ఇది విన్నారా కన్నారా ! 22
36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -5
258-గాత్రానికి గాత్రత్వం ఎలాంటిదో వీణ కు ‘’వీణత్వం’’ అలాంటిది .చాలామంది వైణికులలో ఈ వీణత్వం లోపిస్తుంది .7 తంత్రులను వీణ మీద మీటి నప్పుడు కలిగే నాద సౌభాగ్యం ఇతర వాద్యాలలోకాని గాత్రం లో కాని రాదు అంటారు ఆచార్య వీరభద్రయ్య .ప్రతి వాద్యానికీ ఒక పరిమితి ఉంటుంది .ఆ పరిమితి లోనే వీణ వృద్ధి చేశారు శంకర శాస్త్రి గారు .త౦త్రి మీద కంపిత గమకాన్ని సాధించటం కుదరదు .కాని ప్రయోగ శీలి అయిన శాస్త్రిగారు అనుమంద్ర తంత్రిని పరాన్ముఖంగా కాకుండా ,అభి ముఖంగా లాగి గమకాన్ని సాధించిన నేర్పు ఈమని వారిది అంటారు శ్రీ వీరభద్రయ్య .మంద్ర ,అనుమంద్ర తంత్రుల మీటులో సాధించిన మరో విశేషం ఉంది .వీణ బ్రిడ్జికి మేళాంతానికిమధ్య మీటటం కాక ,తార స్వరాలు పలికే మెట్ల మీద ఆ తంత్రులను బొటన వ్రేలితో మీటటం .మామూలు చోట మీటితే వచ్చే ధ్వనికి ,దండం పై తారస్థలం లో మీటితే వచ్చే ధ్వనికీ ఎంతో భేదం ఉంది అని విశ్లేషించి చెప్పారు ఆచార్య వీరభద్రయ్య .ఇక్కడే రసికులు ,సంగీత ప్రియులు గమనించాల్సిన అంశం ఒకటి ఉందంటారు ఆచార్య వర్యులు .తీగపై మీటు ఎక్కడ మీటాలి ?ఇది ఒక్కొక్క త౦త్రి పై ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది .సందర్భాన్ని బట్టికాకుండా అన్నిటికీ మేళాంతంనుంచి బ్రిడ్జి వరకు తీగలోని మధ్య బిందువు మీద కాని ,మేళాంతం లో కాని మీటటం సాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు .కాని శాస్త్రి గారు మీటే స్థలాన్ని అక్కడక్కడ మారుస్తూ నాదం లో గొప్ప వైవిధ్యాన్ని సాధించారు .మీటును బ్రిడ్జి కి ఆనుకొన్న స్థలం లో మీటి రాగానికి ,స్వరానికీ ఎంతో భేదాన్ని చూపారు శాస్త్రి గారు మూడు చోట్ల మీటు ను మీటడం వలన వాద్యధ్వనిలో ఉండే యాంత్రికత ను తొలగించి’’ సజీవత్వం ‘’కల్గించటం శాస్త్రి గారి అద్భుత కృషి అన్నారు వీణ విమర్శకులైన ముదిగొ౦డవారు .
259-శాస్త్రి గారు సాధించిన మాధుర్యం మీటే స్థలాన్ని బట్టి తెప్పించారు . ఆ తంత్రులకు ‘’జీవం ‘’పెట్టారు .అంటే బ్రిడ్జి మీద ఈ రెండు తంత్రులకు ఒక ‘’గరుకైన ఉన్ని పోగు’’ను పెట్టి ,దానితో ఆ తంత్రులను మీటినప్పుడు ఒక విచిత్ర ,విశిష్ట మధుర ధ్వని కలుగుతుంది ఈ పధ్ధతి త౦బూరాలో ఉంది .దీన్ని వీణలోనూ తెచ్చారు శాస్స్త్రిగారు .వాయి౦పు లో మంద్ర తంత్రీ నాదానికి అనూహ్యమైన మాధుర్యాన్ని ఈ ‘’జీవం ‘’వలన సాధించేవారు శాస్త్రి గారు అని కనిపెట్టి చెప్పారు ముదిగొండ అయ్యవారు.అంతవరకూ మీటు విషయం లో ఇలాపరిశోధించిన వారు లేరని ముదిగొండ ఉవాచ .వీణా వాదనా మాధుర్యం లో సగం ఈ మీటు లోనే ఉంది .
260-సారణి మీద పంచమాన్ని మీటి నప్పుడు పంచమ తంత్రిని కూడా జోడించటం సాధారణ వైణికులు చేసేపని .కాని శాస్త్రి గారు సారణి మీద వాయిస్తున్నప్పుడు, కేవలం స-ప-స- లను వాయిస్తున్నప్పుడు మాత్రమే కాక ,తక్కిన స్వరాలను మీటు తున్నప్పుడు కూడా ఇతర తంత్రులను అక్కడక్కడ మీటి ‘’అనితర సాధ్యమైన మాధుర్యాన్ని ‘’సృష్టించేవారు .వీటి గురించి తెలియాలంటే వారి ప్రయోగాలే శరణ్యం అన్నారుఆచార్య వీరభద్రయ్య .
261-తాళం తీగల విషయ౦ లో కూడా శాస్త్రి గారి వాదన లో ప్రత్యేకత ఉంది .పూర్వ సంప్రదాయం లో తాళాన్ని చూపేటప్పుడు మాత్రమే తాళం తీగలను మీటేవారు .తాళాన్ని చూపేటప్పుడు ‘’ఘాత ‘’ఎక్కడ చూపితే అక్కడ మాత్రమే తాళం తీగలను చిటికెన వ్రేలి గోరు తో పైకి మీటేవారు .తరువాత తర్వాత ఈ విధానం మారింది .అప్పుడు శాస్త్రిగారు తాళం తీగలను మాధుర్యం సృస్టించటానికి మాత్రమే వాడారు .ఇప్పుడు ఎవరూ వారి నైపుణ్యాన్ని అనుకరించ లేక పోతున్నారు శ్రుతికి ప్రత్యామ్నాయం గానిలపడమే కాక ,సారణి మీద వాయింపు కు మాధుర్యపు గుబాళింపు ,రోచిస్సు లను జోడించి ఘనత తెచ్చారు అని విశ్లేషించారు డాక్టర్ వీరభద్రయ్య .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్