నా దారి తీరు -100 మేడూరు లో ఉద్యోగం

నా దారి తీరు -100

మేడూరు లో ఉద్యోగం

2-9-1989 న చిలుకూరి వారి గూడెం లో చేరిన నేను 22-8-90 సాయంత్రం విధులనుండి విడుదలై ,రిక్వెస్ట్ ట్రాన్స్ ఫర్ కనుక జాయినింగ్ టైం ఉండదు కనుక మర్నాడే  మేడూరు హైస్కూల్ లో 23-8-90 ఉదయం చేరాను .

సుమారు సంవత్సర కాలమే చిలుకూరి వారి గూడెం లో పని చేసినా ,ఆ స్కూల్ అన్నా ఆ ఊరు అన్నా విపరీతమైన అభిమానం ఏర్పడింది .మళ్ళీ ఎప్పుడైనా అక్కడే చేయాలని అనిపించేది .అంతమంచి వాతావరణం ఏర్పడి ,అనుబంధం శాశ్వతమయింది .అందుకే ఈబాద .రాను పోనూ ప్రయాణపు ఇబ్బంది తప్ప అక్కడనాకు యే ఇబ్బందీలేదు స్టాఫ్ సహకారం ,పిల్లల ప్రవర్తన కమిటీ వాళ్ళ చేయూత అన్నీ అందుకొని స్కూల్ రూపు రేఖలనే మార్చగాలిగాను .ఇంత గొప్ప అభి వృద్ధి చేయగాలుగుతానని నాకే తెలియదు అన్నీ కుదిరి అలా జరిగింది .ఇందులో నాకు సహకరించిన లెక్కల మేష్టారు శ్రీ పురుషోత్తమా చారి సెకండరీ మాస్టారు శ్రీ శేషగిరి రావు హాస్టల్ వార్డెన్ శ్రీ రాఘవుల చేయూత జీవితం లో మరువ లేనిది .నేను అక్కడి నుంచి బదిలీ అయి వచ్చినా, వీళ్ళు నాతో ,మా కుటుంబం తో అదే బాంధవ్యాన్ని కొనసాగించారు .లెక్కల మాస్టారి తల్లిగారు భార్య నా యెడల చూపిన ఆప్యాయత మరువలేను .పై మూర్తిత్రయం బెజవాడ వైపు వచ్చినప్పుడల్లా ఉయ్యూరు వచ్చి మా ఆతిధ్యం పొంది వెళ్ళేవారు వాళ్ళను చూస్తే మహదానందంగా ఉండేది .పూర్వం మానికొండలో రాజుగారు గరుడాచలం గారు ,రాఘవ రావు లు యెంత అభిమానంగా ఉండేవారో అదే ఇప్పుడు కనిపించింది .జననాంతర సౌహృదం అనిపిస్తుంది ఆలోచిస్తే .అలాగే మేము మైలవరం వైపు వెళ్ళినా వాళ్ళను కలిసి మాట్లాడకుండా ఉండే వాళ్ళం కాదు .మా మూడో వాడు మూర్తి చిలుకూరి వారి గూడెం దగ్గర రామ చంద్రాపురం లో ఆర్ ఏం పి డాక్టర్ గా ఉన్నప్పుడు ,మైలవరం దగ్గర గణపవరం లో ఉన్నప్పుడు కారు మీదమా అక్కయ్య బావలతో  మైలవరం లో రాఘవులుగారిని పుల్లూరులో ఆచార్యుల గారి ఫామిలీ ని అక్కడికొచ్చిన శేష గిరి రాగారినీ చూసి కిన్నెర సాని ,భద్రాచలం ,నెమలి ,జమలాపురం ఒక సారి వెళ్లాం మరో సారి మా అమ్మాయి మేము కలిసి వెళ్లి వీళ్ళందర్నీ చూశాం .అలా చాలాకాలం కొనసాగింది .

తర్వాత శేషగిరి రావు గారు నన్ను మళ్ళీ చిలుకూరి వారి గూడెం ట్రాన్స్ ఫర్ చేయించే ప్రయత్నం శాసనసభ్యులు శ్రీ కోమటి భాస్కర రావు గారిద్వారా చేస్తానని రిక్వెస్ట్ రాసి ఇమ్మని ,రెండు మూడు సార్లు నేను అడ్డాడలో ఉండగా వచ్చి అడిగారు .అది ఇక జరగని పని అని ఆయన్ను సమాధాన పరచి పంపేవాడిని .ఆయనకు హెడ్మాస్టర్ బండి రామారావు కు కెమిస్ట్రీ కుదరలేదని ఆయన మాటల్లో తేలింది స్కూల్ డబ్బు స్వాహా చేస్తున్నాడని కూడా చెప్పిన జ్ఞాపకం గుడివాడలో ఆయన బ్రహ్మాండమైన ఇల్లు కట్టి గృహప్రవేశానికి స్వయంగా ఆహ్వానిస్తే వెళ్లాను అక్కడ లెక్కలమేస్టారు వార్దేన్ గారు మళ్ళీ కలిశారు .తర్వాత శేషగిరి రావు గారికి హార్ట్ ఎటాక్ వచ్చిందని లేక్కలమేస్టార్ ఫోన్ చేస్తే బెజవాడ విజయ టాకీస్ ఎదురుగా ఉన్న హాస్పిటల్ లో ఇన్సెంటివ్ కేర్ లో ఉండగా చూసొచ్చాను .కాని ఆయన ఆతర్వాత రెండుమూడు రోజులకే చనిపోయారు .వాళ్ళబ్బాయి శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పాడు గుడివాడలో కార్యక్రమాలు చేశారు కాని నేను వెళ్ళలేక పోయాను వీరు భొట్ల శేషగిరిరావు గారి అన్నగారికి ఉయ్యూరు లో ఉన్న వేమూరు దుర్గ,సుబ్రహ్మణ్యం గార్ల అమ్మాయినిచ్చి ద్వితీయం చేశారు .ఆ సందర్భం గా రెండు వైపులవారూ నన్ను సంప్రదించి మంచి చెడ్డలుతెలుసుకొన్నారు ఈ విధంగా ఉయ్యూరు బంధం ఆయనకు ఏర్పడింది

లెక్కల మాస్టారు ఏం .పురుషోత్తమా చారి గారి తో స్నేహం అసలెన్నటికీ మరుపు రాదు ఆయన కుటుంబం తో నూ అంతే .ఇదెక్కడి బంధమో ఆశ్చర్యమేస్తుంది .ఆచారి గారి తల్లిగారి ఆరోగ్యం బాగా ఉండేదికాదు భార్య చాలా సన్నగా అనారోగ్యంగా నే ఉండేవారు .కాని ఆదరణకు స్నేహానికి వాళ్ళనే చెప్పుకోవాలి ఆడపిల్ల మగ పిల్లాడు చిన్నక్లాసులు చదువుతున్నారు .దాదాపు 8 ఏళ్ళక్రితం ఆచారి గారు చనిపోయారని వాళ్ళబ్బాయి ఫోన్ చేశాడు .వెళ్ళలేక పోయాను .తర్వాత వాళ్ళ అమ్మాయి వివాహం మైలవరం లో చేస్తున్నామని శుభలేఖ పంపి వాళ్ళబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు  .అదే ముహూర్తానికి బెజవాడలో మల్లాది వెంకటేశ్వర్లు కూతురు వివాహం .వివాహం చూసి అక్షంతలు వేసి దీనికి హాజరైన దంటు వారబ్బాయి ,వెంపటి శర్మగారబ్బాయిలను చాలా రోజుల తర్వాత చూశాం .అక్కడికి మమ్మల్నిద్దర్నీ చూడటానికి వచ్చినఆత్మీయులు కవి కధకులు  శ్రీ గంధం వేంకాస్వామి శర్మ గారిని చూశాం అప్పటికే 85 ఏళ్ళ వృద్దు ఆయన .’’ఎందుకండీ శ్రమ పడి వచ్చారు ?మేమే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళం కదా ‘’అన్నాను .ఆయన నవ్వి ‘’మీ ఇద్దర్నీ చూస్తే పార్వతీ పరమేశ్వరులని పిస్తుంది అందుకే దర్శనం కోసం వచ్చాను ‘’అన్న ప్రేమాభిమాన మూర్తి వారు .ఇదే వారిని చూసిన చివరి సారి .ఆ తర్వాత మేము అమెరికా వెళ్ళటం అక్కడ మేము ఉండగానే వెంకాస్వామి శర్మగారు చనిపోవటం జరిగింది

సత్యనారాయణ పురం లో మల్లాది  వెంకటేశ్వర్లు కూతురు పెళ్లి నుంచి సరాసరి బస్ స్టాండ్ కు వెళ్లి మైలవరం బస్ ఎక్కి ఫంక్షన్ హాల్ కు చేరేసరికి సుమారు మధ్యాహ్నం 2 అయింది వేలాది మంది వచ్చి భోజనాలు చేసి వెడుతున్నారు మేము లేక్కలమాస్టారి భార్యను పలకరించి పెళ్లి కూతురు కు కానుక అందజేసి ఆశీర్వ దించి వాళ్ళబ్బాయి అబ్బాయాచారి మా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చోట వివాహ భోజనం చేసి మళ్ళీ బస్ ఎక్కి బెజవాడ మీదుగా ఉయ్యూరు చేరాం ఇన్ని జ్ఞాపకాలు మాకు లేక్కలమేస్తారి కుటుంబం తో ఉన్నాయి పిల్లలిద్దరూ మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లోనే బి టేక్ చదివి బెంగుళూర్ లో ఉద్యోగాలలో ఉన్నారు మంచి అభివృద్ధి సాధించారు లెక్కల మేస్టారి మంచి మనసే ఈ అభివృద్ధికి కారణం వారి అమ్మగారి ఆశీస్సులు విశుద్ధ హృదయం తోడ్పాటుగా నిలిచాయి .

అంతకు ముందు మైలవరం గర్ల్స్ స్కూల్ హెడ్ మిస్త్రేస్ విజయ లక్ష్మి గారి పదవీ విరమణకు ఆహ్వానిస్తే నేనూ  వెళ్లాను అప్పుడు ఆచారిగారు కలిసి ఇంటికి తీసుకు వెళ్ళారు .

మేడూరు స్కూల్ విశేషాలు

ఉయ్యూరు లో 23-8-90 ఉదయం 7 గంటలకేఇంట్లో భోజనం చేసి సరాసరి బెజవాడ మేడూరు బస్ ఎక్కి ,తాడంకి కపిలేశ్వరపురం వీరంకిలాకు పమిడిముక్కల మీదుగా మేడూరు చేరాను .ఉదయం విధుల్లో చేరినట్లు సంతకం పెట్టాను .పెద్దస్కూల్ .సుమారు ౩౦౦ మంది పిల్లలు .అన్నీ రెండు సెక్షన్లు .స్టాఫ్ అందరూ కొత్త నా ముందు ఇక్కడ పనిచేసిన శ్రీ జి ఎస్ యెన్ చౌదరి కూడా బిఎడ్ లో నా ట్రెయినింగ్ మేట్ అవటం మరో తమాషా అతన్ని పునాది పాడు వేశారు .ఒక సారిస్కూల్ అంతా కలయ తిరిగా .మంచి బిల్డింగ్ లున్నాయి .పెద్ద ఆటస్థలం  మంచి లేబరేటరీ దానిలోనే పాఠాలు చెప్పటానికి వీలైన విశాలమైన హాలు ,పైన లైబ్రరీ కం కామన్ హాల్ ఉంది లైబ్రరీలో చాలా పుస్తకాలు మంచి పుస్తకాలు ఉన్నాయి లైబ్రేరియన్ శ్రీమతి  కోటమ్మ అనిజ్ఞాపకం ఇక్కడే ఉద్యోగం లో చేరి నాన్ స్టాప్  గా పని చేస్తోంది చాలా మంచి ఆవిడ అనిపించింది .పెద్దావిడే .స్కూల్ ముందు వెనకా ఆట స్థలం చుట్టూ కొబ్బరి చెట్లు బాగా ఉన్నాయి పెద్ద ఊటబావి దానికి ఎలక్ట్రిక్ మోటారు ఓవర్ హెడ్ వాటర్ టాంక్ అన్నీ ఉన్నాయి .కొబ్బరి  పోషణకు ప్రభుత్వం డబ్బు అందజేస్తుంది మూడు నేలలలకోసారి జమాఖర్చులు పంపాలి ఉయ్యూరయ్య అనే జూనియర్ గుమాస్తా స్కూల్ లెక్కా డొక్కా తోపాటు దీన్నీ చూస్తాడు .నమ్మకస్తుడు భయస్తుడు కమితీవారి తలలో నాలుక కూడా .కొంతా స్థలం లో వరిసాగు కూడా ఉంది గొప్ప  .సీనియర్ గుమాస్తా సుబ్రహ్మణ్యం గారని గుర్తు ఉయ్యూరులో మాధవరావు అనే ఆయన తోడల్లుడు .గంభీరంగా ఉంటాడు .సైన్స్ మేస్టర్ శ్రీసుబ్రహ్మణ్యం  నాతొ పెనమకూరులో చేశాడు .భార్య గ్రేడ్ టు తెలుగుపండిట్ .లెక్కల మాస్టారుశ్రీ ప్రసాద్ అని చాలా సమర్ధుడు ,మంచి టీచర్ .తలలో నాలుక .స్కూల్ ఇంచార్జ్ హెడ్ మాస్టర్ ఆయనే ఇంకో పోస్ట్ లో ఎవరో ఒకరు రావటం వెళ్ళటం జరిగేది .కనుక బాధ్యతఅంతా ప్రసాద్ గారిమీదే ఉండేది .సీనియర్ తెలుగు మేష్టారు శర్మగారు .దగ్గరలో ముళ్ళపూడి వారు స్కూల్ ఫంక్షన్ లన్నీ ఈయనే నిర్వహించేవారు .వాళ్ళబ్బాయి టెన్త్ లో ఉన్నాడు చురుకైనవాడు పబ్లిక్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు నాకు బాగా ఇష్టమైన శిష్యుడు చాకు అంటామే అలాంటి షార్ప్ నెస్ ఉన్నవాడు ఆయన కుటుంబం లో అందరూ తెలుగు పండితులే ఒక అన్న పెనమకూరు లో తెలుగు పండిట్ .ఇంకో ఆయన కపిలేశ్వరపురం లో అలా .సోషల్ మేష్టారు మస్తాన్ గారు .ఇక్కడి వాడే  హిందీటీచర్ లేడీ .ఉయ్యూరు లనుండి వస్తారు కోటలో అద్దెకుంటున్నారు భర్త తమిరిశ దగ్గర సోషల్ మేష్టారు ఇద్దరు ఆడపిల్లలు .పేరు తూటుపల్లి సావిత్రి అనిజ్ఞాపకం .సెకండరీ గ్రేడ్ లలో లంకపల్లి ఆయన నల్లగా పొట్టిగా ఉండేశ్రీరామ మూర్తిగారు .మా మామయ్యా వాళ్ళ పొలం కౌలుకు చేస్తానని ఒకటి రెండు సార్లు ఉయ్యూరులో నన్ను చూశానని గుర్తు చేసుకొన్నారు  .ఈయనే స్టాఫ్ సెక్రటరి .అందర్నీ ఒప్పించగలిగే ఓర్పూ నేర్పూ ఉన్నవారు .భీష్మ పితామహుడు ఒకాయన రెడ్డియ్యగారు ఉండేవారు .క్రాఫ్ట్ మాస్టర్ ప్రకాశ రావు గార్డెనింగ్ .’’దేవదాసు ‘’.అటెండర్ అర్జున రావు .రుద్రపాక వాడు ఇక్కడే సెటిల్ అయ్యాడు నైట్ వాచ్ మన్ ఆ ఊరివాడే కోటయ్య .సీనియర్ డ్రిల్ మాస్టారు శ్రీ సుబ్బారావు కపిళేశ్వరపురం వాడు రెండో డ్రిల్ మాస్టారు పమిడిముక్కలనుంది వచ్చేవారు మెతక మనిషి .నా దగ్గరే రిటైర్ అయ్యాడుసహృదయుడు  లాబ్ అసిస్టంట్ ప్రసాద్ –అతనికొడుకు 9 లో ఉన్నాడు స్కూల్ లో సంచాయిక ‘’అనే పిల్లల పొదుపు పధకం నేనెక్కడ పని చేసినా సమర్ధంగా నిర్వహించాను ఇక్కడ దాన్ని ప్రసాద్ చూస్తున్నాడు .వార్షికోత్సవం నాటికి ఎవరు ఎక్కువ పొడుపు చేస్తే వారికి బహుమతి ఇచ్చేవాళ్ళం .బాగా తెలివిగలవాడు సహృదయుడు .కొద్దికాలానికి గుమాస్తా సుబ్రహ్మణ్యం గారు బదిలీ అయి, లోయ శంకర రావు వచ్చాడు జగజ్జన్త్రీ మాటల గారడీ వాడు పని కూడా స్పీడ్ గా చేసేవాడు బాగా రాజకీయ పలుకుబడి ఉన్న వాడు .నాకు బాగా ఉపయోగ పడ్డాడు .అలాగే కొద్దిమంది బదిలీ అవటం కొత్తవాళ్ళు రావటం జరిగేది .

సాయంకాలం స్టాఫ్ సెక్రెటరి స్టాఫ్ సమావేశం ఏర్పాటు చేశారు తేనీటి విందు ఇచ్చారు .నన్ను నేను పరిచయం చేసుకొని అందరి పరిచయం చెప్పించి ,అందరం కలిసి స్కూల్ అభి వృద్ధికి పని చేద్దాం యిలా చేస్తా అలా చేస్తా అని నేను చెప్పను సంవత్సరం చివరికి మనం ఏం చేశామో తెలుసుకొందాం అని చెప్పాను ఒక పావుగంటలో స్టాఫ్ మీటింగ్ పూర్తీ చేశాను స్కూల్ జనరల్ డిసిప్లిన్ అంతా డ్రిల్ మాస్టర్ సుబ్బా రావు గారే చూసేవారు .రోజూ సమయానికి అసెంబ్లీ నిర్వహించటం ,లేట్ గా వచ్చిన వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వటం అన్నీ పకడ్బందీ గా చేసేవాడు .టీచర్ లలో బాడ్మింటన్  ఆడే వాళ్ళలో నేనూ తెలుగు మాస్టారు డ్రిల్ మాస్టారు , సైన్స్ ,లెక్కల మేస్టార్లు ఉన్నాం మేమందరం వాలీబాల్ కూడా ఆడేవాల్లమే కనుక స్కూల్ అయ్యాక ఒక గంట ఆడుకొని అప్పుడు బయల్దేరేవాళ్ళం

మళ్ళీ ప్రయాణం తిప్పలు

మేడూరు ఉయ్యూరుకు దగ్గరే .సుమారు 15 కిలోమీటర్లు కాని రోడ్డు బాగుండదు బస్ ఫ్రీక్వెంసి లేదు .ఏదో రకంగా వీరంకి లాకు చేరితే అక్కడినుండి వెళ్ళాలంటే ‘’టంగు’’ తెగేది .ఏదో తంటాలుపడి పమిడిముక్కల చేరితే అక్కడి నుండి స్కూల్ పిల్లల సైకిల్ మీద ఎక్కి వెళ్ళాలి లేక పోతే లెఫ్ట్ అండ్ రైట్ రెండుకిలోమీటర్లు   అలాగే సాయంకాలం 5 గంటలకే మేడూరు నుంచి విజయవాడ బస్ .అది మిస్ అయితే ఆరున్నరకో ఏడుకొ కాని మళ్ళీ బస్ లేదు .ఇంటికి చేరేసరికి ఎనిమిది దాటేది .ఒక రకంగా నాపని’’ పెనం మీంచి పొయ్యిలోకి ‘’అన్నట్లు అయిందేమో అనిపించింది .

సాయంకాలం బస్ కోసం స్కూల్ దగ్గరే ఉన్న యలమంచిలి వెంకటేశ్వరరావు గారు అనే రిటైర్డ్ సెకండరీ గ్రేడ్ మాస్టారి అరుగులపై ఆయనతో కబుర్లు చెప్పుకోవటం ఆయన శ్రీ పి శ్రీరామ మూర్తి గారి మనిషి .కబుర్లు బాగానే చెప్పేవారు ఎన్నో పాత విషయాలు తవ్వుకొని మాట్లాడుకొనేవాళ్ళం అలాగే ఆ ఊళ్లోనే రిటైర్ అయిన ఒక హిందీ మాస్టారు కూడా ఉన్నారు ఆయనా వెంకటేశ్వర రావే ఆయన ఇక్కడ ట్యూషన్ కింగ్ .

శ్రీ యలమంచిలి రామమోహన రావు గారు

మేడూరు అన్నా మేడూరు స్కూల్ అన్నా శ్రీ యలమంచిలి రామమోహన రావు గారే జ్ఞాపకం వస్తారు ఎవరికైనా మేడూరు లోనే కాదు చుట్టూ ప్రక్క వంద గ్రామాలలో అంతటి మంచి మనిషి .లేరు .మేడూరు గ్రామ సర్పంచ్ గా దాదాపు 25 ఏళ్ళు పనిచేశారు స్కూల్ బిల్డింగ్ కు స్థలం ఇచ్చి బిల్డింగ్ కట్టించారు .పంచాయితీ భవనం పసువులాస్పత్రి వంటివి అన్నీ వారి వితరణ వలన వచ్చినవే  ఆయన గొప్ప సంస్కారి .మాంచి కాంగ్రెస్ అభిమాని నిజాయితీకి నిర్భీకతకు ప్రసిద్ధి .ఎప్పుడూ తన చేయి పైనే ఉండాలని కోరుకొనేవారు దాన ధర్మాలకు లెక్కేలేదు .శ్రీ కాకాని వెంకటరత్నం గారికి నమ్మిన బంటు ,కాకాని వారు యే ఎలక్షన్ లో నిలబడినా ఖర్చు అంతా రామ మోహన రావు గారిదే దానితో ఎలక్షన్ అయ్యాక ఈ యన పొలం నాలుగో ఐదో ఎకరాలుఖాళీ .అంతమాత్రం చేత వెనకడుగు వేసేవారుకాడు మళ్ళీ ఎన్నికకు మళ్ళీ రెడీ సుక్షేత్రమైన మాగాణి పొలం కాకాని వారికోసం ఎన్నికలార్పణం అయ్యేది .సర్పంచ్ గా గ్రామాన్ని సర్వతోముఖా భి వృద్ధి చేశారు కాని రోడ్డు సౌకర్యం ఎర్పరచుకోలేక పోయారు తారు రోడ్డు గతుకుల రోడ్డే గతి .రావు గారికి రాజకీయ ప్రమోషన్ రావాలని ఆశించారు జనం దానికి ఆయన ససేమిరా అనేవారు నేను శాసన సభకు నిలబడతాను అంటే కాకానికి నిలబడే సాహసం ఉండేదికాదు అంత సాహసం ఈ వీర భక్త హనుమాన్ చేయలేదు ఏనాడూ .చివరికి ఉయ్యూరు మండలానికి ఉపాధ్యక్షులుగా అందరి బలవంతం మీద పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .ఆయన కనబడినా ఆయన పేరు చెప్పినా ‘’చేయెత్తి మహానుభావుడు ‘’అని నమస్కరిస్తారు జనం అదీ ఆయన కున్న కీర్త ప్రతిష్ట ‘అలాంటి రామ మోహన రాగారు నేను మేదూరులో చేరటానికి సుమారు రెండు నెలల ముందు చనిపోయారు .వాళ్ళబ్బాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రావు  మేడూరు సర్పంచ్ .ఆయన తమ్ముడు ఉయ్యూరు షుగర్ ఫాక్ట్రరీ లోను ,చుట్టూ ప్రక్కలా ప్రసిద్ధుడైన చెరుకు రైతు .పేరు గుర్తు లేదు .స్కూల్ కు సలహా దారు కూడా  ఇదీ నేను చేరిన మేడూరు అక్కడి స్కూలు నేపధ్యం మిగతా వివరాలు తరువాత తెలియ జేస్తా .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-16- ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.