ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -221
82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్
స్కూల్ లో చదవని ఆస్ట్రియన్ అడాల్ఫ్ హిట్లర్ వియన్నా మురికి వాడలవాడు, చెదిరి పోయిన జర్మనీని క్రూర ప్రపంచ శక్తిగా ఉద్ధరించి అసలే జబ్బుతో ఉన్న యూరప్ ను కోలుకోలేని సంక్షోభం లోకి నెట్టినవాడు .20-4-1889 న ఆస్ట్రియా బవేరియా దేశ సరిహద్దు లో ఉన్న బ్రానువా అనే చిన్న పట్నం లో పుట్టాడు .తండ్రి ఆలోయిస్ అనే ఒక రైతు కన్నెపిల్ల మేరియా శికిల్ గ్రుబర్ కు అక్రమ సంతానంగా పుట్టినవాడు.తల్లిపేరును 30 వ ఏడాదివరకు కొనసాగించి తర్వాత హిట్లర్ గా మార్చుకొన్నాడు .హిట్లర్ లేక హీడ్లర్ లేక హీట్లర్ కుటుంబం తరతరాలుగా సంచారులే .కాని హిట్లర్ తల్లి వైపు వాళ్ళు పోల్జులు తరతరాలుగా పొలం కూలీలు .హిట్లర్ తండ్రి చిన్న ఆఫీసర్ .మూడు సార్లు పెళ్లి చేసుకొన్నాడు .మొదటి పెళ్ళాం అతనికంటే 14 ఏళ్ళు పెద్దది .పిల్లలు లేరు. 16 ఏళ్ళ తర్వాత పెళ్లి రద్దు చేసుకొని ఒక హోటల్ లో వంట చేసే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక కొడుకు కు తండ్రి అయ్యాడు .ఏడాది తర్వాత ఆమె టి బి వచ్చి చనిపోయింది .ఆమె చనిపోయిన ఆరు నెలల తర్వాత సెకండ్ కజిన్ నుతనకంటే 23 ఏళ్ళ చిన్నదైన అమ్మాయిని ముచ్చట గా మూడో పెళ్లి చేసుకొని 5 గురు పిల్లలను కన్నాడు .ఇందులో ముగ్గురు బాల్యం లోనే చనిపోయారు .మూడో పెళ్లి కి మూడో కొడుకే అడాల్ఫ్ హిట్లర్ .తండ్రి రెండవ పెళ్ళాం హాఫ్ సిస్టర్ ఏంజెలా రాబాల్ తో మాత్రమే హిట్లర్ కు అనుబంధం ఉండేది .ఆమె కూతురు జీలి తో విచిత్రంగా విషాదంగా ప్రేమలో పడ్డాడు హిట్లర్ .
ఆరవ ఏట స్కూల్ లో చేరి ఇతర ఆస్ట్రియన్ పల్లెటూరి పిల్లలలాగానే అరవై వ ఏడు లోకి ప్రవేశిస్తున్న తండ్రిని తండ్రిగా కాక తాత అనే భావం తో చూశాడు .సాధారణ చదువే చదివి ,తాను సివిల్ సర్విస్ ఉద్యోగం కోసం చదవనని పెయింటర్ అవుతానని చాలెంజ్ చేశాడు .మొదట్లో కొడుకు ఇంటికి సున్నాలు రంగులు వేసే వాడు అవుతాడేమోనని అసంతృప్తి చూపి విపరీతంగా కోప్పడ్డాడు. కాని ఫలితం లేక పోయింది .ఆయన కోపం బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయింది .ఇదే హిట్లర్ మొదటి విజయం .దీన్ని ప్రయోజనం గా భావించి లింజ్ లో సెకండరి స్కూల్ లో చేరి ,చదవనని భీష్మిస్తే సర్టిఫికేట్ ఇవ్వటానికి నిరాకరించారు .’’నాకు ఏది సంతోషంగా ఉందేదో దాన్నే చదివాను .ఇష్టం లేని దానివైపు కన్నెత్తి కూడా చూడలేదు ‘’అని హిట్లర్ తన జీవిత చరిత్ర ‘’మీన్ కాంఫ్ అంటే ‘’నా పోరాటం’’ లో రాశాడు .1903 లో తండ్రి చనిపోగా ,రెండేళ్ళ తర్వాత స్కూల్ మానేశాడు .అతని ప్రోగ్రెస్ కార్డ్ లో అన్నీ ‘’అత్తిసెరు ‘’మార్కులే కనిపిస్తాయి .ఫ్రీ హాండ్ డ్రాయింగ్ మాత్రం బాగా ఉంది. రాత దరిద్రపు గొట్టు .జర్మనీ గురించి ఆయనకు తెలిసింది సంతృప్తికరంగా లేదని ఆ రిపోర్ట్ సారాంశం .
స్కూల్ లో నూ తలిదండ్రుల పరంగానూ క్రమ శిక్షణ లేని హిట్లర్ లింజ్ కు దగ్గర లో ఉన్న ఉర్ఫార్ లో జులాయిలా తిరుగుతూ యే పనీ చేయని సోంబేరి అయ్యాడు .తానేం కావాలో తెలియక ఇతరుల పై అనుమానం పెంచుకొని ,ఎవరితోనూ స్నేహం చేయక , యే సంస్థలోనూ చేరక ఎవరి తీర్పుకూ ఇష్టపడకుండా కాలక్షేపం చేశాడు .కొన్ని నెలలు మ్యూనిచ్ ఆర్ట్ కాలేజిలో చేరి చదివాడు .18 వ ఏట తల్లి ఆసరాతో వియన్నా ఫైన్ ఆర్ట్స్ లో చేరుదామను కొన్నాడు .ఎందరో ఆర్టిస్ట్ నిష్ణాతులను కలిసినా ఎవరూ చేర్చుకోలేదు .మరుసటి ఏడాదీ ప్రయత్నించి దారుణంగా విఫలుడయ్యాడు .పరీక్ష రాయటానికి కూడా ఎవరూ ఒప్పుకోలేదు .జీనియస్ ఆర్టిస్ట్ లందరూ తనలాగా తిరస్కరింప బడిన వారే అని తనను తాను ఓదార్చు కొన్నాడు .ఇరవై ఏళ్ళు వచ్చేలోపే తల్లీ చనిపోయింది .ఏం చేయాలో,ఎక్కడికి వెళ్ళాలో పాలుపోలేదు .’’’’నార సంచీలో ఉన్న బట్టలు సర్దుకొని ,మొక్కవోని దైర్యం తో వియన్నాకు బయల్దేరాను .నేను’ఏదో కావాలి ‘’అనే నిశ్చయం నా మనసంతా నిండి పోయింది .కాని సివిల్ ఉద్యోగిని మాత్రం కాకూడదు అని గట్టిగా నిర్ణయించుకొన్నాను ‘’అని రాసుకొన్నాడు హిట్లర్ .
వియన్నా లో అనేక చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు .తర్వాత తిండి తినటానికి సరి పడడబ్బును పెయింటింగ్ ద్వారా సంపాదించానని గర్వంగా చెప్పుకొన్నాడు .కాని ‘’గురుడికి ‘’మనిషి బొమ్మ వేయటమే రాదు .ఒక చిన్న సృజనాత్మకమైన బొమ్మా వేయే లేక పోయాడు .ల్యాండ్ స్కేపులు బిల్డింగ్ లను కాపీచేశాడు .వియన్నా పై పోస్ట్ కార్డ్ భావాలు గిలికాడు .ఈ తిరుగులాటలో బోహిమియన్ దేశ ద్రిమ్మరి తో అనుకోకుండా పరిచయమైంది .కొద్ది రోజుల్లోనే వాడితో పోట్లాడి వదిలించుకొన్నాడు.మంచు ఆటలలో పెన్నీలు సంపాదిస్తూ ,రైల్వే స్టేషన్ లో సామాన్లు మోస్తూ ,కార్పెట్ల దుమ్ము దులుపుతూ ,తాగు బోతుల దగ్గర అడుక్కొంటూ ఏదో కొంత సంపాదిస్తూ బతికేస్తున్నాడు .పార్క్ బెంచీలమీద పడుకొంటూ ,చేతిలో ‘’గవ్వలు’’ఆడుతుంటే చిన్న మురికి గదిలో ఉంటూ వచ్చాడు .ఉచితంగా ఇచ్చే సూప్ కప్ కోసం బారులు తీరిన క్యూలో గంటల తరబడి నిలబడే వాడు .ఒక్కో సారి అదృష్టం కలిసొస్తే బ్రెడ్ తో హార్స్ సాసేజ్ దొరికేది .
హిట్లర్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండేవాడు కాదు .ముఖం మృదువుగా గుండ్రంగా ఉండేది.రంగు పాస్టేగా ఉండేది .జుట్టు దువ్వ కుండా ,నుదుటిమీద పడుతూ ఉండేది .పొడుగాటి జుట్టు .21 కే గడ్డం మీసం మొలిచి క్రిస్టియన్ లలో ఒక విపరీతమైన వాడుగా కనిపించేవాడని స్నేహితులు చెప్పారు .అతనిపరిస్థితి చూసి స్నేహితులు హిట్లర్ ను బాధిత పీడిత జన బాంధవుడు అనుకొన్నారు .కాని వారిని ద్వేషిం ఛి అసహ్యించుకొనే వాడని పాపం వాళ్లకు తెలియదు . ‘’వర్కర్లు మురికి తో రోతపుట్టిస్తారు .ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తారు .పొట్టకు కూడు తాగుడు ,అమ్మాయిలూ తప్ప వాళ్లకు ఇంకేమీ అక్కర్లేదు .ఏ విషయం పైనా ఈ మూక జనాలకు అవగాహన ,నిర్ణయాలు ఉండవు ‘’అని’’హిట్లర్ గురూజీ’’సూక్తులు పలికాడు .కార్మిక సంస్థలలో హిట్లర్ సభ్యత్వం తీసుకోలేదు ,ఉద్యమాలలో చేరలేదు .’’పేదజనం నిరంతరంగా పెరిగే ప్రజల్ని భయపెట్టే బెదిరించే సైన్యం’’అన్నాడు .’’ఏ వ్యక్తీ అయినా తన గమ్యం చేరాడు అంటే దానికి అతని ఒరిజినాలిటి బ్రూటాలిటీ యే కారణం ‘’ అని గర్వంగా ప్రకటించాడు .
హిట్లర్ కు ఒరిజినాలిటీ కంటే బ్రూటాలిటి పై మోజేక్కువ దాన్నే ఆయుధంగా చేసుకొని గద్దె నెక్కాడు. అధికారం చెలాయించాడు ,ప్రపంచాన్ని భయపెట్టాడు .సాధారణ అసంతృప్తి అంతా కలిసి లేబర్ ను ,లిబరల్స్ సాంఘిక ప్రజాస్వామ్య వాదులు ముఖ్యంగా యూదులు అంటే ద్వేషాన్ని ఆయనలో రెచ్చగొట్టి పాశవికంగా ప్రవర్తి౦ చేన్చేట్లు చేసింది .హిట్లర్ కున్న’’ యాంటి సెమిటిజం’’ ఆయనకు పగటి కల ఫాంటసి అయి ఆయన రక్తమా౦సాలలో జీర్ణమై ,అంతరాత్మకు చోదక శక్తియై కోప ద్వేష కారణమై నడిపించింది .సామాన్య జ్యూ ను ,నల్లజుట్టుతో ,పతనం చెందించే యువకుడిగా చిత్రించాడు .తన చరిత్ర మీన్ కాంఫ్ లో ‘’యూదులే నీగ్రోలను రీన్ లాండ్ కు తెల్లజాతిని జారత్వం లోకి దించటానికి తెచ్చినవారు.’’అని రాశాడు .ఇలాంటి యూదు జాతితో కలిసి ఉండలేక పోయాననుకొన్నాడు ..తానూ అత్యంత ఉన్నత జాతి వాడినని కాలరెగరేసి చెప్పుకొన్నాడు .అందుకే సమానత్వాన్ని బోధించే వాళ్ళందర్నీ ద్వేషించాడు హిట్లర్ .మార్క్స్ ను కొంత చదివాడుకనుక జ్యూలు అందరూ కమ్యూనిస్ట్ లే అనే పొరబాటు అభిప్రాయానికి వచ్చాడు .కనుక హిట్లర్ కున్న యాంటి సేమిటిజానికి మానవత్వ వాదులు అంతర్జాతీయ వాదులు ,సంస్కర్తలు ,మేధావులు ,ప్రక్రుతి సిద్ధ తేడాలు సహజం అనే యాంటి సేమిటిజాన్నిప్రశ్నించేవారు అంటే ద్వేషం నర నరానా జీర్ణించుకు పోయింది .మేధావులు సమర్ధించే జ్యూలు కొన్ని జాతులు సర్వోత్క్రుస్త మైనవి అనే అభిప్రాయ౦ తో మానవ అస్తిత్వ మూలాలనే కూల్చేయాలనుకొనే వారి ని అంగీకరించ లేదు.
అలాన్ బులాక్ రాసిన ‘’హిట్లర్ యే స్టడి ఇన్ టిరనీ ‘’పుస్తకం లో ‘’మీన్ కాంఫ్ అనే తన స్వీయ చరిత్రలో పేజీ లన్నిటి లోను పిచ్చివాడి ప్రపంచమే కనిపిస్తుంది .అందులో మనుషుల నీడలే కనిపిస్తాయి .జ్యూలు మనుషులే కాదు .తననొక పురాణ పురుషుడుగా అభి వర్ణించు కొన్నాడు .ఆయన అవినీతికి మారు రూపం .ఈ కోణం నుంచే ప్రపంచాన్ని చూశాడు .కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపి౦చి నట్లు ఆయనకు ప్రపంచమంతా ద్వేషం కోపం అనుమానం భయంగ మాత్రమే కనిపించింది . ప్రతి అన్యాయానికి తనకు ఇష్టం లేని ఆధునికతకు సంగీతానికి ఆర్ట్ కు జ్యూలే కారణంగా కనిపించారు హిట్లర్ కు . పోర్నోగ్రఫీ కి వ్యభిచారానికి జాతి వ్యతిరేక ప్రెస్ విమర్శకు ,సోషలిజం పేరుతొ మాస్ జనాల పై ఒత్తిడికి ,చివరికి తన వైఫల్యాలకు యూదులే ముఖ్య కారణమనుకొన్నాడు .మూడవ నెపోలియన్ తనను ఆస్ట్రియా నుంచి సాగనంపి పాన్ జర్మన్ గా మార్చటానికీ వాళ్ళే కారణం అనేభ్రమ ఆయన్ను పీడించి ఆడించి ఓడించింది ‘’అని రాశాడు .బలహీన ప్రపంచ పౌరుడు ఒకఫెనటిక్ ,యాంటి సెమెటిక్ యోధుడిని చేసింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-16 –ఉయ్యూరు