గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం
257 -ఉభయ కవి మిత్రులు, సంస్కృత సాహిత్య రత్న -శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (1933 -2013 )
శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి తెలంగాణా కరీ౦ నగర్ జిల్లా ధర్మ పురిలో 1933 లో భారద్వాజ గోత్రీకులు కొరిడే కృష్ణయ్య ,గంగాయమ్మ దంపతులకు జన్మించారు .సంప్రదాయ బద్ధంగా విద్య నేర్చి బాల్యం లోనే రామాయణ భాగవత భారతాదులను చదివి ఆకళించుకొని ,తాడూరి బాల కృష్ణ శాస్త్రి ,గొల్లపల్లి సాంబశివ శాస్త్రి ,పాలెపు వెంకట రాయ శాస్త్రి వంటి ఉద్దండుల వద్ద సంస్కృత వ్యాకరణ అలంకార ,తర్క వేదాన్తాలను అధ్యయనం చేశారు .కవిత్వం శాస్త్ర విచారాలలో లో స్వయం కృషితో పట్టు సాధించి ,కవిత్వ, రచనల ద్వారా వాసికెక్కారు .1956 లో 23 వ ఏట పూరీ గోవర్ధన పీతాదిపతులచే ‘’సాహిత్య రత్న ‘’బిరుదం పొంది ,ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృత సాహిత్య విద్యా ప్రవీణ పరీక్షలో 1961 లో ఉత్తీర్ణులై కరీం నగర్ జిల్లా లో సుల్తానా బాద్ ,,రాయకల్లు ,చొప్పదండి ధర్మపురి లలో సంస్కృత ,తెలుగు పండితులుగా పని చేశారు .శ్రీ తాడూరి శివ రామయ్య శ్రీమతి లక్ష్మీ నర్సిం ల కుమార్తె శ్రీమతి సులోచనా దేవిని ఆమె కు 5 లేక 6 ఏళ్ళ వయసున్నప్పుడే వివాహమాడారు .
సంస్కృత సాహిత్య పరిశోధనకై కేంద్ర ప్రభుత్వమిచ్చిన ఉపకార వేతనం తో ఉస్మానియా యూని వర్సిటి సంస్కృత అకాడెమి లో వారణాసి ధర్మ సూరి రచించిన ‘’సాహిత్య రత్నాకరం ‘’పై గొప్ప పరిశోధన చేశారు .ప్రైవేటుగా చదివి ఎం ఓ ఎల్ ,తెలుగు ఎం. ఏ లను ఉస్మానియా నుంచి అందుకొన్నారు .సికందరాబాద్ సర్దార్ పటేల్ కాలేజి లో 1972 నుంచి ఆంధ్రోపన్యాసకులుగా పని చేస్తూ ,యు జి సి ఫెలోషిప్ తో ‘’ధ్వని-మనుచరిత్రము ‘’విషయం పై పరిశోధన చేసి పి హెచ్ డి పొంది ,1981 నుండి ఉస్మానియా యూని వర్సిటి స్నాతకోత్తర కేంద్రం లో ఆంధ్రోపన్యాసకులుగా చేరి ,1993 లో రిటైరయ్యారు .
శాస్త్రి గారి సంస్కృత రచనలుసంస్కృత భారతి ,ఆరాధన ,భారతి వివేచన పత్రికలలో ,వారణాసి విశ్వ విద్యాలయ సాహితీ సుషమా ,సాగర్ విశ్వ విద్యాలయ సాగరిక ,భారతీయ విద్యా భవన్ వారి సంవిత్ ,స్వాధ్యాయ మండలి వారి ‘’అమృతలత ‘’,వారణాసి ధర్మ మండలి ‘’సూర్యోదయ ‘’,మద్రాస్ రామకృష్ణ ప్రభ లలో ప్రచురితాలై భారత దేశ ప్రముఖ సంస్కృత పండితులుగా గుర్తింపు పొందారు .వీరి సంస్కృత రచనలో ముఖ్యమైనదవి 1- వారణాసి ధర్మ సూరి రాసిన సాహిత్యరత్నాకరానికి ‘’ఉన్న నౌక ,మందారం అనే రెండు వ్యాఖ్యానాలను మదించి లఘువ్యాఖ్యను మూడు భాగాలుగా సంతరింఛగా ఉస్మానియా సంస్కృత అకాడెమి 1972 ,74 ,81 లలో ప్రచురించగా యావద్భారత పండిత ప్రకాండ శ్రేణిలో ఒకరైనారు .2- సుమనో౦జలిఅనే సంస్కృత కవితా సంకలనం టిప్పణి సహితంగా1973 లో ప్రచురించారు 3-భూ సంస్కరణలపై ‘’వసుమతీ సుధాకరం ‘’నాటకం రాస్తే ఆకాశవాణి ద్వారా ప్రసారితమైంది 4- ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాతం 5-సంస్కృత పథ ప్రదర్శిని ,6-స్వీయ సంస్కృత కవితా ఖండికల సంకలనం ‘’కవితా విపంచీ ‘’ .7-షోడశీ. ‘’8-శ్రీ ఏ సి పి శాస్త్రి గారు రచించిన ‘’నల చరిత్ర ‘’తెలుగు నాటకాన్ని రాజన్న శాస్త్రి గారు సంస్కృతం లోకి అనువదించగా ‘’సురభారతి ‘’ప్రచురించింది .20 01 లో ఢిల్లీ సంస్కృత అకాడెమి ప్రచురించిన ‘’విశ౦తి శతాబ్దీయ సంస్కృత కావ్యామృతం ‘’లో శాస్త్రి గారి కవితా ఖండికలను చేర్చి గౌరవించింది .
తెలుగులో వైశాలి నాటకం ,వీరభద్ర సుప్రభాతం ,ఏక వీర కుమారీయం ,శ్రీ రుద్ర స్తోత్రం ,శంభు శతకం ,సరస్వతీ వైభవం ,సుమగీతాలు ,మొదలైనవి రచించారు .శాస్త్రిగారి ఆధ్యాత్మిక సాహిత్య వ్యాస సమాహారాన్ని ‘’మ౦జూష ‘’గా ప్రచురించారు .
శాస్త్రి గారి విద్వత్తు కు తగిన పురస్కారాలు అందుకొన్నారు .శ్రీ శృంగేరి పీతదిపతులు శాస్త్రి గారిని ఆస్థాన పండిత గౌరవం కల్పించారు సారస్వత జ్యోతి ఉత్తమ ఉపాధ్యాయ బిరుదాన్ని ,సర్వార్ధ సంక్షేమ సమితి శాస్త్ర పండిత పురస్కారం,చ్చి సత్కరించింది . దివాకర్ల పురస్కారం ,హిందూపుర స్వర్ణ భారతీ పురస్కారం ,తెలుగు విశ్వ విద్యాలయం ఉత్తమ సంస్కృత పండిత పురస్కారం ,కందుకూరి శివానంద మూర్తిగారి అమృతోత్సవ పండిత పురస్కారం అందుకొన్నారు .
శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి గారు 11-3-20 13 మాఘ బహుళ అమావాస్య నాడు 80 వ ఏట ‘’రాజశేఖర సాయుజ్యాన్ని’’ పొందారు.
ఆధారం –శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి గారి కుమారులు శ్రీ కొరిడే విశ్వనాధ శర్మ గారు పంపిన ‘’మంజూష ‘’లో ఆచార్య బిరుద రాజు రామ రాజు గారి వ్యాసం ‘’పస్పశము ‘’శ్రీ విశ్వనాధ శర్మగారి ‘’మా నాన్న గారు ‘’వ్యాసం .
గీర్వాణ వైదుష్యం
గణేశుని స్తుతిస్తూ రాజకీయ గణ నాయకులనూ అన్యాపదేశంగా ఎత్తి పొడిచిన కవిత
‘’అది తిష్ట న్నుచ్చ పదం –రూపకళా ఖర్వా గర్వ యుక్తశ్చ
పరి భూయ త్వం ద్విజపతి –రాప్తశ్చాదర్శనీయతాం సద్యః ‘’
ఉన్నత పద౦ లో ఉంటూ రూప కళా గర్వం తో చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వి అవమానం చేసి ప్రజాదరణ కోల్పోయాడు అని భావం .
గోదావరీ నది వర్ణ న –‘’గోదావరీ విమల వీఛి మృదంగ వాద్యే –సంవాద్యమాన ఇహ గంధ వహేన హృద్యం
బాలాపికా లపతి రమ్య రవేణ గీతం –లక్ష్మీ నృసింహ భగవంస్తవ సుప్రభాతం ‘’
నిర్మల గోదావరీ తరంగాల మృదంగ ధ్వని ని వాయువు హృద్యంగా అందిస్తుంటే పిల్లకోయిలలు రమ్యం గా గానం చేస్తున్నాయి మేలుకో లక్ష్మీ నృసింహా .
ఏది రాసినా సంప్రదాయం చరిత్ర అంతర్లీనంగా ,కవితాత్మకంగా రాశారు శాస్త్రి గారు .అందుకే వారి వైదుష్యాన్ని అంతటి గొప్ప పండితకవి శ్రీ కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి గారు బహు గొప్పగా రమ్యంగా వర్ణించారు రాజన్న శాస్త్రి గారిని –
‘’వైదుష్యం ,లేఖకత్వం ,సుగమ ఫఃణితిభిః సంస్కృతాధ్యాపకత్వం –విద్వద్గోస్టీషు చర్చానికషణ చణతా శాస్త్ర వాదే పటుత్వం
శక్తి ర్గైర్వాణవాణ్యాం విబుధ జన సదోభాషణే నర్గళాచ-విద్వద్రాజన్న శాస్త్రిన్ !భవతి విజయతే భారతీ సుప్రసాదాత్ ‘’
ఆధారం –శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి గారి కుమారులు ,ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల సంస్కృతోపన్యాసకులు- శ్రీ కొరిడే విశ్వనాధ శర్మ గారు24-10-16 న పంపిన ‘’మంజూష ‘’పుస్తకం లో ఆచార్య బిరుద రాజు రామ రాజు గారి వ్యాసం ‘’పస్పశము ‘,’శ్రీ విశ్వనాధ శర్మగారి ‘’మా నాన్న గారు ‘’వ్యాసం.
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-16-ఉయ్యూరు