రామదాసుతో రామయ్య సొద
భక్త రామదాసు భద్రాచల సీతారామ స్వామి సన్నిధిలో నిలుచున్నాడు .కాని రామచంద్ర మూర్తి దర్శనం కాలేదు .అందరికీ కనిపిస్తున్న తనకు ఎందుకు కనిపించటం లేదో అర్ధం కాలేదు .దీన దృక్కులతో చూస్తున్నాడు అయ్యవారిని .కాని లాభం కనిపించలేదు .అదేమిటి రామ దాసుగారు స్వామిపై కీర్తన పాడ కుండా గమ్మున ఎందుకుండిపోయాడో భక్తులకు అర్ధం కావటం లేదు . ఆయన కాళ్ళ నుండి బాష్పధార కారి పోతోంది .పరవశం అనుకోన్నారందరూ .కాని ఆయన కనులు ,మనసు శూన్యంగా ఉన్నాయి .ఏభావమూ కదలాడ లేదు .భగవంతుడికి భక్తుడి కి మధ్య ఏదో పెద్ద అగాధం ఏర్పడింది .ఒక గంట నిశ్శబ్దమే తాండవం చేసి౦ది ఇద్దరి మధ్యా .తర్వాత స్వామి కనులలో ఏదో ఆజ్న కనిపించి,తనను రామదాస మందిరానికి రమ్మన్న సూచన అర్ధమై ,వడి వడి అడుగులతో నిమిషం లో అక్కడికి చేరి నిలిచాడు .భక్తుడు తన భావన గ్రహించి వచ్చాడని సంతోష పడ్డాడు భగవంతుడు .ప్రసన్నం చేసుకొందామని’’పలుకే బంగార మాయేనా –కోదండ పాణి –పిలిచినా పలుకవేమి –కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి ‘’అన్న కీర్తన పాడి, వెంటనే ‘’అంతా రామమయం ఈ జగమంతా రామమయం ‘’పాడాడు .పులకించి పలకరిస్తాడనుకొన్నస్వామి అప్రసన్నంగా ‘’ఈ పొగడ్తలకేమి దాసూ ! ఇస్టం వచ్చినట్లు కీర్తనల పేరుతో నన్ను నీ ఇష్టం వచ్చినట్లు దులిపేశావు .కస్టాలు నీకేనా ?లోకం లో ఇంకెవరికీ లేవా ?ఆ మాత్ర౦ అర్ధం చేసుకోలేవా ?నీకస్టాల చిట్టా విప్పి,వాటికి నేనే కారణం అన్నట్లు చేతిలో కలం ఉందికదా రాసి పారేశావు .అదేమిటీ ! ‘’అయ్యయ్యో నీ వంటి అన్యాయ దైవము –నెయ్యెడగానగనయ్యా ‘’ అంటావా ?అంత అన్యాయం నేనేం చేశానయ్యా నీకు ? అంతా స్వయ౦కృతాపరాధమే నీది .పైగా నన్ను దానికి దుయ్యబడతావు .భలే జాణ తనం నేర్చావయ్యా దాసూ !’’అనగానే అవాక్కయ్యాడు రాం దాసు .’’అది కాదు రామయ్యా ! పరిపూర్ణకరుణచే బ్రహ్మాదుల గాచిన
నరసింహుడైనట్టి నళినదళేక్షణుడు ఇతడు ‘’అని కీర్తించాను కదయ్యా !నా మీద సొడ్డు వేస్తున్నావేం రామా ! ‘’అన్నాడు కొంచెం నత్తురు నత్తురు మంటూ . .’’చాలు చాలుకాని –‘’ఉన్నాడో లేడో భద్రాద్రి యందు –ఆకొని నేనుచేకొని వేడితే రాకున్నాడయ్యయ్యో ‘’ ‘’అని లోకం లో నా మీద అనుమానం కలిగిస్తావా ?గుడికట్టి ప్రతిష్టించింది నువ్వు. ఉత్సవాలు ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహి౦ఛి వేలాది భక్తులను రప్పించింది నువ్వు .నీకే అనుమానం వస్తే నాపరువేం కాను ‘’?దబాయించాడు రామయ్య. ‘’స్వామీ !నన్ను పూర్తిగా అపార్ధం చేసుకొన్నారు .నేరం మోపుతున్నది మీరే .’’’’ఎంతో మహానుభావుడవు –ఎంతో చక్కని దేవుడవు ‘’అని పోగిడాను కదా రామ చంద్రా !’’’—’ఏదో గిల్లి జోలపాడినట్లుంది నీవైఖరి .కప్పి పుచ్చటం బాగా అలవాటైంది నీకు భక్త రామదాసూ !’’కొంచెం కోపం తో అంటించాడు స్వామి .అల్లల్లాడి పోయాడు రామ చరణ దాసు .’’అన్నిటికి అన్నీ చెబుతున్నావు దాసూ !’’ఇక్ష్వాకు కుల తిలకా !ఇకనైనా బలుకవా ‘’అని బాగానే ఎత్తుకొని ‘’ఆ ప్రాకారమునకు బట్టే పది వేల వరహాలు ,భరతునకు జేయిస్తి పచ్చల పతకము అంటూ శత్రుఘ్నుని మొలత్రాడుకు పది వేల వరహాలు ,లక్ష్మణుని ముత్యాలపతకానికి మరో పది వేలు ,సీతమ్మకు చేయించిన చింతాకు పతకానికి ఇంకో పది వేలు ఖర్చు చేశానని గొప్పలు చెప్పుకోన్నావు.అసలు నిన్ను ఎవడు చేయించమన్నాడు వీటిని ?.ప్రభుత్వ సొమ్ము అంటే అంత చులకనా ?మంచినీళ్ళు లాగా ఖర్చు చేసి మా మీద నింద వేస్తావా ?పైగా ‘’సర్కారు సొమ్ము తృణంగా భావించ వద్దు ‘’అని నాకే శ్రీరంగ నీతులు –అదే లేవయ్యా భద్రాద్రి నీతులు చెబుతావా ?గడుసు పిండానివయ్యా దాసూ ! పోనీ అంతటితో ఆగావా ? నేను కలికితురాయి పెట్టుకొని కులుకుతున్నానని ,పైగా నీ బాబు చేయించాడా నీ మామ చేయించాడా ?.’’అని వీరంగం వేస్తావా ? ఇది చాలక ‘’అబ్బా తిట్టితి నని ఆయాస పడవద్దు ‘’అని జాలిం లోషన్ రాస్తావా ?‘’ అని కొంచెం ఘాటుగానే అన్నాడు భద్రాద్రి రాముడు .కాని భద్రాద్రి రామ దాసు మొహం మాడిపోయింది .స్వామి ఎదుట దోషిగానిలబడి పోయాడు .అయినా ధైర్యం కొంచెం తెచ్చుకొని’’అయ్యా !దెబ్బలకోర్వక తిట్టితి నయ్యా ‘’అని చెంప లేసుకొన్నా గా రామ ప్రభూ.నిన్ను పూజించినట్టి చేతుల నిదిగోకట్ట బెట్టి రెటు తాళుదు నయ్యా’’ అని బతిమి లాడుకొన్నాను గదా స్వామీ ‘’అన్నాడు వేడుకొంటూ .
ఏది చెప్పినా రామస్వామి అపార్ధం చేసుకొంటున్నాడను కొని ‘’సీతా రామ స్వామీ నే జేసిన నేరంబేమి ?ఖ్యాతిగా నీ పద పంకజములు నే ప్రీతిగ దలపక భేద మెంచితినా “’అని లంకించుకొన్నాడు .’’చాల్చాల్చాల్లేవయ్యా దాసయ్యా!ఎత్తు కోవటం బాగానే ఎత్తు కున్నావ్ తర్వాత ఏమన్నావ్ ? ‘’రంగుగా నాపది వేళ్ళకు రత్నపు టు౦గరములు నిన్నడిగితినా ‘’అంటూ మొదలెట్టి నీబంగారు శాలువాలు ,పాగాలు అంగీలు నడికట్లు ముత్యాల సరాలు ,నవ రత్నాల హేమ కిరీటం ,మురుగులు గొలుసులు,సరి గజ్జెలు ,గజ తురగాలు, అడిగానా ,ప్రభుత్వం ఇమ్మన్నానా ?దాన కంకణం ,మేలిమి మొలనూలు అడిగానా ?అని మరీ చింతకాయ దులుపుడు దులిపెశావు .కలలో నన్నా నిన్ను వీటిని అడిగానా ఎప్పుడైనా భక్త స్వామీ !ఏదో నర్మ గర్భం గానో ,నిందా స్తుతో,వ్యాజ స్తుతో అను కోవటానికి వీల్లేకుండా సూటిగా మాటల ఈటెలతో నా గుండె గాయం చేశావు .నా కీర్తి ప్రతిష్టలు ‘’గోదాట్లో ‘’కలిపేసి ,సాటి దేవుళ్లలో నన్ను తలవంచు కోనేట్లు చేశావ్ .ఇదేం తెంపరి తనమయ్యా .అన్నీ ఇస్తే కట్టుకొని ,పెట్టుకొని కులుకుదామనే ! అన్నీ నీ కిచ్చేసి నేను దిగంబరంగా దిసి మొలతో ఊరేగాలనా నీ భావం ?ఎంత ఆశయ్యా రామదాసయ్యా నీకు ? పోనీ అప్పుడెప్పుడో తానీషా కాలం లో ప్రభుత్వ ఖజానా నీ జమానా అనుకోని గుట్టు చప్పుడుకాకుండా ఖర్చు చేసి నాకు గుడికట్టించి ,ఆభరణాలు చేయించి ,జామా ఖర్చులు చెప్పనందుకు బందిదిఖానాలో ఉండి చువ్వలు లెక్క పెట్టలేక నన్ను కీర్తిస్తూ తిడుతూ ,నీలో నువ్వు పాడుకోన్నావు బాగానే ఉంది.ఏదోలే భక్తుని ఆర్తి అని సరిపెట్టుకున్నాను .కాని ఇన్ని వందల ఏళ్ళు అయినా దాన్ని మర్చిపోకుండా మీ వాళ్ళు సినిమాలు తీసి ,నిన్ను నాయకుడిని చేసి నన్ను విలన్ చేసి ,కీరవాణి తో స్వరాలు కట్టించి కమ్మగా పాడించి ,దేశ విదేశాలలో కూడా నన్ను నీ పాటల ద్వారా ఆడి పోసుకొంటున్నారు కదయ్యా .పైగా బాలమురళి ప్రతికచేరీలో నీ పాటలే పాడి మరీ రక్తికట్టిస్తున్నాడు .నీకు కీర్తి ,నాకు అపకీర్తి .ఇదేం బాగా లేదు రాం దాసూ ‘’అన్నాడు గుక్క తిప్పుకోకుండా రామ స్వామి .
ఇంకా రామస్వామి ప్రసన్నం కానందుకు నొచ్చుకొని భక్త స్వామి ‘’రాముడే గలడు నా పాలి శ్రీ రాముడే గలడు-రాముడార్త విరాముడా భావ భీముడానంద ధాముడు ‘’అని కీర్తన పాడాడు .చలనం లేదు .’’భజరే మానస రామం –భజరే జగదభిరామం –అవనత జలజ భావేంద్రం ,అగణిత గుణ సాంద్రం –మానసరుచికరదేహం –రూప మదన శత కోటిం-శ్యామ సజలధర శ్యామం –సాంబ శివానుగత రామం –భద్రాచల నివాసం –పరిపాలిత శ్రీ రామ దాసం ‘’అని రామదాసూ గుక్క తిప్పుకోకుండా కీర్తించాడు .ఊహు –మార్పు లేదు స్వామి ముఖం లో .ఇంకా గంభీర ముద్రలోనే ఉన్నాడు .
‘’ఏమయ్యా దాసూ !నేను నీ కంటికి ఆనటం లేదా? నా మీద నీకు నమ్మకం లేదా .ఆడవాళ్ళ తో చెప్పిస్తే వింటానని భ్రమలో ఉన్నట్లున్నావు .అలా అయితే సీతా పరిత్యాగం ఎందుకు చేస్తాను ?అగ్ని ప్రవేశం చేయమని ఎందుకు కోరుతాను ?.అంత మరీ కొంగు చాటు కృష్ణుడి నను కొన్నావా ? నాదగ్గర సిఫార్సులు చెల్లవని తీలీదా నీకు? .నంగ నాచి కబుర్లు చెబుతున్నావు.’’నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి –నారీశిరోమణి ,జనకుని కూతురా జనని జానకమ్మా ‘’అని అటు నుంచి నరుక్కొద్దామనుకొన్నావా?’’పోనీ మగాళ్ళకంటే ఆడవాళ్ళు జాలి గుండె కలవాళ్ళు అనుకొందాం ,కాని ‘’ప్రక్కను చేరుక చెక్కిలి నొక్కుచు –చక్కగ మరు కేళి సొక్కు చుండెడి వేళ-ఏకాంతం లో ఏక శయ్య నుండేడి వేళ’’ సీత నీ గురించి నాకు చెప్పాలా ?’’–ఆ పని తప్పఇంకో పనీ ,ఆలోచన ‘’లేని వేళ మరీగుర్తుంచుకొని నీ గొడవ చెప్పాలా ? ఎంత స్వార్ధం రామదాసూ నీది ?మా ఏకాంతం ,దా౦పత్య సౌఖ్యం వదిలి ,పానకం లో పుడక లాగా నీ బాధ మాకు అడ్డు కావాలా ?ఎంత పక్షపాతం నీకు ? .ఇంత మంది భక్తుల్ని చూశానుకాని’’ నీదంతా– అదో మాదిరి ‘’.’’అన్నాడు కొంచెం కనికరంగా .
‘’నా తప్పులన్నీ క్షమి యించుమీ -జగన్నాధ నీవాడ రక్షించుమీ –పాతకుడని ఎంచక పోషించు దాత వనుచు నీ పదములే నమ్మితి –నా యెడ నేరమెంచక హితమున ద్వేషములెంచకు –మ్రొక్కెద ‘’అని పాడాడు . స్వామి మోము నెమ్మదిగా జీరో కాండిల్ నుంచి థౌసంద్ కాండిల్ వెలుగు సంతరించుకొన్నది .అమ్మయ్యా అనుకొన్నాడు భక్త రామదాసు .
‘’ బిడియమేలనిక మోక్షమిచ్చి నీవడుగుదాటి పోరా రామా
తడవాయెను నేనోర్వలేను దొరతనము దాచుకోరా రామా’’ అంటూ
‘’ మురియుచు నీధర జెప్పినట్లు విన ముచికుందుడ గాను రామా
అరుదుమీరలని తలచి ఎగురగా హనుమంతుడ గాను రామా
సరగున మ్రుచ్చుల మాటలు విన జాంబవంతుడను గాను రామా
బిరబిర మీ వలలోబడ నేనా విభీషణుడ గాను రామా ..మాయలచేత వంచింపబడగ నే మహేశుడను గాను రామా
న్యాయములేక నే నటునిటు దిరుగను నారదుండ గాను రామా
ఆయము చెడి హరి నిను గని కొలువను నర్జునుండ గాను రామా
దాయాదుండని మదిలో మురియను దశరథుడను గాను రామా బి..
గరిమతోడ మాసీతను గాచిన గొప్పలు నే వింటి రామా
పరగ భద్రగిరి శిఖరనివాసా పర బల సంహార రామా
నరహరి నను రక్షింపుమయా శ్రీనారాయణరూపా రామా
మరచి నిదురలోనైనను మీపద సరసిజములు విడువ రామా ‘’
అని పూర్తీ చేసిఆపసోపాలు పడుతూ ఆపాడు .అప్పుడు రామసామి ‘’రామదాసూ !అందుకే నయ్యా త్యాగయ్య గారు నీ కీర్తనలంటే పరవశించి పోయేవారు .ఆయనకు స్పూర్తి నీవే నని చెప్పుకొనేవారు .’’అన్నాడు .భక్తుడు పరవశి౦చాడు మ్ ‘వెంటనే
వందేవిష్ణు దేవమశిక్షాస్థితి హేతుం
త్వామధ్యాత్మజ్ఞాని భిరంతర్హృతి భావ్యం
హేయాహేయా ద్వంద్వ హీనంపర
మేకసత్తామాత్ర సర్వహృదిస్థ దృశ్యరూపం వం..
నానాశాస్త్రైర్వేదకంబైః ప్రతిపాద్యం
నిత్యానందం నిర్విషయాజ్ఞ మనాదిం
మత్సేవార్థం మానుషభావం ప్రతిపన్నం
వందే రామం మరకతవర్ణం మధురేశం వం..
అని గీర్వాణ గానాన్ని చేశాడు .మందస్మిత వదనార వి౦దుడైన రామయ్య రామ దాసుకు సుమనోజ్నంగా సీతా లక్ష్మణ సమేతంగా దర్శనమిచ్చాడు .
హరిహరిరామ నన్నరమర చూడకు నిరతము నీ నామస్మరణ ఏమరను .. |
దశరథనందన దశముఖమర్దన పశుపతిరంజన పాపవిమోచన .. |
మణిమయభూషణ మంజులభాషణ రణజయభీషణ రఘుకులపోషణ |
పతితపావననామ భద్రాచలధామ సతతము శ్రీరామదాసునేలుమా రామ
|
అంటూ మరో కీర్తనతో రామదాసు రామస్వామిని కీర్తించాడు .మానసానందం పొందిన రామయ్య ‘’రామ దాసూ !నీ మంగళ గీతం నాకు మహా నచ్చుతు౦దయ్యా .ఒక్క సారి పాడవా నా కోసం .?అడిగాడు .’’స్వామీ ! నీ అజ్ఞ అని –
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం రా..
:కోసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాదివినుత సద్వరాయ మంగళం రా..చారుమేఘరూపాయ చందనాది చర్చితాయ
హారకటకశోభితాయ భూరిమంగళం రా..లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ
జలదసదృశ దేహాయ చారు మంగళం రా..దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ
భావజ గురువరాయ భవ్యమంగళం రా..పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ
అండజవాహనాయ అతులమంగళం రా..విమలరూపాయ వివిధవేదాంత వేద్యాయ
సుముఖచిత్త కామితాయ శుభదమంగళం రా..రామదాసాయ మృదుల హృదయ కమలనివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రా..
‘’ఏమండీ !ఆరై పోయింది భక్తి రంజని వస్తోంది లేవండి .’’అని నిద్ర లేపింది మ శ్రీమతి .అప్పడే బాలమురళి రేడియోలో ‘’సీతా రామస్వామీ !నే చేసిన నేరమదేమి ‘’అంటూ పాడుతున్న రామ దాసు కీర్తన వినిపిస్తోంది .
మహర్నవమి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-16 –ఉయ్యూరు