నా దారి తీరు -99

నా దారి తీరు -99

బదిలీ ప్రయత్నం వగైరా

స్కూలు  రోడ్డు ప్రక్కనే ఉంది .మైలవరం నుంచి తిరువూరు ,భద్రాచలం మొదలైన చోట్లకు చిలుకూరి వారి గూడెం మీదనుంచే పోవాలి .ఎక్స్ ప్రెస్ బస్సులు ఇక్కడ ఆగవు .కనుక మైలవరం లో దిగి సాధారణ బస్  కాని లారీ కాని ఎక్కి ఈ ఊరు రావాలి .స్కూల్  టైం కు చేరుకోవాలంటే ఉయ్యూరు లో కనీసం 5 గంటలకేబయల్దేరాలి .బెజవాడ చేరి అందుబాటులో ఉన్న బస్సెక్కి రావాలి .అప్పటికే ఇంటి దగ్గర టిఫిన్  చేసి కాఫీ కలిపి అయ్యగారికి రెడీ చేసేది మా శ్రీమతి .అన్నం వండి ,ఒకటో రెండో కూరలు ,పప్పు సిద్ధం చేసి కారియర్ సిద్ధం చేసేది  .ఇవన్నీ తీసుకొని దొరగారు బయల్దేరాలి .మధ్యలో ఎక్కడైనా బస్ మిస్ అయినా టెన్షన్ టెన్షన్ .మైలవరం బస్ స్టాండ్ లో టిఫిన్ బాగానే ఉండేది .అవసరమైతే తినేవాడిని .సమయానికి ఎలాగో అలా తంటాలు పడి స్కూల్ కు చేరేవాడిని .బట్టలు మాసిపోయేవి .ఒక్కోసారి ప్రయాణం అంటే భయమేసేది .అట్లాగే సాయంత్రం స్కూల్ వదిలాక ఇంటికి బయల్దేరటమూ బ్రహ్మ ప్రళయ మైపోయేది .బస్సులు సమయానికి రాక వచ్చినా ఖాలీలేక ఆటోలోనో లారీలోనో వెళ్లాల్సివచ్చేది మైలవరం నుండి సూపర్ ఫాస్ట్ లేక ఎక్స్ ప్రెస్ బసు ఎక్కి ఇబ్రహీం పట్నం నుంచి బెజవాడ చేరి మళ్ళీ ఆర్డినరి బస్ ఎక్కిఊరు చేరేవాడిని .ప్రయాణం నరకమయ్యేది మైలవరంనుండి మిల్క్ ప్రాజెక్ట్ మీదుగా బెజవాడ బస్ దొరికితే ఎక్కేవాడిని .ఏమైనా సోమవారం శనివారం ప్రయాణాలకు అటు నుంచి ఇటు ,ఇటు నుంచి అటు చాలా కష్టమై పోయేది .స్కూల్ బాగుంది పిల్లలు మేస్టార్లు మంచివాళ్ళు కమిటీ సహకారం బాగా ఉంది  స్కూల్ చుట్టుపక్కల  వాతావరణమూ బాగుంది .నన్ను ఇక్కడే ఉండిపోమ్మనే వారూ బాగా ఉన్నారు నాకూ చాలా ఇష్టమైన స్కూల్ ఇప్పటిదాకా చేసినవాటిలో .కాని ప్రయాణ బాధ భరించ లేక పోయేవాడిని .అలాంటి సమయం లో మాతమ్ముడు మోహన్ దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చి నా బదిలీ ప్రయత్నాలకు ఊపు వచ్చింది .ఆ విషయాలు చెప్పేముందు మరికొన్ని విషయాలు చెప్పాలి .

,మామిడి కాయలు

స్కూల్ రోడ్డుకు దగ్గర గా ఉండటం ,రోడ్డుకిరువైపులా మామిడి చెట్లు ఉండటం ఈ స్కూల్ కు నాకు వరం అయింది .ఉయ్యూరు వెళ్ళేటప్పుడల్లా అటెండర్ దాస్ కు చెబితే మామిడికాయలు కోసి రెడీ చేసేవాడు .తీసుకు వెళ్ళేవాడిని. పుల్లూరులో ,మెరుసుమిల్లి గ్రామాలలో వెన్న పూసా బాగా మంచిది దొరికేది. లెక్కల మేస్టారికి చెప్పి డబ్బులిచ్చి కొని పించి తీసుకు వెళ్ళేవాడిని .కృష్ణ దాసు దాసుగారి అమ్మాయిసీత తో పాటు ,మరొక పొట్టి అమ్మాయి ఇంకొక మెరుసుమిల్లి తొమ్మిది చదివే అమ్మాయిప్రభావతి అనిజ్ఞాపకం –తెల్ల చొక్కా ఆకుపచ్చ పరికిణీ మీద వేసేది .మగ పిల్ల అని పించేది  .వీళ్ళే కాక  మగపిల్లలూ ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారు .ఎక్కడో బయట వంద కిలో మీటర్ల దూరం లో ఉన్నాను అనే ఫీలింగ్ వీరందరి వల్లా ఉండేదికాదు.  స్కూల్ అన్నివిధాలా అభి వృద్ధి చేశాం .అదొక ‘’తుత్తి’’.

స్కూల్ బోర్డ్ లు

స్కూల్ కు డిస్ ప్లే బోర్డ్ లు ఉండాలి అవేవీ లేవు ఇన్స్పెక్షన్ కు ముందే వివరాలన్నీ సేకరించి ముందుగా ‘’గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ ‘’బోర్డ్ తయారు చేయించాను. అంటే స్కూల్ పుట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు యేయే హెడ్ మాస్టర్లు ఎంత కాలం పని చేశారో వివరాలు అన్నమాట .తర్వాత  టెంత్ క్లాస్ రిజల్ట్  బోర్డ్  .యే సంవత్సరం యెంత రిజల్ట్ వచ్చింది ,స్కూల్ ఫస్ట్ ఎవరు వివరాలన్నమాట .తర్వాత 7 వ తరగతి జిల్లా కామన్ పరీక్షలలో ఉత్తీర్ణతా శాతం స్కూల్ ఫస్ట్ విద్యార్ధి వివరాలు .ఆ తర్వాత స్టాఫ్ పర్టిక్యులర్స్ .హెడ్ మాస్టర్ తో ప్రారంభించి సీనియారిటీ ప్రకారంబి ఎడ్ అసిస్టంట్ట్లు సెకండరి గేరేడ్ లు , ,తెలుగు హిందీ డ్రిల్ డ్రాయింగ్ అటెండర్ నైట్ వాచ్మన్ తో సహా వివరాల బోర్డ్ కూడా తయారు చేయించాను. ఇవి రాయటానికి పెయింటింగ్ చేయటానికి డ్రాయింగ్ మాస్టారు లేదు  కనుక ప్రైవేట్ ఆర్టిస్ట్ తో డబ్బు లిచ్చికామన్ గుడ్ ఫండ్ నుంచి ఖర్చు చేసి  రాయించాను .వీటితో స్కూల్ కు సమగ్రతః ఏర్పడింది అందమూ వచ్చింది .ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయికనుకనే ఇన్స్పెక్షన్ లో మంచి రిమార్క్ లు పొందగాలిగాం .గార్డెన్ వర్క్ చా లా ప్రోత్సాహకంగా ఉండేది. కూరగాయల వలన రాబడీ వచ్చేది .కనుక ఎందుకు ఈ ఊరు వదలాలి అని మనసు పీకేది .నేను వెళ్ళటం ఎవరూ హర్షించే విషయమూ కాదు కూడా .

స్కూల్ కు గుమాస్తా లేదు అన్నీ ఆచారిగారే చెయ్యాలి పే బిల్స్ జీతాలబట్వాడ నామినల్ రోల్స్ తయారీ పరీక్షల ఏర్పాట్లు అన్నీ ఆయనే చేసేవారు .బెజవాడ నుండి ఉమాశంకర్ అనే ఆయన వస్తాడని బాగా ప్రచారం జరిగింది .కాని రాలేదు ఆయన బాగా పలుకుబదిఉన్న తోట్ల వల్లూరు బ్రాహ్మిన్ .కనుక రాలేదు .మైలవరం పంచాయితీ రాజ్ లో లో జూనియర్ గుమాస్తా ప్రసాద్ అనే కుర్రాడిని వేశారు .తండ్రి టీచర్ చనిపోతే కొడుక్కి ఉద్యోగం ఇచ్చారు .బాగానే పని చేసేవాడు .కనుక గుమాస్తా బాధా తీరింది .

ఇక్కడ ఉండగానే  రెండవ మేనల్లుడు అంటే చిన్నక్కయ్య బావలకుమారుడు ఛి .మృత్యుంజయ శాస్త్రి ,ఛి సౌ విజయలక్ష్మి ల వివాహం హైదరాబాద్ లో జరిగితే వెళ్లాను .తిరిగి వచ్చేటప్పుడు అ౦చ లంచేలు మీద రావటం తో పాంట్ షర్ట్ రైలు ఇంజన్ లో బొగ్గు వేసేవాడి బట్టల్లా నల్లగా మారిపోయాయి .స్కూల్ దగ్గర గప్ చిప్ గా దిగి  స్నానం చేసి బట్టలు మార్చుకొన్నాను. ఇదొక తమాషా అనుభవం నాకు

శ్రీ వి .హనుమంత రావు గారి రికమండేషన్ లెటర్ – మేడూరు కు ట్రాన్స్ ఫర్

హైదరాబద్ బి. డి .ఎల్ .లో పని చేసే మా తమ్ముడు మోహన్ ఒక సారి ఉత్తరం రాస్తూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన శ్రీ వి .హనుమంత రావు గారి బామ్మర్ది తన దగ్గర పని చేస్తున్నాడని రోజూ ‘’సార్ !మీరు నాకు ఉద్యోగం ఇచ్చి చాలాహేల్ప్ చేశారు .మాబావగారి ద్వారా ఏదైనా పనికావాలంటే ఇట్టేచేయించి పెడతాను ‘’అనే వాడట ఈవిషయంనాకు రాసి ఉయ్యూరు చుట్టూ పక్కలకు చేరాలంటే ఇదే మంచి అవకాశం అన్నాడు. సరే ప్రయత్నం చేయమన్నాను .బామ్మర్ది బావకు ఏం చెప్పాడో తెలియదు కాని పది రోజుల్లో శ్రీ హనుమంతరాగారు కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ పిన్నమ నేని కోటేశ్వర రావు గారికి నన్ను ఉయ్యూరు లేక దానికి అతి దగ్గరలో ఉన్న స్కూల్ కు ట్రాన్స్ ఫర్ చేయమని రికమండేషన్ లెటర్ రాసి ఇచ్చారు .దాన్ని బామ్మర్ది మా వాడికిస్తే వాడు నాకు పోస్ట్ లో వెంటనే పంపేశాడు .ఈవిషయం ఎవరికీ చెప్పలేదు చాలా  రహస్యంగా నే ఉంచాను . మా ఆవిడకూ చెప్పలేదు .ఒక శని వారం ఉయ్యూరు వెళ్లి ఆ సీల్డ్ రికమెండేషన్ లెటర్ ను చైర్మన్  శ్రీ కోటేశ్వర రావు గారిని జిల్లా పరిషత్ ఆఫీస్ లోకలిసి అందజేశాను .అయన ఆశ్చర్యంగా ఒక సారి తలపైకెత్తి నా వైపు చూసి నవ్వుతూ కాంప్ క్లెర్క్ కిచ్చి అర్జెంట్ గా ఈపని పూర్తిచేయమని చెప్పారు .నేను తర్వాత చిలుకూరివారి గూడెం వచ్చి నా పనులు నేను చేసుకు పోతూనే ఉన్నాను. లెక్కల మేస్టారికి శేషగిరి రావు గారికి కూడా రహస్యం చెప్పలేదు .ఒక రోజు టపాలో నా ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది నన్ను మేడూరుకు ట్రాన్స్ ఫర్ చేసి ఇక్కడ నా పోస్ట్ లో మైలవరం నేటివ్ నాలాగానే సైన్స్ మేస్టర్, నాకు రాజమండ్రి ట్రెయినింగ్ కాలేజి లో సహాధ్యాయి నల్లగా ఎత్తుగా తెల్ల బట్టలతో ఉండే రామా రావు ను వేశారు .నేను ఇక్కడికోచ్చినప్పుడుకూడా నా ట్రెయినింగ్ మేట్ జి .హెచ్. హనుమంతరావు ను ఇక్కడినుండి కాజ కు ట్రాన్స్ ఫర్ చేసి, నన్ను చిలుకూరివారి గూడెం హెడ్ మాస్టారుగా వేశారు .నేను రిలీవ్ చేసినవాడు నన్ను రిలీవ్ చేసిన వాడూ నా సహాధ్యాయు లవటం తమాషా గా ఉంది .స్టాఫ్ అంతా షాక్ తిన్నారు .చెప్పకుండా ఎందుకు చేశారీపని అని కమిటీ ప్రెసిడెంట్ రెడ్డిగారు వచ్చి గోల చేశారు .శేషగిరిరావు గారిముఖాన నెత్తుటి బొట్టు లేదు. దిగాలు పడిపోయారు ..ఏదో అందరికి సర్ది చెప్పాను .మంచి టీపార్ర్టీ సెండాఫ్  పార్టీ ఇచ్చారు .ఒక ఆల్ఫా సూట్  కేస్ ను బహుమతిగా  అందజేశారు దాన్ని చాలా ఏళ్ళు వాడాను .పిల్లలందరూ బార హృదయం తో వీడ్కోలు చెప్పారు .ప్రయాణం భారం తప్పిందికదా అని నేను సంతోషించాను .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-22-8-16-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.