ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -10
21-ఆంగ్లో ఇండియన్ పద నిఘంటు నిర్మాత –ఆర్ధర్ కోక్ బర్నేల్
11-7-1840 న జన్మించి ,12-10-1882 న మరణించిన ఆర్ధర్ కోక్ బర్నేల్ సంస్కృతం లో ప్రముఖ ఇంగ్లిష్ స్కాలర్ .ఆయన సంగ్రహించిన ఆంగ్లో ఇండియన్ పదాల నిఘంటువు’’హాబ్సన్- జాబ్సన్’’ గొప్ప పేరు తెచ్చింది .ఇంగ్లాండ్ లో గ్లూసేస్టర్ షైర్ లోని సెయింట్ బ్రియావేల్స్ లో జన్మించాడు .లండన్ లోని కింగ్స్ కాలేజి లో చదువుతుండగా కోపెంహాం కు చెందిన ప్రొఫెసర్ విగ్గో ఫాస్బోల్ ను కలుసుకొని ఆయన ప్రభావం తో భారతీయ భాషలను అధ్యయనం చేశాడు .తండ్రి బ్రిటిష్ ఈస్టిండియా కంపెని ఉద్యోగి అవటం వలన 1860 లో ఇండియన్ సివిల్ సర్విస్ ఉద్యోగిగా మద్రాస్ వచ్చాడు .మద్రాస్ లో సంస్కృత వ్రాత ప్రతులను కాపీ చేశాడు .1870 లో తాను సేకరించిన 350 వ్రాతప్రతులను ఇండియా ఆఫీస్ లైబ్రరీకి అంద జేశాడు .
మద్రాస్ వాతావరణం పడక పోవటం వలన అధిక శ్రమ వలనా తరచూ అనారోగ్యం పాలయ్యేవాడు .ఇంగ్లాండ్ లోని హాంప్ షైర్ లోని వెస్ట్ స్ట్రాషన్ లో 12-10-1882 న చనిపోయాడు .బర్నేల్ 1874 లో ‘’హాండ్ బుక్ ఆఫ్ సౌత్ ఇండియన్ పాలోలోగ్రఫీ ‘’ప్రచురించాడు దీనినే మాక్స్ ముల్లర్ ‘’ప్రతి భారతీయ సాహిత్య విద్యార్ధి చేతిలో ఉండదగిన పుస్తకం ‘’అని ప్రశంసించాడు 1880 లో మద్రాస్ ప్రభుత్వానికి తన కృషి సర్వస్వం అయిన ‘’ది క్లాసిఫైడ్ ఇండెక్స్ టు ది సాంస్క్రిట్ మాన్యు స్క్రిప్ట్స్ ఇన్ ది పాలస్ ఆఫ్ టాంజోర్ ‘’ సమర్పించాడు .భారతీయ శిక్షాస్మృతి కి చెందిన అనేక సంస్కృత గ్రంధాలను అనువాదం చేశాడు .భారతీయ భాషలపైనేకాక బర్నేల్ కు టిబెటన్ ,అరబిక్ ,కావి ,జావనీస్ ,కాప్తిక్ భాషలలో కూడా పాండిత్యం ఉండి .సర్ హెన్రి యూల్ తో కలిసి ఆంగ్లో –ఇండియన్ పదాలు .పద సమూహాలకు చెందిన నిఘంటువు ను కూర్చి దానికి ‘’హాబ్సన్ –జాబ్సన్ ‘’అని పేరు పెట్టాడు .
22 – సంస్కృత చరిత్ర రాసిన -ఆర్ధర్ బెర్రిడేల్ కీత్
ప్రొఫెసర్ ఆర్ధర్ బెర్రిడేల్ కీత్ డి.సి .ఎల్. ,డి.లిట్. ,ఎల్. ఎల్ .డి.5-4-1879 న జన్మించాడు .స్కాటిష్ కాన్ స్టిట్యూషనల్ లాయర్ ,సంస్కృత విద్వాంసుడు, ఇండాలజిస్ట్ .ఎడిన్ బర్గ్ యూని వర్సిటిలో సంస్కృతం లో రీజియాస్ ప్రొఫెసర్ ,కాన్ స్టి ట్యూషనల్ హిస్టరీ లెక్చరర్ కూడా .ఈ పదవులలో 1914 నుండి 30 ఏళ్ళు 1944 వరకు పని చేశాడు .అబర్దీన్ లో 6-10-1944 న చనిపోయాడు .ఆయన గ్రంధాలు –ఇండియన్ మైతాలజి ,ది రెలిజియన్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ది వేదాస్ అండ్ ఉపనిషడ్స్ ,ది హిస్టరీ ఆఫ్ ది సాంఖ్య ఫిలాసఫీ ,బుద్ధిష్ట్ ఫిలాసఫీ ఇన్ ఇండియా ,ఏ హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ .ఆత్రేయ సంహిత ,.అనువాద రచనలు -ది వేద ఆఫ్ ది బ్లాక్ యజుస్ స్కూల్ (కృష్ణ యజుర్వేదం ),రిగ్వేద బ్రాహ్మనాస్ ది ఆత్రేయ అండ్ ది కౌసితకిబ్రాహ్మనాస్ ఆఫ్ ది రిగ్వేద ‘’.ఇవికాక’’ కాన్ స్టి ట్యూషనల్ లా అండ్ హిస్టరీ ‘’పై 20 దాకా ఉద్గ్రంధాలు రాశాడు .
23-ప్రబోధ చంద్రోదయం ను జర్మన్ భాషలోకి అనువదించిన –దియోదర్ గోల్డ్ స్టక్కర్
దియోదర్ గోల్డ్ స్తక్కర్ 18-1-1821 న జన్మించి 6-3-1872 న మరణించిన జర్మన్ సంస్కృత విద్వాంసుడు .జర్మనీలోని కొనిగ్స్ బర్గ్ లో యూదు దంపతులకు జన్మించి ,పారిస్ వెళ్లి 1842 లో కృష్ణ మిశ్ర యతి రచించిన ప్రబోధ చంద్రోదయం ను జర్మనీ భాషలోని అనువదించి ప్రచురించాడు .1847 నుండి మూడేళ్ళు బెర్లిన్ లో ఉండి ,అలేక్సాండర్ వాన్ హంబోల్ద్ చేత గుర్తింపబడ్డాడు .కాని అతని రాజకీయ భావాలు అతనిని అధికారుల కు అనుమానం కలిగింఛి ,1848 జర్మన్ విప్లవ సమయం లో బెర్లిన్ వదిలి వెళ్లమని ఆజ్ఞాపించారు .హెచ్ .హెచ్ .విల్సన్ ఆహ్వానం పై లండన్ వెళ్ళాడు .1852 లో లండన్ యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .విల్సన్ తయారు చేసిన సంస్కృత నిఘంటువు కు సహాయమ౦ దించాడు .ఇందులో మొదటిభాగం 1856 లో ప్రచురణ పొందింది .సుదీర్ఘంగా చాలా వివవరణాత్మకం గా ఉన్నందున మిగిలిన భాగాల ప్రచురణ ఆగి పోయింది .1861 లోఆయన గొప్ప రచన ‘’పాణిని –హిజ్ ప్లేస్ ఇన్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’రాసి విడుదల చేశాడు .సాంస్క్రిట్ టెక్స్ట్ సొసైటీకి వ్యస్థాపక అధ్యక్షుడు .ఫైలలాజికల్ సొసైటీ లో చురుకుగా పాల్గొనే వాడు .చనిపోయే నాటికి ప్రెసిడెంట్ గా ఉన్నాడు .ఇవికాక ‘’లిటరరీ రిమైన్స్ ‘’రాశాడు .
సశేషం
మీ గబ్బిట దుర్గ ప్రసాద్ -3-10-16 –ఉయ్యూరు