11-కృష్ణా పుష్కర శోభను ఆకాశం నుంచి చూస్తున్న లక్ష్మీ పార్వతీ సరస్వతీ పరవశించి అబ్బురపడి తన్మయం తో ఆనందిస్తూ ఉన్నా సహజమైన ఆడలక్షణం పోక ఒకరినొకరు సూటి పోటీ మాటలు రువ్వుకొంటున్నారు .ముందుగా పార్వతి ‘’అమ్మా లక్ష్మీ !మీ ఆయన పాదాల నుంచే నీళ్ళు కారాయని మేము బాధపడుతుంటే ఇప్పుడు ఏకంగా ఒళ్లంతా నీళ్ళు కారుతూ కృష్ణగా నల్లగా కనిపిస్తూ,చీమలు పిట్టలు కాకులతో సహ్యాద్రి పై ఉన్న అశ్వత్ధ వృక్షం నుంచి కారుతున్నాడు .నాకైతే కంపర మేస్తోంది బాబూ ‘’అంది .
లక్ష్మి తక్కువదా’’గురివింద గింజ సామెత రుజువు చేశావుకాని ఇక చాలు ఆపవమ్మా !మా అయన పుట్టిన చోటే తగుదునమ్మా అని మీ ఆయనా పచ్చి ఉసిరికాయల చెట్టు లోంచి కిందకు దూకి ,వేణి గా మా ఆయనలో కలవలేదా “”అని అంటించింది .
తానూ ఏదో ఒకటి మాట్లాడాలికనుక సరస్వతి ‘’ఏమోనమ్మా !ఎక్కడా లేని విడ్డూరం మీ ఆయనల్లో ఉంది .అయినా మగా మగా ఈ సంపర్కమేమిటి అసహ్యంగా .స్వజాతి సంపర్కంలా .పోనీ నదులే కదా ఆని సరి పెట్టు కొంటె , అంతటితో ఆగారా ?ఇద్దరూ పరస్పర వ్యామోహం తో కిందామీదా పడి అయ్యప్పనే కన్న మహానుభావులు .చెప్పు కొంటె సిగ్గేస్తోంది ‘’అంది నిష్టూరంగా .
అప్పుడు లక్ష్మీ పార్వతులు ‘’అమ్మా !ఇలా సూటీ పోటీ మాటలు అంటావనే మీ ఆయనకు మా ఆయనలు గుడులే నిషేధించారు .ఒక్క గుడిలో అయినా మాకున్నట్లు మీ ఇద్దరి విగ్రహాలు ఉన్నాయా?చాలు చాల్లేవమ్మా ‘’అన్నారు .అవాక్కైంది సరస్వతి
అదే సమయం లో త్రిమూర్తులూ పుష్కర వైభవాలను చూసి ముచ్చటపడుతుండగా పై మాటలు వాళ్ళ చెవుల బడ్డాయి’’చూశారా ! లోకపూజలు అందుకొంటున్నా ,మన ఆడవాళ్ళకు ఆడ బుద్ధి పోలేదు ‘’బ్రహ్మవి మూడు విష్ణువుదొకటి ,శివుడివి అయిదు మొత్తం 9 మొహాలతో ఆకాశమ౦ తా వినబడేలా పగలబడి నవ్వారు .
12-‘’ఒరేయ్ ! మా అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది కృష్ణ వేణి పేరు పెట్టారు .’’అన్నాడు ఇంకోడితో .ఇంకోడు ‘’మా అబ్బాయికి మగపిల్లాడు పుట్టాడు ‘’పుష్కర్ ‘’అని నామకరణం చేశాం ‘’అన్నాడు .ప్రక్కనే ఉన్న ఒక యాభై ఏళ్ళ పెద్దాయన ‘’మరి మొన్ననే నాకు 12 వ సంతానం కలిగింది .ఏం పేరు పెట్టాలో తెలీక బుర్ర గోక్కు౦టు న్నాను ‘’ .వీళ్ళిద్దరూ ‘’పిండం ‘’అనిపెట్టు అన్నారు .ఆయన గుడ్లురిమి చూశాడు ‘’అదేనండి పిండజ’’అని పెట్టండి. అరిరే పీరు.బాగా కిక్ అవుతుందని వెళ్ళిపోయారు . ఉంటే కోడతాడేమో ననే భయం తో .
13-‘’గురూ ! బాబు పుష్కరాలకు మోడీని పిలిచాడా ?’’
‘’ఇది ఎవరింట్లో పెళ్లి .ఆయనే రావాలికాని ఆహ్వానాలు కావాలా ?’’
‘’ఒక వేళ వచ్చి ఉంటే ఏమిచ్చే వాడు ?
‘’పూర్తిగా కృష్ణ నీటిలో మునిగి అడుగున దొరికిన ఇసక మట్టి నువ్వులు దర్భలు తీసి బాబు చేతిలో పెట్టి ‘’కృష్ణార్పణం ‘’అనేవాడేమో !
14-‘’శాస్త్రీ !ఇదివరకు పుష్కరాలకు ముందు హేతువాదులు నాస్తికులు ఇదంతా ‘’మనువాదుల ‘’అకృత్యం అని ,ఇందులో సైంటిఫిక్ రీజన్ ‘’లేదని వాదించి పుంఖాను పుంఖాలుగా కరపత్రాలు పంచి పెట్టేవారు .ఇప్పుడు వాళ్ళ జాడే కనిపించట్లేదే ?’’
శాస్త్రి ‘’నిజమే శర్మా !పాపం వాళ్ళ మాట వినే నాధుడే లేడిప్పుడు .విశ్వాసానికి మించిన సైన్స్ లేదని ఆనాటి నుంచి ఈనాటి దాకా మనవాళ్ళందరూ ఘోషిస్తూనే ఉన్నారు .
మూర్తి ‘’అయ్యా శాస్త్రిగారు శర్మగారు ! ఊరవతల ఒక చోట టెంట్ వేసి ఎవరికీ తెలీకుండా పుష్కరాలు లాగిస్తున్నారని కర్ణాకర్నీగా వినికిడి .ఇది నేను చెప్పానని నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్ ‘’అనగా అందరూ నవ్వుకొన్నారు .
15-‘’పంతులుగారూ !మానాన్నకు ఇద్దరు భార్యలు .మా అమ్మకు ఇద్దరు భర్తలు .నేను ఎవరెవరికి తర్పణాలు వదలాలో తెలియటం లేదు ‘’అన్నాడు
‘మరి నీ సంగతి ?’’పంతులుగారి ప్రశ్న .
‘’ముగ్గురు పెళ్ళాలు .నా చివరిపెళ్ళానికి అయిదుగురు భర్తలు ‘’అన్నాడు
‘’అందరూ కట్టకట్టుకొని కృష్ణలో పడి మునగండి చాలు ‘’విసుక్కొంటూ పంతులుగారు లేచిపోయాడు .
16-అందరూ ఆకాశం వైపు కన్నార్ప కుండా చూస్తున్నారు .ఏమిటి విశేషం అని తెలుసుకోవటానికి వెళ్లి అడిగాను
‘’బాబూ ! ఇప్పుడే పోలీసులు వాన్ లలో 80 మంది అంధులను అతి మర్యాదగా కార్లలో ఎక్కించుకొని వచ్చి ,ప్రతి ఒక్కరికీ దగ్గరుండి పుష్కర స్నానం చేయించి ,టిఫిన్ కాఫీ భోజనాలు సంతృప్తిగా పెట్టి గొప్ప సేవా ధర్మం చూపారు .ఇప్పుడే మధ్యాహ్నం అయిందిగా అదుగో ఆకాశం లో సకల దేవ రుషి గణాలు ,పుష్కర, కృష్ణవేణి తల్లి వారందరినీ మనసారా ఆశీర్వ దిస్తున్నారు .ఇంతకంటే పుష్కర మహాత్మ్యం ఏముంటుంది ‘’అని అందరూ ఆకాశం వైపుకు నమస్కరిస్తూ ఆనందం ప్రకటించారు .
17-‘’ఇంతటి సేవా భావం తెలంగాణలో కనపడలేదేం?’’ఒకాయన సూటి ప్రశ్న
‘’దండుకోనేవాడు ,పిండు కొనేవాడు ఒకడైతే ,దయా దాక్షిణ్యాలు మానవతా ప్రదర్శించేవాడు ఇంకోడు నాయనా .అందుకే అంత తేడా ‘’అన్నాడు పక్కవాడు
18-‘’గురూ !పుష్కరాలకు ఇంత ఖర్చు చేయాలా ? రోజూ హారతులివ్వాలా ,రోజూ బాబు ప్రత్యక్షంగా చూడాలా .నాకు మాత్రం చాలా సిల్లీ గా ఉంది ‘’అన్నాడొక సిల్లీ ఫెలో.
‘’శిష్యా ! పన్నెండు ఏళ్ళకోసారి వచ్చే అరుదైన అవకాశం .మనం తిన్నా తినక పోయినా అతిధి మర్యాదలను కాపాడాలి .పుష్కర స్నానం చేస్తేనో పిండ ప్రదానాలు చేస్తేనో మోక్షం వచ్చేదానికన్నా ఇన్ని లక్షలమంది కి మర్యాద పూర్వక ఆతిధ్యమిచ్చి వాళ్లకు యే అసౌకర్యం కలగకుండా కంటి పాపల్లాగా కాపాడి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే వచ్చే పరమ సంతృప్తి ఇంకేది చేసినా రాదు .ఆ సంతృప్తీ ,ఆనందమే బాబు కళ్ళల్లో ముఖం లో ప్రస్పుటంగా కనిపిస్తోంది .మన ఇంట్లో కార్యక్రమం జరుగుతుంటే యజమాని ఎక్కడో కూచుంటే దానికి శోభ రాదు .అందరితో మమైకం అవ్వాలి అప్పుడొచ్చే సంతృప్తి ఇంకెప్పుడూ రాదు .దానికోసమే బాబు పడే శ్రమ .స్వార్ధం లేనప్పుడే ఇంతటి పరమానందం కలుగుతుంది ‘’అన్నాడు గురూజీ .
19-‘’శాస్త్రిగారూ! పుష్కరాలలో ఏదైనా ఇష్టమైంది వదలాలా “”?భార్యా భర్త ప్రశ్న
‘’వదిల్తే మంచిది నాయనా ‘”
‘’అయితే ఇష్టం తో కాదుకాని కష్టం తో మా ఆవిడను వదిలేస్తా ‘’అన్నాడు భార్యా బాధితుడు
‘’కానిస్టేబుల్ !అని అరిచి ‘’మా ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు చూడండి ‘’అంది
‘’నాయనోయ్ ! కాశీకి వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు ‘’నిన్ను నేనెక్కడ వదల గలను బాబోయ్ ‘’అన్నాడు
20-సిపి ఐ నారాయణ ,సిపిఎం రాఘవులు పుష్కర ఘాట్లు చూసుకొంటూ వస్తూ ‘’జనం వెర్రికి హద్దులేదు .నది దేనికో ప్రతినిధి అట మూఢ విశ్వాసం పెరుగుతో౦ది కాని తగ్గట్లేదు ‘’అనుకొంటున్నారు .ప్రక్కనే ఉన్నాయన ‘’అయ్యా మీగుర్తులు సుత్తీ కొడవలి మీ జెండాలు మీ విశ్వాసాలకు ప్రతినిదులుకావా ?’’అన్నాడు .కనిపించకుండా ఆ ఇద్దరూ పరార్ .
కృష్ణా పుష్కరం చివరి రోజు శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-23-8-16- కాంప్-బాచుపల్లి –హైదరాబాద్