ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -18
35- అమెరికా యోగిని జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్ -2
అమెరికన్ అకాడెమి ఆఫ్ ఏషియన్ స్టడీస్ ఏర్పాటు
1950 ఏప్రిల్ లో టై బెర్గ్ కలకత్తా నుంచి కాలి ఫోర్నియా కు బోట్ బుక్ చేసుకొని హవాయిలో ఆగి ,అక్కడ పాత బెనారస్ నేస్తం చార్లెస్ మూర్ ను కలిసి 1949 లోజరిగిన ‘’తూర్పు –పడమర తత్వ వేత్తల సమావేశం ‘’ఫలితాల గురించి చర్చించింది .అందులోని భావ పరంపర సమాహారం శ్రీ అరవిందులను చేరుకోవటానికి పాశ్చాత్య మేధావి వర్గానికి నివేదించటానికి అనువుగా ఉంటు౦ద ని భావించింది .ఆమె లాస్ ఏంజిల్స్ కు రావటం అనుచర వర్గానికి గొప్ప ప్రోత్సాహమై ,రెండు వారాలలో ఆమె వెయ్యిమందికి పైగా పాల్గొన్న పది సమావేశాలలో ప్రసంగించేట్లు చేసింది .సాన్ ఫ్రాన్సిస్కో లోనూ ఇదే ఉత్సాహం వెల్లి విరిసి,స్టాన్ ఫోర్డ్ యూని వర్సిటిలో ఘన సన్మానం ఏర్పాటు చేశారు .’’ఇండియా పై నిషేధం లేని సత్యాన్నితెలుసుకోవటానికి అమెరికా ఆతుర పడుతోందని దీనికి నాంది గా కాలి ఫోర్నియా అరవిందుని భావ జాలాన్ని అందుకునే ప్రయత్నం లో ముందు ఉందని చెప్పింది .19 5 1 లో సాన్ ఫ్రాన్సిస్కో లో కొత్తగా స్థాపించబడిన ‘’అమెరికన్ అకాడెమి ఆఫ్ ఏషియన్ స్టడీస్ ‘’ ఫాకల్టి లో చేరటానికి జూడిత్ టై బెర్గ్ ను సాదరంగా ఆహ్వానించారు .ఇది ఆసియా సంస్కృతికి పూర్తిగా అంకితమైన మొట్టమొదటి గ్రాడ్యుయేట్ యూని వర్సిటి ‘’.1961 లో ‘’శాన్ఫ్రాన్సిస్కో పునరుజ్జీవన ‘’కు వేళ్ళు పాదుకొనే సిద్ధాంతాలకు వేదికయింది .టై బెర్గ్ ఇందులో సంస్కృతం లో ప్రొఫెసర్ గా పని చేస్తూ అలాన్ వాట్స్ ,హరిదాస్ చౌదరి ,దిలీప్ కుమార్ రాయ్ వంటి అంతర్జాతీయ మిత్ర బృందం తో కలిసి పని చేసింది .రాయ్ ,చౌదరి ఇద్దరు ఆమె తో పాటు అరవింద అనుచరులే .డైరెక్టర్ ఆఫ్ స్టడీస్ గా ఉన్న ఫ్రెడరిక్ స్పీగెల్ బెర్గ్ కు శ్రీ అరవిందులు ఈ యుగ మార్గ దర్శి అనే అభిప్రాయం బలంగా ఉన్నవాడు .టై బెర్గ్ సంస్కృత బోధనా విధానం ప్రాచీన ,అర్వాచీన భారతీయ భావ అనుసంధానం తో ఉండటం ఆయనకు ఎంత గానో నచ్చి అభినంది౦చేవాడు .ఆమె బోధనా పటిమ అత్యుత్తమమని శ్లాఘించాడు .ప్రతిక్లాసు ను ఆమె ఎంతో వైవిధ్య భరితంగా ఉత్సాహం గా ప్రేరణగా బోధించటం అపూర్వం గా ఉండేది ..’’ఆధునిక భారత దేశం ‘’పై 1952 వేసవిలోసాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ కాలేజి లో జరిగిన సెమినార్ లో ఆమె ఇంస్ట్రక్టర్ గా ఉంది.ఆమె టీచింగ్ ను అనూహ్యప్రతిభా ప్రభావ సంపన్నం గా ఉందని కీర్తించారు .ఆమెకు ఈ సబ్జెక్ట్ పై ప్రత్యక్షంగా స్వీయ అనుభవం ఉండటం ,లోతైన అధ్యయనం చేసి ఉండటం ఆమె విజ్ఞానం అగణితంగా ఉండటం దీనికి ముఖ్య కారణమైనాయి. స్ట్రాఫోర్డ్ యూని వర్సిటీ లోనూ ఆమె లెక్చరర్ గా పని చేసింది .
ప్రాచ్య –పాశ్చాత్య సంస్కృతీ కేంద్రం
అకాడేమిలో రెండేళ్ళు పని చేశాక బెర్గ్ లాస్ ఏంజెల్స్ పై దృష్టి పెట్టి అక్కడ 1953 మే 1 న ‘’ఈస్ట్ వెస్ట్ కల్చరల్ సెంటర్ ‘’స్థాపించింది .’’అందరినీ ఏకం చేసేదే అసలైన జ్ఞానం ‘’అన్న అరవిందుల లోకోక్తిని ఆమె పాటించింది .ఈ సంస్థ విశాల దృక్పధం తో ప్రాచ్య పాశ్చాత్య సాంస్కృతిక అన్యోన్యతను నిర్మించటం ,ఆధ్యాత్మిక జీవనానికి వైవిధ్య అంశాలను ప్రతిపాదించటం కోసం పాటు పడింది .ఆమె ఒక్కతే సంస్కృతం, హిందీ, పాళీ, గ్రీక్ భాషలను ,తులనాత్మక మతం ,భారతీయ ఉత్తమ సాహిత్య గ్రంధాలను ,,సంగీత, నృత్య , యోగ ,అరవింద ,మదర్ లపై తరగతులను అద్వితీయంగా బోధించి ‘’ మానవ కంప్యూటర్’’ అనే భావన కలిగించింది . భారతీయ కళా సంస్కృతులు ,నాటక విధానం మొదలైన వాటిపై గెస్ట్ లెక్చర్ లను ఏర్పాటు చేసింది .’’ఓరియెంటల్ లైబ్రరి ‘’ని ,బుక్ షాప్ ను ఏర్పాటు చేసి అనేక యోగ విధానాలకు చెందిన ఎన్నో పుస్తకాలను సేకరించి అందు బాటులో ఉంచింది .కొరియా యుద్ధ సమయం లో ఒంటరి భావం లో ఉన్న మైనారిటీలకు ఇది గొప్ప ఊరట కలిగించింది .1953 నుంచి 73 వరకు ఆమె ‘’ది ఈస్ట్ –వెస్ట్ కల్చరల్ స్కూల్ ఫర్ క్రిఏటివ్లి గిఫ్టేడ్ చిల్ద్రెన్ ‘’ స్థాపించగా లాస్ ఏంజెల్స్ ,కాలి ఫోర్నియా స్కూల్ బోర్డ్ వారు పూర్తీ అంగీకారం గుర్తింపు నిచ్చాయి .’’కళా సౌందర్య (ఈస్తెటిక్స్ )విద్యా సక్తి ‘’కలిగించటమే ఈ స్కూళ్ళ లక్ష్యం .రాజ యోగా స్కూల్ ట్రైనింగ్ కు ప్రతిధ్వనిగా టై బెర్గ్ ఈ స్కూళ్ళలో విద్యార్ధులలో ‘’దైవీ భావ ‘’వ్యాప్తిని కలిగించింది .అన్ని సబ్జెక్ట్ లతోపాటు సంగీతం ,పియానో తానే బోధించింది .ఈ స్కూల్స్ లో చదివి గ్రాడ్యుయేట్ అయిన వారిని ప్రముఖ కాలేజీలలో కళ్ళకు అద్దుకొని సీట్ ఇచ్చి చేర్చుకొన్నారు .అంతటి క్వాలిటీ బెసేడ్ ఎడ్యుకేషన్ ఆమె అందించింది .ఈ విద్యార్ధులను పబ్లిక్ స్కూల్స్ లో రెండేళ్ళ అడ్వాన్స్డ్ క్లాస్ లలో చేర్చుకోనేవారు .అందుకే టై బెర్గ్ స్కూల్ లో చదివిన వారికి అదొక అద్భుత, ప్రత్యేక ,అరుదైన అవకాశం గా గుర్తుండి పోయింది .
యాభైలలోని ప్రచ్చన్న యుద్ధం (కోల్డ్ వార్ )అరవై లలో కొత్త యుగానికి (న్యు ఏజ్ )కు దారి తీసి అనేక ఏళ్ళుగా చేస్తున్న బెర్గ్ విధానాలు సంపూర్ణంగా వికసనం చెంది పూర్తీ ఫలితాలనిచ్చాయి .’’యూని వర్సిటి కోసం నాఅన్వేషణ ‘’అనే ఆమె ప్రసంగాలు ఆమెను సొత్ లాండ్ ప్రముఖ వ్యక్తిగా నిరూపించాయి .దక్షిణ కాలిఫోర్నియా ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ సంస్థ ప్రముఖ స్థానం పొందింది .అది వారం మధ్యాహ్నకాలాలో ఆడిటోరియం యోగా కేంద్రంగా ఆధునిక యోగాన్ని ప్రభావితం చేసేదిగా నడుస్తోంది .స్వామి ముక్తానంద ,సచ్చిదానంద ,చిదానంద ,రామ దాస్ ,మదర్ మీరా బాయ్, సిఖ్ ,సూఫీ ,బౌద్ధ యోగా గురువులు శ్రీలంక ,జపాన్ ,కాంబోడియాలనుండి ,ఇండియా లోని సాంస్కృతిక రాజకీయ నాయకులు వచ్చిసందర్శించి సంతృప్తి చెందేవారు .పాశ్చాత్య మిస్టిక్ లను ,మంత్రం వేత్తలను ,జ్యోతిశ్శాస్త్ర వేత్తలను బెర్గ్ ఆహ్వానించేది . ప్రముఖ నృత్య కళాకారిణులైన రూత్ సెయింట్ డెనిస్ ,ఇందిరా దేవి లు ఇక్కడ నృత్య ప్రదర్శన చేశారు .ఈ వేదిక అమెరికా ఆధ్యాత్మిక వికాస కేంద్రంగా భాసించింది .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-16 –ఉయ్యూరు ,,