నా కృష్ణా పుష్కర అనుభవం

నా కృష్ణా పుష్కర అనుభవం

సహ్రుదయులైన సాహితీ బందులకు,సాహిత్య సాంస్కృతిక అభిమానులకు శ్రీ క్రష్ణవేణీపుష్కర శుభాకాంక్షలు ‘ఈ నెల 12 వతేదీ శుక్రవారం నుండి 23 వ తేదీ మంగళవారం వారం వరకు బృహస్పతి కన్యా రాశిలో ప్రవేశించటం వలన క్రిష్ణవేణీ నదికి పుష్కరాలు మహోద్రుతంగా ఆంద్ర దేశమంతా జరుగుతున్నాయి .ఈ సందర్భం గా వయసు ,జ్ఞానం లో పెద్ద లైన వారు తమ కృష్ణ వేణీ పుష్కర అనుభవాలను రాస్తే అందరికి విశేష విషయాలు తెలుస్తాయని పించింది .అందుకే ఈ శీర్షికలో అందరూ భాగ స్వాములై తమ అనుభవాలను దీనిలో రాసి అందరికి వాటితో పరిచయం కలిగించాలని మనసారా కోరుతున్నాను  .బాధ్యత ఎవరి మీదో వేసి నేను పక్కకు తప్పకొకుండా ముందుగా వయసు రీత్యా 77లో  ఉన్న నేనే ముందుగా నా అనుభవాలను పొందు పరుస్తున్నాను. మీరూ రాయండి .పంచుకోండి .సద్వినియోగం చేయండి .

1940 లో పుట్టిన నాకు  4 ఏళ్ళవయసులో 1944 లో పుష్కరం  వచ్చింది .కనుక దాని గురించి నాకేమీ తెలియదు .నాకు గ్రాయకం వచ్చాక వచ్చిన పుష్కరం 1956 లో వచ్చింది .కనుక దీన్ని రెండవ పుష్కరం గా భావిస్తాను .అప్పడు మా నాన్న గారున్నారు .అమ్మా నాన్నలతో కలిసి పుష్కర స్నానం బెజవాడ లో చేసినట్లు లీలగా గుర్తుంది .అప్పడు నేను ఎస్ ఎస్ ఎల్ సి పాసై బెజవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో ఇంటర్ చదువుతున్నాను .మా చిన్న మామ్మఅంటే ‘’బుల్లిమామ్మ’’ గారింట్లో ఉండి చదువు కున్నా.అమ్మా నాన్న బుల్లిమామ్మ ఇంటికే వచ్చారు .అందరం కలిసి బారేజ్ ఇవతల ఘాట్ లో స్నానం చేసి ఉంటాము . అప్పుడే ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తే చూశాము .అప్పుడే మొదటి  సారి టీ.వి .ని చూశాము .భలే గొప్ప అనుభవం అది నాకు .ఇంకా చాలా ఉన్నాయి కాని నాకేమీ గుర్తులేవు .కాని ఆ తర్వాత నాన్న ,మా మేనమామ గుండు గంగయ్యగారు కలిసి తోట్ల వల్లూరు లో యధావిధిగా పుష్కరాలు పెట్టారు .వంట బ్రాహ్మణులను కుదిర్చి  మంచి బ్రాహ్మణులను పిలుచుకొని చాలా పెద్ద  ఎత్తున పుష్కర విధి నిర్వహించారు.బహుశా అదే మా రెండు ఇళ్ళల్లో జరిగిన పూర్తి పుష్కర సంబరం అని నాకు జ్ఞాపకం .

1968 లో మూడవ పుష్కరం చూశాను .నాన్న గారు 1961 లో మరణించటం ,అంతకు ముందే 1959లో మా అన్నయ్య మరణించటం,1964 లో నాకు ప్రభావతి తో పెళ్లి అవటం  వెంట వెంటనే పిల్లలు పుట్టటం తో మా ఇంట్లో పుష్కర హడావిడి ఏదీ జరిగిన గుర్తు లేదు .

1980లో నాలుగవ పుష్కరం చూశాను .బెజవాడ వెళ్లి మా తోడల్లుడు చతుర్వేదుల శ్రీరామ మూర్తి గారి కుటుంబం తోకలిసి బారేజ్ కు ఇవతలే పుష్కర స్నానాలు చేశాము .అప్పుడే నా చేతి వాచీ ,బంగారు ఉంగరం తీసి మా తోడల్లుడి గారి అబ్బాయి ముదుకు జాగ్రత్త చేయమని ఇస్తే వాడు బాధ్యతా రహితంగా సంచీలో వేసుకొన్న వాటిని గాలిలో ఊపుతూ రేవు చేరేసరికి అవి ఇసుకలో ఎక్కడో పడిపోయాయి .వాడిని అడిగితె తెల్ల మొకం వేశాడు .కృష్ణార్పణం –పుష్కరార్పణం అనుకొన్నాను –గాలికి ఎగిరే పేల పిండిని కృష్ణార్పణం అన్నట్లుగా .

1992లో అయిదవ పుష్కరం చూశాను .అప్పుడు మా రెండో అక్కయ్యాశ్రీమతి దుర్గ  బావ గారుశ్రీ వివేకానంద్ గారు కూడా ఉయ్యూరు వస్తే అందరం కలిసి తోట్ల వల్లూరు వెళ్లి కృష్ణా స్నానం చేసి హిరణ్యం పెట్టాం .తర్వాత శ్రీ కాకుళం కూడా వెళ్లి అక్కడా పుష్కర స్నానాలు చేశాం.  మేమిద్దరం బెజవాడ వెళ్లి కృష్ణానదీ స్నానం చేసి కనక దుర్గమ్మ దర్శనం చేసి ఎక్సి బిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం లో స్వామిని దర్శించాం.అప్పుడే చిట్టి బాబు గారి వీణ కచేరీ చూసి పరవశించాం .కోకిల స్వరాలు వేదం చాలా అద్భుతంగా వీణ పై వాయించి దివ్యాను భూతి కలిగించారు చిట్టి బాబు .చిట్టిబాబు వీణ లో చాలా గట్టి బాబు అని పించారు .ఆకార్యక్రమాన్ని శ్రీ నూకల చిన సత్యనారాయణ గారు సమన్వయ కర్త గా వ్యవహరించారు .ఎందుకోఆయన చిట్టి బాబు గారి వీణా వాదనను సరిగ్గా విశ్లేషించ లేక పోయారు అని పించింది నాకు .చేతిలో కాగితం లేదు. కాని చిట్టిబాబు గురించి చెప్పాలని తహ తహ గా ఉంది .ఎవరినో అడిగి పెన్ను తీసుకొని బస్ టికెట్ల వెనక నా స్పందన రాసి నూకల వారికిచ్చి చదవమని కోరాను .నా రాత అర్ధం కాక ఆయన ‘’ ఎవరో దుర్గా ప్రసాద్ గారట .చిట్టిబాబు గారి గురించి బాగా రాశారు .వారి నోట వింటే బాగుంటుంది .అని మాస్టారూ !మీరే పైకొచ్చి చదివి వినిపించండి ‘’అన్నారు  .నేను అక్కడ ప్రేక్షకజనాలకు బాబు గారికి నూకల వారికి నమస్కరించి నేను రాసిన ఆ చిన్న అక్షరాలలోని భావాన్ని ‘’చిట్టిబాబుగారు ఈ కృష్ణా పుష్కర సమయం లో మనల్ని అందరినీ తమ వీణా వాదనతో రస పుష్కరిణి లో ఓల లాడించారు .ఈ అనుభవం జీవితాంతం మరువ లేనిది .ఈ జీవితానికి ఈ అనుభవం చాలు అని పించింది .కోయిల స్వరాన్ని, వేద మంత్రాలను మహాద్భుతంగా వాయించి రస డోలికలలో ఊరేగించారు .ఆంద్ర జనం వారికి ఏమిచ్చినా ఋణం తీరదు .ఈమని వారిశిష్యులై గురువును మించిన శిష్యులనిపించారు .మరింత గా వీరు రాణించి సంగీత సర్వాతీ సమారాధన చేయాలని వినయ పూర్వకంగా కోరుతున్నాను ‘’అన్నాను .చిట్టిబాబు గారు తల వంచి నా పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు .నా జీవితం లో ఇది గొప్ప అనుభవం .అక్కడే శ్రీ మంగళం పల్లి బాలమురలీకృష్ణ గారి మేనల్లుడు శ్రీ పారుపల్లి రంగనాద్ గారి అన్నమయ్య కీర్తనలు విన్నాము .చాలా అలవోకగా భక్తీ భావ బంధురంగా పాడారు వారు .వేదిక దిగగానే అభినంది౦చాము .చాలా సంతోష పడ్డారు  ఆయన  చెబితే కాని  ఆయన బాలమురళిగారి మేనల్లుడు అని తెలియ లేదు .అప్పుడే బెజవాడ వాస్తవ్యులు  ప్రముఖ హరికధా విద్వాంసుల శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి   హరి కధనూ విన్నాం .ఆయన లబ్ధ ప్రతిస్టులైన భాగవతార్ .1963 లో నేను మోపి దేవి హై స్కూల్ లో పని చేస్తున్నప్పుడు పెద ప్రోలులో కాపురం ఉన్నాం. అప్పుడొక రాత్రి ఆయన పెదప్రోలులో కదా గానం చేశారు .వారికధాగానం వినటం అదే మొదటి సారి .ఇప్పుడు మళ్ళీ ..గాత్రం గానం విధానం చాలా బాగా ఉన్నాయి . .అయన మంచి నాటక నటులు కూడా .పొట్టిగా ఎర్రగా ఉంటారు ఈ పుష్కరాలలోనే మా అమ్మాయి విజయ లక్ష్మి  గుంటూరుగర్ల్స్ పాలిటెక్నిక్ లో చదువుతున్నప్పుడు అమరావతి కి కూడా వెళ్లి పుష్కర స్నానం చేసి అమరేశ్వర స్వామినీ దర్శించాం .

ఆరవ పుష్కరం2004 లో వచ్చింది .అప్పటికి నేను రిటైర్ అయి 6 ఏళ్ళు అయింది .అప్పటికే ఒక సారి 20 02 లో మొదటి సారి అమెరికా వెళ్ళాం .ఈపుష్కరానికి ఆరోగ్యాలు బాగానే ఉండటం తో వీలైనన్ని ఎక్కువ చోట్ల పుష్కర స్నానాలు చేశాం .స్నానం చేయాలి అను కొన్న రోజున తెల్లవారుజ్హామునే లేచి స్నానం సంధ్యా పూజా పూర్తి  చేసి టిఫిన్ తయారు చేసుకొని బాక్స్ లో పెట్టుకొని బస్ ఎక్కేవాళ్ళం .అక్కడ పుష్కర స్నానం చేసి దైవ దర్శనం చేసి అప్పుడు టిఫిన్ చేసేవాళ్ళం .ఆ తర్వాత మళ్ళీ ఏదో ఊరికి వెళ్లి  అక్కడస్నానాదులు చేసేవాళ్ళం .సాయంత్రానికి ఎప్పటికో  ఇంటికి చేరేవాళ్ళం .ఒకసారి ఉదయమే బయల్దేరి తోట్ల వల్లూరు రేవులో స్నానం చేసి ,పులిగడ్డ  నాగాయ లంక పెదకళ్ళే పల్లి  ,శ్రీకాకుళం ,పడవ పై కృష్ణ అవతలి ఒడ్డు చిలుమూరు చేరి అక్కడిగుంటూరు  రేవులో స్నానం చేసి రాత్రి కి  ఇంటికి చేరాం .ఈ ప్రయాణాలలో పండ్లు ఇంటి టిఫిన్ తప్ప ఎక్కడా భోజనం కాని టిఫిన్ కాని చేసేవాళ్ళం కాదు .

ఇప్పుడు 2016 లో వస్తున్నవి ఏడవ పుష్కరాలు .ఇంకా ఎక్కడ స్నానాలు చేయాలన్నది ఆలోచన లేదు .రేపు ఉదయమే మాఅమ్మాయి పిల్లలతో హైదరాబాద్ మా అబ్బాయి శర్మా వాళ్ళ ఇంటికి వెడతాం .అక్కడ అమ్మాయి ,పిల్లలు  13 తేది రాత్రి ఫ్లైట్ కు అమెరికా బయల్దేరి వెడతారు .మేము మా రెండో అబ్బాయి శర్మా  వాళ్ళింట్లో బాచుపల్లి లో ఉంటాం .అన్నీ కుదిరితే అక్కడే దగ్గరున్న ప్రదేశం లో కృష్ణా పుష్కర స్నానం చేస్తాం .అయినా సౌరమానం ప్రకారం గురుడు కన్యా రాశిలో ప్రవేశించాడని ముక్త్యాలలో ఒక గురువుగారు శిష్యులతో కృష్ణా పుష్కర స్నానం కిందటి మంగళవరామే చేశారని ఆంద్ర జ్యోతిలో చదివి కిందటి శుక్రవారం మేమిద్దరం మా అమ్మాయి పిల్లలిద్దరూ కలిసి కారులో ముక్త్యాల వెళ్లి పుష్కరస్నానం చేసి శ్రీ ముక్తేశ్వరస్వామిని కోటిలింగాలలోని శ్రీ పశుపతి నాదుడిని తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని ,పరిటాల శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి ఫెర్రీ వద్ద గోదావరి కృష్ణా సంగమాన్ని చూసి పులకించి ఆ పవిత్ర సంగమ ‘’గోదా –కృష్ణ ‘’జలాన్ని శిరసుపై చల్లుకొని ఇంటికి తిరిగి వచ్చిన సంగతి మీకు  తెలిసిందే .అంటే మా పుష్కర కోయిల మా సరసభారతి ఉగాది కోయిలలాగా ముందే కూసి౦దన్నమాట .

మీరూ మీ అనుభవం రాసి ఈ శీర్షికను సుసంపన్నం చేయండి .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-16—ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.