ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -242
90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి –డబ్ల్యు .హెచ్ .ఆడెన్
35 ఏళ్ళ లోపు విస్టన్ హఘ్ ఆడెన్ కలవరపరచే విషయమైనాడు .అట్లాంటిక్ సముద్రానికి రెండు వైపులా ఆయన అత్యంత ప్రభావం కలిగించాడు .ఆయన కవిత్వం ఒక మైలు రాయిగా ఉండటమే కాక ,ఒక అత్యంత గొప్ప మలుపు కూడా తిప్పింది .ఆధునిక కవులపై రాసిన ఉద్గ్రంధం ‘’ఆడెన్ అండ్ ఆఫ్టర్ ‘’గొప్ప విశ్లేషణాత్మకమైన గ్రంధం .దీని ఉప శీర్షిక ‘’కవిత్వ విముక్తి 1930-43 ‘’కూడా అంతటి ప్రాముఖ్యం పొందింది .దీన్ని బట్టి ఆయన ఒక యుగ కర్త అనిపిస్తాడు .
21-2-1907న ఇంగ్లాండ్ లోని యార్క్ లో ఆడెన్ జన్మించాడు తండ్రి రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ .హాల్ట్ లోని గ్రేషమ్స్ స్కూల్ లో చదివి,ఆక్స్ ఫర్డ్ లో క్రైస్ట్ చర్చ్ కాలేజిలో చేరి ,23 వ ఏటనుండి అయిదేళ్ళు మాల్వేర్న్ లోని స్కూల్ లో బోధించాడు ‘అతని ‘’ఓడ్ -టు మై ప్యూపిల్స్ ‘’లండన్ అంతా ప్రతిధ్వనించింది .మరుసటి ఏడాది ఒక ఫిలిం ఫర్మ్ లో పని చేశాడు .30 లో కింగ్స్ పోయెట్రి మెడల్ అందుకొన్నాడు . .స్పెయిన్ వెళ్లిస్పానిష్ విప్లవ సమయం లో లాయలిస్ట్ లకోసం ఒక అంబులెన్స్ నడిపాడు .రెండేళ్ళ తర్వాత ఎరికా మాన్ అనే ధామస్ మాన్ కుమార్తెను పెళ్లి చేసుకొని అమెరికాకు తాను రాసిందంతా తీసుకొని వెళ్ళాడు .1946 లో అమెరికా పౌరుడయి ,అప్పటికే నాలుగు కవితాసంపుటులు ,మూడు నాటకాలు ,3 వచన సంపుటులు ,యాత్రపై రెండు, 3 ఆ౦ ధాలజీలు రాసి రచయితగా పేరొందాడు .
ఆడెన్ మొదటి కవితా సంపుటి లోనే ఆయన కవితా చాతుర్యం మనసులోని ఫిలాసఫీ వ్యక్తమయ్యాయి .’’పాత ముఠా’’’ను నిర్దాక్షిణ్యంగా ఖండించాడు .వారికవిత్వం ఏడుపు గొట్టు ,విషాదభరితమన్నాడు.కాని తానూ కొత్త దారి తొక్క లేక పోయాడు .యుద్ధపు కరుకుదనం లో శాంతిలో అలక్ష్యం చేయబడిన వారి పక్షాన చేరాడు .వాళ్ళలో ఒకడు కాక పోయినా మనసారా సానుభూతి చూపాడు .ఆయన పూర్తిగా పాల్గొనక పోవటానికి కారణం కవిత్వం లో బిగుసుకు పోవటం అడ్డంకి అయింది .తనకోసం తన చుట్టూ ఉండే కొద్ది మంది కోసమే ఆడెన్ రాశాడు అని ఆయనపై అభియోగం ఉంది .తన పరిధి దాటి ఇతరులతో కలవటానికి చేసే ప్రయత్నం ,అంతశ్శోధన ,అనిశ్చిత ముగింపు లు కనిపిస్తాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-16 –ఉయ్యూరు