ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -223
82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ –3
తీవ్ర వాదుల పార్టీల కార్యక్రమాలు బాగా వేగంగా ఊపు నందుకోన్నాయి .డిప్రెషన్ ,ఇన్ ఫ్లేషన్ పరిస్థితులను మరీ దిగ జార్చాయి .19 18 లో జర్మని కరెన్సీ లో డాలరు కు 4 మార్క్ లు వస్తే, 1922 లో డాలర్ కొనాలంటే 75 మార్కు లు 1922 లో 100 మార్క్ లు చెల్లించాల్సి వచ్చింది .ఆ తర్వాత కూడా ప్రతి నెలా మార్క్ పతనం కొనసాగింది .1923జులై కు పరిస్థితి మరీ దిగ జారిపోయి 1 50 000అయి,ఆగస్ట్ నాటికి మిలియన్ మార్క్ లకు దేకింది. కరెన్సీ పతనం నాజీలకు బాగా కలిసి వచ్చింది . ఆహార కొరత ,నిరుద్యోగం ,సాధారణ దివాలా ,కూడా వాళ్లకు పంట పండించింది .ఈ గండాలనుంచి దరి చేర్చటానికి ప్రజల్ని ఆదుకోవటానికి నాజీ పార్టీ ఒక్కటే సరైనది అనే అభిప్రాయం బాగా కలిగించారు దేశాన్ని దివాలా స్థానం నుంచి ఉద్ధరించటానికి ,ప్రాంతీయ అలజడులు అంతర్జాతీయ దాడుల నుండి కాపాడ గలిగే పార్టీ నాజీ పార్టీ ఒక్కటే అనే గట్టి నమ్మకాన్ని హోరెత్తే ప్రచారం తో కలిగించారు .వేర్సేల్లీస్ ఒప్పందాన్ని రద్దు చేయాలనే డిమాండ్ ను బాగా ప్రచారం చేసి శక్తి వంతమైన జర్మనీ నిర్మాణం చేయాలన్న ఆలోచనకు మద్దతు సంపాదించారు .ప్రజల్ని ఎలా మాటలమాయతో మభ్యపెట్ట వచ్చో హిట్లర్ కు బాగా తెలుసు .ముఖ్యంగా ప్రజల ఫ్రస్ట్రేషన్ తో ఎలా ఆడుకోవచ్చో తెలుసు ..వాళ్ళకోరికలు తీరుస్తానని , జర్మనీ కీర్తి విశ్వ వ్యాప్తమవుతుందని పూర్తీ నమ్మకం కలిగించాడు .రహస్య క్రూర పోలీసు దళాలతో ,దారి తప్పిన ప్రజల్ని దారిలోకి తెచ్చుకొన్నాడు .విప్లవానికి పరిస్థితి తిబాగా పక్వమై౦దని గ్రహించి పార్టీని సివిల్ వార్ కు పురిగొల్పాడు .1923 నవంబర్ లో బ్రవేరియాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం లాక్కోవాలని ప్రయత్నించాడు .సరైన ప్రయత్నం ,ముందు జాగ్రత్తలు తీసుకోక పోవటం వలన అది ఫలించలేదు .సైనిక తిరుగుబాటు జరుగుతుందని ఊహించాడుకాని జరగలేదు పైగా హిట్లర్ అరెస్ట్ అయ్యాడు . .ఇదొక పెద్ద అపజయం .
ఇప్పటికి 35 ఏళ్ళు వచ్చాయి హిట్లర్ దొర గారికి .జర్మనీ లో ప్రతి వారి నోటినుంచి హిట్లర్ హిట్లర్ అనే నామం మంత్రోచ్చారణగా వినిపించి మహా ప్రసిద్దుడైపోయాడు .ఆయన పై జరిగిన 9 నెలల విచారణ ,జైలు జీవితం హిట్లర్ ను త్యాగ వీరుని చేశాయి .జైలు లో ఉండగానే ‘’మీన్ కాంఫ్ ‘’లో చాలా భాగం రాశాడు .అదే నాజీలకు పవిత్ర బైబిల్ అయింది..జైల్లో ఉంటూ పార్టీ నాయకులతో సంప్రదిస్తూ పార్టీని మరింత పదును పెట్టాడు .హిట్లర్ కు క్షమా భిక్ష ఇచ్చి విడుదల చేశాక తన స్థానాన్ని పదిల పరచుకొనే ప్రయత్నం గట్టిగా చేశాడు .అయిదేళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించి తనకు అడ్డు వస్తారను కొనే వాళ్ళనందర్నీపురుగుల్ని నలిపినట్లు నలిపి పారేశాడు .తనకున్న లేబర్ వ్యతిరేక విధానాలతో ముఖ్య పారిశ్రామిక వేత్తల మద్దతు సంపాదించాడు .సైనికాధికారులూ అతన్ని సమర్ధించి మరింత శక్తి వంతుడిని చేశారు .దేశం లోని అసంతృప్తిని బాగా కాష్ చేసుకొని తన అధికారానికి అవకాశ వాదం తో అధికార పీఠం పై కూర్చోవటానికి రాచ బాట వేసుకొన్నాడు.
45 వ ఏట అధికారం చేతిలో ఉంటే దేనినైనా సాధించవచ్చు ననుకొన్నాడు .ముందుగా రాజ్యాధికారం పొందాలి కనుక ఎన్నికలకు పార్టీని సిద్ధం చేశాడు .మాటల గారడీ ,ట్రిక్కులు ,ఆశలు కల్పించి ఎన్నికల ప్రచారం నిర్వహించాడు ఇల్లు లేనివాళ్ళకు ఇల్లు ,నిరుద్యోగికి ఉద్యోగం ,అతి ముఖ్యంగా అదో జగత్ సహోదరులు తనలాగే పైకి వచ్చే అన్ని రకాల అవకాశాలు కల్పిస్తానని ఆశ పెట్టాడు .అన్నీ కలిసి వచ్చాయి .అతనికి వ్యతిరేకంగా ఉన్న లెఫ్ట్, రైట్ నాయకులు ఒక్కటికాలేక పోయారు .చట్టప్రకారం రాజ్య భోజ్యానికి చేసిన కుట్ర ఫలించింది .45 వ ఏట ఎందుకూ పనికి రాని ఒక పోస్ట్ కార్డ్ పెయింటర్ ,వియన్నా వీధుల్లో తిండికి ,నిద్రకు అలమటించి తిరిగినవాడు అయిన హిట్లర్ –రిపబ్లిక్ ప్రెసిడెంట్ ముసలి యుద్ధ వీరుడు మార్షల్ హీన్దేన్ బర్గ్ పై ఒత్తిడి తెచ్చి తనను చాన్సలర్ నియమంచమని కోరాడు .1933 జనవరి 30 అయిన ఆ దుర్దినం నుంచి అతనిమాట ,చర్య పరమ భీకరంగా మారి జర్మనీకి అన్నివిధాల తానేప్రభువును అనే స్థితిలోకి వచ్చి ,యూరప్ అంతా తానే పరిపాలిస్తానని భయపెట్టాడు .’’To day Europe tomorrow the whole world ‘’అనే స్లోగన్ తో అందర్ని కంగు తినిపించాడు .
చాన్సలర్ నుండి డైరెక్టర్ కు వెంటనే ఎదిగిపోయాడు .తన సహచరులు గోరింగ్ ,గోబెల్ల్స్ కు సర్వాధికారాలు ఇచ్చి విపక్ష వర్గాన్ని ఏవిధంగా నైనా అణచి నాశనం చేసి పారేయ్యమన్నాడు .హిట్లర్ వాణి అయిన గోరింగ్ పార్టీ అధినేత,డైరెక్టర్ కూడా అయి నరకాసుర పాలన చేబట్టారు .గోబెల్స్ పబ్లిక్ యెన్ లైటేన్ మెంట్ మంత్రిగా ముఖ్య ప్రాప గాండ చేశాడు .రీచ్ స్టాగ్ బిల్డింగ్ ను తగల బెట్టించిన ఈ ఇద్దరు ప్రభుద్దులు కమ్యూనిస్ట్ లే ఆ పని చేశారని ప్రచారం చేశారు .అందుకే అప్పటినుంచి అసత్య ప్రచారాలను ‘’గోబెల్స్ ప్రచారం ‘’అనటం ఆనవాయితీ అయింది ప్రపంచం లో .దీనితో అన్ని ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికినాంది అయింది . స్వీయస్వేచ్చా ,వాక్ స్వాతంత్ర్యం ,పత్రికా స్వాతంత్ర్యం ,పోస్టల్ కమ్యూని కేషన్ లో ఉన్న రహస్య౦ అన్నిటికి భంగం కలిగించి స్వేచ్చకు సంకెళ్ళు వేశారు . .తన నిర్వాకాన్ని తెలియ జేస్తూ గోరింగ్ బోరింగ్ గా ‘’నా చర్యలు న్యాయ వ్యవస్థ పరిధిలో ఉండవు .న్యాయం పై నాకు చింత లేదు .నా సంకల్పం సర్వ నాశనం ,దు౦పనాశనం, నిర్మూలనమే ‘’అని నిర్లజ్జగా ప్రకటించాడు .రీచ్ వ్యవస్థ చేసే దురాగత ప్రజా వ్యతిరేక చర్యల నుంచి రక్షి౦చటానికే అనే బూటకం తో హిట్లర్ రాజ్యాంగాన్ని కూడా ప్రక్కకు పెట్టేశాడు .విశ్లేషకుడు అలాన్ బులాక్స్ వివరించినట్లు ‘’కొత్త రాజ్యం లోని సంపత్తిని అంతటినీ వీధి రౌడీ గాంగ్ లు స్వాధీన పరచుకొని పెత్తనం చేశారు .మురికి నాయాళ్ళు అందలమెక్కారు ‘’.1933 జులై 14 న జర్మనీలో నాజీ పార్టీ ఒక్కటే రాజ్యాంగ బద్ధమైన పార్టీ అనే చట్టాన్ని తెచ్చాడు .దీనితో పెట్రేగిపోయిన నాజీ మూకలు భీభత్సం ,హత్యాకాండ, దమన కాండ ,లతో రక్తపు టేరులు పారించారు .హిట్లర్ ఇప్పుడు ‘’ఫ్యూహ్రేర్ ‘’ అంటే సర్వాధికార నియంత అయ్యాడు .రాజ్య పాలకుడిగా సైన్యం పైనా అధికారం పొందాడు .సైనికు లందరి చేత ఎలాంటి భేషజం లేకుండా ‘’హిట్లరే మా నాయకుడు ,ఆయనకే లొంగి ఉంటాము’’అనే పవిత్ర శపథం చేయింఛి జర్మనీ సామ్రాజ్యానికి అరివీర భయంకరుడయ్యాడు .తన దేశాన్ని లోబరుచుకొన్న గట్టర్ హీరో హిట్లర్ ఇప్పుడు ఉపఖండాన్ని జయి౦చాలనే ఉబలాటం లో ఉన్నాడు .
మొదటి ప్రయత్నంగా లీగ్ ఆఫ్ నేషన్స్ కు గొళ్ళెం పెట్టాడు .మొదట్లో బ్రిటన్ గొణిగినా తర్వాత జర్మనీకి కొత్తాయుధ వితరణ ఇచ్చింది .అంతర్జాతీయ పరిస్థితి ని హిట్లర్ బాగా అవగాహన చేసుకొని దాన్ని ప్రయోజనం గా చేసుకొనే ప్రయత్నం చేశాడు .శత్రువుల బలహీనత లను పసిగట్టే మేధావి హిట్లర్ .వారి విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకొనే మహా తెలివి తేటలున్న వాడు .తన దేశం జర్మనీ లోని విభేదాలను తుంగలోతొక్కి అధికారానికి వచ్చినవాడుకనుక సామ దాన భేద దందోపాయాలన్నీ తెలుసు. ఏది ఎప్పుడు ఎలా ఎక్కడ ప్రయోగించాలో తెలిసిన కౌటిల్యుడు .ఇంగ్లాండ్ ను ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా చేశాడు .ఫ్రాన్స్ ను పోలాండ్ కు వ్యతిరేకం చేశాడు .రష్యాను పశ్చిమ దేశాలకు వ్యతిరేకిని చేశాడు .జెనీవాలో జరిగిన ఆయుధ విసర్జన సమావేశం ఫలప్రదం కాకుండా అడ్డుపుల్ల వేశాడు .జర్మనీలో నిర్బంధ సైనిక విధానం అమలు పరచి అందర్నీ సైన్యం లో చేర్చే ప్రయత్నం చేశాడు .విద్య ,వ్యాపారం వాణిజ్యం ,జర్నలిజం దియేటర్ లలో బాగా స్థిర పడి ఉన్న జ్యూలన్దర్నీ దేశ బహిష్కారం చేసి వారి స్థానాలలో తన ‘’చెంచా గాళ్ళ’’ను కూర్చోబెట్టాడు .ఏది ప్రసారం చేయాలో ఏది కూడదో నిర్ణయిస్తూ సమాచార వ్యవస్థను స్వాధీనం చేసుకొన్నాడు .దీనితో విధ్వంసానికి కోట గోడ కట్టాడు. దేశ ద్రోహ గ్రంధాలు అనే ముద్ర వేసి విలువైన సాహిత్యాన్ని అంతా తగుల బెట్టించాడు . ముందుగ కమ్యూనిస్ట్ సానుభూతి రచనలను, తర్వాత జ్యూ ల ఫ్రాయిడ్ యొక్క ,హీన్ యొక్క రచనలన్నీ తగలబెట్టించి భోగి మంటలు వేయించి ఆనందంగా చలి కాచుకొన్నాడు .ఆర్య వ్యతిరేకమైనవన్నీ భస్మీపటల మైపోయాయి .ఇంతటితో ఆగక సోషల్ డెమొక్రాట్ ల ,యుద్ధ వీరుల ,అసమ్మతి సైంటిస్ట్ ల ,అధిక అధికారం చెలాయించే వారిపై రాసిన విమర్శల నన్నిటినీ తగలబెట్టి వినోదం పంచుకొన్నారు ఆ కిరాయి మూకాసురులు .
1936 లో యూరప్ సమస్యలతో సతమత మైంది .ఫాసిస్ట్ ఇటలి సంధిని ఉల్లంఘించి ఇతోపియాను బాంబుల దాడితో నామ రూపాలు లేకుండా చేసింది .లీగ్ చేతగాక ముసోలినే సమర్ధించి దెబ్బతిన్న దేశాన్ని వదిలేసింది ..స్పెయిన్ లో అంతర్యుద్ధం చెల రేగింది .తిరుగు బాటు దారులను జర్మని ఇటలీలు వెనకేసుకొస్తే లాయలిస్ట్ లకు జనరల్ ఫ్రాంకో ,రష్యాలు మద్దతు నిచ్చారు .బ్రిటన్ అమెరికాలు దూరంగా ఉండి పోయాయి .పరిస్థితులన్నిటిని జాగ్రత్తగా గమనించిన హిట్లర్ ఇప్పుడు అంతర్జాతీయరాజకీయ గాంబ్లింగ్ ఆడాడు .తన జర్మన్ సైన్యాన్ని రీన్ లాండ్ పైకి ఉరికించాడు .దీనితో జర్మని పూర్వపు ఒప్పందాలన్నిటినీ ఉల్లంఘిస్తుంది అని చాటి చెప్పాడన్నమాట .మిగిలిన దేశాలు లీగ్ కు ఫిర్యాదు చేశాయి .కానిఇదివరకటిలాగానే ఏమీ చేయలేక పోయింది లీగ్ .1937 జనవరిలో ఫ్రాన్స్ ,గ్రేట్ బ్రిటన్ లు స్పెయిన్ లో పోరాడుతున్న విదేశీ వాలంటీర్లు అందరిని వెనక్కి రావాలని కోరాయి .ఇటలీ జర్మనీలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి .స్పానిష్ ఫాసిస్ట్ లకు హిట్లర్ ఇంకా ఎక్కువ సాయం చేయాలని నిర్ణయించాడు .ఇంకాస్త ముందుకెళ్ళి వేర్సైల్లిస్ ఒప్పందాన్ని తప్పు పట్టి జర్మనీకి జరిగిన అన్యాయాన్ని చాటుతూ కోల్పోయిన కాలనీలన్నిటిని తిరిగి ఇచ్చేయాలని కోరాడు
.
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్-24-7-16- ఉయ్యూరు