పుష్క(ల )ర హాస్యం
1- అప్పుడే ఒకడిని కత్తితో కసక్కున చంపి ఒక రౌడీ ఒక ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ కాళ్ళపై పడి చేసిన తప్పు చెప్పి ‘’స్వామీ కృష్ణా పుష్కరం లో మునిగితే నా పాపం పోద్దా ?’’అని అడిగాడు .
వెంటనే స్వామి ‘’’’నువ్వు మునిగి పోతే’’ అంతా పోతుంది నాయనా ‘’అన్నాడు .
2- కృష్ణకు హారతి ఇవ్వటానికి జనం లోంచి దూసుకెళ్లిన ఒకడు పక్కవాడితో ‘’ఇంత పెద్ద’’ గోదా- కృష్ణ ‘’కు ఈ హారతులు చాలవేమో గురూ ?’’అన్నాడు.
పక్కవాడు ‘’నువ్వైతే నీళ్ళపై పెట్రోల్ పోసి హారతిచ్చేవాడివా టింగిరి నాయాలా ‘’అని విసుక్కున్నాడు .
3- ‘’మా నాన్నకు పాతిక వేలు పెట్టి పుష్కరం పెట్టాను తెలుసా ?’’అన్నాడొక బాజా రాయుడు పదేళ్ళ తర్వాత బెజవాడ పుష్కరం లో కలిసిన గుడివాడ ఫ్రెండ్ తో
‘’అలాగా ! నిన్న సాయంత్రమే గుడివాడలో మీ నాన్న తో మాట్లాడానే ! అప్పుడే పోవటం పుష్కరం పెట్టటం కూడా అయిందా ?ఆశ్చర్యంగా అడిగాడు గు. మి.
‘’ఒరే!పదేళ్ళ కిందట మానాన్నను మా ఆవిడ సరిగ్గా చూడటం లేదని కోపం తో ఇల్లు వదిలి వెళ్లి పోయాడు .పోయాడనే అనుకొన్నాం .మా ఆవిడ’’ పుష్కరం పెట్టి మీ నాన్న పీడా విరగడ చేసుకో మంటే పాతిక వేలు క్షవరం చేసుకొని పెట్టాన్రా బాబూ .మా నాన్న బతికే ఉన్నాడన్నమాట .నేను బతికున్న సంగతి ఆయనకు మాత్రం చెప్పకురా ప్లీజ్ ‘’అన్నాడు బె .మి .
4-‘’ఒరే! చంద్రబాబు మరీ పిసినారి .వత్తులతో నక్షత్ర హారతిప్పిస్తున్నాడు ‘’అన్నాడు ఇంకో ఠికానా లేని వాడితో
రెండో వాడు ‘’అయితే ఏం చేయాల్రా ?’’అడిగాడు
మొ. వాడు ‘’రాకెట్ పంపించి నక్షత్రాలని తెంపుకొచ్చి హారతివ్వచ్చుగా ‘’అన్నాడు .
4- బికినీతో ఆమె ,పోట్టినిక్కర్ తో వాడు పుష్కరానికొచ్చారు .ఆమె స్నేహితురాలు కనిపించి ‘’ఒసే సుశీ !మొన్నేకదే మీ పెళ్లి అయింది .అప్పుడే పుష్కరానికొచ్చారేం “”?అని అడిగింది
సుశి ‘’మీ అన్న టింగ రోడే.ఎక్కడికీ కదలడు .నేనే హనీ మూన్ కి పుష్కరానికి లాక్కొచ్చా ‘’అంది.
5 –ఒక పల్లెటూరాయన సంచీనిండా సామానుతో పుష్కర స్నానానికి వచ్చి బ్రాహ్మడి దగ్గరకెళ్ళి ‘’పంతులు గారూ !ఇవాళ పండు ,కూర ,పుస్తకం దానం చేయమని పంచాంగం లో ఉంది ,పుచ్చుకోండి ‘’అన్నాడు
గిరాకీ లేని ఆయన తలో కిలో కూరలు డజను పళ్ళు ఏదైనా భాగవత గ్రంధం లాంటిది దానం ఇస్తాడేమోనని ఆశతో ‘’సరే’’నన్నాడు .వాడు సంచీ అంతా కెలికి ‘’పంతులుగారు !రేట్లు మండిపోతున్నాయి .ఏదీ కొనేట్టు లేదు’’ అని పండు కు ప్రత్యామ్నాయంగా పావలా విబూది పండు ,కూరకు బదులుగా ఒక కొత్తిమిరకాడ ,పుస్తకానికి బదులు పావలా ఎక్కాల పుస్తకం చేతిలో పెట్టాడు .’’ఓరి నీ పిండం పిచికలకు పెట్టా ‘’అని మనసులో అనుకోని చెంబెడు నీళ్ళు వాటిమీద దిమ్మరించి కృష్ణలో కలపమన్నాడు.
6 ఒకడు పుష్కరానికొచ్చి స్నానం చేయకుండా వాచీ చూసుకొంటూ కాలం గడుపుతున్నాడు .ఇది గమనించి ఒక పెద్దాయన ‘’ఏమిటి నాయనా దేనికోసం ఎదురు చూస్తున్నావ్ ‘’అని అడిగాడు
‘’ఏం లేదండీ !మధ్యాహ్నం పన్నెండున్నర ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నాను ‘’అన్నాడు .’’ఏమిటి దాని ప్రత్యేకత ?అడిగాడు .’’తెలియదా మీకు .ఆ సమయం లో ముక్కోటి దేవతలు పుష్కరుడు బృహస్పతి పుష్కర జలం లో ఉంటారు కదా అప్పుడు స్నానం చేస్తే కనిపిస్తారేమో నని’’ అన్నాడు ఆ అమాయక బ్రహ్మ ‘’స్నానం చేస్తే కనిపించరు .స్నానం చేస్తూ’’ పోతే ‘’వాళ్ళే కనిపిస్తారు ‘’అని చమత్కరించాడాయన .
7-‘’స్వామీ !పుష్కరాలలో వాగ్దానం చేసి నెరవేర్చక పోతే ఏటవుద్ది ?’’ఒక డౌటేశ్వర్.
‘’ఏమీకాదు .తెలంగాణా ప్రభుత్వం ఉచిత ఫలహారాలు భోజనాలు అని హోర్డింగ్ లతో హోరెత్తించి పిడికెడు మెతుకులు కూడా రాల్చలేదు .ఏమయింది ?నాయకుల వాగ్దాన వైఫల్యం ప్రమోషన్ కు దారి .పుష్కరుడు కూడా ఏమీ పీకలేడు ‘’అన్నాడు స్వామీజీ గడ్డం సాఫు చేసుకొంటూ .
8–‘’పాపం బాబు ఉచిత టిఫిన్ భోజనం ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తూ కంటికి నిద్రలేకుండా పర్య వేక్షిస్తున్నాడు కదా స్వామీ .కేంద్రం నుంచి ఏదైనా రాల్పిస్తాడా పుష్కరుడు ?’’
‘’ఏం రాల్పిస్తాడు నాయనా ! మట్టీ మశాన్నం తప్ప .ఏదో మెతుకులు విసిరినట్లు ఇవ్వాల్సినవాటినే వందో వంతు రాలుస్తుంటే .ఆయన మాత్రం ఏం చేస్తాడు ?కస్టపడేవాడికి ఫలితం లేటు .మాటలగారడీ వాడికి సద్యో ఫలితం ‘’అన్నాడు నిర్లిప్తంగా స్వామి.
9—‘’గురవా !ఇన్నికోట్లమంది పుష్కర స్నానం చేస్తే మనపాపాలన్నీ తొలగించి పుష్కరుడు ఈ పాపా౦మూట మోస్తాడా పాపం ‘’అన్నాడొక సామాన్యుడు .
‘’అందుకే గదరా సన్నాసీ –ఇవన్నీ వదిలించు కోవటానికి ఆయనకు 12 ఏళ్ళు పట్టేది . అప్పటిదాకా మన మొహం చూడడు.
10 –‘’పుష్కరాలకు పుష్కలం గా వస్తున్న అశేష జన సందోహాల భక్తీ శ్రద్ధలకు ,నమ్మక విశ్వాసాలకు సంస్కృతీ పారంపర్యానికి ఘనంగా నమస్కరిస్తూ సరదాకోసం రాసిన దీన్ని’’ లైటర్ వీన్’’ గా తీసుకోమని ప్రార్ధిస్తున్నాను –
మీ– దుర్గా ప్రసాద్ –22-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్