సాహితీ బందువులకు సాహిత్యాభిమానులకు 12-8-16 శుక్రవారం నుండి ప్రారంభమయ్యే శ్రీ కృష్ణ వేణీ పుష్కర ప్రారంభ శుభాకాంక్షలు ,మరియు శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు -దుర్గా ప్రసాద్
—
పుష్కరోత్సవం!
12-08-2016 01:32:19
పుష్కర ఘడియల్లో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నది. తెలుగుసమాజం యావత్తూ భక్తిపారవశ్యంలో పులకరించి పోతున్నది. జలం జీవమై, మానవ నాగరికతలు నదీమతల్లుల ముద్దు బిడ్డలైనప్పుడు, పాడిపంటలు ప్రసాదించే ఆ జీవనదులను అర్చించి, తమ ప్రాణదాతలకు ప్రణమిల్లే సమున్నత సంప్రదాయం మనది. ఎండిన గొంతుకల సేదతీర్చి, తెలుగునేలపై నిండైన పచ్చదనాన్ని పరచే కృష్ణవేణమ్మ పుష్కర మహోత్సవాన, నిండుగా మునకేసి పునీ తులు కావడానికి కోట్లాదిమంది సంసిద్ధులైన తరుణంలో తెలుగు ప్రభుత్వాలు బృహత్తరమైన ఏర్పాట్లతో ప్రజాభీష్టాన్ని నెరవేరు స్తున్నాయి.
పుష్కరాలు భారతీయ ధార్మిక జీవనానికి ప్రతీకలు. ఉమ్మడి భావనకు చిరునామాలు. సమైక్యతకు నిదర్శనాలు. పుష్కరుడైన వరు ణుడు ఏడాదికొకటి చొప్పున, ఈ దేశంలోని పన్నెండు పుణ్యనదుల్లో నివాసం ఉంటాడన్న శాస్త్రోక్తితో పన్నెండేళ్ళకోమారు ప్రతీనదికీ పుష్క రాలు వస్తాయి. ఆయా కాలాల్లో ఈ నదీపరీవాహక ప్రాంతాలు పుణ్య భూములై పులకరించిపోతాయి. ఇప్పుడు దేవగురువు బృహస్పతి కన్యా రాశిలో కాలూనిన కాలంలో, దేశంలో మూడవ అతిపెద్ద, పుణ్యనదుల్లో ఆరవదిగా శాస్త్రాలు అభివర్ణించిన కృష్ణమ్మ పుష్కరుడి ఆగమనంతో పులకించిపోతున్నది. తన 1400 కిలోమీటర్ల ప్రయాణంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల చారిత్రక, సాంస్కృతిక జీవనంలో ప్రముఖ పాత్రపోషిస్తూ, వివిధ పురాణాల ప్రశస్తిని పొందిన కృష్ణవేణి ఈ దారిపొడవునా అనేక ఆలయాలను అభిషేకిస్తున్నది. తెలుగునేల మీద ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం, అష్టాదశపీఠాల్లో ఒకటిగా ఉన్న అలంపూర్‌లతో పాటు అనేకానేక పుణ్యస్థలాలను స్పృశి స్తున్నది. ఆయా దివ్యక్షేత్రాల మహిమ, నదీ పవిత్రత కలగలసి పుష్కరకాలంలో తీరంలోని ఆలయాలు మరింత మహత్తును సంతరించుకుంటాయన్న విశ్వాసమే నదీస్నానం అనంతరం అలయ దర్శనాన్ని ఒక విధిగా మార్చింది. సహ్యాద్రి పర్వతసానువుల నుంచి హంసలదీవిలో సాగరసంగమమయ్యేవరకూ మార్గమధ్యంలో అనేక ఉపనదులను కలుపుకుంటూ పరవళ్ళు తొక్కే కృష్ణవేణి మానవ నిర్మిత ఆధునిక దేవాలయాలకూ ఆధారభూతమవుతున్నది. శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీవంటివాటిని నిండుగా దీవిస్తూ, తెలుగునేలను సస్యశ్యామలం చేస్తూ, కోట్లమంది దప్పిక తీరుస్తున్నది.
పుష్కరుడి ఆగమనంతో పులకించే పుణ్యతీర్థాలు, భక్తజన పాదస్పర్శతో తడిసిముద్దవుతున్న వందలాది స్నానఘట్టాలు, అలం కరణలతో వెలిగిపోతూ, భక్తిపారవశ్యంలో పరవశించిపోతున్న ఆల యాలు తెలుగునేలన దర్శనమిస్తున్నాయి. చల్లనితల్లి కృష్ణమ్మకు తలవంచి నమస్కరించి, మునకలేసి తరించడానికి బారులు తీరు తున్న భక్తులకోసం ఘనమైన ఏర్పాట్లు చేయాలన్న దృఢ సంకల్పంతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సుదీర్ఘకాలంగా శ్రమించాయి. తెలంగాణ ప్రభుత్వం 825 కోట్లతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1200 కోట్ల కేటాయింపులతో, ఉమ్మడిరాష్ట్రంలో జరిగిన చివరి పుష్కరాల బడ్జెట్‌కు పదిరెట్లు ఇప్పుడు ఖర్చుచేస్తున్నాయి. 1992లో కోటీపాతికలక్షలున్న భక్తజనుల సంఖ్య, మరుసటి పుష్కరాలకు మూడుకోట్లయినప్పుడు ఇప్పుడు ఆ సంఖ్య ఏడుకోట్లకు చేరుతుందన్న అంచనాలు కట్టి ఇంతటి వ్యయానికి నడుంబిగించినా, పనుల నాణ్యత విషయంలో ఎప్పటిమాదిరిగానే విమర్శలు తప్పడం లేదు. వాటిని అటుంచితే, ఈ సామాజిక మహోత్సవాన్ని సజావుగా ముగించడం ప్రభుత్వాల కర్తవ్యం. ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్ళతో భక్తజనకోటి రాకకోసం ఏర్పాట్లు చేసినప్పుడు డజనుకుపైగా ప్రభుత్వవిభాగాలు సయోధ్యతో, సమన్వయంతో మిగతా బాధ్యతలను కర్తవ్యనిష్ఠతో నెరవేర్చి ఈ పుణ్య స్నానాల ప్రక్రియను మధురానుభూతిగా మార్చవలసిన అవసరం ఉన్నది.
ప్రయాణానికి వీలైన, పేరున్న ప్రాంతాలకే భక్తులు అధికంగా తరలివెళ్ళే చరిత్ర ఇటువంటి సందర్భాల్లో కనిపిస్తున్నదే. అందువల్ల తక్కిన ఘాట్ల వివరాలను ఆధునిక సమాచార వ్యవస్థద్వారా తెలియ చెప్పడంతోపాటు, ఎప్పటికప్పుడు రద్దీని కూడా విశదీకరించి మార ్గనిర్దేశనం చేయడం అవసరం. ప్రభుత్వ సమాచారాన్నీ, హెచ్చరికలను పెడచెవినపెట్టకుండా భక్తులు కూడా సంయమనంతో తోడ్పాటుతో వ్యవహరించినప్పుడే ఈ పుణ్యకార్యం ప్రమాదాలకు తావులేకుండా ప్రమోదాన్ని అందిస్తుంది.
తనకు ప్రాణాధారమైన నీటిముందు వినమ్రంగా మోకరిల్లే ఈ ఆధ్యాత్మిక క్రతువు ప్రకృతిపట్ల ప్రేమకూ ఆరాధనకు ప్రతీక. దీనికి ఆయాప్రాంతాల్లోని విభిన్నమైన ఆచారాలు, విధులు, విశ్వాసాలు తోడైనప్పటికీ, అది అందిస్తున్న సందేశాన్నీ, అంతిమసారాన్నీ తన జీవనపర్యంతం గుర్తెరిగి వ్యవహరించడం మనిషి బాధ్యత.