మణిపూర్ మత,సాంఘిక స్వాతంత్రోద్యమ నాయకురాలు పద్మభూషణ్ రాణి గైదిన్లూ -గబ్బిట దుర్గాప్రసాద్

మణిపూర్ మత,సాంఘిక స్వాతంత్రోద్యమ నాయకురాలు పద్మభూషణ్ రాణి గైదిన్లూ -గబ్బిట దుర్గాప్రసాద్


శుభ దేవ దూత
26-1-1915న పూర్వపు మణిపూర్ సంస్థానం లోని బారక్ ,నక్రు నదుల మధ్య ఉన్న కాలానాగ్ పర్వత శ్రేణులలోని నుంగ్ కావో గ్రామంలో రాణి గైదిన్లూ జన్మించింది .తండ్రి లోతో నాగ్,తల్లి కరోట్లీన్లూ .ఆగ్రామం లో ప్రసిద్ధ పామీ కుటుంబానికి చెందింది .తండ్రి ఆ గ్రామ పెద్ద కాకపోయినా చిన్నారి రాణి అందరికీ అల్లారు ముద్దు బిడ్డ గా ఎదిగింది .గైదిన్లూ అంటే శుభ వార్త తెచ్చే దూత అని అర్ధం .చిన్నతనం నుంచే అసాధారణ తెలివి తేటలను ,నైపుణ్యాన్ని ప్రదర్శించేది .ఎవరికి భయపడని స్వతంత్ర వ్యక్తిత్వం ఆమెది .బాల్యం నుండి ఆధ్యాత్మికత అలవడి మహాత్మ్యాలు చూపటం ప్రారంభించింది .ఏపనైనా ధైర్య సాహసాలతో స్వంత ఆలోచనతో చేసేది .అక్కయ్యలకంటే అన్నిటా ముందుకు దూసుకు పోయి ,ఆగ్రామ బాలికలకు నాయకురాలైంది .
మలుపు
ఆమె జీవితం ఒక ముఖ్య సంఘటన తో మలుపు తిరిగింది .అ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో తన పోలికలే ఉన్న దేవత కనిపించింది .ఆ దేవత జీలియంగ్రా౦గ్ దేవతా సమూహం లో బిష్ణు దేవుని కుమార్తె అని గ్రహించింది .దేవతకు ,గైదిన్లూ కు మంచి స్నేహమేర్పడింది .గైదిన్లూ తలిదండ్రులు తమకుమార్తె షమాన్ పూజారిణిగా మారిపోతుందని భావించారు .తర్వాత మణిపూర్ రాజకీయ ఏజెంట్ జే సి హిగ్గిన్స్ ఆమె ను’’మైబి ‘’.అంటే మందుల అమ్మాయి గా ప్రచారం చేశాడు. కాని మందుల వ్యక్తీ మైబా కంటే జడోనాంగ్ఎంత గొప్పవాడో, అలాగే మైబి కంటే గైదిన్లూ అంత గొప్పది . ,

.ఒక రోజు కలలో జడోనాంగ్ కనిపిస్తే ఆయనే తన భవిష్యత్ గురువు అని తెలుసుకొని,ఆయనను కలుసుకోవటానికి ,వెతుక్కుంటూ కంబిరాన్ కు వెళ్ళింది .1926 నుండి -27వరకు ఈ గురు శిష్య సంబంధం జడోనాంగ్ ,గైదిన్లూ మధ్య నడిచింది .గైదిన్లూ లో దైవిక లక్షణాలున్నాయని ఆయన గ్రహించాడు . జడోనాంగ్ సాగిస్తున్న ఉద్యమం లో స్వచ్చందంగా గైదిన్లూ చేరి పని చేయటం ప్రారంభించింది .

కొద్దికాలం లోనే ఆమె జడోనాంగ్ కు అతినమ్మకమైన అనుచరురాలైంది .తన స్వగ్రామం నుంగ్ కావు లో తారాంగ్ కాయ్ దేవాలయ ఉత్సవాలు బహు శ్రద్ధగా నిర్వహిస్తూ ,ప్రజలందరూ పాల్గొని పూజించటానికి ఒక ప్రార్ధనా మందిరాన్ని నిర్మించి సమర్పించింది .వారికి టింగ్ కవ్ రగ్వాంగ్ అనబడే టింగ్ వాంగ్ సర్వోత్తమ దైవం .జెలియన్ గ్రాంగ్ మతం లో సంస్కరణలను చేయటం ప్రారంభించింది .మతం లో ఉన్న నిషేధాలను తొలగించేట్లు చేసింది .

అందరుకలిసి సామూహికంగా దైవ ప్రార్ధన చేసుకోవటం పాటలు పాడటం నృత్యాలు చేయటం వంటి వాటికి మంచి అవకాశాలు కల్పించింది.వీటిని గురువైన హైపో జడోనాంగ్ పూర్తిగా సమర్ధించి ఆమె పక్షాన నిలిచాడు .అసలే పేదరికం లో అలమటిస్తున్న ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వం చూపిస్తున్న అణచివేత దమనకాండను ఆమె తిరస్కరించింది .గురువు ఆశీర్వాద బలం తో ప్రజలందర్నీ సమీకరించి వారికి ధైర్య సాహసాలు చొరవ అన్యాయాన్ని ఎదిరించటంలో సాహసాలను నేర్పింది .మత పరమైన సంస్కరణల వలన వారందరూ బాగా దగ్గరయ్యారు .

బిష్ణు దేవుని గుహ సందర్శనకు చివరి సామూహిక యాత్రలో ఉండగా ఆమెకు తన భవిష్యత్ పోరాటం అర్ధమైంది .గురువు జడో నాంగ్ కు సంస్కరణలతో కూడిన కొత్త మతం పై ఆలోచన వచ్చి శిష్యురాలు గైదిన్లూ కు తెలియ జేయగానే ఆమె దానిని వెంటనే అనుసరించింది .అస్సాం పోలీసులు లఖిపూర్ లో జడో గాంగ్ గురువును అరెస్ట్ చేయగానే ఆయనకు మరణం సమీపిస్తోందని గ్రహించింది .తెలివిగా పోలీసుల కళ్ళు కప్పి కొండలపైకి వెళ్లి దాక్కుంది .
అస్సాం లోని కచార్ జిల్లా డిప్యూటీ కమీషనర్ సి గిమ్సన్ జడో నాంగ్ గురువును అరెస్ట్ చేసి ,మణిపూర్ లో పొలిటికల్ ఏజెంట్ అయిన హిగ్గిన్స్ కు అప్పగించాడు .అస్సాం రైఫిల్స్ కాలమ్స్ బృందం తో జిరిఘాట్ ,నుండి నుంగ్ కావ్,తామేలాంగ్ మీదుగా ఇంఫాల్ దాకా పెద్ద ఊరేగింపు జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది .13-3-1931 న జరిగిన ఈ మార్చ్ సందర్భంగా హిగ్గిన్స్ కు ఎస్ డి వో .ఎస్ జే .డంకన్ కు,నాలుగవ అస్సాం రైఫిల్స్ మేజర్ బుల్ ఫీల్డ్ 17 ఏళ్ళ గైదిన్లూను గుర్తించారు .ఆమె గ్రహించి జీలాండ్ లేక్ ఫారెస్ట్ ఏరియాకు పారిపోయి దాక్కుంది ..ఆమె వెంట కొందరు బాలికలతోసహా 40 మంది అనుచరులున్నారు .

అడవులలో ,కొండలమీదా ఎవరికీ కనిపించకుండా అజ్ఞాత వాసం చేస్తూ జడో నాంగ్ గురువు పై ఇంఫాల్ కోర్ట్ లో జరుగుతున్ననేర విచారణ విషయమై ఆరా తీస్తూనే ఉంది.జడోనాంగ్ గురువు నిరపరాధి అని, ఆయనకు ఏ హత్య తోనూ సంబంధం లేదని పూర్తిగా నమ్మింది .29-9-1931 న విచారణ పూర్తి అయి జదోనాంగ్ ను ఉరితీశారు .గురువు మరణ వార్త విన్నగైదిన్లూ వెంటనే ప్రజా సమీకరణ చేసి నాయకత్వ బాధ్యతలను తీసుకొన్నది .అసలైన నాగా విప్లవం జడోనాంగ్ మరణం తర్వాతనే ప్రారంభమైందని నాయకత్వం వహించిన గైదిన్లూ పోరాటపటిమ త్యాగం , బ్రిటిష్ వారి ఉక్కు పాదం కింద నలిగి అణగారి పోయిన నాగా జాతి జరుపుతున్న పోరాటం పరాకాష్టకు చేరిందని చరిత్రకారులు రాశారు .అంతకాలం తమ హక్కులకై పోరాటం చేసిన నాగా ప్రజలు జడోనాంగ్ అరెస్ట్ ,ఉరితీతలకు భయపడి పోయి ,బ్రిటిష్ దౌర్జన్యాలకు తలఒగ్గి అసలు జడోనాంగ్ తమ నాయకుడే కాదన్నారు ఆవూరి ప్రజలు .ఇప్పుడు పోరాట భారమంతా గైదిన్లూ మీదనే పడింది .
సాంఘిక మతోద్యమం
రాజకీయాలతోపాటు సాంఘిక మత సంస్కరణల పైనా రాణి గైదిన్లూ దృష్టిపెట్టింది .జేమీ ,లింగమై రాంగ్, మీ అనే మూడు తెగల నాగాలను సమైక్య పరచటమే ఆమె ధ్యేయంగా ముందుకు సాగింది .పరంపరగా వస్తున్న నాగ జాతి సంస్కృతీ వారసత్వాలను పరిరక్షించుకోవాలనే దృఢమైన సంకల్పంతో ,ఏ మత౦తోనూ సంబంధం పెట్టుకోకుండా ఉద్యమించింది .చివరికి హెరాకా అనే కొత్త మతాన్ని ఏర్పాటు చేసింది .
రాజకీయ ఉద్యమం
గురువు జాడో నాంగ్ ఫిలాసఫీ అయిన ‘’నాగా జాతి వారే పాలకులు ‘’అనే సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసింది. జోడా నాంగ్ కు మహాత్మా గాంధి సహాయ నిరాకరణ ఉద్యమం ,భారత స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమం బాగా తెలుసు ..కాని రాణి గైదిన్లూ మాత్రమే గాంధీ విధానాలను తన రాజకీయ ప్రచారానికి బాగా ఉపయోగించుకొన్నది .తన అనుచరులకు ఆమె ‘’ భారత దేశానికి ’గాంధీ అనే కొత్త రాజువచ్చి పరిపాలిస్తాడు ‘’అని ఉద్బోధించింది .జడో నాంగ్ గాంధీ రాజు అవుతాడు అని రాసిన పాటనుబాగా ప్రచారం చేసింది .
జెలియన్ గ్రాంగ్ విప్లవం
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గైదిన్లూ విప్లవ శంఖం పూరించి విప్లవ నాయకురాలై ,అస్సాం ,మణిపూర్ లలోని జెలియన్ గ్రాంగ్ ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించమని పిలుపునిచ్చింది .ఉద్యమాన్నిమణిపూర్ వాయవ్య భాగం లోని తామేన్ గ్లాంగ్ లోను , నాగా కొండల జిల్లాలో ,అస్సాం లోని ఉత్తర కచార్ కొండ జిల్లాలలోను తీవ్రతరం చేసింది .పరిస్థితి చేయి జారిపోతోందని భావించిన అస్సాం కౌన్సిల్ లోని గవర్నర్ జనరల్ అస్సాం రైఫిల్స్ దళంను ఆమెకు వ్యతిరేకంగా సైనిక చర్యకు ఆజ్ఞలను జారీచేశాడు .నాగా హిల్స్ డిప్యూటీ కమీషనర్ జే .పి .మిల్స్ కు సైనిక చర్య బాధ్యతను అప్పగించాడు .ఆయనకు సహాయం గా 3,4 దళాల అస్సాం రైఫిల్స్ వారిని , నార్త్ కచార్ హిల్స్ ఎస్ .డి .వో .,మణిపూర్ రాష్ట్ర అధికారుల సేవలను ఉపయోగించుకోవాలని చెప్పాడు .గైదిన్లను అరెస్ట్ చేసినవారికి రెండు వందల రూపాయల పారితోషికం మణిపూర్ స్టేట్ దర్బార్ ప్రకటించింది .దీన్ని తర్వాత అయిదు వందలకు పెంచింది .
హాన్ గ్రు౦ పోరాటం
విప్లవ కారిణి గైదిన్లకు సహాయపడిన వారికి తీవ్రమైన శిక్ష విధిస్తామని మణిపూర్ ప్రభుత్వం హెచ్చరించింది ఎన్నో గ్రామాలను ప్రభుత్వం తగలబెట్టించింది .1932 ఫిబ్రవరి 16న నార్త్ కచార్ హిల్స్ వద్ద అస్సాం రైఫిల్స్ సిపాయిలు ,విప్లవకారులపై పెద్ద ఎన్ కౌంటర్ జరిపి యువ విప్లవ కారి గైదిన్లను అరెస్ట్ చేశారు ,1932 మార్చి లో పట్టపగలే నాగా ప్రజలు పెద్ద ఎత్తున హాన్ గ్రుం లోని అస్సాం రైఫిల్స్అవుట్ పోస్ట్ పై తీవ్రమైన దాడి చేశారు .పాపం నాగ ప్రజల ఆయుధాలు డాలు బల్లాలే అవటం తో రైఫిల్స్ ముందు నిలువలేకపోయారు .అవుట్ పోస్ట్ వారు నాగాలపై కాల్పులు జరుపగ గాయపడ్డారు .తర్వాత వెనక్కి వెళ్లి పోయారు .ఆరుగురు అస్సాం రైఫిల్స్ జవాన్లు జీమె యుద్ధవీరులు ఎనిమిది మంది చనిపోయారు , ఈ దాడిలో నాగా హిల్స్ లోని బోపంగ్ వామి గ్రామం భస్మీపటలమైంది .
పూల్వాలో అరెస్ట్
1932 అక్టోబర్ లో రాణి గైదిన్లూ ,పూల్వా(పోలోమి)గ్రామానికి చేరి ,అక్కడ కొయ్యతో కోట కట్టించటంమొదలుపెట్టింది .రాబోయే రెండు నెలలు చాలా క్లిష్టమైనవి అని తానో, బ్రిటిష్ వాళ్ళో ఎవరో ఒకరు విజేతలు అవుతామని అనుచరులకు చెప్పింది.తన సైన్యానికి అస్సాం రైఫిల్స్ కు తుది పోరుకు సన్నద్ధమైంది .ఈ లోగా డిప్యూటీ కమిషనర్ జే .పి మిల్స్ ,కెప్టెన్ మాక్డోనాల్డ్   ఆధ్వర్యం లో బలమైన అస్సాం రైఫిల్స్ దళాన్ని ,హర్ బాలా ను తోడిచ్చి దానికి సాయంగా పూల్వా పంపాడు . రాణీ కోట ఇంకా పూర్తికాలేదు ,విప్లవ వీరులు పూర్తిగా అప్రమత్తంగానూ లేరు .1932 అక్టోబర్ 17 తెల్లవారుజామున పూల్వా గ్రామం పై కెప్టెన్ మాక్డోనాల్డ్ సైన్యం తో హఠాత్తుగా విరుచుకుపడ్డాడు .అవాక్కైన విప్లవ దళం ఎదిరించే స్థోమతలేక  డీలాపడి లొంగిపోయింది యువ రాణిని ఒక ఇంట్లో ఉండగా అరెస్ట్ చేసి కొహిమాకు తీసుకువెళ్లి ఇంఫాల్ లో విచారణ జరిపారు .
బ్రిటిష్ జైళ్లలో నిర్బంధం
పొలిటికల్ ఏజెంట్ హిగ్గిన్స్ ఆమెకు యావజ్జీవ కారాగారశిక్ష విధించాడు . గైదిన్లూ ఒక ఏడాది గౌహతి ,ఆరేళ్ళు షిల్లాంగ్ ,మూడేళ్ళు ఐజ్వాల్ ,నాలుగేళ్ళు గారోహిల్స్ లోని తురాలో మొత్తం 14 ఏళ్ళు బ్రిటిష్ జైళ్లలోశిక్ష అనుభవించింది.గైదిన్లూ శిక్ష గైదిన్లూకంటే విపరీతంగా ప్రజల్లో వ్యాప్తిచెంది ప్రసిద్ధి పొందింది .ఆమె సాగించిన పోరాటాన్ని ఆపకుండా అనుచరులు చాలా ఏళ్ళు కొన సాగించారు .
నెహ్రూ –రాణి గైదిన్లూ
కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా జవహర్ లాల్ నెహ్రు 1937లో అస్సాం వచ్చినప్పుడు షిల్లాంగ్ జైలులో ఉన్న యువనాగ కన్య గైదిన్లూ విప్లవ పోరాటపటిమ తెలుసుకొని బ్రిటిష్ వారి దౌష్ట్యానికి బలైపోతున్న ఈయువ నారీ కిశోరం పై విపరీతమైన సానుభూతి ప్రదర్శించాడు .ఆమె పోరాటం పై ఆయన హిందూస్తాన్ టైమ్స్ లో వ్యాసం రాస్తూ ఆమెను ‘’రాణి ‘’అని కీర్తించాడు అప్పటి నుంచి ఆమెను’’ రాణి గైదిన్లూ’’ అంటున్నారు .1937 లో దేశం లో చాలా రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనలోకి వచ్చాయి .ఆమెను విడిపించటానికి నెహ్రు విశ్వ ప్రయత్నం చేశాడు .కాని మణిపూర్ బ్రిటిష్ ప్రావిన్స్ లో లేకపోవటం తో ఏమీ చేయలేకపోయాడు .

బ్రిటిష్ లేడీ ఆఫ్ హౌస్ ఆఫ్ కామన్స్ అయిన ఆస్టర్ దృష్టికి ఈమె విషయం తెచ్చాడు .ఆమె సెక్రెటరి ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకు ఈ విషయం తెలియ జేస్తే ఆయన గైదిన్లూ ఆమె ఇప్పటికీ మణిపూర్ లో బలమైన నాయకురాలని ,ఆమెను విడుదల చేస్తే మణిపూర్ అస్సాంలలో శాంతికి భగ్నం కలుగుతుందని విడుదలకు తిరస్కరించాడు .దీనిపై నెహ్రు స్పందిస్తూ ఆమె యవ్వనం అంతా బ్రిటిష్ జైళ్లలో మగ్గి మసిబారి పోయిందని ,ఇంత చిన్నవయసులో బ్రిటిష్ రాజ్ ను ఎదిరించిన ఆమె సాహసాన్నిబ్రిటిష్ ప్రభుత్వం ఓర్వలేక హింసిస్తోందని అన్నాడు .
స్వాతంత్ర్యానంతరం విముక్తి
1947 లో నెహ్రు భారత దేశ తాత్కాలిక ప్రధానిగా ఉన్నప్పుడు మిసెస్ జోన్స్ అనే బ్రిటిష్ వనిత ఒత్తిడి చేయటం వలన రాణి గైదిన్లూ ను తురా జైలు నుంచి విడుదల చేశారు .ఆమెను మణిపూర్ వెళ్ళటానికి వీలు లేదని ఆంక్ష పెట్టగా ఆమె పూర్వపు నాగా హిల్స్ జిల్లా లోని మొక్కాచుంగ్ దగ్గరున్న ఇమ్రాప్ గ్రామలో ఉన్నది .అయిదేళ్ళ తర్వాత 1952 లో ఆమెను మణిపూర్ రాష్ట్రం లోకి అనుమతించారు .అక్కడ తామేన్ గ్లాంగ్ హెడ్ క్వార్టర్స్ లో స్థిరపడి ప్రశాంత జీవనం సాగించింది .నెహ్రూ ను ఆయన కుమార్తె ఇందిరా గాంధీని 1958 లో స్వయంగా వెళ్లి కలిసింది .మణిపూర్ నాగాలాండ్ నార్త్ కచార్ లలోని తన ప్రజల ఆర్ధిక సాంఘిక అభి వృద్ధికి కృషి చేసింది .
నాగా తిరుగు బాటు దార్ల తో విభేదం
1956 లో ఏ జడ్.ఫిజో నాయకత్వాన నాగా నేషనల్ కౌన్సిల్ ఏర్పడి తిరుగుబాటు చేశారు .రాణి గైదిన్లూ ,ఆమె మత మైన హెరాకా జనం పై దాడి జరిపి ఆమెను అగౌరవపరచి ,ఆమెపై పుకార్లు వ్యాపింప జేశారు .1960 లో ఆమె అనుయాయులు ఆమెతో సహా అడవులలోకి వెళ్లి వెయ్యి మంది జనంతో నాలుగు వందల రైఫిల్స్ తో ఒక ప్రైవేట్ సైన్యం ఏర్పరచి తమ మత విశ్వాసాలను రక్షించుకొందామని ఆమెకు నచ్చచెప్పారు .సరేనని మళ్ళీ నాయకత్వం చేబట్టింది. ఆ నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆమె తిరుగుబాటుదారుకాదని , భారత జాతీయతపై ఆమెకు విశ్వాసం ఉందని దేశ ద్రోహికాదని ,నాగా నాయకురాలని అర్ధం చేసుకొన్నది .మణిపూర్ ,నాగాలాండ్ ప్రభుత్వాలు ఆమెను బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపొమ్మని పిలుపు నిచ్చాయి .
మళ్ళీ జనజీవన స్రవంతిలోకి
ప్రభుత్వాల పిలుపును గౌరవించి రాణి తన సైన్యం తో సహా బయటికి వచ్చి 1966 జనవరి లో కోహిమాలో స్థిరపడింది .ఆమె సైన్యం నాగాలాండ్ ప్రభుత్వానికి లొంగిపోయి ,తర్వాత’’ బటాలియన్ ఆఫ్ నాగాలాండ్ ఆర్మేడ్ పోలీస్’’ అని పిలువబడింది .ఆమె ఎప్పటినుంచో జీలియాన్ గ్రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ నుఅస్సాం నాగాలాండ్ మణిపూర్ లలోని జీం ,లింగ మాయ్,రా౦గ్ మేప్రాంతాలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూనే ఉంది .ప్రధాని ఇందిరను కలిసి ఈ ప్రతిపాదన అందజేసింది. ఆవిడ ఆమె కోరిన ప్రాంత ,ప్రజల సర్వతోముఖాభివృద్ధికి అన్నిరకాల సహకరిస్తానని హామీ ఇచ్చింది. కాని ఆమె తనగురువు హైపూ జడోనాంగ్ చిరకాల వాంఛఅయిన జీలాంగ్ ప్రజలకు ప్రత్యేక భాగం కావాలన్న అసలైన కోరికను మర్చి పోలేదు . జీన్ గ్రాంగ్ ప్రజల ఆరాధ్యదైవంగా మన్ననలు అ౦దుకొంటున్నది .కొహిమా లో ఉండగానే ఆమెను నాగా ఇంటి గ్రేటేడ్ఉద్యమ నాయకులు ఆమెను తమ డిమాండ్ కు మద్దతు ఇవ్వమని కోరారు .ఆమె జీనియాన్ గ్రాంగ్ ప్రాంత ఏర్పాటుకే కట్టు బడి ఉంది .
ప్రభుత్వ పురస్కారం
రాణి గైదిన్లూ నాగాలాండ్ లో ఉండగా అన్ని జాతీయ ఉత్సవాలకు రాష్ట్ర ప్రతినిధిగా హాజరయ్యేది .ఆలిండియా ఫ్రీడం ఫైటర్స్ అసోసియేషన్ వారు నాగలాండ్ స్టేట్ చాప్టర్ కు ఆమెను ప్రెసిడెంట్ ను చేశారు .బ్రిటిష్ ప్రభుత్వాని వ్యతిరేకంగా పోరాడిన ఆమె చరిత్ర లోకవిఖ్యాతమైంది .దీనికి కేంద్ర ప్రభుత్వం 1972 లో తామ్రపత్రం అందించింది .పడమటి మణిపూర్ లో తామేన్ గ్లాంగ్ జిల్లా ఏర్పాటు చేయటం లో ,నాగా లాండ్ లో పేరెన్ జిల్లా ఏర్పాటులో ,నార్త్ కచార్ హిల్స్ లోని జీలియన్ గ్రాంగ్ ప్రజల సంరక్షణకు ,కచార్ లో రాంగ్ మీలకు నివాస భూమి సాధించటంలో ఆమె చూపిన చొరవ, ధైర్యం, ముందు, చూపు ఒప్పించే నైజం బాగా కలిసివచ్చాయి .1981 లో ఆమెను ‘’పద్మ భూషణ్’’ పురస్కారంతో ప్రభుత్వం సత్కరించింది .ఆమె అనేక సాంస్కృతిక మత సంస్థలకు సన్నిహితు రాలయ్యింది .

జీనియాగ్రాంగ్  కమ్యూనిటి పునర్వ్యస్తీకరణ లో హెరాకా మత విశ్వాసం ఆమెను మరింత ఉన్నతురాలిని చేసి ,ఆ విశ్వాసులకు ఫిలాసఫర్ ,మార్గదర్శి అయింది .మాజీ శాసన సభ్యుడు యెన్. సి .జీలంగ్ అధ్యక్షుడుగా ‘’జీలియంగ్రాంగ్ హెరాకా అసోసియేషన్  ఏర్పాటు చేసింది .జాతీయ సంస్థలైన కళ్యాణ్ఆశ్రం ,విశ్వ హిందూ పరిషత్ ,విద్యా భారతి లతో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి .దేశ ప్రజల మత ,సాంస్కృతిక పునర్ వైభవ ఉద్యమానికి ఊపిరుల౦దించింది భారత ప్రభుత్వం. ఆమెగౌరవార్ధం 1996 లో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది .ఇండియా ప్రభుత్వ మానవ వనరుల శాఖలోని మాతా శిశు సంరక్షణ విభాగం ప్రతి ఏడాది మహిళా సంక్షేమానికి అత్యుత్తమ సేవలందించే వారికి శక్తి పురస్కార్ పేరిట అయిదుగురు మహిళలకు అందిస్తోంది . పద్మభూషణ్ రాణి గైదిన్లూ కూ అందజేసి గౌరవించింది .ఇండియన్ ఆన్త్రో పాలజికల్ సర్వే సంస్థ ఆమెకు 1996 లో భగవాన్ బిశ్రాముండా పురస్కారం తోపాటు లక్షరూపాయల నగదు బహుమతిని అందజేసింది .దురదురదృష్టవశాత్తూ దీన్ని ఆమె మరణానంతరం ఇవ్వబడింది
జీలియన్ గ్రాంగ్ ప్రజా సంస్థ నాయకత్వం
రాణి గైదిన్లూ అధ్యక్షతన జీలియంగ్రాంగ్ ప్రజాసంస్థ ఏర్పడింది .దీని ముఖ్య ఉద్దేశ్యం భారత ప్రభుత్వం ఆప్రజలకు ప్రత్యేకజిల్లా లేక యూనిట్ లేక యూనియన్ టేర్రిటరి ఏర్పాటు చేయటం .ప్రధాని ఇందిర దీనికి సానుకూలంగా స్పందించింది .కాని 1984 లో ఇందిరాగాంధీ ఆకస్మిక మరణం రాణీకి ఆశనిపాతమే అయింది .కాని ఆమె పోరాటం ఆపలేదు .తర్వాత ప్రధాని రాజీవ్ గాంధి ఆ ప్రాంతాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అధారిటి కిందకు తెస్తానన్నాడు .స్తబ్ధత ఏర్పడి 1992 లో ,కూకి –నాగా సంఘర్షణలతో రాజకీయ కార్యక్రమాలు ముందుకు సాగలేదు .ఈలోగా రాణీకి జబ్బు చేసి కొహిమా వదలి స్వగ్రామం నుంగ్ కావూక్ కు చేరి, ఏడాది తర్వాత నుంగ్ కావో గ్రామం చేరింది .కొద్ది అస్వస్థత ఏర్పడి రాణి గైదిన్లూ 17-2-1993 న చనిపోయింది.

నాటి ప్రధాని పి. వి .నరసింహా రావు సంతాపసందేశం పంపిస్తూ ఆమెను ఈశాన్య రాష్ట్రాల అగ్రశ్రేణి స్వాతంత్ర్య సమరయోధురాలని ప్రశంసించారు .ఆమె అంత్యక్రియలకు గవర్నర్ శ్రీ చింతామణి పాణిగ్రాహి హాజరయ్యారు .దేశ వ్యాప్తంగా ఆమె మరణానికి వేలాదిప్రజలు సానుభూతి ప్రకటించారు .26-1-2015 న రాణి గైదిన్లూ శత జయంతిని భారత ప్రభుత్వం ఘనం గా నిర్వహించింది .ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ జడోనాంగ్ ను  అమర వీరునిగా ,రాణి గైదిన్లూను భారత స్వాతంత్ర్యసమర యోధురాలిగా అభి వర్ణించారు .

-గబ్బిట దుర్గా ప్రసాద్

————————————————————————————————————————————–

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.