నా కృష్ణా పుష్కర అనుభవం -2
ఇప్పుడు 2016 లో వస్తున్నవి ఏడవ పుష్కరాలు .ఇంకా ఎక్కడ స్నానాలు చేయాలన్నది ఆలోచన లేదు అని 5-8-16 న రాశాను .నిన్న 15-8-16 సోమవారం భారత 70 వ స్వాతంత్ర దినోత్సవం రోజున తెలంగాణా లో కృష్ణా పుష్కర స్నానం చేశాము .ఆవివరాలే ‘’బాచుపల్లి నుండి బీచు పల్లి ,అలంపురం ‘’శీర్షిక గా తెలియ జేస్తున్నాను ‘
‘’బాచుపల్లి నుండి బీచు పల్లి ,అలంపురం’’
నిన్న 15 వ తేది ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి స్నానం ,సంధ్య ,పూజ లు పూర్తీ చేసుకొని ,రెండు సార్లు కాఫీ త్రాగి ,నేనూ మా రెండవ అబ్బాయి శర్మ ,కోడలు ఇందిర మనవడు శ్రీ హర్ష ,మనవరాలు హర్షితా౦జని కలిసి మా వాడి కారులో వాళ్ళు ఉంటున్న హైదరాబాద్ లోని బాచు పల్లి నుండి శ్రీ ఆంజనేయ క్షేత్రం అయిన బీచుపల్లి కృష్ణా ఘాట్ కు ఉదయం 5 గం లకే బయల్దేరాం .దారిలో తినటానికి పులిహోర ,పెరుగన్నం ‘’మూటలు ‘’కట్టుకొన్నాం .మా శ్రీమతికి కంటి శుక్లాల ఆపరేషన్ చేసి మూడు వారాలు అయినందున ఆవిడను ఇంట్లోనే వదిలి మేము మాత్రమే బయల్దేరాం నేషనల్ హై వే 44 మీద ప్రయాణం చేస్తూ షాద్ నగర్ జడ్చెర్ల మీదుగా మెహబూబ్ నగర్ జిల్లా బీచుపల్లి ఘాట్ కు ఉదయం 8- 30 గంటలకు అంటే సుమారు మూడున్నర గంటలు కారులో ప్రయాణం చేసి సుమారు 210కిలోమీటర్లు ప్రయాణించి చేరాం జూరాల ప్రాజెక్ట్ చెర నుండి విడుదలైన కృష్ణమ్మ ఇక్కడ పరవశంగా పరవళ్ళు తొక్కుతూ మహా ప్రవాహంగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది .బీచుపల్లికి రెండవ వైపు రంగా పూర్ ఘాట్ ఉంది .అక్కడ నీరు ఘట్లకు చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపించింది నడక దూరం కూడా తక్కువగా ఉన్నట్లు ఉంది .జన రద్దీ కూడా అక్కడ బాగా ఉంది .కాని బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి సుప్రసిద్ధుడు కనుక ఈ ఘాట్ లో కృష్ణా పుష్కర స్నానం చేయాలని వచ్చాం .
ఎ1 కార్ పార్కింగ్ లో కారు ను పెట్టి ,స్నాన సరంజామా ,పూజా సామగ్రి ,తిండీ అన్నీ మోసుకొంటూ సుమారు కిలోమీటరు పైగా ఉన్న బీచు పల్లి రేవు చేరాం .జనం అంత గా రద్దీగా లేరు .ఓ మోస్తరుగా ఉన్నారు .పార్కింగ్ దగ్గరే బస్ స్టేషన్ ఉంది.అక్కడి నుండి అలంపురం కర్నూలు మొదలైన చోట్లకు బస్సులున్నాయి .కర్నూలు చాలాదగ్గర .పుష్కర ఘాట్ లో దిగి మా అబ్బాయి కోడలు మనవ రాళ్ళ కు సంకల్పం చెప్పి కృష్ణా పుష్కర స్నానం చేయించి అర్ఘ్యాలు ఇప్పించాను .తర్వాత మా మనవడు ,నేను దిగి స్నానం చేశాము .కాలుష్యం లేదు మంచి ప్రవాహం .కానిమా ఘాట్ కు పక్కనే ఉన్న రెండవ ఘాట్ లో కొంచెం లోతు ఎక్కువగా ఉంటె మధ్యలో ఉన్న చిన్న గోడ దాటి అందులో పూర్తిగా మునిగి స్నానాలు చేశాం. చాలా హాయి అనిపించింది ,కొత్త విద్యుత్హు శరీరం లోకి ప్రవేశించిందని పించింది .కరెంట్ అంటే ప్రవాహం కనుక జల విద్యుత్ శరీరం లోకి చేరిందన్నమాట .మాంచి ఉరవడి ఉండటం తో జీవ నదిలో స్నానం చేయటంతో గొప్ప అనుభూతి కలిగింది .అందరం చాలా ఆనందించాం.నేనూ మళ్ళీ సంధ్యావందనం చేసి కృష్ణవేణి కి ,బృహస్పతి శివ సూర్య మొదలైన దేవతలకు,ఋషులకు అర్ఘ్యం ఇచ్చాను. తర్వాత పితృదేవతలకు ,జలతర్పణం చేశాను .జ్ఞాపకం ఉన్న చనిపోయిన బంధువులకు మిత్రులకు కె ఎల్ రావు గారికి కాటన్ దొరకు ,కాంతారావు గారికి ఆర్ ఎస్కె మూర్తి మొదలైన మిత్రులకు జల తర్పణం చేశాను .తర్వాత మా కోడలి చేత కృష్ణ వేణీ మాతకు అష్టోత్తర పూజ చేయించాను .అంతా అయ్యాక అందరం బట్టలు మార్చుకొని ఒడ్డునే ఉన్న శ్రీ రామాలయాన్ని సందర్శించే ప్రయత్నం చేసి జనం బాగా ఉన్నందున బయటి నుంచే నమస్కారం చేసిలడ్డూ ప్రసాదం కొని ,తిని ,ప్రక్కనే ఉన్నఅతి ప్రాచీన బీచు పల్లి ఆంజనేయ స్వామి ని కనులారా దర్శించి ,ప్రసాదం కొని,తిని బయటికొచ్చి అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని వెంట తెచ్చుకొన్న పులిహోర ,దధ్యోజనం తిని బరువు తగ్గించాం .మందులేసుకొని11గంటలకు మళ్ళీ ప్రయాణానికి సిద్ధమయ్యాం .ఈ క్షేత్రం లోనే ‘’కణ్వ మహర్షి ‘’తపస్సు చేశాడని ఐతిహ్యం .ఇక్కడ కణ్వమహర్షి తపోవనం ,ఆయన కు గుడి కూడా కట్టి ఉంది .ఇక్కడ వి ఐ పి లకు ప్రత్యేకఘాట్ ,ప్రత్యేక పార్కింగ్ లు కూడా ఉన్నాయి ‘
బీచుపల్లి ప్రాధాన్యత
మెహ బూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్ట్ కు సుమారు 30 కిలోమీటర్ల దిగువన బీచుపల్లి లో కృష్ణానది ప్రవహిస్తోంది .నదిమీదుగా బ్రిడ్జ్ కట్టి నేషనల్ హై వేకు కలిపారు .దీనివలన తెలంగాణా ,రాయల సీమలకు గొప్ప సౌకర్యమేర్పడింది .మధ్య ,ఉత్తర దక్షిణ భారత దేశాలను కలిపే భాగం గా నిర్మించబడిన బ్రిడ్జ్ లలో ఇది ఒకటి .మొదట్లో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కృష్ణా నది ఒడ్డుకు 20 0మీటర్ల దూరం లో ఉంది. దీనికి దగ్గర శివాలయముంది ..వర్షాకాలం లో కృష్ణకు ఉద్ధృతంగా వరదలొచ్చి శివాలయం మునిగి పోయేది .19 92 లో ఒడ్డునే శ్రీ రామాలయం కట్టారు .బీచుపల్లి ఆంజనేయ స్వామి రెండు దీవుల మధ్యలో ఉన్నాడు .10 చదరపు కిలో మీటర్ల వైశాల్యం ఉన్న పెద్ద దీవిఉన్నగ్రామాన్ని గుర్రం గడ్డ అని అంటారు .దీనిలో పంటలు బాగా పండి రైతుల నివాస భూమిగా ఉంది. చిన్నదీవిని నిజాం కొండ అంటారు .బీచుపల్లి లో ఉన్న రెసి డేన్షియల్ స్కూల్ గత 30 ఏళ్ళుగా పదవ తరగతి పరీక్షలలో టాప్ రాంక్ సాధిస్తూ అగ్రభాగాన ఉంది .
శ్రీ బీచుపల్లి ఆంజనేయ వైభవం
15 వ శతాబ్ది లో విజయనగర రాజు శ్రీ కృష్ణ దేవ రాయల ఆస్థాన గురువు వ్యాస రాయలవారు ఈ ప్రాంతం లో పర్యటన చేస్తూ ,శిష్యులతో ఒక సారి ఇక్కడే విశ్రాంతి తీసుకొన్నారు . ..ఈ ప్రదేశం పరమ పవిత్రమైనదిగా భావించి ఇక్కడ శ్రీ ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించారు తన ఆలోచనలనన్నిటితో ఒక సుందర ఆంజనేయ విగ్రహాన్ని తయారు చేయించారు .తాను ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాక ఈ మూర్తిని ఎవరు అర్చిస్తారు అనే అనుమానం రాగా ,ఆ రాత్రి కలలో స్వామి కన్పించి దానికి పరిష్కారం చెప్పాడు అంతే .మంచి ముహూర్తంలో వ్యాస రాయలవారు శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతిష్టించారు .మర్నాడు ఉదయం వ్యాస రాయలవారు నిద్ర లేవగానే ఒక గిరిజన బాలుడు తాను ప్రతిష్టించిన హనుమస్వామి విగ్రహానికి పూజ చేస్తూ కనిపించాడు .ఆ కుర్రాడి పేరే ‘’ బీచు పల్లి ‘’.బోయ జాతి కుర్రాడైన బీచుపల్లి ని ఆలయ అర్చకునిగా వ్యాస రాయలవారు నియమించారు .అప్పటి నుంచి ఆ జాతివారే ఆలయ అర్చకులు .అందుకనే స్వామిని ‘’బీచుపల్లి రాయుడు ‘’అని ఆప్యాయంగా పిలుచుకొంటారు .
నిత్యం బీచు పల్లి రాయుడికి తమలపాకుపూజ ,పంచామృత అభిషేకం నిర్వహిస్తారు .మార్గశిర పౌర్ణమి నాడు హనుమజ్జయంతిని వైశాఖ శుద్ధ చతుర్దశినాడు నృసింహ జయంతిని ఘనం గా నిర్వహిస్తారు .ఈ క్షేత్రం లో వివాహ ఉపనయనాలు చేసుకొంటారు .ప్రశాంత వాతావరణం ఉన్న క్షేత్రం కనుక ధ్యానానికి అత్యంత అనుకూలం .ఈ ప్రాంతం వారికి బీచుపల్లి రాయుడు కులదైవం .ఉత్సవాల రోజున దేశం నలు మూలల నుంచి వేలాది భక్తజనం వచ్చి క్రిష్ణాస్నానం చేసి బీచుపల్లి రాయని దర్శించి మనసులోని కోర్కెను విన్నవించి సఫల మనోరదులౌతారు .
బీచుపల్లి పోతే వాఛి పోద్ది
ఆలయాల సందర్శనం తర్వాత ఎటు పోతే కారు పార్కింగ్ వస్తుందో తెలీక ,చెప్పేవారెవరూ లేక అక్కడి దిశా నిర్దేశం చేసే సూచికలు లేక ,తలో రకంగా చెప్పగా ‘’లాడూ లస్కూ ‘’బుజాన వేసుకొని పొలం గట్ల వెంట పడుతూ లేస్తూ నడుస్తూ ,దాదాపు రెండుకిలోమీటర్లు కాళ్ళు వాచేట్లు నడించి పార్కింగ్ చోటికి చేరితే ,అది వి ఐ పి పార్కింగ్ అని కానిస్టేబుల్ చెబితే మళ్ళీ అరకిలో మీటరు నడిచి కోళ్ళ ఫారాల ప్రక్కన నడుస్తూ ,ఆ కంపు నసాళానికి ఎక్కి చీదరింపు ఏవ గింపు కలిగినా ముక్కు మూసుకొని నడిచి ఎట్లాగో అట్లా మా ఎ 1 పార్కింగ్ చేరి హమ్మయ్య అనుకోని కారులో కూర్చుని బయట పడే ప్రయత్నం చేశాము .జనమూ పెద్దగా లేరు ,కార్ల హడావిడీ తక్కువే అయినా ఘాట్ దాకా కార్లను పంపించకపోవటం దారుణం .ముసలీ ముతకా అంత దూరం నడిచి వెళ్ళాలంటే’’ కూసాలు ‘’కదిలి పోతాయి .పోనీ అంత స్ట్రిక్ట్ గా రూల్స్ అమలు చేస్తున్నారా అంటే అదీ లేదు .ఆటోలు’’ పుష్పక విమానాల్లాగా’’ జనాలను ఎక్కించుకొని ,ఆఘమేఘాలమీద ఘాట్లకు పరిగెత్తుతూనె ఉన్నాయి .సుమోలు కార్లూ కూడా వెళ్ళటం చూశాం .చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేదు .’’డైరెక్షన్ లెస్ యాటి ట్యూడ్’’కు ప్రత్యక్ష నిదర్శనం ఇదే .
సరే అని కారులో బయల్దేరి బయట పడుదామంటే దాదాపు ఇరవై కిలోమీటర్లు నిర్జన ,కొత్తగా వేసిన కచ్చా ఎర్రమట్టి సన్నని రోడ్డు మీద ప్రయాణిస్తేనే కాని మెయిన్ రోడ్ కు చేరుకోలేక పోయాం .ఈ ఏర్పాటూ పరమ దారుణంగా ఉంది .అసలు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు .బ్రిడ్జి మీదనుంచే వెనక్కి వెళ్ళే ఏర్పాటు చేస్తే ఎంతో సౌకర్యంగా ఉంది .బ్రిడ్జి కి ఆనుకొనే నది ఉంటె ఈతిప్పలెందుకు అని అందరూ ‘’సన్నాయి నొక్కులు ‘’నొక్కుతూనే ఉన్నారు . .
ఇంకో విశేషం హైదరాబాద్ దాటి వచ్చాక ప్రతి అరకిలో మీటర్ దూరం లోనూ రోడ్డుకు రెండువైపులా ‘’పుష్కర యాత్రికులకు ఉచిత ఫలహారం భోజనం ‘’అని బోర్డ్ లున్నాయి .కాని ఎక్కడా ‘’బావార్చి ‘’అంటే వండి వార్చి వడ్డించిన దృశ్యం కనిపించలేదు .ఇదొక మెహర్బానీ .సరే’’ టోల్ ఫ్రీ ‘’అని నెలల తరబడి మాధ్యమాలలో చెప్పించిన సర్కారు తోలు వలిచి మరీ టోల్ ప్లాజా లలో టోల్ బాజా మొగిస్తున్నారని కార్ల వాళ్ళు ‘’కార్ కూతలు ‘’కూశారు .అందుకే ‘’బీచ్ పల్లి పొతే వాచి పోద్ది ‘’అన్నాను .
అలంపురం జోగులాంబ దర్శన విశేషాలు తరువాత తెలియ జేస్తాను .అంత దాకా ఓపిక పట్టండి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-16-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్