గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం )
481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు -2(చివరి భాగం )
శివ కర్ణామృతం లో పుట్టపర్తి వారి కవితా గీర్వాణం
పుట్టపర్తి వారి సంస్కృత భాషా గరిమకు ,వారి ఊహా సౌందర్యానికి అద్దం పట్టేదే ‘’శివ కర్ణామృతం ‘’.కాని దీనిని కొందరు సాహితీ ప్రియులేకాక సాహిత్య వరిస్టులు కూడా తమ రచనలు గా , వారివిగా ప్రకటించుకొన్నారని ఆచార్య వర్యులు మధునాపంతుల సత్యనారాయణ గారికి జాబు రాస్తూ బాధ పడ్డారు ..ఇలా వ్రాత ప్రతిగాఉన్నప్పుడే చేతులు మారింది ఈ కావ్యం .కాని ఇందులోని శ్లోకాలను ఆచార్యుల వారు పలు సభల్లో చదివి వినిపించటం తో వారి సంస్కృత భాషా వైదుష్యం చాలా మందికి తెలుసు .50 ఏళ్ళ తర్వాత వారి కుమార్తె శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని గారిని చేరటం,తండ్రిగారు 1990 సెప్టెంబర్ 1 న శివ సాయుజ్యం పొందాక ,మరణానంతరం 16 ఏళ్ళ తర్వాత ఆమె దీన్ని 20 06 లో ఆమె ముద్రించి సాహితీ లోకానికి అందించారు .ఇదీ దీని తెర వెనుక గాధ..పరమ వైష్ణవులైన నారాయణాచార్య పరమేశ్వర భక్తితో శివ తా౦డవమేకాక ,ఈ కావ్యాన్నీ రచించి తమ అద్వైత భావనకు ఉద్దీప్తి కలిగించారు .
శివ కర్ణామృతం అంతా పరమేశ్వరుని గుణగాన లహరీ విలాసమే .ఒకే అంశం తో ఒక గ్రంధాన్ని రాయటం సాహసమే కాక అరుదైన విషయం కూడా .121శ్లోకాలతో విరాజిల్లే ఈ కావ్యం శివ పారమ్యాన్ని మనోహరంగా వర్ణించి చెప్పింది .ఉదాహరణకు కొన్ని శ్లోకాల సొగసు చూద్దాం –
‘’కళానిధి కళావతీ కలిత జూట వాటీ లస –త్త్రివిస్టప తరంగిణీ లలిత తాండవాడంబరః
మదా౦చిత విలోచనో మధుర ముగ్ధ వేషస్సదా-పరిస్పురతు మానసే గిరి సుతాను రాగాంకురః’’
భావం –గిరిపుత్రి పార్వతికి శివుడు అనురాగ అ౦కురంగా ఉన్నాడు .ఆయన జటా జూటం చంద్ర వంక తో శోభిస్తోంది .ఆ జూటం లో గంగానది అతి మృదులంగా తాండవిస్తోంది .అందుకని ఆయనకళ్ళు మదాలనం గా ఉన్నాయి .ఆకట్టుకొనే ఇలాంటి రూపం ఉన్న శివుడు నన్ను అనుగ్రహించాలి .
49 వ శ్లోకం లో తమ ధార్మిక నైజాన్ని మనోహరంగా వర్ణించిన శ్లోక వైభవం చూద్దాం –
‘’శేష శైల శిఖా రాది వాసినః –కిమ్కరాః పరమ వైష్ణవా వయం –తత్తధాపి శశి ఖండ శేఖరే –శా౦కరే మహసి లీయతే మనః ‘’
అర్ధం –శేష శైల శిఖరం పై వెలసిన శ్రీనివాసుని భక్తులం పరమ వైష్ణవులం అయిన మేము నెల వంక శిరో భూషణం గా విరాజమానమైన ఆ పరమ శివ కాంతి స్వరూపం లోనే మా మనసులు లీన మౌతున్నాయి ‘’ అని తమ శివ భక్తిని వైష్ణపరాయణత్వాన్ని చెప్పుకొన్న అద్వైత భావి పుట్టపర్తివారు .
‘’శివ కర్ణామృతకావ్యం స్తోత్ర కావ్యం .భగవానుని రూప గుణ మహాత్మ్య ,తత్వ భక్తీ తన్మయత్వ స్తుతి ఇందులో ఉండటం వలన భక్తుని అభ్యర్ధనం పరమ రామణీయకంగా ఆవిష్కృత మైంది .శబ్దాలంకార శోభ నిజంగా చెవులకు అమృతం గా అంటే కర్ణా మృతం గా భాసిల్లింది .బ్దార్ధ ఉభయ అలంకార శోభ నెమలిలా పురి విప్పి నాట్యం చేసింది ‘.ఈ కావ్యం లో ఆచార్యులవారు శివునిదివ్య కాంతి స్వరూపునిగా స్తుతించారు .శివుని విభూతిని కాంతి ,తేజో రూపాలుగా వర్ణించి దైవం ఒక్కటే అని ఆ దైవం ఆమెకాని అతడు కాని కాదని అదొక దివ్య తేజం అని ,ఆతేజం మానవులకే కాక సకల విశ్వ సృష్టి కి ఆధారమైనది అని తన మనో భావాన్ని తెలియజేసి వేదోపనిషత్ రహస్యాన్ని విస్పష్టంగా విడమర్చి చెప్పారు ‘’అన్న శ్రీ శశిశ్రీ గారి మాటలు ముత్యాల మూటలే.ఆచార్య వర్యుల ముఖ్య అంతేవాసిగా వారు గ్రహించిన పూర్తి సత్యమే ఇది .
సాహితీ పుత్రుని జీవిత విశేషాలు
శ్రీ కృష్ణ దేవరాయల రాజ గురువు తిరుమల తాతాచార్యుల వారి వంశం వారు అనంత పురం జిల్లా చిత్రావతీ నదీ తీరం లోని పుట్ట పర్తి చేరి తిరుమలవారు పుట్టపర్తి ఇంటి పేరు వారయ్యారు .పెనుగొండ తాలూకా చియ్యేడు గ్రామం లో మాతామహుల ఇంట నారాయణా చార్యుల వారు 28-3-1914 న జన్మించారు .తండ్రి శ్రీ శ్రీనివాసాచార్యులు .తల్లి లక్ష్మీదేవమ్మ (కొండమ్మ ). నారాయణా చార్యులవారికి తొలి గురువు తల్లి . అణ్ణయ్య ఆచార్యులవద్ద సంస్కృతం అభ్యసించారు . ధర్డ్ ఫారం చదివే రోజుల్లోనే ‘’అల కవితా లోకమునకు ‘’అనే కంద పద్యం అల్లిన కుశాగ్ర బుద్ధి వారిది .పెనుగొండ కలెక్టర్ భార్య పిట్ దొరసాని వీరి కుటుంబ శ్రేయోభిలాషి .ఆమె షేక్స్పియర్ ,మిల్టన్ ల సాహిత్యాన్ని ఆపోసన పట్టిన విదుషీ మణి .ఆచార్యులవారికి ఆంగ్ల భాషపరిచయం ఆసాహిత్యం పై అభిమానం కలుగ జేసింది .రంజకం మహా లక్ష్మి అనే నృత్యకళాకారిణి వీరికోరికపై కూచిపూడి ,భరతనాట్యాలను నేర్పింది .పుట్టపర్తివారి బంధువు మైసూరులో ఉన్న శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారి వద్ద ప్రాకృత భాష ,దాని భాషా భేదమైన ‘’అపభ్రంశం’’కూడా నేర్చి అందులోని కావ్యమైన ‘’జనహర చరిత్ర ‘’అధ్యయనం చేసి కావ్య రచన పై ద్రుష్టి పడి. పెనుగొండ గతవైభవం మనసులో మెదిలి ‘’పెను గొండ లక్ష్మి ‘’కావ్యంగా రాశారు .అప్పటికి ఛందస్సులో పూర్తి ప్రవేశమూ లేదాయనకు .చిన్నప్పటి నుంచి తిక్కన భారతం వాచో విదేయం అవటం తో తేలికగా రాయగలిగారు .ఆర్ధిక స్తోమత లేక ముద్రా భాగ్యం కలిగించే లేక పోయారు .
తిరుపతి సంస్కృత కలాశాలలో చేరాలని వెడితే ప్రిన్సిపాల్ కపిత్ధలం కృష్ణమాచార్యులు పూర్వపు చదువు ధృవీకరణ పత్రాలు కావాలన్నారు .అవి ఉండటానికి అయన ఎక్కడైనా చేరి చదివితేగా!అసహనంగా బయటికి వస్తూ ఆశువుగా ఆవేశంగా పద్యాలు చెబుతూ బయటికొచ్చిన వీరిని వెనక్కి పిలిచి సీటు ఇచ్చారు ప్రిన్సిపాల్ .అదే వారి యోగ్యతా పత్రమైంది ,ప్రవేశ పాత్రమైంది.వ్యాకరణ అలంకార శాస్త్రాధ్యయనం చేస్తూ తోటి విద్యార్ధులకు వీటిని బోధిస్తూ’’ వాలి చరిత్ర ‘’,ఇందుమతి’’ అనే రెండు కావ్యాలు రాసి నచ్చక చి౦చి పారేశారు .అవధానాలు చేసి అలరించారు .ఊహా శక్తి కి అవధానాలు అడ్డం అని మానేశారు .పాఠ్య భాగాలు ఆయనకు ‘’ఆనలేదు’’ .నటన పై ధ్యాస పెరిగి సహ విద్యార్ధులతో ‘’బొబ్బిలి ‘’నాటకాన్ని కడప జిల్లా రాజం పేట లో ప్రదర్శించారు .వీరు తాండ్ర పాపారాయుడు పాత్రను, చలమచర్ల రంగా చార్యులుగారు రంగ రాయుడు పాత్రధరి౦చారు .నిరంతర సాహిత్య గోష్టి జరిపేవారు . వారి ధారణా శక్తి అమోఘం భట్ట బాణుని కాదంబరి కావ్యం షేక్స్పియర్ మిల్టన్ షెల్లీ కీట్స్ వర్డ్స్ వర్త్ కవుల రచనలను ఆసాంతం అప్పగించేవారు .వాల్మీకి రామాయణం నాలుకపై ఎప్పుడూ నర్తి౦చేది .అలివేలుమంగా పురానికి ఉత్తరాది మఠం స్వామి శ్రీ సత్య ధ్యాన కీర్తుల వారొచ్చినప్పుడు వారి సమక్షం లో సంస్కృతం లో ఆశుకవిత్వం చెప్పి షట్ శాస్స్త్ర పండితులైన స్వామినే మెప్పించారు .తిరుపతిలో తాను చదవటానికి ఏదీ మిగలి లేదని పెను గొండ కు వెళ్లి పోయి పరీక్ష సమయానికి వచ్చి రాసి ఉత్తీర్ణులయ్యారు .
1934 లో14 వ ఏట’’ పెనుగొండ లక్ష్మి’’ కావ్యం రాశారు .19 వ ఏట ముద్రణ పొందిన ఆ కావ్యాన్ని మద్రాస్ ప్రభుత్వం ఇంటర్ కు పాఠ్య గ్రంధం చేసింది .తిరుపతిలో ఉండగానే ఇంటర్ పరీక్ష రాసి తాను రాసిన కావ్యానికి తానే విద్యార్ధిగా పరీక్ష రాసి చరిత్ర సృష్టించారు .ఏనుగొండ లక్ష్మి పై ఇచ్చిన రెండుమార్కుల ప్రశ్నకు 40 పేజీల సమాధానం రాసి సమయం అయిపోగానే మిగిలిన వాటి జోలికీ పోకుండా జవాబు పత్రం ఇచ్చేశారు .పార్సీ భాషాధ్యయనం చేసి 17 0పద్యాల ‘’షాజీ ‘’ ‘’సాక్షాత్కారం ‘’ రాశారు .పెనుగొండలో వివాహం చేసుకొని భార్య కొన్ని రోజులకే చనిపోతే విద్వత్ కవ యిత్రి శ్రీమతి కనకమ్మ గారిని వివాహమాడి 5 గురు కుమార్తెలు ఒక కుమారునిని పొందారు . .ఆమె ఉత్తమ కవయిత్రి గా బహుమతి పొందారు .కాపురం ప్రొద్దుటూరు కు మార్చారు .కన్యకా పరమేశ్వరి దేవాలయం లో సంస్కృతం నేర్పారు విద్వాన్ పూర్తికాలేదింకా .భారతి పత్రికలో వీరి రచనలు ప్రచురితమయ్యేవి .మునిసిపల్ హై స్కూల్ తెలుగు పండితులుగా చేశారు .హిందీ సాహిత్యాన్ని అవలోడనం చేశారు .తులసీ తుకారాం కబీర్ రాస్ఖాన్ ,రాహీం ల కవిత్వాన్ని మధించారు .’’మేఘదూతం’’ ,శివ తాండవం’’ ‘’పండరి భాగవతం’’ రాశారు .కుందూ నది ఒడ్డున చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని శిష్యులతో ఉంటూ దాదాపు 7,0 00 కృతులు రాశారు .’’విజయనగర సామ్రాజ్య ప్రబంధం’’ రాశారు .మరాఠీ భాషానుభవంతో ‘’పాద్యం ‘’,అనే కావ్యాన్ని గురువు పూజ స్థానీయం పై రాశారు .పాండి చేరి వెళ్లి ,శ్రీ అరవింద ఘోష్ తో పరిచయం పెంచుకొన్నారు .అరవిందుల రచనలు తెలుగులోకి కొన్ని ఆవదించారు
రాళ్ళపల్లి వారి వద్ద సంగీతాన్ని సంధ్యా వందనం శ్రీనివాసాచారిగారితో కలిసి నేర్చుకొన్నారు .ఫిడేల్ పెద్ద జమాలప్ప ,వద్ద 150 కృతులు పాఠం చెప్పించుకొన్నారు ‘.ఘోరా కు౦ భార్ ‘’,తులసీదాస్’’, ‘’కాంగ్రెస్ చరిత్ర ‘’హరికధలు రాసి స్వయంగా గానం చేశారు. 60 వర్ణాలను కొక్కొండ సుబ్రహ్మణ్యం వద్ద నేర్చి ‘’శివ రంజని ‘’,శ౦కరి ‘’అనే రెండు కొత్త రాగాలను కనిపెట్టారు .త్యాగ రాజ స్వామి పై సంస్కృతం లో సుప్రభాతం రాస్తే మంగళం పల్లి బాల మురళీ కృష్ణ మధుర గానం చేసి అజరామరం చేశారు .ఇది ఆడియో కేసెట్ గా వచ్చింది .అగస్త్యేశ్వర సుప్రభాతం, చెన్నకేశవ సుప్రభాతం ఆచార్యులవారి ఇతర సంస్కృతకీర్తనలు . అన్నమాచార్యులవారి 100 కృతులకు బాణీల ఓణీలు వేశారు .
‘’గాంధీజీ మహా ప్రస్థానం ‘’తోపాటు కమ్యూనిస్ట్ భావ ప్రేరితంగా ‘’మేఘ దూతం ‘’,ఇంగ్లీష్ లో ‘’లీవ్స్ ఇన్ ది విండ్ ‘’కవితా సంపుటిని రాశారు . శంకరం బాడి బాడి సుందరా చార్యుల ప్రసిద్ధ గీతం ‘’మా తెలుగు తల్లి ‘’ని ఆంగ్లం లోకి అనువదించారు.సంప్రదాయ శైలి లో ‘’ది హీరో ‘’’’వైన్ గ్లోరియస్ ,’’భాగవతం ‘’రాశారు .ప్రొద్దుటూరు నుండి కడప కు మకాం మార్చి శ్రీ రామ కృష్ణ హైస్కూల్ లో తెలుగు పండితులుగా చేరి ,జిల్లెళ్ళమూడి అమ్మ గారు కొనిచ్చిన ఇంట్లో చేరి , .మళయాళ నిఘంటువు నిర్మాణం చేసి, ఆ భాషలోని రచనలను తెలుగులోకి తెలుగు నుండి కొన్ని మలయాళం లోకి మార్చారు .మరాఠీ భాష లో’’ భగవాన్ బుద్ధ’’ ,స్వర్ణ పత్ర’’ ,’’ఉషః కా’’ల్ నవలలు రాశారు .కృష్ణ శంకర్ దేవ్ మరాఠీరచన ను ‘’సమర్ధ రామ దాసు ‘’గా తెలుగులోకి అనువాదం చేశారు .
తులసీదాస్ మహాకవి రామ చరితమానస్ ఆచార్యులవారికి కంఠో పాఠం..హిందీలోఉన్న ‘’గాడీవాలా ‘’నవల ‘’కబీర్ వచనా వలి’’అనువదించారు .ఇంగ్లీస్ష్ నుంచి ‘’మెరుపులు –తలపులు ,’’అరవిందులు ,గీతోపన్యాసాలు’’ అనువాదం చేశారు .14 భాషలలో అనితర సాధ్య పాండిత్య ప్రకర్ష కలిగి ,సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించిన వీరికి ,ప్రతిభకు తగ్గ పురస్కారం ‘’పద్మశ్రీ ‘’నిభారత ప్రభుత్వం 1972జనవరి 26 న పుట్టపర్తి వారికి అందజేసి గౌరవించింది .1975 లో తిరుపతి విశ్వ విద్యాలయం ,1978 లో శ్రీ కృష్ణ దేవ రాయ విశ్వ విద్యాలయం లనుంచి గౌరవ డాక్టరేట్ పొందారు .’’జనప్రియ రామాయణం’’రాసి ,5 వ ఏట ఉర్దూ భాష నేర్చి ,ఘనంగా షష్టి పూర్తీ మహోత్సవం జరుపుకొని ,దేశం లోని అనేక సాహిత్య సంస్థలచేత సమ్మానింప బడి ,భార్య కనకమ్మగారి ప్రోత్సాహ , ప్రోద్బలాలతో 140 గ్రంధాలు రాసి తనకురావాల్సిన ‘’జ్ఞాన పీఠపురస్కారం ‘’మాత్రం దక్కక , 78 వ ఏట అభిమానులకు శిష్యులకు ‘’అవతారం చాలిస్తున్నానప్పా ‘’అని చెప్పి సరస్వతీపుత్రులు తల్లి సరస్వతీ సాన్నిధ్యానికి చేరారు .
ప్రొద్దుటూరు లో 20-9-1991 న పుట్టపర్తి వారి విగ్రహం ఏర్పాటు చేశారు .కడపలో వారి శిష్యులు ‘’సరస్వతీ పుత్ర అవార్డ్ ‘’ఏర్పరచి అర్హులకు అంద జేస్తూ వారి మధురస్మృతులను జ్ఞప్తికి తెచ్చుకొంటూ ఋణం తీర్చుకొంటున్నారు .కుమార్తెలు శ్రీ నాగపద్మినిగారు సోదరితో శ్రీమతి అనూరాధ గారి తో కలిసి ‘సరస్వతీ పుత్ర’ నారాయణా చార్య ‘’’బ్లాగ్ ఏర్పరచి తండ్రిగారి రచనలను అందరికి అందుబాటు లోకి తెచ్చారు .
సమాప్తం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్