ఇది విన్నారా కన్నారా ! 29 నేటి వైణికులు 39-పుదుక్కోటై కృష్ణ మూర్తి

ఇది విన్నారా కన్నారా !  29

నేటి వైణికులు

39-పుదుక్కోటై కృష్ణ మూర్తి

308 –నేటి అగ్రశ్రేణి వైణికులలో పుదుక్కోటై కృష్ణ మూర్తి ఒకరు .అయన లో అనేక వాదనల శైలి మిశ్రమితమై ఉంది .అందరి లోని మేలిమిని గుర్తిస్తూ తనదైన శైలి ఏర్పరచుకొన్నారు .7-10-19 39 లో మీనా౦ బాళ్ ,రామస్వామి దంపతులకు కొడైకెనాల్ లో జన్మించారు ..తండ్రి పుదుక్కొట రాజావారి కార్ డ్రైవర్ .9 వ ఏటనే పుదుక్కోటై శ్రీనివాసన్ దగ్గర సంగీత శిక్షణలో చేరి 13 వ ఏట గాత్ర కచేరీ చేశారు .అన్నామలై విశ్వ విద్యాలయం లో సంగీతం లో బాచిలర్ డిగ్రీ పొంది ,20 వ ఏటతిరుచ్చి,,మద్రాస్ ఆకాశవాణి లనుంచి కచేరీలు చేశారు.22 వ ఏట 1961 లో తిరుపతి దేవస్థానం సంగీత కళాశాలలో చేరి 1997 వరకు అధ్యాపకులుగా చేసి ,ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ పొందారు  .విరమణ తర్వాత శ్రీ సత్య సాయి మీర్ పూరి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ ప్రిన్సిపాల్ అయి సర్టిఫికేట్ ,డిప్లొమా కోర్స్ లకు రూప కల్పన చేసి ,బాబా నుండి ప్రశంసలు పొందారు .

309- .’’వైణిక పంచానన ‘’ ,వైణిక గాయక ‘’బిరుదులు  పొంది గాత్ర వాద్య మాదుర్యాలతో మెప్పించారు .పరమనాజూకైన తమగాత్రం తో పాత పాడుతూ వీణ వాయించి సవ్య సాచి అనిపించారు .రెండిటిని సమాన ప్రతిభతో వ్యక్తం చేయటం వారి ప్రత్యేకత .వారికి అపారమైన కీర్తన పాఠం ఉన్నదని,తానం లో అందే వేసిన చేయి అని ,సప్తవిధ తానాలు అలవోకగా వాయించ గలరని హామీరు ,కల్యాణి రాగాలను వాయించేటప్పుడు అచ్చంగా హిందూస్థానీ పద్ధతిలోనే వాయిస్తారని ముదిగొండవారంటారు .

310- సాధారణం గా వైణికులు తమ వీణకు మేళం కట్టుకోరని ,కాని కృష్ణమూర్తిగారు తామే కట్టుకొని ,కొత్త పద్ధతులను కూడా కనుక్కోన్నారని చెక్కతో మేళం కట్టుకోవటాన్ని సాధించారని వీణ కుండ సైజు ను తగ్గించి స్థాయిని 1 ½ స్థాయిగా మార్చి అంటే’’ మానవుడికంఠం పలికే స్థాయి’’కి చెక్కమేళం కట్టి ,యాళి ముఖాన్ని పై వైపుకు మార్చి ‘’కృష్ణ వీణ ‘’అని పేరు పెట్టారని ఆచార్య శ్రీ తెలిపారు .భార్య పద్మా కృష్ణ మూర్తి గారితోకలిసి సంగీత కేసెట్ తెచ్చారు .

311-5-2-2003 న విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలలో గురు పూజోత్సవ సమయం లో శ్రీ అన్నవరపు రామస్వామి గారు కృష్ణ మూర్తిగారిని  సన్మానించి ,వెండి వీణ బహూకరించి ‘’వీణా వాద్య విద్వద్మణి’’బిరుద ప్రదానం చేశారు .పదవి విరమించాక తిరుపతిలో స్థిరపడి వీణ మీటు ,సరలీస్వరాల నుంచి రాగం తానం ,పల్లవి దాకా నేర్పటం పై 32 డి,వి.డి.లను సిద్ధం చేసి కొత్త రీతిలో గురుత్వం వహిస్తున్నారు .ఇవి 38 గంటల నిడివి ఉన్నవి .ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన 4 సంవత్సరాల సర్టి ఫికేట్ కోర్స్ కు దృశ్య శ్రవ్య మాధ్యమాలలో వాయించి చూపారు .స్పెయిన్ కెనడా దేశాలు భార్యతో పర్యటించి వీణ కచేరీలు చేసి మెప్పు పొందారు .

Inline image 1

40 –అయ్యగారి శ్యామ సుందర్

312-అయ్యగారి సోమేశ్వర రావు గారికుమారులైన శ్యామ సుందర్ తండ్రికి మించిన తనయులు .తండ్రి ‘’వైణిక రత్న ‘’అయితే కుమారుడు ‘’వీణా వాద్య విశారద ‘’.19 48 లో విజయనగరం లో జన్మించి 8 ఏళ్ళకే మొదటికచేరీ చేసిన ఉద్దండ పిండం .4 వ ఏటనే కీర్తనలు వాయించిన ఈచిన్నారికి 5 న చేయాల్సిన అక్షరాభ్యాసం 4 వ ఏటనే చేసి స్పీడ్ పెంచారు తలిదండ్రులు .30 వ ఏట ఆకాశవాణి ఎ గ్రేడ్ ఆర్టిస్ట్ అయ్యారు. అదే వయసులో మద్రాస్ సంగీత అకాడెమి ‘’ఉత్తమోత్తమ వీణా వాదకుని ‘’గా గుర్తిస్తే ,1978 లో శ్రీ కృష్ణ గాన సభ వీరిప్రతిభను గుర్తించి సత్కరించింది

313-త్యాగ రాజ పంచరత్న ఊహా స్వర తరంగిణి ,భ్రమ ,విశ్వ సంగీత పరిణామం అనే వాద్య బృంద రచనలు చేసి ,అనేక యక్షగానాలకు సంగీతం కూర్చి సామర్ధ్యం రుజువు చేసుకొన్నారు .వీరి ‘’నాగ బంధం ‘’రచనకు జాతీయ పురస్కారం లభించింది .17 ఏళ్ళుగా ప్రభుత్వ సంగీత కళాశాలలో పని చేశారు  .విజయవాడ కాలేజి ప్రిన్సిపాల్ గా పని చేశారు వీరి వీణ తరగతి లో 200కు పైగా విద్యార్ధులు ఉ౦డేవారంటే వారి సామర్ధ్యం ఎంతటిదో తెలుస్తుంది .ఆహ్వానం పై అమెరికా వెళ్లి అనేక చోట్ల కచేరీలు చేశారు .’’నాకు అనుభవం అంతా నాన్నగారితో కచేరీలు చేయటం వల్లనే వచ్చింది ‘’అని చెప్పుకొన్నారు .3 గంటల కచేరీలో 20 ఐటమ్స్ వాయించే నేర్పు వారిది .’’వీణ మీద గిమ్మిక్స్ చేయ కూడదు . ,అది సంగీతం కాదు . వీణ పాడాలి ‘’అంటారు .

Inline image 2

41- –రామ వరపు విజయ  లక్ష్మి

Inline image 3

314-కొన్ని వేలమందికి వీణ నేర్పిన విజయలక్ష్మి విశాఖ వాసి .ఆమె పుట్టినిల్లు మెట్టి నిల్లు  రెండూ సంగీత నిలయాలే పట్రాయని నారాయణ మూర్తిగారి వద్ద పదేళ్ళు నేర్చారు .ఓలేటి వెంక టేశ్వర్లుగారి కర్నాటక హిందూ స్థానీ బాణీల సమ్మేళన పధ్ధతి బాగా నచ్చి దానిలో సాధన చేసి అగ్రభాగాన నిలిచింది .కుమార్తె మాధురి వైణికురాలు ,కుమారుడు తేజస్వి మార్దంగికుడు .సంగీతం లో డాక్టరేట్ పొందాడు .ఉక్కు విశాఖ ను సంగీత విశాఖ గా తీర్చి దిద్దిన ఘనత రామ వరపు విజయ లక్ష్మిగారిదే .ఆమె శిష్యురాళ్ళు డా పద్మిని ,మాధురి లు అంతర్జాతీయంగా ఎదిగిన విద్వాంసులు.

Inline image 4

42-దుడ్డు సీతా రామయ్య

315-20-2-1956 న జన్మించిన సీతారామయ్య 1994నుంచి హైదరాబాద్ త్యాగరాజ ప్రభుత్వ సంగీత కళాశాలలో వీణా చార్యులుగా పని చేస్తున్నారు .9 వ ఏటనే వీణ మీటిన ఈ చిరుత 1973 లో చిట్టిబాబుగారి వీణ కచేరి చూసి ప్రేరణ పొంది సాధన చేశారు .కౌశల్యం వచ్చాక నేపాల్ ప్రధాని కొయిరాల ,మెక్సికో గవర్నర్ ఆల్బర్టో కార్దినాస్ సమక్షం లో కచేరీలు చేశారు .

316-వీణ లో దొడ్డ వారైన దుడ్డువారు శయన వీణా విధానాన్ని మార్చి ఊర్ధ్వ వీణగా వాయించటం మొదలు పెట్టారు .తాళానికి ‘’మెట్రో నిం ‘’(తాళయంత్రం ) ఉపయోగిస్తారు .’’చిట్టిబాబు గారి వాదనలో మెలోడి ఉంటుంది .అదే పండితుడిని ,పామరుడిని కట్టి పడేసింది .చిట్టిబాబు గారే నా ఇన్ స్పి రేషన్ ‘’అన్నారు దుడ్డు వారు .’’పుదుక్కోటై క్రిష్ణమూర్తిగారిలో ఒక టెంపో ఉంది .అది హుషారెత్తిస్తుంది .గమకం ,అలవోకతనం గాత్ర ధర్మం వాద్య ధర్మం ఉంటాయి .స్వర కల్పనలో నిర్దుష్ట మైన మాద మేటిక్స్ ఉంటాయి ‘’అని అభిప్రాయపడ్డారు .

317 –‘’వీణ మీద తానం ప్రత్యేక అంశం .తానానికి ఎక్సేర్ సైజు లుంటాయి .ఇవన్నీ చెప్పి ,కలిపేస్తే సామాన్యంగా సులభం గా ఉండే రాగాలలో తానం వాయి౦చేట్లు విద్యార్ధిని సిద్ధం చేయ వచ్చు. తానం లో లయ ఉంది .జాగాకి రావాలన్న టెన్షన్ ఉండదు ‘’అన్నది దుడ్డువారి దొడ్డ అభిప్రాయం .మంచి ప్రయోగశీలి ఉత్తమ అధ్యాపకులు మేధా సంపత్తి ఉన్నవారు సీతారామయ్యగారు అని వీరభద్రయ్యగారి విశ్లేషణ .

43-కాజా సుభాషిణీ శాస్త్రి

318-వాసా కృష్ణ మూర్తిగారి శిష్యులలో ఇప్పుడు వీణ బాగా వాయించేముగ్గురిలో శ్రీమతి కాజా సుభాషిణీ శాస్త్రి ,శ్రీమతి ఆనంద రాజ్య లక్ష్మి శ్రీమతి అంబుజ వల్లి గారు అని ముదిగొండ ఉవాచ .ముగ్గురూ ముగ్గురే .సంగీత అమ్బోనిది ని చిలికి అమృతం తెచ్చినవారే నంటారు .కచేరీలు చేస్తూ గాన సభలు నిర్వహిస్తూ విద్య నేర్పుతూ మూడింటిలోనూ అసామాన్య ప్రతిభ చూపినవారు సుభాషిణీ శాస్త్రి .1958మే నెలలో కందుకూరులో రాజేశ్వరి నరసింహం దంపతులకు జన్మించారు .విశాఖలో వాసావారి శిష్యురాలై వీణ అభ్యసించారు .వాసావారికి లలిత ,సినీ సంగీతం ఇష్టం లేదని ఆమె చెప్పారు .

319- అరుణాచల శాస్త్రిగారిని వివాహం చేసుకొని హైదరాబాద్ లో ఉంటూ మంచాల వారి వద్ద వీణాభ్యాసం కొన సాగించారు .1987లో ఎ గ్రేడ్ ఆర్టిస్ట్ అయి మనరాస్ట్ర , కొచ్చిన్ రేడియో కేంద్రాలనుంచి ,దూరదర్శన్ లలో కచేరీలు చేశారు .ప్రస్తుతం హైదారాబాద్ తెలుగు విశ్వ విద్యాలయం లో బోధిస్తున్నారు .మనో ధర్మ సంగీతాన్ని ఆదరించారు .’’తుమురాడ ,వాసా ,ఈమని త్రయం  తెలుగు వీణకు కొత్త జీవం పోశారు .శాస్త్రిగారి శిష్యుడు చిట్టిబాబుగారు వీణకు హత్తిన మాధుర్యం అంతా ఇంతా కాదు ‘’అన్నారు సుభాషిత౦ గా  సుభాషిణి గారు .1986 డిసెంబర్ లో ముదిగొండవారికి  నిజామాబాద్ లో మామిడి పూడి ఆనంద్ గారి అబ్బాయి సింహాచలం గారింట్లో ఈమని వారితో రెండు మూడు గంటలు మాట్లాడే సదవకాశం లభించిందట .అప్పుడు ముదిగొండ వారు ఈమనివారిని ‘’వీణా వాదనలో బాల చందర్ గారిది ఒక పంధా ,మీది ఒక పంధా గా ఉన్నాయి కదా ఈ రెండిటిలో ఏది శ్రేష్టమైనది ?’’అని అడిగితే తడుముకోకుండా ‘’నా మార్గమే ‘’అని నిర్ద్వంద్వంగా శాస్త్రి గారు చెప్పారట ‘’అది నిజమే .పద నిర్దేశకుడై ఒక రీతికి ప్రవక్త అయిన మహా వైణికుడు తనమార్గం తక్కువదనో ,ఇతరుల మార్గం తనదానికంటే గోప్పదనో అంటాడా ?’’అన్నారు ఆచార్య ముదిగొండ .

320-శ్రీ సంజీవ రెడ్డి తర్వాత హైదరాబాద్ లోని గ్రీన్ లాండ్ సౌధాన్ని యే ముఖ్యమంత్రీ ఉపయోగించలేదని శ్రీ టంగుటూరి అ౦జయ్యగారు ముఖ్యమంత్రి అయి ఆ సౌధానికి మరమ్మత్తులు చేయించి గృహ ప్రవేశం చేసే సందర్భం లో ముఖ ద్వారం ముందు శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి వీణ సంగీత కచేరీ  ఏర్పాటు చేయించారని ,అ౦జ య్యగారు గృహప్రవేశం చేయాలంటే శాస్త్రిగారు తమ వాయిద్యాలతో సహా వేదిక వదిలి వెళ్ళాల్సిందే నని ,గంట సేపు జరిగిన ఆ కచేరీని అ౦జయ్యగారు ఆస్వాదించి వేదిక ముందుకు వచ్చి శాస్త్రిగారికి  వారి వీణకు వంగి నమస్కరించి ,వేదికదాటి సకుటుంబం గా గ్రీన్ లాండ్స్ సౌద ప్రవేశం చేశారని అ౦జయ్య గారి సంస్కారం అది అని ,శాస్త్రిగారి వీణ వైదిక మంత్రోచ్చారణ తో సమానమని ,అది సామవేద గానమని ,కచేరీలలో మంత్రం పుష్పాన్ని ,ఘన పాఠాన్ని వాయించటం శాస్త్రి గారి ప్రత్యేకత అని ముదిగొండ వారు ముదిత మనస్కులై వివరించారు .

321-సంగీతం లో పండిపోయిన శాస్త్రిగారు 16 ఏళ్ళ వర్దిష్ణువు అయిన సుభాషిణి శాస్త్రి కి తనతో పాటు కొన్ని కచేరీలలో సహకార వాద్య కారిణిగా అవకాశం కల్పించారని ,కొంత కాలం ఆ శాస్త్రి గారు ఈ శాస్త్రికి వీణ కూడా నేర్పారని ,ఆయనతో చేసిన కచేరీల విషయాలెన్నో తనకు తెలియ జేశారని ఆచార్యులవారన్నారు .శాస్త్రిగారి అరుదైన ‘’లైటర్ మూడ్స్ ‘’అంటే తేలిక లక్షణాలను సుభాషిణి రికార్డ్ చేసి భద్రపరచారు .ఆయన వద్ద సంగీతం నేర్చుకోవటానికి తన రెండున్నర ఏళ్ళ కొడుకు రామ కృష్ణ తో  సహా వెళ్ళేదాన్ని అని వాడుఏడవవకుండా  ఆటబొమ్మలు బిస్కెట్లు తీసుకు  వెళ్ళేదాన్నని కాని ,వాడు శాస్త్రి గారి శాస్త్రిగారి ‘’పాన్ పరాగ్ ‘’డబ్బా తీసుకొని పారి పోయేవాడని ,గురువుగారు వెంటపడి ‘’ఒరే దాన్ని తినకురా ‘’అని అరుస్తూ వెంబడించేఈ చిన్న విషయాలను కూడా తాను  రికార్డ్ చేశానని సుభాషిణి శాస్త్రి గారు చెప్పారు .పెద్దవారి జీవితం లో చిన్న తంతు ఇది .ఇదంతా ‘’జీవన సంగీతమే ‘’అంటారు సుభాషిణి .

322-ఒక సారి శ్రీకాకుళం లో శాస్త్రిగారి కచేరీకి సుభాషిణీ శాస్త్రి గారి కుటుంబాన్ని శాస్త్రిగారు కారులో తీసుకు వెళ్లారట .కచేరీ మొదలవ్వటానికి ముందు సుభాషిణి కొడుకు రామ కృష్ణ శాస్త్రిగారిని ‘’కచేరీ ఎప్పటికి పూర్తీ అవుతుంది తాతగారూ ?అని అడిగితె ‘’బిగ్ ముల్లు 12 ,స్మాల్ ముల్లు9 మీదకు వస్తే ప్రోగ్రాం అయి పోతుందిరా ‘’అన్నారట .పిల్లాడు వాచీ మాటిమాటికీ చూసుకొంటూ9 కాగానే స్టేజి దగ్గరకెళ్ళి గట్టిగా ‘’తాతగారూ ! 9 అయి పోయింది ‘’అన్నాడు .కోపం తెచ్చు కోకుండా’’ తాత శాస్త్రిగారు -‘’అయి పోయి౦ది నాన్నా కచేరీ ‘’అని కొన సాగించారని సుభాషిణిగారు తెలియ బర్చారు .’’జీవితానికి సంగీతం మాధుర్యం తెస్తే ,సంగీతానికి జీవితమూ మాధుర్యం తెస్తుంది .విద్య విషయం లో  శాస్త్రి గారు ఎంతటి రసిక మూర్తి యో ,జీవితం లోనూ వారి శిష్య వాత్సల్యం లోనూ ఆయన పరమ సహృదయ రసమూర్తి ‘’అని చెప్పారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

Inline image 5

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.