కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు -2(చివరిభాగం )
విధవా పునర్వివాహ ఉద్యమ౦
1884 లో మద్రాస్ కు చెందిన బ్రహ్మ సమాజ ప్రచారకుడు బుచ్చయ్య పంతులు బళ్ళారి వచ్చి బ్రహ్మ సమాజ సిద్ధాంతం పై నా ,విధవా పునర్వివాహం పై నా వరుస ప్రసంగాలు చేశాడు .దీని ప్రభావం తో వెంకట రావు బళ్లారిలో మొదటి విధవా వివాహాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి విందు కూడా ఏర్పాటు చేశాడు .సాంప్రదాయ స్మార్తులు వెంకట రావు కు వ్యతిరేకమై ఆయనను ఆయన శూద్ర సేవకులను వెలివేసి చాలా ఇబ్బందుల పాలు చేశారు .దీన్ని ధిక్కరించి ఆయన తనకు తన వారికి స్నేహితులకు అందరూ చూస్తూ ఉండగానే మంచి నీరు ,విలువైన ద్రవ్యాలు తీసుకుని వెళ్ళేవాడు .విరూపాక్ష మతానికి చెందిన శ్రీ శంకరా చార్యులు వెంకట రావు కు బంధువులు అవటం వలన ఆయన తటస్థంగా ఉండిపోయారు .విధవ పునర్వివాహాలపై విస్తృతంగా శాస్త్ర చర్చ జరగాలని శంకరాచార్య అభిప్రాయ పడ్డారు .వెంకట రావు చొరవ ,ధైర్యాలకు ఆకర్షింపబడిన ఆయన కులస్తులు సంకోచం లేకుండా ఆయనతో సన్నిహితంగానే మెలిగి స్మార్తుల ఆంక్షలను తూ నా బొడ్డుఅన్నారు .దీని తర్వాత మళ్ళీ రెండు విధవా పునర్వివాహాలను వెంకట రావు నిర్వహించాడు .అందులో ఒకదాన్ని తన స్వంత ఇంట్లోను ,రెండవది తన స్నేహితుడైన సభాపతి మొదలియార్ ఇంట్లో చేశాడు .పరిస్థితి అర్ధం చేసుకొన్న అతని బంధుగణం ఆయన ఇంట్లో జరిగిన ఏ శుభ ,అశుభ కార్యాలకూ ఆటంకం కలిగించకుండా ప్రవర్తించారు .
సముద్రం పై విదేశీ యానం
1887 లోమద్రాస్ లో జరిగిన సోషల్ కాన్ఫ రెన్స్ కు హాజరై ,సముద్రాంతర ప్రయాణం పై ఆనాడున్న ఆంక్షల విషయం పరిష్కరించాలనుకొన్నాడు .’’కాలాపానీ ‘’ని రెండు సార్లు దాటి శ్రీలంకకు ,రెండు సార్లు బర్మాకు ఓడపై ప్రయాణించి వెళ్ళాడు .ప్రతిసారీ సముద్రం పై నాలుగు నుంచి ఆరు రోజులు ప్రయాణం చేశాడు .వెంకట రావు దృఢ సంకల్పానికి ఆయన బంధువులు మిత్రులు అందరూ అబ్బురపడి ఎవరూ అభ్యంతరం తెలుప లేదు. ఈ విధం గా జన హృదయాలను గెలుచుకొన్నాడు .ఆయన శీలం మీద మచ్చ పడకుండా ప్రవర్తించారు అందరూ .దీనిపై మరింత అవగాహన కలిగించాలని ఆయన 1902మేలో ఇంగ్లాండ్ దేశానికి వెంట వంటవాడు కాని పనివాడుకాని లేకుండానే ఒక్కడే వెళ్ళాడు .ఆరునెలలుండిఇంగ్లాండ్ లోని గ్రామీణ ప్రాంతాలను పట్నాలను కలియ తిరిగి ,తర్వాత స్కాట్లాండ్ ,ఐర్లాండ్ తో పాటు ఐరోపాలోని చాలా దేశాలు పర్యటించాడు .స్కాండినేవియన్ పెనిన్సుల ,రష్యా ,టర్కీ లు తప్ప అన్నీ చూశాడు .ఆ యా దేశాలలో తాను చూసిన వాటి గురించి బంధు మిత్రులకు వెంట వెంటనే వివరంగా ఉత్తరాలు రాసేవాడు .వాటిని ముద్రించి ఉంటే అమూల్యమైన యాత్రా , లేఖా సాహిత్యం మనకు లభించి ఉండేది .9-8-1902 న లండన్ లో జరిగిన ఏడవ ఎడ్వర్డ్ రాజు పట్టాభిషేకానికి హాజరై నాడు .
అపూర్వ స్వాగతం
సీమ దేశ పర్యటన దిగ్విజయం గా ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చిన వెంకట రావు కు గుంతకల్ రైల్వే స్టేషన్ లో బ్రాహ్మణ ,అబ్రాహ్మణ ,వైదిక ,గృహస్త జనాలందరూ అపూర్వ స్వాగతమిచ్చి బళ్ళారి దాకా ఊరేగింపుగా తోడ్కొని వచ్చి ఇంటి వద్ద కు చేర్చారు .బళ్లారిలో అంతటి సంరంభం అంతకు ముందెన్నడూ ఎవరూ చూడలేదు .ఎవరికీ జరుగ లేదు కూడా .వెంకట రావు ఎక్కిన బండీని .ప్రజలు భక్తిగా తామే లాగుతూ పురవీధుల్లో ఊరేగింపు చేశారు .తర్వాత అన్ని కులాలవారు వెంకట రావు ను విందు భోజనాలకు ఆహ్వానించి అపూర్వా సఖ్యతను చాటారు .ప్రెసిడెన్సి కి అవతల ఉన్న ఆయన కులస్తులు కూడా అరమరికలు మరచి ఆయనను ఆహ్వానించి ఆయనతో కలిసి మెలిసి నడిచారు .
అపూర్వ వ్యక్తిత్వం
అజేయమైన నడవడి .మచ్చ లేని శీల సంపత్తి ,ప్రగతి పై అకు0ఠిత విశ్వాసం ,ధ్యేయ సాధనకు మనో నిబ్బరం ఆత్మ స్థైర్యం ,సాహసం అందరిని ఒప్పించే నేర్పు ఉన్నవాడు కనుకనే వెంకట రావు అన్నిటా విజయం సాధించాడు అని గ్రహించాలి .ఆయన ప్రవర్తనలో అణుమాత్రం కూడా దోషం ఎవరూ గుర్తించలేదు. అంతటి విశుద్ధ మనస్కుడు వెంకట రావు .ఆ రోజుల్లో అందరూ తాగే సోడా నీరుకాని ,మత్తు పానీయాలు కాని రుచి చూడని అపూర్వ వ్యక్తి వెంకట రావు .1889 లో భార్య మరణించింది .అప్పటి నుండి భారత దేశం లో విధవలు పాటించే అత్యంత పరిశుద్ధ జీవితాన్ని వెంకట రావు గడిపాడు .భార్య చనిపోతే ఏ విధురుడూ అంతటి కఠోర నియమాలతో జీవించటం మనం ఎవరూ చూడనది .సాంఘిక నియమాలను ఉల్లంఘించిన వారిని వెంకట రావు చాలా సున్నితంగా మందలించి తప్పు తెలుసుకోనేట్లు చేసేవాడు ఆయన నడవడి ఆచరణ ఆలోచన అంతా విశ్వ జనీనమైనదిగా అంటే కాస్మోపాలిటన్ గా ఉండేది .ఆయనకు కులమతాల పట్టింపు ,పక్షపాతాలు లేనేలేవు.హిందూ ,మహమ్మదీయ ,క్రైస్తవులను సోదరులుగా ఆత్మీయులుగా భావించి ,వారికి ఏ కష్టం ,నష్టం వచ్చినా మనస్పూర్తిగా వారిపక్షాన నిలబడి సాయం ,న్యాయం చేసేవాడు .వారి సాంఘిక రాజకీయ ఉన్నతికి పాటు పడేవాడు .అందరితో కలిసి సంచరిస్తూ దురభ్యాసాలనుంచి వారిని దూరం చేస్తూ పరిశుభ్రత పారిశుధ్యాలపై అవగాహన కలిగింఛి ఆచరణ సాధ్యం చేసేవాడు .
ఆ రోజుల్లో బళ్ళారి లోని బ్రాహ్మణకుటుంబాలలో ఎవరైనా మరణిస్తే ,వారి శవాలను ఇళ్ళనుండి చాలా దూరం లో ఉన్న శ్మశానానికి తీసుకొని వెళ్ళటానికి శవ వాహకులు లభించేవారు కాదు .ముఖ్యంగా బీద బ్రాహ్మణులు శవవాహక బ్రాహ్మణులు కోరే అధిక ధనాన్ని చెల్లించలేని పరిస్థితి ఉండేది .ఈ అనివార్య పరిస్థితులలో వెంకట రావు వారికి అండగా ఉండి ధన రూపం లోనూ ,శవ వాహన విషయ౦ లోనూ సహాయ కారిగా నిలిచేవాడు .
మునిసిపల్ చైర్మన్ వెంకట రావు
వెంకట రావు సేవా దృక్పధాన్ని ,చొరవను ,సంస్కరణాభిలాషను గుర్తించిన బళ్ళారి ప్రజలు 1902 లో ఆయనను మునిసిపల్ చైర్మన్ గా ఎన్నుకొని అపూర్వ గౌరవం చూపించారు .దురదృష్ట వశాత్తు అదే సమయం లో బళ్ళారి ని ప్లేగు మహమ్మారి చుట్టు ముట్టి భీభత్సం సృష్టించింది .మొక్కవోని ధైర్యం తో చైర్మన్ వెంకట రావు మూడు నెలలు అహోరాత్రాలు శ్రమించి వేలాది రూపాయల తన ధనాన్ని ,శారీరక శ్రమను ఖర్చు చేసి దీనజన బా౦ధ వుడిలా ఆదుకొని ప్రభుత్వ సాయం తో ప్లేగు వ్యాధిని అరికట్టగలిగాడు .
వితరణ శీలి వెంకట రావు
అతి పేదవాడుగా జీవితం ప్రారంభించి నెలకు కేవలం 40 నుండి 70రూపాయల జీతం తోనే ప్లీడర్ అయ్యేదాకా గడిపాడు .న్యాయవాదిగా పుష్కరం పాటు పనిచేసినా మొదత్లొఆయన సంపాదన బొటా బొటీ గా ఉండేది .ఇలా చాలీచాలని జీతంతో గడుపుతున్నా దాన ధర్మాలు మానలేదు .1896 నుంచి తన సంపాదనలో ఆరవ వంతు ,కొన్ని సార్లు నాలుగవ వంతు దాన ధర్మాలకు వినియోగించిన త్యాగ శీలి ,ఆదర్శ మూర్తి వెంకట రావు .తన తర౦ భౌతిక, ఆధ్యాత్మిక, సాంఘిక ఔన్నత్యం సాధించాలని తపన పడేవాడు .బళ్ళారి బాలుర క్రికెట్ ఆటస్థలం కోసం ప్రభుత్వం 3 వేల రూపాయలు ఖర్చు చేస్తే ,దానికి రక్షణ కంచే కోసం ,నిర్వహణ కోసం వెంకట రావు ఒక వెయ్యి రూపాయలు స్వంత ధనాన్ని వెచ్చించాడు .ఇప్పుడు అది జింఖానా గ్రౌండ్ అయింది .ప్రముఖ సంఘ సంస్కర్త ,విధవా వివాహాల చాంపియన్ రావు బహదూర్ వీరేశ లింగం పంతులు గారుచేబట్టిన ‘’విధవా గృహం ‘’నిర్మాణానికి వెంకట రావు 3 వేల రూపాయలు విరాళం గా అందజేసి ,మరుసటి ఏడాది మరొక 2 వేల రూపాయలను అంది౦చిన వదాన్యుడు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయానికి భూరి విరాళ మందించిన వితరణ శీలి .లండన్ లోని జాతీయ కాంగ్రెస్ కు చెందిన బ్రిటిష్ కమిటీ డబ్బు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఖర్చులకు ఏటా 500 రూపాయలను 3 ఏళ్ళు అందజేశాడు .బళ్లారిలో బాలికా ఉన్నత పాత శాల నిర్మాణం కోసం 7 వేల అయిదు వందలు ఇచ్చాడు .బళ్ళారిర లోని హిందూ ముస్లిం క్రైస్తవ సేవా సంస్థలకు ప్రతినెలా విరాళాలు అందించేవాడు .బళ్లారిలో సభలు సమావేశాల కోసం టౌన్ హాల్ ను అర లక్ష రూపాయలతో నిర్మించి ,మరో యాభై వేల రూపాయలతో దానికి అనుబంధంగా ఒక గ్రంధాలయాన్ని 10 వేల విలువైన పుస్తకాలతో ఏర్పాటు చేశాడు .తన మాతృ మూర్తి పేర క్షయ రోగులకోసం ఒక విద్యాలయాన్ని కట్టించాడు .తన తమ్ముడు ప్రముఖ నటుడు నాటక రచయిత కోలాచలం శ్రీనివాసరావు రచించి ,ప్రదర్శించటానికి ,వీలుగా ఒక నాటక శాలను 10వేల రూపాయలతో నిర్మించాడు .అనాధ బాలలకోసం అనాధాశ్రమ నిర్మాణానికి 20 వేల రూపాయలు ఖర్చు చేసిన మహానుభావుడు
శాసన మండలి సభ్యుడు వెంకట రావు
నార్దర్న్ గ్రూప్ ఆఫ్ మునిసిపాలిటీస్ వెంకట రావు ను 1903నవంబర్ లో మద్రాస్ శాసన మండలికి సభ్యునిగా ఎన్నిక చేసింది .అన్ని ప్రాంతాల ప్రజలు తర తమ భేదాలు పాటించకుండా వెంకట రావు నుఆహ్వానించి సన్మానించి ఆయన ప్రసంగాలతో తన్మయులయ్యారు .సాంఘిక సంస్కరణ ల అమలులో ఆచరణాత్మకంగా కృషి చేసిన వెంకట రావు ను మించిన వారెవ్వరూ లేరు .1903లో గ్రూప్ వారి వార్షిక సాంఘిక సభలకు వారి అభ్యర్ధనపై అధ్యక్ష స్థానం అలంకరించి సమర్ధం గా నిర్వహించాడు ‘ ప్రపంచ పర్యాటకుడు వెంకట రావు 1904 ఫిబ్రవరి లో కుమారుడు రామ చందర్ తోకలిసి ప్రపంచ యాత్ర దిగ్విజయంగా పూర్తీ చేసి అక్టోబర్ 30కి తిరిగి వచ్చాడు .కుమారుడు బార్ కోసం చదివి బారిస్టర్ అయి బళ్లారిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు .
బిజినెస్ మాగ్నెట్
వెంకట రావు కు సభాపతి ప్రెస్ , నాలుగు జిన్నింగ్ మరియు హైడ్రాలిక్ ప్రెస్సింగ్ ఫాక్టరీలు ఉండేవి .రిప్పన్ ప్రెస్ అండ్ షుగర్ మిల్ లో అరలక్ష పెయిడ్ అప్ కాపిటల్ ఉంది .డెక్కన్ ప్రెస్సింగ్ అండ్ జిన్నింగ్ కాయస్ కు సెక్రటరిలలో ఒకడు గా ఉండేవాడు .వజ్ర కరూర్ డైమ౦డ్ప్ ప్రాస్పెక్టింగ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ .దీనిలో ఇంగ్లీష్ రష్యన్ ,ఆఫ్రికన్ భాగ స్వాములు ఉండేవారు .ఆయనకుఆయిల్ ఇంజన్ తో నడిచే ఒక ప్రత్యేక ఎక్స్ పెరిమెంటల్ ఫారం ఆధునిక హంగులతో ఉండేది .స్పిన్నింగ్, వీవింగ్ ,షుగర్ ఫాక్టరీలలో షేర్లు చాలా ఉండేవి .ఇవికాక భూవసతి ,పొలాలు ,భవనాలు లెక్కలేనన్ని ఉన్న బడా బిజినెస్ మాగ్నెట్ వెంకట రావు .సేవా భావం లోనూ సాటి లేనివాడు కోటీశ్వరుడైన కోటి కొక్కఁడైన వాడు శ్రీ కోలాచలం వెంకట రావు . .
ఆధారం –కోలాచలం వంశానికి చెందినవారు ,వెంకట రావుగారి తమ్ముడు బళ్ళారి నివాసి అయిన లాయర్ శ్రీకోలాచలం అనంత ప్రకాష్ గారు నాకు 8-7-16 న పంపిన ఆంగ్ల రచన ‘’Life of Mr .K.Vencata Rao .
మనవి -కానీ వెంకట రావు గారు ఎక్కడ ,ఎప్పుడు చనిపోయినదీ పై ఆంగ్ల వ్యాసం లో లేదు .నెట్ లో వెతికినా దొరకలేదు .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -9-9-16 -ఉయ్యూరు