లాభాపేక్ష లేని స్వచ్చంద సేవా సంస్థ -గౌతమి కంటి ఆస్పత్రి –రాజమండ్రి
రాజమండ్రి లోని గౌతమి కంటి ఆస్పత్రి లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఉచిత నేత్ర వైద్యం చేస్తున్న గొప్ప సంస్థ .ఉభయ గోదావరి జిల్లాలు ఖమ్మం కృష్ణా జిల్లాలో వారు ఐ కాంప్ లు నిర్వహిస్తూ ,రాజమండ్రి నుండి సకల వైద్య పరికరాలతో వచ్చి ఉచితం గా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలిచ్చి ,మరీ అవసరమైతే వారి కున్న ఏ సి వాన్ లో రాజమండ్రి తీసుకు వెళ్లి అక్కడి గౌతమి హాస్పిటల్ లో చేర్చి ఉండటానికి ఏ సి రూమ్ ఇచ్చిఉచితం గా అపరేషన్ చేసి అవసరమైన మందులు ఇచ్చి మర్నాడు వారి ఏ సి కారు లోనే ఇంటికి అంటే స్వగ్రామానికి చేరుస్తున్నారు .ఒక వారం తర్వాత వారే కారు లో ఇంటికి వచ్చి ఫాలో అప్ యాక్షన్ చేసి నేత్ర రోగులపాలిటి అశ్వినీ దేవతలుగా సేవ లందిస్తున్నారు .ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డ్ కాని ఆధార కార్డ్ కాని ,ఉంటె చాలు రోగులు ఎలాంటి ఫీజులు ఆపరేషన్ ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా నిర్వహిస్తూ ,అందరి అభిమానం పొందుతున్నారు .ముఖ్యంగా రిటైర్ అయిన వారికి గొప్ప ఊరట కల్పిస్తున్నారు .
సుమారు వారం క్రితం నా తోటి ప్రధానోపాధ్యాయుడు ,హిడ్ మాస్టర్ అసోసియేషన్ సెక్రటరి ,మాతో పాటే రిటైర్ అయిన పెదముత్తేవి ఓరిఎంటల్ హై స్కూల్ మాజీ హెడ్ మాస్టర్ శ్రీ కోసూరు ఆదినారాయణ రావు నాకు ఫోన్ చేసి కృష్ణా జిల్లా మొవ్వ ,కూచిపూడి మండలాల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యం లో రాజమండ్రి గౌతమీ నేత్రాలయ వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించామని వారి సేవలు చిరస్మరణీయమని మా ఇద్దరికీ తెలిసిన ఎందరో చికిత్స చేయించు కొన్నారని ,11 వ తేది న మొవ్వ హై స్కూల్ లోపెన్షనర్స్ సర్వ సభ్య సమావేశం జరుగుతోందని అందులో గౌతమి నేత్రాలయ సీనియర్ డాక్టర్ ఎం డి శ్రీ రాజు గారిని ఆహ్వానించి సత్కరిస్తున్నామని ,నన్ను కూడా ఆత్మీయ అతిధిగా రావలసిందిగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు ఆ రోజు నాకు వేరే పని ఉండటం వలన రాలేక పోతున్నానని తెలియ జేశాను .సరే అన్నారు .తర్వాత రెండు రోజులకు ఫోన్ చేసి 18 వ తేది కూచిపూడి లో గౌతమి వారి ఐ కాంప్ నిర్వహిస్తున్నామని తప్పక రావలసిందిగా కోరారు సరే అన్నాను .
ఇవాళ కూచిపూడి సిద్ధేంద్ర కళా క్షేత్రం లో జరిగిన ఐ కాంప్ కు నేను వెళ్లాను .ఇద్దరు యువ డాక్టర్లు చాలా శ్రద్ధగా అందరినీ చాలా ఓపికగా అన్ని పరీక్షలు చేసి సలహాలు ఇస్తున్నారు .నాతొ పాటు రిటైర్డ్ హెడ్ మాస్టర్లు శ్రీ యెన్ అంజయ్య ,శ్రీ రామస్వామి శ్రీ ఆంజనేయులు మొదలైన వారూ వచ్చారు పరీక్ష కోసం .శ్రీ జి .ఉమామహేశ్వర రావు గారు ఇప్పుడు పెన్షనర్స్ అసోసియేషన్ కు కొత్త అధ్యక్షుని హోదాలో కనిపించారు .నేనూ పరీక్షలు చేయించుకొన్నాను .నాకు సుమారు 8 ఏళ్ళక్రితం ఎడమ కంటి రెటీనాకు లేజర్ ఆపరేషన్ చేయిన్చుకోన్నానని ఆ రిపోర్ట్ చూపి ,జూన్ లో ఉయ్యూరు రోటరీ కంటి ఆస్పత్రిలో చెక్ చేయించుకొని కొత్త జోడు వాడుతున్నానై చెప్పాను అన్నీ ఓపికగా విని కంటిలో రెండు సార్లు డ్రాప్స్ వేసి మళ్ళీ పరీక్ష చేసి అంతా బాగానే ఉందని కుడి కంటికి కొద్దిగా శుక్లం ఉందని ఇపుడిప్పుడేమీ కంగారు పడాల్సింది లేదని అంటే ఒక ఏడాది ఆగచ్చా అని నేను అడిగితే ఆరునెలల తర్వాత మళ్ళీ పరీక్ష చేసి చూపు తగ్గితే అప్పుడు చూద్దాం ప్రస్తుతం మండులుకాని ఐ డ్రాప్స్ కాని అక్కర లేదు అని చెప్పారు .ఈ యువ డాక్టర్ గారి సరసభారతి ప్రచురణ గ్రంధాలు 9 ,శ్రీ ఉమా మహేశ్వర రావు తోడుగా అందజేశాను ఆయన వాటిని ‘’మీ పెద్దాయనకు ఇవ్వండి ‘’అని చెప్పారు సరే అన్నారు కుర్ర డాక్టర్ .ఉమా గారికీ మన పుస్తకాలు ఇచ్చాను .దాదాపు 100మంది దాకా ఇవాళ పరీక్ష చేయించుకొన్న వారున్నారు .అందరు చాలా సంతృప్తిగా ఉన్నట్లు అర్ధమైంది .ఇలాంటి కాంప్ లు నిర్వహిస్తున్న శ్రీ ఆదినారాయణ అండ్ కొ వారికి ,గౌతమి నేత్రాలయ వారికి వారు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు .రాష్ట్రం లో అంధత్వం ఉండరాదు అన్న రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం తో చేతులు కలిపి గౌతమి సేవ చేస్తోంది .వారిని అడిగి వారి బ్రోచర్ తీసుకొన్నాను .అందులోని ముఖ్య విషయాలు మీకు తెలియ జేస్తున్నాను .
ఉద్యోగుల ఆరోగ్య పధకాలను హెల్త్ కార్డ్ ద్వారారుసుము లేకుండా సేవలు అందించటం .ప్రాధమిక పరీక్షలు ,నిర్ధారిత పరీక్షలు అవసర శాస్త్ర చికిత్సలు ఉచితంగా పొందవచ్చు .ప్రభుత్వంనిర్దేశించిన ప్రమాణాలతో సేవలు అందించటం సమాజం లో విజ్ఞులైన వర్గాలకు కంటి సేవలు అందించటం వీరి ముఖ్య ధ్యేయం.ఉద్యోగ సంఘాలున్న చోట కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తారు .ఉన్న కళ్ళ జోడు నుపరీక్షించి మార్పులు ఉంటె సూచించటం మధు మేహ వ్యాధి ఉన్నవారికి రెటీనా ఫోటో తీసి గ్లకోమా ,రేటినో పతి నిర్ధారణ చేస్తారు .న్యాయమైన ధరలకు కళ్ళజోళ్ళు అందజేస్తారు .శస్త్ర చికిత్సలు చేయించుకొనే వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు .వీరికి రాజమండ్రి గౌతమి హాస్పిటల్ లో ఉచిత భోజన వసతి సదుపాయం కల్పిస్తారు శస్త్ర చికిత్స చేయి౦చు కోనేవారికి అవసరమైన రక్త పరీక్షలు ,కంటి పరీక్షలు ఉచితం గా చేస్తారు.అమెరికా పద్ధతిలో శుక్ల శస్త్రచికిత్సలు చేస్తారు .శస్త్ర చికిత్సానంతరం కూడా వైద్య సేవలు అందజేస్తారు .గౌతమి నేత్రాలయం లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ . సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నదాన్ని ఆచరణ లో చూపిస్తూ సేవ చేస్తున్న ఉన్నత ఆదర్శాలతో నడుస్తున్న సంస్థ . అవసరమైన వారందరూ వీరి సేవలను వినియోగించుకొని కంటి స్వస్థత పొందాలని కోరుతున్నాను .
కళా క్షేత్రానికి వెడుతున్న దారిలోమెయిన్ రోడ్డుకు దగ్గరలో ఎడమవైపు సిలికానాంధ్రా వారుఅన్ని వైద్య సేవలు అందించే చాలా పెద్ద .సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ కడుతున్నారు .భూమిని సుమారు నాలుగు గజాల లోతు కు తవ్వి ఉంచారు .పనులు ప్రారంభించాలి ఇది శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారి ఆధ్వర్యం లో సర్వాంగ సుందరంగా అన్ని ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న విద్యాలయం .కూచిపూడి కి వరం అందరికీ గొప్ప సదుపాయం .
గౌతమి నేత్రాలయ కంటి శిబిరం ఫోటోలు తీశాను. జత పరుస్తున్నాను చూడండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్- -18-9-16 –ఉయ్యూరు