నా కృష్ణా పుష్కర అనుభవం -3-అలంపురక్షేత్ర సందర్శన విశేషాలు

నా కృష్ణా పుష్కర అనుభవం -3-అలంపురక్షేత్ర సందర్శన విశేషాలు

సుమారు పాతికేళ్ళ క్రితం శ్రీ గడియారం రామ కృష్ణ శర్మ గారి జీవిత చరిత్ర చదివాను .వారు మెహబూబ్ నగర్ ప్రాంతం వారని జ్ఞాపకం ,అందులో వారు తాను సంస్కృత కావ్యాలను చదువుకోవాలనే ధ్యేయం తో కృష్ణా జిల్లా తేలప్రోలు దగ్గర ఉన్న చిరివాడ అగ్రహారం లో ఉన్న శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారి వద్ద శిష్యులై వారిఇంట్లో నే ఉంటూ వారి గురుత్వం లో అభ్యసించి ఇంతటి వాడినయ్యానని శాస్త్రి గారి వైదుష్యానికి ఎల్లలు లేవని గురుపత్ని అపర అన్నపూర్ణ అని రాశారు .ఆ తర్వాత శర్మ గారు అలంపురం విశేషాలను ,అక్కడి పురాతన వస్తువులు శ్రీశైలం డాం నిర్మాణం లో మునిగి పోతున్న విషయాలను గురించి రాసి అక్కడి మహా శక్తి పీఠం అయిన జోగులాంబ దేవాలయ వైభవాలను చారిత్రిక నిర్మాణాలను కాపాడే బాధ్యతా తానూ ఎలా తీసుకొని  ఆ పురాసంపదను ఎలా కాపాడినదీ వివరించారు తుంగ భద్రా కృష్ణా సంగమం వలన ఆలయం మునిగిపోకుండా ,పురా సంపద చిద్రం కాకుండా నదిలోగోడకట్టించి కాపాడిన వైనం అంతా ఒక డాక్యుమెంటరీ చిత్రం చూస్తున్న అనుభూతి కలిగేట్లు రాసిన తీరు చదివి వారి పాండిత్య ప్రకర్షకు వైదిక సంప్రదాయ నిబద్ధతకు ఆశ్చర్య పోయాను .అది గొ అప్పుడే నాకు అలంపురం గురించి ,అమ్మవారి గురించి తెలిసింది .అప్పటి నుంచి వెళ్లి సందర్శించాలన్న తహతహ పెరిగి పోయింది .అంత దూరం వెళ్ళాల్సిన పని ఉంటేకదా వెళ్లి చూసేది  .ఆ పని రాలేదు,సందర్భమూ కలగ లేదు  .ఇదిగో ఇప్పుడు’’ బీచుపల్లి రాయుడి దర్శనం’’ తో అనుగ్రహం తో  దానికి సుమారు 40 కిలో మీటర్ల దూరం లోనే అలంపురం ఉందని మా అబ్బాయి చెబితే, కారును అల౦పురానికి పోనిమ్మన్నాను మా మనవడు మనవ రాలు గొణుగుతున్నా,తిండి తిన్న వెంటనే బయల్దేరి మధ్యాహ్నం 12 -30 కి అలంపురం చేరాం .కర్నూలు హై వేకి సుమారు 15 కిలోమీటర్ల దూరం లో సింగిల్ రోడ్ పై అలంపురం చేరాం .హై వే నుంచి కర్నూలు కేవలం 14 కిలో మీటర్లే . ఇన్నేళ్ళకు అలంపురం చూసే అదృష్టం కృష్ణ వేణీ పుష్కరం కలిగించింది .

ఆలంపుర క్షేత్ర వైభవం

ఒక్క జోగులాంబ అమ్మవారిని దర్శించాలంటే ఒక దారి ,కృష్ణా తుంగ భద్రా సంగమ ఘాట్ లలో స్నానం చేయాలంటే మరో దారి ఉంది .అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు సర్క్యులర్ రోడ్ లాగా ఉంటుంది .మేము సరాసరి అమ్మవారి దర్శనానికే వెళ్లాలని అనుకొన్నాం .గుడికి దూరంగా కారు పార్క్ చేయాలని కాంట్రాక్టర్లు ‘’కిరి కిరి ‘’చేసినా మేము దాదాపు గుడి సమీపం దాకా వెళ్లి అక్కడే పార్క్ చేసి నడక శ్రమ తగ్గించు కొన్నాం .ఇక్కడ కూడా యే రకమైన సూచనలు ఇచ్చేవారుకాని దారి చూపే బోర్డ్ లు కాని లేవు .’’అడుక్కుంటూ ‘’వెళ్ళాల్సిందే అలానే వెళ్లాం .ముందుగా అక్కడున్న నవ బ్రహ్మాలయాలు చూశాం .తర్వాత శ్రీ బాల బ్రహ్మేశ్వర ఆలయమూ దర్షించాము .వీటిల్లో ఎక్కడా ‘’పూజార్ల దర్శనం’’ కాలేదు మాకు .తలుపులు తీసే ఉండటం తో స్వాముల దర్శనమే లభించింది .పేర్లు తేడా కాని అన్నీశివ లింగాలే .ఒకప్పుడు ఇది వీర శైవానికి కేంద్రం .బసవన మంత్రి ప్రభావం తో వీర శైవం  ఇక్కడ విజ్రు౦భిం చింది .కూడలి సంగమేశ్వరం లో సంగమేశ్వర స్వామి దర్శనం సకల పాపహరం .కృష్ణా తుంగ భద్రా నదుల్లో పవిత్ర స్నానాలు ,శివ మహాదేవుని దర్శనం ఒళ్ళు పులకరించే విశేషాలు .అలంపురం ఒకప్పుడు ప్రసిద్ధ విద్యాపీఠం గా ప్రసిద్ధి చెందింది ఇందులోని స్థానాది పతులు అందరూ మహావిద్వాంసులు .దాన శాసనాలలో చాలామంది కాలాముఖ శివా చార్యుల పేర్లు ఉన్నాయి .అందులో ‘’బ్రహ్మ రాసి పండిత ,వితరణే౦ద్రరాసి ,భువన శకిత పండిత ,సోమేశ్వర రాసి ,త్రిలోచనముని నాద,లోకాభరణ పండిత ,ఈశాన రాసి ,విద్యా రాసి ‘’మొదలైన పేర్లు శాసనాలలో తరచుగా కనిపిస్తాయి .కొందరు మంత్రులు విద్యాలయాలకు భూరి దానాలు చేసినట్లు ఉంది .ఆనాటి దేవాలయాలు విద్యా కేంద్రాలుగా విలసిల్లాయి .

జోగు లాంబ సందర్శనం

అమ్మవారి ఆలయం కిట కిట లాడుతోంది భక్త జన సందోహం తో .పెద్ద క్యూలున్నాయి .ఉచిత  దర్శనమే .మధ్యాహ్నం 1 గంటకు చేరిన వాళ్ళం జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచచ్చేసరికి మధ్యాహ్నం 3 గంట లయింది .అయితేనేం మహా వైభవ దర్శనం లభించింది .అమ్మవారిని కనులారా దర్శించే అదృష్టం కలిగింది .సర్వాలంకార శోభితయై అమ్మవారు నయనానందకరం చేసింది. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూశాను .జన్మ ధన్యం, చరితార్ధం అయింది .పాతికేళ్ళ తహ తహ తీరి ఉపశమనం కలిగింది .అమ్మవారి అసలు పేరు ‘’యోగాంబ’’అదే కాల క్రమం లో జోగులాంబ అయింది .సతీదేవి శరీరాన్ని విష్ణు మూర్తి చక్రాయుధం తో 18ముక్కలు చేస్తే అవి పడిన ప్రతి చోటూ శక్తి క్షేత్రం అయింది అని మనకు తెలుసు సతీదేవి పై’’ పెదవి దంతాలు’’ ఇక్కడ పడటం వలన ఇది శక్తి క్షేత్రమై అయిదవ శక్తి క్షేత్రంగా ప్రాధ్యాన్యం పొందింది .ముసల్మానుల  దండ యాత్రలో పురాతన ఆలయం 1390 లో విధ్వంసం కాగా ,615 సంవత్సరాల తర్వాత అమ్మవారి ఆజ్ఞాను సారం ఆమెకు పాత ఆలయం ఉన్న చోటు ననే వాస్తు ప్రకారం పునర్నిర్మించి పాక్షికంగా ధ్వంసమైన అమ్మవారి పాత విగ్రహాన్నే ప్రతిష్టించారు  .అప్పటి దాకా అమ్మవారి విగ్రహాన్ని బాల బ్రహ్మేశ్వర ఆలయం లో చిన్న గుడిలో ఉంచి పూజించారు 9 వ శతాబ్దం లో జగద్గురువులు ఆది శంకరాచార్య స్వామి ఇక్కడికొచ్చి అమ్మవారి దర్శనం చేసి ,అమ్మవారి భయంకర రూపాన్ని శాంతింప జేయటానికి శ్రీ చక్రం ను ప్రతిష్టించారు .విజయ నగర రాజు రెండవ హరి హర రాయల కుమారుడు మొదటి దేవరాయలు తండ్రి ఆజ్ఞపై ఇక్కడికి వచ్చి ముస్లిం సేనలతో యుద్ధం చేసి ఓడించి తరిమేసి ఆలయాన్ని కాపాడినట్లు చారిత్రకాధారం ఉంది .ఈసంఘటన 1390లో జరిగింది.ఆలయం చుట్టూ జలకుండం ,మధ్యలో దేవాలయం ,మండప స్తంభాలమీద  అష్టాదశ మహా శక్తుల మూర్తులు చెక్కబడి ఉన్నాయి .ముఖ మండప పైకప్పు బండలకు నాగం ,పద్మం తీర్చ బడ్డాయి .మిగతా దేవాలయాల్లోనూ ఈ చిత్రాలు ఉన్నాయి .నాగం మన శరీరం లోని మూలాధార చక్ర౦ లోని కుండలినీ శక్తి కి  ప్రతీక .పద్మం శిరసులోని సహస్రారంకు గుర్తు అని గ్రహించాలి .ఈ రహస్యం తెలుసు కొని అమ్మవారిని దర్శిస్తే పరమ వైభోగమే .

నవ బ్రహ్మాలయాలు

దక్షిణ కాశి అని ఆలంపూర క్షేత్రానికి పేరు .నవ బ్రహ్మేశ్వర తీర్ధం అనీ పిలుస్తారు శ్రీశైలాని అలంపురం పశ్చిమ ద్వారం అంటారు .శైవులకు మహా ఆరాధనీయ క్షేత్రం .నల్లమల కొండలలో వెలసిన బాలబ్రహ్మ ,జోగులాంబ దేవి ఆలయాలు నిరంతర౦ భక్తులతో కళకళ లాడుతాయి .తుంగ భద్ర నదికి పడమటి ఒడ్డున ఆలంపూర క్షేత్రం ఉంది .ఈ ప్రాంతం పూర్వం శాతవాహన ఇక్ష్వాకుల బాదామి చాళుక్యుల ,రాష్ట్ర కూటుల ,కల్యాణి చాళుక్యుల కాకతీయుల ,విజయనగరరాజుల ,గోల్కొండ కుతుబ్ షాహీ ల   ఏలుబడిలో ఉండేది .అల౦ పురం పూర్వపు పేరు హలం పురం ,హమలా పురం .ఆరవ త్రిభువన మల్ల విక్రమాదిత్యుని క్రీ శ1101 నాటి శాసనం లో ‘’హటంపుర ‘’అని పేర్కొన బడింది .ఇక్కడి నవబ్రహ్మాలయాలు శిల్పకళా చాతుర్యానికి ప్రతీకలు .ఆలయాలన్నీ ఎర్ర రాతి నిర్మాణాలే .భారతీయ పురాతత్వ శాఖ ఆలంపూర ఆలయాలను జాతీయ సంపదగా గుర్తించి రక్షిస్తోంది .శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణం లో ఈఆలయ సముదాయాలు పురాతన వైభవ చిహ్నాలు మునిగి పోకుండా ఎత్తైన ప్రదేశం లో మ్యూజియం కట్టి భద్ర పరచారు .నవ బ్రహ్మ ఆలయాలన్నీ7 వ శతాబ్దికిబాదామి చాళుక్య రాజులు నిర్మించిన   శివాలయాలే .

స్కాంద పురాణం లో అలంపురం గురించి ఉంది బ్రాహ్మ దేవుడు అలంపురం లో శివుని కోసం ఘోర తపస్సు చేశాడని ,శివుడు ప్రత్యక్షమై బ్రహ్మకు సృష్టి చేసే వరం ప్రసాదించాడని ఉంది. అందుకే దీనికి బ్రహ్మేశ్వర ఆలయం అనే పేరొచ్చింది .కుమార ,అర్క ,వీర ,విశ్వ ,తారక ,గరుడ ,స్వర్గ ,పద్మ ,బ్రహ్మేశ్వరాలయాలే నవ బ్రాహ్మాలయాలు .ఈ పేర్లు పురాణ ప్రసిద్ధ నవ బ్రాహ్మలు అంటే ప్రజా పతుల పేర్లుకావు .ఈ పేర్లు సిద్ధుడు పరుసవేది కోసం వాడిన మూలికల పేర్లు అయి ఉంటాయని గడియారం వారు తెలియ జేశారు .పాల్కురికి సోమనాధుడు ‘’పండితా రాధ్య చరిత్ర ‘’లో ఇక్కడిక్షేత్ర తీర్ధ విశేషాలను వర్ణించాడు .ప్రతి ఆలయం మీద అష్టదిక్పాలకులు ,శివ ,విష్ణువులు ,నటరాజు ,పురాణ కదా శిల్పాలు భావ గాంభీర్యం తో దర్శన మిస్తాయి ఈశిల్పాల ప్రత్యేకతకు దేశీయ విదేశీయ శిల్ప మర్మజ్ఞులు అబ్బురపడ్డారు .పై భాగం లో గరుడ ,గ౦ధర్వ,కిన్నెర ,కింపురుషాదులు ,మానవ మిదునాలు ,పంచ తంత్ర కావ్య కదా శిల్పాలు అందరినీ ఆకర్షిస్తాయి . ‘’శ్రీమార ,నాయన ప్రియాన్ ,శ్రీ కంఠా చార్యన్ మొదలైన శిల్పా చార్యుల పేర్లు చెక్కబడి ఉన్నాయి .పులకేశి కట్టించిన ‘’పట్టుద కల్లు’’దేవాలయాలకంటే అలంపురం లోని ఈ దేవాలయాలలో అపూర్వ వికాసం కనిపిస్తోందని శ్రీ గడియారం రామకృష్ణ శర్మ గారు ‘’అల౦పూర్  క్షేత్రం ‘’పుస్తకం లో వివరించారు. అదృష్ట వశాత్తు నాకు వెదక బోయిన తీగ కాలికి తగిలి నట్లుగా ఈ పుస్తకం బయట పుస్తక ఫోటో షాపు లో దొరికింది కొని అందులోని విశేషాలనే తెలియ జేస్తున్నాను .

ఎందుకు దక్షిణ కాశి అయింది ?

శ్రీ శైల క్షేత్రానికి నాలుగు దిక్కులలో నాలుగు ద్వారాలున్నాయి తూర్పు ద్వారం త్రిపురాంతకం .దక్షిణ ద్వారం సిద్ధవటం ,పడమర అలంపురం ,ఉత్తరాన ఉమా మహేశ్వరం ద్వారాలుగా ఉన్నాయి .స్థల పురాణం లో దీన్ని భాస్కర క్షేత్రమని ,పరశురామ క్షేత్రమని ,దక్షిణ కాశి అని వర్ణించారు .కాశీకి దీనికి చాలా దగ్గర పోలికలున్నాయి .కాశీలో ఉత్తర వాహినిగా గంగానది ,64 స్నాన ఘట్టాలు విశ్వేశ్వరుడు,విశాలాక్షీ  ఉన్నారు అలాగే అలంపురం లో కూడా ఉత్తరావాహినిగా తుంగ భద్రా నది ,పాపనాశిని ,మణి కర్ణిక మొదలైన 64 స్నాన ఘట్టాలు ,బాల బ్రహ్మేశ్వరుడు జోగులాంబా ఉన్నారు .కాశీకి దగ్గరలో ప్రయాగలో గంగా యమునా సరస్వతి కలిసి సంగమ క్షేత్రం ఉన్నట్లే ఇక్కడ కూడా కృష్ణానది తుంగ భద్రానదికలిసే కూడలి  సంగమ క్షేత్రం ఉంది .

మత దృష్టిలో కూడా అలంపురం చాలా ప్రాధాన్యత పొందింది .వైదిక మతాలైన శైవ వైష్ణవ ,శాక్తేయ ,గాణాపత్య ,సౌర స్కాంద అనే షణ్మతాలకు చెందినదేవతా మూర్తులు ఇక్కడ ఉండటం మహా విశేషం .ఇక్కడి బ్రహ్మేశ్వరాలయం రస సిద్దులైన శిల్పా చార్యుల చేత నిర్మింప బడింది .ఇక్కడి బాల బ్రహ్మేశ్వర లింగం మహా ఓషధీ సంస్కారం పొందిన మహా మహితాత్మక రసలింగం .ఇక్కడి అధిష్టాన దేవత అష్టాదశ శక్తి పీఠాలలో అయిదవది

ఈ క్షేత్రానికి 12 అధ్యాయాల స్థలపురాణం ఉంది .దీన్ని బట్టి బ్రహ్మ ఇక్కడ తపస్సు చేశాడని అందుకే బ్రహ్మేశ్వరుడు అనే లింగానికి పేరొచ్చిందని ముందే చెప్పుకొన్నాం ఇతర క్షేత్రాలలో బ్రహ్మ విగ్రహాలు కనిపించవు కాని ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడి లింగం ‘’జ్యోతిర్ జ్వాలామయం ‘’.జమదగ్ని మహార్హి ఇక్కడే తపస్సు చేశాడని భార్య రేణుకా దేవిని అనుమానించి కుమారుడు పరశురాముని చేత వధింప చేశాడని తండ్రిమాట విని నందుకు మహర్షి సంతోషించి వరం కోరుకో మంటే తల్లిని బ్రతికించమని కోరి తిరిగి తల్లిని దక్కి౦చుకోన్నాడని  రేణుకాదేవి తల పరశురాముని గండ్ర గొడ్డలికి తెగి చండాల వాటిక లో పడినందున ,మొండెం తో తలను అతికించే వీలు లేక ఆ తల ‘’ఎల్లమ్మ ‘’అనే గ్రామ దేవతగా పూజలు  అందుకొంటు౦దని జమదగ్ని చెప్పాడు .ఇప్పటికీ ఆ ‘’మొండేమే’’ ‘’భూదేవి’’ పేరుతో పూజింప బడుతోంది .అష్టాదశ తీర్ధాలలో ‘’పాప నాశనం ‘’తీర్ధం విశిష్టమైనదని ,అక్కడి గదా ధర విగ్రహ సన్నిధిలో తీర్ధ ,శ్రార్ధాలు చేస్తే అంతులేని పుణ్యం లభిస్తుందని స్థల పురాణం చెప్పింది. అంతేకాక ఆలంపూర్ దేవాలయాలను రససిద్ధుడు నిర్మించాడని ,కాశీ విశ్వేశ్వర ప్రేరణ తో రససిద్ధుడు ఇక్కడికి వచ్చి క్షేత్ర పాలకుల గురించి తపస్సు చేశాడని బ్రహ్మేశ్వరుడు తలపై నుంచీ ,జోగులాంబ నోటి నుంచి ,గణపతి బొడ్డు నుంచి రసాన్ని ఇచ్చారని ,దానితో ‘’పరుస వేది’’నితయారు చేసుకొని ఇక్కడి ఈఆలయాలను కట్టిస్తూ ఉన్నాడు .’’విలసద్రాజు’’అనేవాడు సిద్ధుడి నుంచి పరుస వేదిని లాక్కొనే ప్రయత్నంలో దాడి చేయటానికి వస్తున్నాడని తెలిసి ,ఆలయాల నిర్మాణం ఇంకా పూర్తికాక ముందే గర్భాలయం లో ప్రవేశించి బ్రహ్మేశ్వర లింగం లో ఐక్యమయ్యాడని కధనం .సిద్ధుని శాపం చేత విలసద్రాజు రాజ్యాన్ని సర్వస్వాన్నీ పోగొట్టుకొని కస్టాలెన్నో అనుభవించి ఒక జింక చేత ఉపదేశం పొంది శివసాన్నిధ్యం చేరాడు .ఈ గాధ ప్రవేశ ద్వారం ముందున్న తోరణ స్థంభం పై చెక్క బడి ఉంది .

ప్రధానాలయం

నవ బ్రహ్మ ఆలయాలు ఉండటం వలననే ఇది బ్రహ్మేశ్వర క్షేత్రమైంది .ఆలయాలన్నీ ఒకే  కాలం లో కట్టినవి కావు బాదామి చాళుక్యులు పాలించిన రెండు వందల సంవత్సరాల కాల గమనం లో కట్ట బడినవి .భారతీయ వైదిక మత వికాసం ,వాస్తు ,శిల్ప రీతులు ,చారిత్రిక విశేషాలు తెలుసుకోవాలను కొనే వారికి ఇది తప్పక చూడ తగిన క్షేత్రం .ఆలయాలకు పడమర దిశ లో మహా ద్వారం ఉంది .దీన్ని 8 వ శతాబ్ది రాష్ట్ర కూట ధారా వర్ష ధ్రువ మహా రాజు సేనాపతి’’ బలవర్మ ‘’కట్టించాడు .శిల్ప రీత్యా దీనికి చాలా ప్రత్యేకతలున్నాయి .పై కప్పు బండలకు మూడు అంక ణాలలోత్రిమూర్తులు ,మొదటి అంకణంలో పద్మంపై పాము పడగలు ఉండే విష్ణు మూర్తి ,మధ్య అంకణం లో అంధకాసుర సంహార మూర్తి రూపం లో శివుడు ,మూడవ అంకణం లో చతుర్ముఖ బ్రహ్మలను తీర్చి దిద్దారు .మహాద్వారం కింది భాగం లోరెండు వైపులా చిన్న గుళ్ళలో కంచి కామాక్షీ దేవి ,ఏకాంబరేశ్వర శివుడు ఉంటారు .కామాక్షి విగ్రహాన్ని 135 3లో ‘’ పెర్మాడి రాయని మంత్రి ‘’ప్రతిస్టించాడు .ఈవిగ్రహ పీఠానికి మధ్య భాగం లో మూడు మనిషి తలలు చెక్కబడి పరిశోధకులను తికమక పెడుతున్నాయని గడియారం వారు ఉవాచ .ఈ విగ్రహం చాలా ఎత్తుగా చేతిలో కత్తి పట్టుకొని పీఠం పై కూర్చుని ఉండటం మరో విశేషం .నల్లరాతి గంభీరాకృతి శిల్పం ఇది .తారక బ్రహ్మేశ్వర ఆలయాన్ని ఎవరో యే కాలం లోనో ధ్వంసం చేశారు .ఇప్పుడు ఆ దేవాలయం ఎక్కడ ఉందో గుర్తించటం కష్టం అంటారుగడియారం  శర్మగారు

బాల బ్రహ్మేశ్వరాలయం

నవ బ్రహ్మ ఆలయాలలో బాల బ్రహ్మేశ్వరాలయం ప్రధాన మైనది .దీనికి చుట్టూ ప్రదక్షిణ చేయటానికి మార్గం ,ప్రాకారం ముఖ మండపాలను విజయాదిత్య మహా రాజు క్రీ శ.702  లో కట్టించాడు .ఆనాటి ప్రాకార ద్వారం ఇప్పుడు ప్రవేశాద్వారమైంది ..ప్రాకార శిల్పి ‘ఈశానా చార్యుడు ‘’మహా రాజ సత్కారం పొందాడు .ముందరి శాలలో త్రిమూర్తులు దక్షిణాన వీరభద్రుడు ప్రక్కన నవ గ్రహాలూ ఉన్నాయి .

రెండవ ద్వారం దాటితే ప్రదక్షిణా పధం ,మధ్య మండపం ,రధం ఆకారం లోని గర్భాలయం కనిపిస్తాయి మధ్య మండపానికి రెండు ప్రక్కలా రెండు ద్వార పాలకులను చెక్కిన బండలను నిల బెట్టారు .పైభాగం లో ఉండాల్సిన గజలక్షి ఆలయ మరమ్మత్తులలో మాయమైంది .అంతరాలయం లో నాలుగు స్తంభాల మధ్య శివలింగం ఉంది .ఇదే ‘’జ్యోతిర్జ్వాలమయ శివలింగం ‘’.జ్యోతిర్లింగాలలో చెరక పోయినా జ్యోతిర్లి౦గ మే .లింగం తల భాగం దోసిలి ఆకారం లో గుంటలు పడి ఉంటుంది .ఆ గుంటలు లింగాన్నుంచి రస సిద్ధులు రసం తోడిన గుంటలు అన్నారు గడియారం వారు .మంత్రం ,ఔషధ సంస్కారం పొంది బాలబ్రహ్మేశ్వరుడు కోరుకొన్నవారికి కొంగు బంగారమయ్యాడు

గర్భాలయానికి మూడు ప్రక్కలా గూళ్ళలో రససిద్ధి గణపతి ,ఆలింగ న మూర్తి ,రెండు సింహాలపై సమ భంగిమలో చేతిలో ఖడ్గం ధరించి నిలబడి ఉన్న దుర్గా దేవి ఉంటారు .దక్షిణం వైపు ప్రదక్షిణ మార్గం లో ఉన్న స్త్రీ మూర్తిని ‘’కన్యా కుమారి ‘అంటారు .ఉత్తరాన కొన్ని విగ్రహాలు పీఠాలపై ఉన్నాయి . ఇవి ఎక్కడా దొరకని అరుదైన విగ్రహాలు .హిరణ్య కశిపుని స్థానాది పతులు,విశ్వ విద్యాలయం లోని అధ్యాపక మూర్తులు  విగ్రహాలకింద’’వ్యాళ సింహ ,అభినవ త్రిలోచన ,ఈశాన రాశి ‘’,విద్యారాసి ‘’మొదలైన  వారి పేర్లు ఉన్నాయి .వాళ్ళ తలపాగాలు ,జడలు కట్టిన వెంట్రుకలు ,చూడ దగ్గవి .ఈవిగ్రహాల ప్రక్కన పాప వినాశిని నుంచి తెచ్చిన రెండు అపూర్వ విగ్రహాలను ఉంచారు .జ్వాలా నరసింహ ఆకృతిలో హరిహర పంచాయతన మూర్తి ,ఫాలనేత్రమూ కుడి చేతిలో సుదర్శన చక్రం ఎడమ చేతిలో త్రిశూలం ,కుడి చెవికి మకర కుండలం ,ఎడమ చెవికి నాగా భరణం ,కుడి చేత జ్ఞాన ముద్ర ,ఎడమ చేత బిల్వదళం ఉన్న ఈ శిల్పం ఎన్నో ఎన్నెన్నో భావాలకు గుర్తు .ఇలాంటి మూర్తి మరెక్కడా లేదని గంట కొట్టి గడియారం వారు మరీ చెప్పారు ..హిరణ్య కశిపుని కడుపు చీల్చి పేగులు మెడలో వేసుకొన్న పదహారు చేతుల ఉగ్ర నరసింహ మూర్తి గాంభీర్యానికి ప్రతీక. ఈ రెండు శిల్పాలను ఒకే శిల్పి చెక్కి ఉంటారని రామ కృష్ణ శర్మగారు ఊహించారు .గర్భగుడిపై చతురస్రం గా  ఎత్తుగా కట్టిన విమానం ,దానిపై మహా ఆమలకం ,,పైభాగాన శిఖరం ,చాళుక్యుల నాటి కళా వైభవానికి నిదర్శనం .నవ బ్రహ్మాలయాలన్నీ ఒకే రీతిలో ఉండటం ఇంకో విశేషం. గోపురానికి ముందున్న ‘’శుక నాశం ‘’గూడులో దండం పట్టుకొన్న పురుషుడి విగ్రహం ‘’లవ లీశ మూర్తి ‘’అని గడియారం వారు తేల్చి చెప్పారు .

ముందే గడియారం వారి పుస్తకాన్ని చదివి ఉంటే వీటినన్నిటినీ సమగ్రంగా దర్శించి తరించ గిలిగే వాడిని అని ఇప్పుడు అనిపిస్తోంది .యోగం ఉంటె మరొక సారి అలంపురం క్షేత్రాన్ని దర్శించి ఆ శిల్ప కళా విభూతికి జోహార్లు అర్పించాలని ఉంది .దీన్ని చదివి మీరు ధన్యులయ్యారు కనుక ఇవన్నీ గుర్తు ఉంచుకొని ఈ క్షేత్రాన్ని దర్శించమని మనవి .

ఇంకా కొన్ని విశేషాలున్నాయి ఈ సారి తెలియ జేస్తాను .

Inline image 5Inline image 6Inline image 1  Inline image 2Inline image 4Inline image 7Inline image 8Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.