కన్నయ్య సన్నిధిలో చూడయ్య (గోకులాష్టమి సందర్భం గా మనసులో మెదిలిన భావనకు ఊహా రూప కద)
వ్రేపల్లెలో కన్నయ్య పుట్టిన రోజు వేడుకలు బహుపసందుగా సాగుతున్నాయి .ఊరంతా ముగ్గులు తోరణాలు ,ఆటలు పాటలు ,బాలకృష్ణుని చిలిపిచేస్టల ప్రదర్శనాలు నాటకాలు ఒకటేహడావిడి .ప్రతి ఇంట్లోనూ వాళ్ళింట్లోనే కన్నయ్యపుట్టాడనే సంతోషం తో చేస్తున్నారు వేడుకలను .ఇవన్నీ అయిపోయి అందరూ నంద యశోదల ఇంటికి చేరారు .అందరి దృష్టీ పలురకాల ప్రదర్శనల పైనే ఉంది.కన్నయ్య ఒక పక్క వంశీగానం భువన మనోహరంగా చేస్తూ మనసులకు ఆనంద పరవశం కలిగిస్తున్నాడు .వెన్నెలలో బృందావన సందర్శనాన్ని కల్పిస్తున్నాడు అపురూపమైన తమకన్నయ్యకు తల్లి యశోదమ్మ వివిధ రకాలైన నూతన వస్త్రాలను ఆభరణాలను గంటకో రీతిగా మారుస్తూ సంతృప్తి పడుతోంది ఆడపిల్ల లేదన్న బెంగ తీరటానికి కన్నయ్యను కన్నెపిల్లగా కూడా అలంకరించి మరిన్ని నగలు దిగేసి ముచ్చట తీర్చుకొంది.ఇక నందయ్యకు ఒంటిమీద బట్ట నిలవటమే లేదు పొంగిపోతున్నాడు తనకు దక్కినఅదృస్టానికి .ఎన్నిజన్మల తపోఫలమో అని భగవంతునికి చేతులెత్తి మాటిమాటికీ నమస్కరిస్తున్నాడు .ఆడవారి సందడి చెప్పనే అక్కర్లేదు
ఇలా కోలాహలం గా పరవశంగా వాతావరం ఉంది అందరూ మేనుమరచి పోతున్నారు .ఈ హడావిడి ఒక్కడి విషయం లో మాత్రం లెక్క తప్పింది .వాడే ‘’చూడయ్య .వాడి ద్రుష్టి అంతా కన్నయ్య మీదే ఉంది .చూపు పక్కలకు తిప్పితే ఒట్టు .ఎంత సేపు అట్టాకన్నయ్యని తాగుతాడు వీడు? అని అందరికీ లోపల ఉందికాని కన్నయ్య ఏమనుకొంటాడోనని నోటికి తాళాలు బిగించు కొంటారు .ఇవాళ అయితే కృష్ణాష్టమి అని సరిపుచ్చుకు౦దామంటే ,రోజూ ఇదే తంతు .కన్నయ్య ఎక్కడుంటే అక్కడే వాడు .ఆయనతో మాట్లాడడు .పలకరించడు .తమలాగా ఆయనతో వెన్న, పాలు దొంగతనాలు చేయడు.ఈ చిలిపి పనులు కన్నయ్య చేసేటప్పుడు కూడా చూడయ్య చూపు కన్నయ్య చేసే పనులమీద ఉండదు .తాము నవ్వుతూ కేరింతలేస్తీ ఆ పనులు చేస్తుంటే వాడుమాత్రం కన్నయ్య మీంచి రెప్ప పక్కకు తిప్పుడు,ద్రుష్టి ,మరల్చడు.అందుకే వాడి అసలు పేరు అందరూ మర్చిపోయి కన్నయ్యను ఎప్పుడూ చూస్తూ ఉంటాడుకనక చూడయ్యఅని పిలవటం మొదలు పెట్టారు . ఇదేమైనా గాలి రోగమేమో అనుకొనేవాళ్ళు .వాడి తలిదండ్రులకు చెప్పారు కూడా .’’ఒరేయ్ ! వాడేవురికిఅర్దమవ్వడు పొద్దున్నే ఇంత సద్ది నోట్లో కుక్కుకొని ఇంటినుంచి బయటికి అడుగు పెట్టినోడు , యే అర్ధరాత్రికో కన్నయ్య నిద్రపోయాక కొంపకు చేరుతాడు .తినటానికి ఏమైనా పెడదామని అడిగితే’’కడుపు చాలా బరువుగా ఉందమ్మా నేనేమీ తినలేనే ‘’అని ముసుగు తన్ని పడుకుంటాడు .వాడు మా దారికి రాడని తెలిసి మేమే ఆడి దారిలో పడ్డాం ‘’అంటుంది తల్లి .’తండ్రి మాత్రం ‘’ఆడిదోఇంతపుటకరా .పుట్టటం తోనే ఆడిపక్క కన్నయ్య బొమ్మ ఉంది .మేమేవరుమూ,కొని తెచ్చి పెట్టి౦దికాదు ‘’పుట్టినోడు ఏడవాలా ?ఆహా అదేమీ లేదే పిలగాడికి .కన్నయ్య బొమ్మను చూస్తూ నగూ కొన్నాడు .గాలీ ధూళీ లాంటివేమైనా పట్టాయా అని ఆల్లనీ పిల్పించాం .ఆళ్ళుతమవల్లకాదని కాడి పారేశారు .ఇదీ ఈడి సంగతి అబ్బయ్యా .ఎప్పుడూ మీ పక్కనే ఉండేటోడుగనక మీరే కుసింత కనిపెట్టి ఉండ౦ డబ్బా’’అన్నాడు తండ్రి .అప్పట్నించి ఇంక ఎవరూ వాడినేమీ అనరు పట్టించుకోరు .
రంగ రంగ వైభవంగా కన్నయ్య పుట్టిం రోజు జరిగిపోతోంది .చూడయ్య చూపు మాత్రం కన్నయ్యను వదలలేదు .యశోదమ్మ చివరగా వచ్చి దిష్టి తీసి ,ఇంతవెన్న నోట బెట్టి ౦ది .కను చూపుతో సైగ చేశాడు తల్లికి .వెంటనే అర్ధం చేసుకొని ఆ ఎంగిలి వెన్నముద్ద నే చూడయ్య నోట్లోనూ పెట్టింది .వాడికి ఆ స౦గతి తెలుసా? .వాడి మనోరంగమంతా కన్నయ్య ముఖ చంద్ర బింబ దర్శనాస్వాదనలోనే ఉండిపోయింది. యశోద వెన్నపెట్టిన సంగతీ తెలీదు అది నోట్లోకి జారిపోతున్న వైనమూ వాడికి స్పృహలో లేదు .అందరూ వెళ్లి పోయారు కన్నయ్యా చూడయ్యా ఇద్దరే ఉన్నారు .కన్నయ్య ‘’చూడా !నాతో మాట్లాడవు .పలకరించవు ఆటాడవు ఎప్పుడూ నా మొహం లోకి చూస్తూనే ఉంటావు .విసుగు అనిపించదా ?’’అడిగాడు కన్నయ్య .ఎప్పుడూ కన్నయ్య ముందు నోరు విప్పని చూడయ్య ఒళ్ళంతా పులకరించింది .అదేదో జన్మ జన్మల అనుబంధం అనిపించింది .కన్నయ్య అడిగాడు కనుక జవాబు చెప్పక పొతే బాగుండదని ‘’కన్నా !నీముఖం చూస్తేనే చాలు నా పంచప్రాణాలకు చైతన్యం కలుగుతుంది .నీతో మాట్లాడితే ఆ భాగ్యం దక్కదేమోనని భయం .కనుక నిన్నే చూస్తా నాకు అంతకంటే ఆనందం లేదు అక్కర్లేదు .ఇలా శాశ్వతంగా నీ ముఖ సందర్శన భాగ్యమివ్వు ఈ చూడ య్య కు .’’అన్నాడు చూడుడి కళ్ళనుండి ధారా పాతంగా ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి కాదు కారిపోతున్నాయి .ఏమైందో తెలీదుకాని కన్నయ్య కళ్ళనుండీ సంతత ధారాపాతం గా బాష్పదారలు కురుస్తున్నాయి .పైన ఉన్న దేవతాగానం రుషిగణంకృష్ణాష్టమి వేడుకలు చూస్తూ ఈ దృశ్యాన్ని చూసి పులకించిపోయారు పుష్ప వృష్టి కురిపించారు .
కొంచెం బాహ్య స్పృహలోకి వచ్చారు ఇద్దరూ ‘’కన్నయ్యా !నేను నిన్ను ఇలాఅంటిపెట్టుకొని ఉలకక పలకక నిన్నే చూడటం నీకిస్టమేనా ఇబ్బందిలేదా ?’’అడిగాడు చూడుడు .కరిగి పోయిన కన్నయ్య ‘’చూడా !మనది జన్మ జన్మల అనుబంధం .నువ్వు చూడామణి అనే రుషీశ్వరుడివి నేను కృష్ణావతారం దాల్చే టప్పుడు రుషిగణమంతా గోప గోపికలు గా జన్మించారు అప్పుడు నువ్వు నాదగ్గరకొచ్చి ‘’పరమాత్మా !నేను అనవరతం నీ ముఖార వి౦దాన్ని దర్శించే భాగ్యం మాత్రం ప్రసాదించు నాకింకేమీ వద్దు ‘’అని కోరావు .ఆ వర ప్రభావం వలననే నువ్వు ఇంత సన్నిహితంగా నన్ను నా ముఖాన్నీ చూస్తూ పరమానందాన్ని పొందుతున్నావు .’’అన్నాడు .అంతే చూడడు కన్నయ్య పాదాలపై వాలి భక్తితో ప్రణమిల్లి’’ ఇంతకంటే ఇంకా యే ఆనందం నాకక్కర్లేదు కన్నా ‘’అని ముఖాన్ని పైకి త్రిప్పి కన్నయ్య ముఖ చంద్రోదయాన్ని తనివి తీరా దర్శించి అలా కన్నయ్య పాదాలపై వాలిపోయాడు .ఒక దివ్యజ్యోతి చూడయ్యనుంచి కన్నయ్యలోకి ప్రవేశించింది .దీనికి సాక్షులు పైనున్న రుషి ,దేవ గణం..విషయం తెలిసి అందరూ వచ్చి కన్నయ్య చూడయ్య ల అనుబంధాన్ని అర్ధం చేసుకొని చూడయ్య భక్తికీ కన్నయ్య కృపకూ ముగ్ధులయ్యారు
శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షలతో
మీ గబ్బిట దుర్గాప్రసాద్-25-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్