అచ్చమైన ఉత్తరాంధ్ర దరిద్రం కధ శ్రీమతి శీలా సుభద్రాదేవి ‘’వానా వానా కన్నీళ్లు ‘’

అచ్చమైన ఉత్తరాంధ్ర దరిద్రం కధ శ్రీమతి శీలా సుభద్రాదేవి ‘’వానా వానా కన్నీళ్లు ‘’

అసలు శీర్షికలోనే కన్నీళ్ళ జడి వాన కురిపించారు శ్రీమతి సుభద్రాదేవి .కధకు శీర్షిక అంటే ఇలా ఉండాలి .ఉత్తరాంధ్ర దరిద్రాన్ని ఇద్దరు కుర్రాళ్ళ జీవిత సంఘటనలో ప్రత్యక్షం చేశారు .సాధారణం గా ఎలక్షన్లు వచ్చాయంటే మనవాళ్ళు రాసే కధలు సరదాల పరదాలు కప్పుకొని ముందుకొస్తాయి, గిలి గింతలు పెడతాయి. కాని సుభద్రా దేవి రాసిన కదచదివితే  కన్నీళ్ళ వాన కురుస్తుంది .అదీ మిగతా వారి కంటే కధకురాలిగా ఆమె చూపు లోని వైశిష్ట్యం .ఒక రకం గా ప్రత్యక్షర శిల్పమే ఈ కద అని పించింది నాకు .అందుకే మీ అందరికీ తెలియాలని దీన్ని గురించి రాస్తున్నాను .కొంచెం ఫ్లాష్ బాక్ లోకి వెడతా .’’ఉత్తరాంధ్ర కధలు ‘’అనే బృహత్ గ్రంధాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 20 14  జులై లో కీ శే విరియాల లక్ష్మీ పతి ,డా చాగంటి తులసి గార్ల సంపాదకత్వం లో డా ఎస్వీ సత్యనారాయణ గారు గౌరవ సంపాదకులుగా వెలువరించారు .దీన్ని నాకు ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా )కొని, కానుకగా 20-1-15 న పంపారు .దీన్ని 12-7-15 న ప్రారంభించి ,సమయం ఉన్నప్పుడు చదువుతూ ‘’లాగు’’తున్నాను .ఇవాళ శ్రీమతి శీలాసుభద్ర గారి ‘’వానా వానా కన్నీళ్లు ‘’కద చదివి దాన్ని గురించి రాయకుండా ఉండలేక పోయాను .ఇదీ నేపధ్యం .

పార్టీ వాళ్ళుఇచ్చిన ఎలెక్షన్  జెండా ను అయ్య చొక్కా కుట్టిస్తే ఆ కొత్త చొక్కా తొడుక్కున్నాడు బజార్లో కాగితాలేరుకొనే సూరిగాడు .అంత కంటే దరిద్రం తో బాధ పడుతున్న అదే పనిని  వాడితో పాటు చేస్తున్న అప్పిగాడు బోల్డంత ఆశ్చర్య పోయి చూసి నేస్తాన్ని ఎవరు కుట్టి౦చారని అడిగితె వాడు ‘’అయ్య కుత్తిం చేడు .పారటీ వొల్లు ఇచ్చినారట ‘’అన్నాడు ముడుకుల కింత వరకు వేలాడుతున్న చొక్కాని మురిపెంగా చూసుకొంటూ సూరిగాడు .పార్టీ వాళ్ళు ,ఎలచ్చన్ల గొడవలు తెలీని అప్పి గాడికి వివరంగా బోధిస్తూ ‘’పెచారానికి ఈ రంగు చొక్కానే తొడగాలి .ఆ పార్టీ వొల్లుమా అయ్యా రిచ్చాను బేరమాడుకున్నారు .రిచ్చా చుట్టూ అచ్చరాలు రాసిన గుడ్డ కూడా నాకు గోసీకని ఇత్తాడట మా అయ్య’’  కాగితాల గోని సంచీ మరో బుజానికి మార్చుకుంటూ గర్వం గా చెప్పాడు సూరిగాడు . అప్పిగాడు మాసి పోయిన తన గోచీ గుడ్డను ఓ సారి తడుముకున్నాడు .తనకీ కొత్త గోచీ ఉంటె బాగుండును అనుకొన్నాడు .వాడి అయ్య మిల్లు లో పని చేస్తాడు .’’మేనేజరు బాబుపంచ ఏదైనా ఇత్తే,అప్పుడు అయ్యా ఆడి పంచ చింపి ,తనకి తమ్ముల్లిద్దరికి గోసీ కిత్తాడు .అంత దాకా ఈ పాత గోసీయే ‘’అను కున్నాడు కూడా .

ఇద్దరూ పోటీ పడుతూ కాగితాలేరు కొంటున్నారు .ఎన్నికల హడావిడి కనుక బోల్డు కాగితాలు దొరుకుతున్నాయి .వీధులు తిరుగుతూ ఎలక్షన్ పందిరి దగ్గరికోచ్చారు .అదేటోఅప్పిగాడికి తెలవక పాయె .సూరిగాడు అనుభవజ్నుడిలా ‘’ఈడ కూడా ఎలచ్చన్ల పెచారం చేత్తార్రా ‘’అన్నాడు .ఇన్ని విషయాలు వాడికెలా తెలిశాయో ఆశ్చర్య పోయి అడిగితే ‘’నాను రెండో కళాసు సదివినాను కాదేటి .ఆడ అతికించిన కాగితాలు సదువుతే నాకు తెలిసిపోనాది ‘’గొప్పగా చెప్పాడుఅమృతం సీరియల్ లో హోటల్ సర్వర్ లా సూరిగాడు తనకైనా వయసులోనే కాదు అన్నిట్లోనూ చిన్న వాడైన అప్పిగాడితో .ప్రచారం కాగితాలను మొహమాటానికి జనం తీసుకొని చదివినట్లు నటించి పార్టీ వాళ్ళు కనుమరుగు కాగానే చింపి పారేస్తుంటే వీళ్ళిద్దరికీ కడుపు నిండా అన్నం మాటేమో కాని సంచీ నిండా కాగితాలే కాగితాలు ఏరుకొన్నవాడికి యేరు కొన్నంత .  .బస్టాండ్ దగ్గర ఎలక్షన్ టెంట్ దగ్గరికి చేరే లోపే మరో తడికల టెంట్ కనిపించింది  అక్కడికి సూరి  గాడి నాన్ననారాయణ పరిగెత్తుకొంటూ వచ్చి ‘’ఒర్ సూరిగా ! ఆ చొక్కా బేగిప్పేసి ఇయ్యరా ,పెచారినికి తోడుక్కేల్లాలి.నీ ఒంటి మీదసూసినారా కొంప మునుగుద్ది .నా బనీను నువ్వేసుకో ‘’అని చొక్కా బనీను తండ్రీ కొడుకులు మార్చుకొన్నారు ఆఘ మేఘాల మీద .కొత్త చొక్కా ఒంటి మీద లేనందుకు దిగులు పడ్డా ,తండ్రి రిచ్చ జెండాలతో కళకళ లాడి పోవటం చూసి చొక్కా విరహం మర్చి పోయాడు .అప్పి గాడికి ఇదంతా వింత గా ఉంది చోద్యం చూస్తున్నాడు నోరెళ్ళ బెట్టి .’’సూసావురా అప్పిగా !అయ్య రిచ్చా చుట్టూతా పెట్టినారే ,ఆ గుడ్డే ఎలచ్చను అయ్యాక ఇత్తారట’’అన్నాడు అల్ప సంతోషి సూరి .ఇంతలో టెలిఫోన్ స్థంభాలకు రోడ్డుపైన పెద్ద బానర్ కట్టటం చూశారిద్దరూ .గుడ్లు తేలేసి గుడ్డ వంక చూస్తూ ‘’అది మనకైతే అయిదు చొక్కాలు అవుతాయి కదరా !’’అన్నాడు అప్పి  .’’కాదురా .రెండు మన ఆదివి అయి రెండు మీ బుడ్డోడికి అవుతాయి  ‘’అన్నాడు ఆరిందా సూరి .అప్పుడే ఆ బానర్ గుడ్డ తమకిచ్చేసినట్లు దాన్ని చొక్కాలు కుట్టి౦ చేసినట్లు ఫీలై , కబుర్లతో సంతృప్తి పడ్డారు ఆ అమాయక గర్భ దరిద్ర బుడత జీవులు .  ఇక ఆపూటకి ఏరుడు ఆపేసి  ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లి పోయారు సూరి ,అప్పి గాళ్ళు .

ఇంటికి వచ్చాడే కాని అప్పిగాడు పరధ్యానం లోనే ఉన్నాడు  ఏదో ఇంత అంబలి కతికి ఆరు బయట బొంత మీద రాత్రి పడుకొని నక్షత్రాలు చూస్తున్నాడు ..పైడి తల్లి మిల్లు నుంచి వచ్చి చెంబెడు నీళ్ళు దిమ్మరించుకొని అంబలి తాగి వచ్చి కొడుకు అప్పిగాడి పక్కన కూర్చున్నాడు .నెమ్మదిగా అయ్యను పలకరించి ‘’అయ్యా !నువ్వు కూడా రిచ్చా తోక్కవే ‘’అన్నాడు ప్రాదేయంగా .కొడుక్కు వచ్చిన వింత ఆలోచన అర్ధం కాలేదు తండ్రికి ‘’మా అయ్య ఇంతప్పటి నుంచి మిల్లు కాడే సేసినాడు .ఆడు సేసిన అప్పులు తీర్చటానికి నాను కూడా మిల్లు కాడే కుదురుకున్నాను అప్పు తీరుతుందో లేదో ఎరిక నేదు .ఇంకా రిచ్చా ఏటిరా ?’’అన్నాడు .ఇంతలో  తల్లి వచ్చి ‘’బాగానే ఉంది అయ్యా కొడుకుల సంబడం .అందరం సేసే సాక్రి కూడుకే సాలటం నేడు .ఇంకా రిచ్చాలేంటి కలలు కంటున్నావా ?అని గదిరింది  .

మళ్ళీ రెండు రోజులు అప్పి సూరి పేపర్ల వేటలో బిజీ బిజీ .అయినా అప్పిగాడి మనసులో ఆ బానర్ దోబూచు లాడుతూనే ఉంది. కనీసం టెంట్ కు కట్టిన గుడ్డ అయినా చాలు అని కలలు కంటున్నాడు .ఒకరోజు సూరిగాడికి చెప్పకుండా టెంట్ దగ్గరకొచ్చి ఎవరూ చూడటం లేదనుకొని టెంట్ తడికకు కట్టిన గుడ్డను బ్లేడ్ తో కోయటం మొదలు పెట్టాడు .దరిద్రం ఎంతకైనా తెగిస్తుంది .ఇంతలో పార్టీ వాడొకడు గమనించి కేకలు లంకించుకొన్నాడు .అందరూ పోగై అప్పిగాడిని పట్టు కొన్నారు,కొట్టారు  .వాడు వేరే పార్టీ వాడేమోనని ,అందుకే  చింపేస్తున్నాడని పొరబడి అప్పిగాడి వీపు చించేశారు . వీడు ‘’ఓర్నాయనో 1 నానే పారిటీ వోన్నీగాను .కొత్త గోసీ గుడ్డ కోసం సి౦పుకున్తున్నాను బావో ‘’అని ఏడ్చాడు .ఇంతలో అప్పి గాడు తనని పిలవ కుండా వచ్చేసాడేమో అనుకొంటూ అక్కడికి తండ్రితో చేరిన సూరిగాడికి సీను అర్ధమై  ,నెమ్మదిగా వాడిని ఆ గుంపు నించి తప్పించి బయటపడేసి వాడి మానాన్ని కాపాడాడు .’ఒర ప్పిగా ! మా అయ్యా ఇత్తే ఆ గుడ్డ  నీక్కూడా కసింత ఇత్తానులేరా ‘’అని అభయమిచ్చాడు స్నేహ ధర్మంగా .’’ఉరే !ఎలచ్చన్లు  అయ్యే దాకా ఆటి జోలికి మనం ఎల్తే సంపెత్తారు .సమయానికి మేం రాబట్టి సరి పోయింది .నేక పొతే ఏటయ్యేదో ‘’అని పార్టీ ఎలక్షన్ కోడ్ చెప్పి ,అనునయించి తీసుకు వెళ్ళాడు .అప్పిగాడికి తగిలిన దెబ్బలకు సూరీ తండ్రీ బాధ పడ్డారు .అయితే ‘’వాళ్ళ బాధ లోకానికేం బాధ లేదు కనుక యాంత్రికంగా మరో రెండు రోజులు గడిచి పోయాయి ‘’అంటారు లోకానుభవం తో రచయిత్రి .

ఎన్నికల మూన్నాళ్ళ భోగం పూర్తీ అయి మళ్ళీ రిక్షా బేరాలకి వెళ్ళాల్సి వచ్చిందే అని సూరి తండ్రి ‘’సూనాయన ‘’తెగ బాధ పడిపోయాడు  . తండ్రి నడిగి రిక్షా చుట్టూ కప్పిన గుడ్డను విప్పేసుకొచ్చి కప్పేసు కొన్నాడు సూరి .’’అప్పుడే దాన్ని సిమ్పీ సేయ్యమాకు. నాల్రోజుల తర్వాత సూడచ్చు ‘’అని హెచ్చరించాడు తండ్రి .సూరి గాడి ముఖం చిన్న బోయింది .కానీ తర్వాతన్నా అది తనదే అవుతుంది కదా అనే ఆశ, ధైర్యం వాడిది .అందుకే మడతేట్టి గూట్లో జాగ్రత్త చేశాడు .కాని ఏమనుకోన్నాడో ఏమో తండ్రి నారాయణ  మర్నాడే బానర్ గుడ్డా ,జెండాలు తీసికెళ్ళి పార్టీ ఆఫీసులో ఇచ్చోచ్చాడు .తెలిసిన సూరి ఏడుపుకు అంతం లేదు .అప్పిగాడి తో చెప్పుకొని తెగ ఇదయ్యాడు .’’పోన్లేరా మన అదుట్టం అంతే ‘’అని ఓదార్చాడు అప్పి గాడు .బానర్ ఎ౦డా వానలకు రంగు వెలిసి పోయినట్లు వాళ్ళ ముఖాలు పాలిపోయాయి అన్నారు సుభద్రా దేవి .గాలికి పడిన చినుగు కనిపించేసరికి మరింత విల విల్లాడారు .

ఒక రోజు రాత్రి విపరీతంగా కొండ పోత గా వాన కురిసింది .గుడిసె వాసులు నిద్ర లేకుండా ఏమై  పోతామో అని జాగరణ చేస్తున్నారు .అప్పిగాడికి ఒక ‘’అవుడియా’’ వచ్చి ఇంట్లోంచి బయటికొచ్చి ఇంట్లో వాళ్ళు అరుస్తున్నా లెక్క చేయకుండా  బయట ఉన్న సూరిగాడితో కలిసి బస్టాండ్ దగ్గర కట్టిన బానర్ వైపు పరిగెత్తారు .అక్కడికి చేరి పైకి చూస్తే  తాము ఇన్నాళ్ళుగా కలలు కంటూ కోరుకున్న బానర్ అడ్రస్ లేదు .తాళ్ళ చివరల గుడ్డ పేలికలు మాత్రమే వేలాడుతూ కనిపించాయి .ఇద్దరి నవ నాడులూ కలిసి 18 నాడులూ కుంగి పోయాయి .రోడ్డంతా కలయ చూశాయి .నాలుగు కళ్ళు ఒకటై .బురదలో కూరుకు పోయిన బానర్ కంట బడింది .అది ఎండా వానలకు, బురదకు చీలికలు పేలికలై కనిపించింది .’’ఇద్దరి గుండె పగిలింది .ఆ చప్పుడు వాళ్ళిద్దరికే వినిపిస్తోంది .రాత్రి  వర్షానికి మించిన తీవ్రత తో కురుస్తున్న వాళ్ళ కన్నీరు ,వాళ్ళిద్దరూ వర్షం లో పూర్తిగా తడిసి పోవటం చేత బయటి వాళ్ళకైతే వినిపిచటం లేదుకాని ,వాళ్ళిద్దరికీ ఒకరి కన్నీరు ఒకరికి కని  పిస్తూనే ఉంది ‘’అని కధను పూర్తి చేశారు శ్రీ మతి సుభద్రా దేవి .

ఉత్తరాంధ్ర అంటే ఘనీభవించిన దరిద్రం అని భావిస్తాం. దాన్ని కళ్ళకు కట్టించారు సుభద్రా దేవి .గోచీ కోసం పడే కుర్రాళ్ళ తపన పరా కాస్ట గా చిత్రించారు . ‘’ఉత్తరాంధ్ర కధలు ‘’కదా సంకలం మొత్తం మీద దరిద్రం పై ఇంత గొప్ప కద ఇంకొకటి మాత్రమె కనిపించింది నాకు. అది శ్రీ  ఏ వి రెడ్డి శాస్త్రి గారి ‘’మునిగిపోతున్న బల్లకట్టు’’.దీన్ని నా వాయిస్ తో చదివి రికార్డ్ చేసి ఇది వరకే మీ అందరికీ అందించాను. ఇవాళ ఈ కద నన్ను బాగా ఆకర్షించింది .ఇంకా సుమారు ముప్ఫై  కధలున్నాయి .చదవాలి  . పుస్తకం పంపిన శ్రీ మైనేనిగారికి ధన్యవాదాలు  ,ఈ కద రాసిన శ్రీ మతి సుభద్ర గారికి మనః పూర్వక అభినందనలు .న్యాయంగా ఈ కధ అక్షర లక్షలు చేసే కధ.

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-16-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.