రిఫ్ఫిత్ సెమి డాక్యుమెంటరి డ్రామా ‘’ది బర్త్ ఆఫ్ యే నేషన్ ‘’ను తెరకెక్కించారు .కాని కామెడి పై ఇవేవీ ప్రభావం చూపలేక పోయాయి .ఒకటి రెండు రీళ్ళతో వారానికి ఒకటి తీయటం మొదలు పెట్టారు .మాక్ సేన్నేట్ అనే హాస్య నటుడు కీ స్టోన్ అధినేత గ్రిఫ్ఫిత్ నుండి మూవీ టెక్నిక్ ను నేర్చుకొన్నారు .పిచ్చపిచ్చగా ఇష్టం వచ్చి నట్లు అసంబద్ధంగా ,తలా తోకా లేకుండా తీసి పారేశాడు హాస్యం పేరుతొ అపహాస్యం సృష్టించాడు .సేన్నేట్ చాప్లిన్ లోని ఒరిజినాలిటి ని గుర్తించి ,అతనిలాగా నవ్వి౦చ గలవారేవ్వరూ లేరనే నిర్ణయానికి వచ్చాడు .
చార్లీ చాప్లిన్ వేసుకొనే వికారపు డ్రెస్ కు ఒక ఫ్లాష్ బాక్ ఉంది .సాన్నేట్ చాప్లిన్ ను లొకేషన్ కు నవ్వు పుట్టించే డ్రెస్ వేసుకొని రమ్మన్నాడు .హడావిడిలో చేతికి ఏది అందుబాటులో ఉంటే దాన్నే ధరించి హడావిడిగా వెళ్ళాడు చాప్లిన్ .ఆ నాడు లావుగా ఉండే కమెడియన్ వేసుకొనే బాగీ పాంటు, మరో హాస్యగాడు వేసే కాళ్ళకు పెద్దసైజు ఉన్న బూట్లు , తలకంటే చిన్నదైన మాసిన డేర్బి, బక్కోడే అయినా బాగా బిగుతుగా ఉన్న కోటు ,,కొంకె లాంటి పేము కర్రా ,చిన్న టూత్ బ్రష్ మీసం తో అక్కడ ప్రత్యక్షమయ్యాడు .ఈ డ్రెస్ కోడ్ వేష ధారణ పై దియోదర్ హాఫ్ రాస్తూ ‘’personifies shabby gentility –the fallen aristocrat at grips with poverty .The cane is a symbol of attempted dignity ,the pert mustache a sign of vanity ‘’అని విశ్లేషించాడు .ఆకర్షణీయ ,తరచుగా కనిపించే విషాద ఆకృతి ఇంకా రావాలి .మొదటి ఏడాదిలో నటించిన 35 సినిమాలలో ఆయన పాత్ర ఎందుకూ పనికి రాని అసమర్ధుడు ,జాలి లేని వాడు గా కనిపించినా గిలిగింతలు పెట్టె హాస్యం తో కడుపుబ్బా నవ్వించాడు .కేవలం 13 వారాల తర్వాత చాప్లి న్ నే స్వయంగా రచన చేసి ,దర్శకత్వం కూడా చేయమని కోరారు .కీ స్టోన్ కాంట్రాక్ట్ 12 నెలలు హాయిగా గడిచి పోయింది .సంవత్సరం పూర్తికాగానే సేన్నేట్ వారానికి నాలుగు వందల డాలర్లు ఇస్తానని చెప్పాడు కాని పోటీ సంస్థ ఎస్సనే కంపెని వారానికి 1250డాలర్ల స్టైపెండ్ అంటే పది రెట్లు ఎక్కువ ఇస్తానని లాక్కు పోయింది .ఈ కంపెనీలో ఒక ఎదాదిపని చేయగానే చాప్లిన్ విలువ మళ్ళీ పది రెట్లు పెరిగింది .ఇప్పుడేమ్యూచువల్ కంపెని వారానికి పది వేల డాలర్లు ,సంవత్సరానికి లక్షా యాభై వేల డాలర్ల బోనస్ ఆఫర్ తో తీసుకొన్నది .అతికష్టం మీద చాప్లిన్ ను ఒప్పించి ఆయన లాస్ ఏంజెల్స్ లో మురికి కూపం ప్రదేశం లో మకామున్న చిన్న హోటల్ నుంచి మంచి ప్రదేశానికి మార్పించింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-7-16 –ఉయ్యూరు