ఇది విన్నారా కన్నారా ! 28 38-కళాప్రపూర్ణ చిట్టిబాబు

ఇది విన్నారా కన్నారా !  28

38-కళాప్రపూర్ణ చిట్టిబాబు

296-1981నుండి 87దాకా తమిళనాడు రాష్ట్ర కళాకారుడుగా ఉన్న చిట్టిబాబు గురించి 656   పేజీలున్న ‘’హిందూ స్పీక్స్ ఆన్ మ్యూజిక్ ‘’గ్రంధం లో  గురించి కేవలం 10 పంక్తులు మాత్రమే రాశారని బాధ అపడ్డారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .కానీ ‘’కన్నడ సంగీత నృత్య పరిభాషా కోశ ‘’లో చిట్టిబాబు గురించి కొన్ని వివరాలైనా సంక్షిప్తంగా తెలియ బరచారని సంతోషించారు.

297 –చల్లపల్లి రంగారావు ,సుందరమ్మ దంపతులకు చిట్టిబాబు 1936 లో కాకినాడ లో జన్మించారు తండ్రివద్దా ,పా౦డ్రవరపు సింగ రాజు గారి దగ్గరా శిక్షణ పొందారు తర్వాత జయుణ్ణి అప్పలాచార్య వద్ద రెండేళ్ళు శిష్యరికం చేశారు .1948భరణీ వారి ‘’లైలా మజ్ను ‘’సినిమాలో మజ్ను వేషధారి అక్కినేనికి బాల మజ్ను వేషం వేయటానికి మద్రాస్ వచ్చి వేషం వేసి మెప్పించారు. ఆసినిమా గొప్ప విజయం సాధించింది .రెండవ సినిమా   బాలరాజు లో కూడా బాల నాగేశ్వర రావు గా నటింఛి  చిట్టిబాబు గట్టి బాబు అనిపించుకొన్నారు .ఈసినిమా కూడా మాంచి హిట్ కొట్టింది   .12 వ ఏట వీణ లో మహా విద్వా౦సుడినవ్వాలనే సంకల్పమ కలిగి ,  చిట్టి బాబు మహా మహోపాధ్యాయ ఈమనిశంకర శాస్త్రి గారి దృష్టిలో పడి వారి వద్ద వీణ నేర్చారు .అసలు పేరు’’ చల్లపల్లి హనుమాన్లు ‘’ను శాస్త్రిగారు ‘’సి .చిట్టి బాబు ‘’గా మళ్ళీ నామకరణం చేశారు .శాస్త్రిగారు ముద్దుగా చిట్టి బాబూ అని పిలిచే పిలుపే పూర్తిగా నామదేయమై పోయింది .

298 – 1948 నుండి62వరకు  ‘’సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రి ‘’లో వీణ కళాకారుడుగా ఉండి,ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర రావు పెండ్యాల నాగేశ్వర రావు విశ్వనాధన్ –రామ మూర్తి గార్ల వద్ద సంగీత శాఖలో పని చేస్తూ అనేక తెలుగు తమిళ చిత్రాల సూపర్ డూపర్ హిట్ ట్యూన్లకు కారకులయ్యారు  .

13-10-1964 న చిట్టిబాబు అభినందన సభలో డా .పి.వి రాజమన్నార్ ‘’ఒక వ్యక్తీ లలితకళలలో ప్రజ్ఞా వంతుడు కావటానికి ‘’పూర్వ జన్మ పరిపాకం ‘’అవసరం .చిట్టిబాబు వీణా గానం వింటే ఆయన అలాంటి పరిపాకం లో జన్మించినట్లు తెలుస్తుంది సాధారణం గా గాయకులూ వాద్య విద్వాంసులు సంప్రదాయాన్ని అనుసరిస్తూ ,అందులోంచి బయట పడలేక అంటిపెట్టుకొని ఉండి పోతూ ఉంటారు .చిట్టి బాబు అలా కాకుండా సంప్రదాయాన్ని ఆధునిక పోకడలతో మేళవించి ,అద్భుత రస కల్పనలతో స్వకపోల కల్పితమైన ఒక బాణీ కి రూప కల్పన చేశారు .కళకు శిఖరాగ్రం అంటూ ఉండదు .కళాకారుడు కళను నిరంతరంగా ఉపాసన చేయాల్సి ఉంటుంది ‘’అన్నారట .

299 –‘’గాన కళ ‘’1964 సెప్టెంబర్ –అక్టోబర్ సంచికలో ‘’చిట్టిబాబు గారి వీనావాదన విన్నప్పుడు వారి గురువుగారు శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి బాణీ స్పురణకు వస్తుంది .’’మార్గ హిందోళ ‘’రాగాలాపన ,కల్యాణి రాగం లో విశిష్ట కల్పనలు అనన్య సామాన్యమైనవి ఉపజ్ఞా  పూరితమైన వీరి భావనా పటిమ పెద్దలైన వైణిక విద్వాంసుల కోవకు చెంది నట్లుగా ఉంది .’’బేహాగ్ ‘’చక్కని హిందూ స్థానీ లో వాయించారు ‘’అని మెచ్చుకోన్నది.

300-తిరువయ్యూరు ‘’శ్రీ త్యాగ రాజ బ్రహ్మోత్సవ సభ ‘’నిపుణుల సంఘం లో చిట్టిబాబు సభ్యులు .కంచికామ కోటి పీఠఆస్థాన విద్వాంసులై వన్నెకెక్కారు .శ్రీ తిరుమల తిరుపతి దేవాలయం ఆస్థాన విద్వాంసులను చేసింది .1990 లో కేంద్ర సంగీత నాటక అకాడెమి పురస్కారం అందజేసి గౌరవించింది .మైసూర్ రాజ దర్బార్ లో ‘’వైణిక శిఖా మణి ‘’బిరుదు ప్రదానం చేశారు .

301  -చిట్టిబాబు ఎందరెందరికో ప్రత్యక్షంగా ,పరోక్షంగా గురువై వీణ నేర్పారు కొలంబియా గ్రామ ఫోన్ రికార్డింగ్ కంపెని వీరి వీణా గానాన్ని ఎల్;పి.రికార్డ్ లుగా ,45 ఆర్. పి.ఏం .రికార్డ్ లుగా తెచ్చంది .వీటికంటే ము౦దేవీరి 75 ఆర్.పి.ఏం రికార్డులున్నాయి .తర్వాతకాలం లో అన్నీ కేసెట్లుగా సి.డి .లుగా వచ్చాయి .తమ శిష్యులైన సుందర్ ,నగేష్ బాబు ,శాంతి రావు ,డా సుమ ,చూడామణి ,శాంత లతో కలిసి ‘’బెల్స్ ఆఫ్ జాయ్ ‘’అనే కేసెట్ ను రికార్డ్ చేశారు .ఇది ‘’శుభోదయం ‘’తో ప్రారంభమై ‘’శుభ రాత్రి ‘’తో పూర్తి అవటం విశేషం .ఇవికాక ‘’సప్త స్వర ,నగు మోము ,రమ్మనవే ,చిన్నం చిరుకులే (రాగమాలిక )తో పాటు స్వయ౦గా ‘’సముద్ర ప్రియ ‘’రాగం లో వాయించిన ‘’కరుణించ వయ్య ‘’అనే కీర్తనలున్నాయి .

302 –ప్రయోగ శీలి అయిన చిట్టిబాబు వీణపై దేనినైనా వాయించవచ్చు ,వీణకు ఏదీ అసాధ్యం కాదు అని రుజువు చేశారు .’’వెడ్డింగ్ బెల్స్ ‘’అనేది పాశ్చాత్య సంగీతాన్ని రుచి చూపించిన కేసెట్ జగత్ ప్రసిద్ధమైంది .చిట్టిబాబుగారి ‘’కొమ్మలో కోయిల ‘’వీణను జన సామాన్యం లో తెచ్చింది .విని పులకించని వారు లేరు .ఆమని కొయిన కలకూజితానికే.మాధుర్యం అద్ది నట్లు ఉంటుంది  .వింటే పులకించి పోవాల్సిందే .

303 –వీణ మీద ‘’వేణు మీటు ‘’ను మీటి వంశీ గానం తో మోహన వంశీ స్వరూపులై భాసిస్తారు .ఇదీ చిట్టిబాబు మరో ప్రత్యేకత .మాంచి స్పురద్రూపి .దైవ భక్తీ అధికం .మాతా పితృ భక్తికి నిలువెత్తు ఆదర్శం చిట్టిబాబు .’’కలై కోవిల్ ‘’అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు .చిట్టిబాబుగారి సంగీత వాద్యం తో వచ్చిన ‘’ఉన్నై పోల్ ఒరువన్ ‘’రష్యన్ అవార్డ్ పొందింది

304 –యుగోస్లేవియా రోమ్ ,జర్మని మలేషియా ,కెనడా మొదలైన విదేశాలలో పర్యటించి అక్కడి రసజ్నులనూ మెప్పించిన వీణ ఘనాపాటీ ,కళా ప్రపూర్ణ చిట్టి బాబు గారు .మద్రాస్ లోని ‘’బాలసుబ్రాహ్మన్య సభ ‘’వైణిక కులాలంకార ‘’బిరుదు నిచ్చి సత్కారించింది .చిట్టిబాబువీణా  వాదన గుణాన్ని’’ కన్నడ సంగీత నృత్య పరిభాషా కోశ ‘’గ్రంధం ‘’మీటుసౌఖ్య ,నాద మాధుర్య ,లయ ప్రచోదనం ‘’అని మహో త్క్రుస్టం గా అభి వర్ణించింది .

305-‘’తెలుగువారి కీర్తి పతాక ,మహా ప్రయోగశీలి ,వీణ వాదనకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన నాద తపస్వి ,గురువు ఈమని నిమరపించిన ప్రియ శిష్యుడు చిట్టిబాబు ‘’అన్నారు ఆచార్య ముది గొండ .

306-9-2-1996 న 60 ఏళ్ళ వయసులోనే చిట్టిబాబు అమరులయ్యారు .బాపు దర్శకత్వం వహించిన’’ సంపూర్ణ రామాయణం ‘’సినిమా కు ‘’రఘువంశ సుధాంబుధి చంద్ర ‘’కీర్తన వీణపై వాయించారు .సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన రాజాజీ జీవితం పై తీసిన తమిళ చిత్రం’’దిక్కట్ర పార్వతి ‘’కి సంగీత దర్శకత్వం వహించారు. దీనికి సంభాషణలు ప్రముఖ మాటల రచయిత’’కన్నదాసన్ ‘’.ఇందులో వాణీ జయరాం పాడిన ‘’ఆగిం మఝై పోఝిందాల్’’పాట విపరీతమైన ప్రజాదరణ పొంది ఆల్ టైం రికార్డ్ అయింది .కన్నడ చిత్రం ‘’శ్రీ రాఘవేంద్ర మహిమే ‘’కు కూడా సంగీత సారధ్యం చేశారు చిట్టిబాబు .ఇది తెలుగులో కి డబ్  అయింది .

307 –చిట్టిబాబు గారి ప్రతిభకు తగ్గ పురస్కారాలు ఎన్నో లభించాయి .కేంద్ర సంగీత నాటక అకాడెమి 1990 లో నాటి భారత రాష్ట్రపతి శ్రీ ఆర్ వెంకట రామన్ గారి చేతులమీదుగా పురస్కారాన్ని అందజేసింది .తమిళనాడు ప్రభుత్వం 19 72 లోనే ‘’కలైమా మణి ‘’పురస్కారం తో గౌరవించింది .ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘’తెలుగు వెలుగు ‘’పురస్కారాన్ని ,తమిళ ప్రభుత్వముఖ్యమంత్రి ఏం జి రామచంద్రన్  ‘’స్టేట్ ఆర్టిస్ట్ అవార్డ్ ‘’ను ,మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ‘’తంత్రీ విలాస్ ‘’బిరుదాన్ని ,ఉప రాష్ట్ర పతి శ్రీ శంకర దయాళ్ శర్మ ‘’స్పిరిట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అవార్డ్ ‘’ను ,మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ క్లబ్ ‘’సంగీత కళా నిపుణ ‘’లను అందించి తమను తాము సత్కరించుకొన్నాయి .వీటి కంటే ప్రముఖమైనది మైసూర్ మహారాజు శ్రీ జయ చామరాజ వడియార్ 1967 లో మైసూర్ ఆస్థాన సభలో ప్రదానం చేసిన ‘’వైణిక శిఖా మణి ‘’బిరుదం .అంతేమాత్రమె కాదు అక్కడ చిట్టిబాబు గారు చేసి అత్యద్భుత  వీణా వాదన కచేరిలో ప్రదర్శించిన  అనితర సాధ్యమైన ప్రతిభకు ముగ్ధులైన మైసూర్ మహా రాజా తాము తమ మెడలోనిత్యం ధరించే అతి విలువైన అత్యంత అభిమానమైన  స్వర్ణ ఆభరణాన్ని  స్వయం గా తీసి చిట్టి బాబు గారి క౦ఠానికి. అలంకరించటం గొప్ప చారిత్రాత్మక సంటనం ,చిరస్మరణీయమై నిలిచింది .ఒక వ్యక్తి సామర్ధ్యం గుర్తించటానికి  అంతే సామర్ధ్యం ఉండాలి. మైసూర్ మహా రాజా శ్రీ జయ చామరాజ వడియార్ సాహిత్య ,సంగీతాది కళలన్నిటిలో అందే వేసిన చెయ్యి .అందుకనే వారిని ‘’రాజులలో సంగీత విద్వాంసుడు సంగీత విద్వాంసులలో రాజు ‘’అనే వారు .ఈ అరుదైన సత్కారాన్ని అందు కొన్న చిట్టిబాబు గారు ధన్యులు .

Inline image 1  Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.