సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -2
‘’సత్యనారాయణ గారిలో రసాను భూతి కి బాధ కలిగించే ప్రయోగాలు లేవు .అతని భాష ‘’లేత బుర్రలకు ‘’పనికి వచ్చేది కాదు .జటిలమైనది .వసంతకాలమున తిన్నగా కదలి వచ్చు పువ్వులవాన వంటిది కాదు .కీకారణ్యం లో యధేచ్చగా తిరిగే మదగజాల గుంపు .ఈ రెంటిలోనూ సౌందర్యం ఉంది.విశ్వనాధ శైలిలో సంగీతం లేదనటం కంటే ,అది తార శ్రుతిలో పలికింది అనటం యదార్ధం .ఈ మహా కవికి ధ్వని దృష్టి చాలా తక్కువ .దాన్ని చిత్రించాలంటే నెమ్మది, నిలకడ కావాలి .ఆవేశ పరుడై పరిగెత్తే ఆయనకు నిలకడ ఎక్కడ ఉంటుంది ?ఈ తెగ వారంతా రసవాదులే .అతని కావ్యాలలో రెండు ,మూడు చోట్ల నాకు ధ్వని కనిపించింది .’’అయ్యా !భక్తుల పైని నీ కరుణ ,దివ్యా౦భ స్తరంగాలలో –ముయ్యేరై ప్రవహి౦చు గాని యెడ ‘’ఇక్కడ అత్యంత సూక్ష్మంగా త్రిమూర్త్యాత్మక స్వరూప ధ్వని కనిపిస్తుంది .’’పతి వంక చూచుచూ –పడతి కిన్నెర సాని -పోయేటి వేళలో భూమి తనంతగా –తోరమై విరియుచూ త్రోవ చేసిందీ ‘’ గీతం లో సీతా నిర్యాణ రూప మైన రామాయణ వృత్తాంతం వ్యంగ్యం గా ధ్వని0చింది .’’పరు గెత్తెడు నీ వేణి –బంధము బూనితి చేతను ‘’లో శాస్త్రీయ ధ్వని ఉన్నా ,శ్లేష అనిపిస్తుంది .విశ్వనాధ ముఖ్యంగా వాచ్య కవి .భావ తీక్ష్ణత పై ఉన్న దాహం శిల్పం మీద లేదు .
‘’ ఆయనకు నియతమైన శైలి ఉందా అని అనుమానం వస్తుంది .ఆయన ఉపాస్య దైవం నన్నయకే లేదు .ఇతనికి ఎక్కడి నుంచి వస్తుంది ?దీనికి రసావేశమే కారణం .మహా స్వతంత్రుడు .ఏ పోకడలనైనా పోతాడు .భాషా రంగం లో అతడు సవ్య సాచి .భావాలలో భగీరధుడు .గద్య ,పద్యాలలో ఆయన శైలి విశ్వ రూపం దాలుస్తుంది .నిలిచి స్వతంత్రంగా చెబితే మాత్రం నన్నయ భట్టారకుడే ప్రత్యక్ష మౌతాడు .లయ ,తూకం ఉన్న కవిత్వం రాస్తాడు .శ్రీనాధుని సమాసాలలో లాగా ఆర్భాటం ఉండదు .సంస్కృత సమాసాలలో మంద గతి కనిపిస్తుంది .ఆయన సమాసాలు ఒక్కో సారి పద్యం లో నాలుగు పాదాల వరకు విస్తరిస్తాయి .రెండు పాదాలైనా ఆక్రమించని సమాసం ఉండదు .అతడు వాడే అలంకారాలన్నీ కొత్తవే .నూత్నత లేకుండా అసలు రాయనే రాయడు .తీక్షణం గా ఆలోచించే మెదడు ,భావించే హృదయం ,తోచింది చెప్పగలిగే వైదుష్యం ఆతని సొత్తు .చాలని దానికి సృస్టించుకొనే సాహసమున్నవాడు .విశ్వేశ్వరుని ‘’గళ రుద్రాక్షీ భవద్బాడబా ‘’అని సంబోధించే సాహసం ఉన్నవాడు .’’కనులకు కైవసం ‘’అనే కొత్తభావం చూపిస్తాడు .ప్రౌఢోక్తి అతని సొమ్ము..కేదారాలను విజయ లక్ష్మీ కేశ బంధం అంటాడు పరమ రామణీయకంగా.ఆయనకు చంద్రుడు ‘’వడ గట్టిన ఎండుగంధపు బెరడు ‘’గా కన్పించాడు .సముద్రుడు ‘’చీకటిలో మరణ వేద తో మూల్గుతున్న దున్న ‘’గా కనిపించాడు ‘’దేవ దాసి పలు వరుసలు సుదర్శనాయుధపు అంచులు ‘’గా గోచరించాయి .
‘’ పారే కిన్నెర సాని-‘’పడువు గట్టిన లేళ్ళకడుపులా తోచింది –కదలు తెల్లని పూల నది వోలె కదలింది –వడలు తెల్లని త్రాచు పడగలా విరిసింది ‘’ఇవన్నీ తెలుగులో కొత్త పదబందాలే . స్వతంత్రమతనికి ఒక క్రీడ..మనకు కొత్తగా అలవాటు పడని భావ నూత్నత,ఆ భావాలను లగింప చేయటానికి కోడె త్రాచు లాగా చుట్టలు చుట్టలు గా చుట్టుకొన్న భాష .ఈ రెండూ మనల్ని దూరానికి నెట్టేసి, మనల్ని నిట్టూర్పులతో వెనక్కి పంపిస్తాడు .మహా రసావేశి కనుక పదాలు ,భావాలు అవశాలై దొర్లుతాయి .వెనకా ముందూ చూసే నిలకడ ఉండదు .నరాలకు అంటిన వైదుష్యం ,జన్మానకు అంటిన ప్రతిభ ,బ్రతుక్కి అంటిన స్వాతంత్రం ఉన్న ఈ కవికి తలచుటకు ముందే తమంత తామే పై బడి దూకుతాయి .’’నాకు మల్లె నీవు నది వోలె పారరా –జలముగా ఇద్దరము కలసి పోదామురా –కెరటాలు కెరటాలు కౌగిలిత్తామురా’’అని వాపోయినప్పుడు ఆ ముగ్ధతకు మనమే కాదు రస స్వరూపమే పులకరిస్తుంది .’’తన్మయీ భవనం ‘’విశ్వనాధకు వెన్నతో పెట్టిన విద్య .గాఢం గా భావించి ,తీవ్రంగా మననం చేసి ,పూర్తిగా తనను తానే మరిచి పోతాడు .’’నీ నిస్టాగతి నీవు గాక మరి లేనే లేను విశ్వేశ్వరా ‘’అంటాడు ఇది తన్మయీ భావానికి పరాకాష్ట ..ఏ వస్తువును భావించినా ‘’శిల వోలె కదల లేక హృదయ స్నిగ్నార్ద్రసద్భావనాఖిల చైతన్యుడై పోతాడు ‘’.
‘’తెలుగుదనం అంటే మహా గర్వం .ఎన్ని జన్మలైనా తెలుగు నేల మీదే పుట్టాలని కోరుకొంటాడు .పూర్వ ఆంద్ర రాజుల వైభవం చూసి అతని రక్తం ఉడు కెత్తుతుంది .అక్కడి తెలుగు మట్టి గడ్డలలో ‘’నవ మృగీ మద వాసనలు ‘’ఆఘ్రాణిస్తాడు .ఇంత అభిమానం ఉన్నా అతనికి ‘’తెలుగుతనం అంటలేదు ‘’.చిక్కని జాతీయాలు ,పూల గుత్తుల్లాంటి ఆచ్చికాలు, విశ్వ నాద శైలిలో కనిపించవు .అతని శైలి సంస్కృత సమాస బరువుకు భుగ్నమైంది .అలాంటి శైలే ఆయనకు కావాలి .లేకపోతే గంభీర భావాలు సుకుమారమైన భాష లో ఇమడక హిందీ రచయిత ‘’ద్విజేంద్రు’’ని సాంఘిక నాటకాల కు పట్టిన గతే పట్టేది .ఇతనిలో హాస్యమూ తక్కువే .బ్రతుకు లో లేని హాస్యం రచనలో ఎక్కడినుంచి వస్తుంది ?నిష్టుర ప్రపంచాన్ని ఆశ్రయించి బతకాల్సి వచ్చిందే అని తోచక నవ్వే’’వెకిలి నవ్వు ‘’ఆయనది .భవ భూతి నవ్వూ ‘’సేం’’ ఇలాంటిదే..అంటే ఏడవ లేని నవ్వు అన్నమాట .
ఎంత ఖచ్చితం గా బంగారాన్నితూచి విలువ కడతారో అంతఖచ్చితంగా విశ్వనాధ సాహిత్యాన్ని తూకం వేసి నిగ్గు తేలుస్తున్నారు సరస్వతీ పుత్రులు శ్రీ పుట్టపర్తి నారాయణా చార్య .అందుకే నాకీ వ్యాసం బాగా నచ్చింది అన్నాను .మిగిలిన విశేషాలు మరో సారి .,
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-16- ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్