దశ ప్రాణి విలాపమే శ్రీ దక్షిణామూర్తి ‘’విశ్వ విలాపం ‘’

దశ ప్రాణి విలాపమే శ్రీ దక్షిణామూర్తి ‘’విశ్వ విలాపం ‘’

రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగి ,సంగీత సాహిత్యాల సమలంక్రుతుడు శ్రీ పొనకంటి దక్షిణా మూర్తి గారితో పూర్వ పరిచయమేదీ లేదు కాని వారు ఆప్యాయంగా పంపిన ‘’విశ్వ విలాపం ‘’పద్య కావ్యం ఈ రోజే 24-10-16 అందింది .విశ్వం దాని ప్రక్కన చెట్టు  చేప ,పిచుక,ఎలుక ,పాము ,కోడి ,కుక్క ,మేక జంతువులతో భావ శుద్ధిగా ముఖ చిత్రం పుస్తకం లోని భావాలను వ్యనజనం చేసింది .తమ తలిదండ్రులు కీ శే లు శ్రీ పొనకంటి నర్సయాచార్యులు శ్రీమతి బాలమ్మ దంపతులకు అంకిత మిచ్చారు .

కవి కరుణశ్రీ పుష్ప విలాపం స్పూర్తి తో రాసిన కావ్యమిది .పది ప్రాణుల ఆర్తిని వాటి తరఫున మనకు అందించి ఒక సారి నిలబడి ఆలోచించమని హెచ్చరించాడు .ఇందులో మొదటిది ‘’వృక్ష విలాపం ‘’జంధ్యాలవారి పుష్పవిలాపానికి అను సృజన – గొడ్డలితో అభయారణ్యం లోని ఒక వృక్షాన్ని నరక బోతుంటే దాని ఆవేదన  ‘’వృక్ష విలాప కావ్యం ‘’అయింది .భూమిలోకి వేర్లు లోతుగా పాదుకొని ,భూసారాన్ని వృద్ధి చేస్తూ ,వానలు గుమ్మరిస్తూ ,ఆశ్రితులకు సేద తీరుస్తూ ప్రశాంత చిత్తులను చేస్తూ ఉండే తమల్ని ఉక్కు రంపాలతో మేను తుక్కు చేయవద్దని చెట్టు ప్రాధేయ పడుతుంది ‘’

‘’మా తులలేని పుష్ప ఫల మానిత వృక్ష సుగంధ మౌషదీ –రీతులు ఎన్నొ మీవయి వరించి భరించి హరి౦చి పోయే,మా

చేతనమంత చెండుకొని చీలిచి, మీచితి మంట పేర్చి మ –మ్మీతరి బుగ్గి చేతురు సుమీ నరజాతికి న్యాయ మున్నదా?’’అని ప్రశ్నించింది .జాలరిగా వల తో చేపలను పట్టుకో బోతే అవి ‘’మత్స విలాపం ‘’చేసి మనసు కరగించాయి  .

‘’నీటిని శుద్ధి చేసెదము ,నీచును నాచును నోట మ్రింగి యే-నాటికి చేటు దేము ,జలనాశన మొనర్చము మీకు వోలె మీ

నోటికి జారదేమి మము నూర్పుచు ముద్దగ మ్రింగకున్న యే-పాటిది నీట మా బ్రతుకు ప్రాణము  దీయుట పాపమే కదా ‘’అన్నాయి .’’పూర్వం మీరూ మేమూ నీళ్ళలోనే కలిసి బతికాం ,తర్వాత భూమి పైకి చేరి పరిణామ క్రమలో మీరు మానవు లయ్యారు .తోటి ప్రాణులమైన మాపై సానుభూతి లేకుండా నిత్యం వేటాడి చంపి తింటారా ?మత్స్యాలను చంపి తినటం నేరం అని చట్టం చేయలేక పోయారని బాధ పడి కవిత్వం లోమాత్రం  నెరాజాణ కనులతో మమ్మల్ని పోలుస్తారుకాని వేటాడటం మానరు ,ఇంట్లో ఆక్వేరియం పెట్టి చిత్ర చిత్రాల చేపల్ని పెంచి తమ స్వేచ్చకు బంధం వేశారని ఈసడించాయి .

‘’నెత్తురు లేని ప్రాణులని  నేరుగా గొంతులు గోయ బోక మ –మ్మెత్తిలి రక్కుచు ,పోలుసులూడగ జేతురుప్రాణము౦ డ గన్

తుత్తినియల్  తెగించి మము దుర్భర హింసల పాలు జేయ ,మీ-చిత్తము లెట్టు లోప్పే జలజాతులు సైతము ప్రాణులే కదా ‘’ అంటూ తమను  చేసే చిత్రవధ వర్ణిస్తూ బావురు మన్నాయి .

ధాన్యపు కంకుల్ని నోటకరచుకొని ఇళ్ళ వసారాలలోఅంద మైన  గూళ్ళు కట్టి కిచ కిచలతో స్వేచ్చాజీవుల్లా విహరించే పిచ్చుకని ఇప్పుడు తుపాకీ గుండుకు కూడా కనిపించక మాయమై పోయాయి .దీనికి కారణం మానవ నైజమే ప్రకృతి సమతుల్యతను కాపాడక పోవటమే .వాటి ఆరాటం విన్నాడు కవి గుండె చెరువైంది వాటి శోకం తో –

‘’పుల్లలు నోట దెచ్చి ,పూరి బోయుచు గుండ్రని గూళ్ళు గట్టుకన్ –ముళ్ళ పొదళ్ళ నైన మరి ముద్దుగ నుందుము గుంపు గూడి ,మీ

కళ్లము లందు గింజలను కమ్మగా నోటితొ నార గించుచున్-అల్లన చెట్ల పైన తిరుగాడుచు నుంటిమి ఇంతకాలమున్ ‘’అని తమ పూర్వ వైభవాన్ని చెప్పుకొని ఇప్పుడు ‘’కాలం మారి పోచ్చి –కలికాలం వచ్చి గాలి నీరు ఆకాశం కలుషితాలై   భూమిపైనే కాక చంద్ర మండలం పైనా ఉండటానికి ఆరాట పడుతున్నారు మీ మానవులు .కరెంటు దీపాలవలన పగలేదో రాత్రేదో తెలియటం లేదు ప్రేలుడు శబ్దాలతో చెవులు పగిలి పోతున్నాయి .దుర్గంధం శ్వాశ నాళాలు చిల్లులు పడుతున్నాయి వాతావరణం భీతావరణం అయి  ఫాక్టరీ పొగలు వాహనాల రోడ్లు , ,కర్బనాల కాలుష్యం ఉద్గ మించే ఉద్గారాలు మధ్య పక్షిజాతి బతక లేక చస్తోంది  గుడిసెలు భవనాలై వృక్షాలను కూల్చి వేస్తుంటే కాకులు గ్రద్దలకు ఆవాస౦కరువై అతి వృష్టి అనా వృష్టి ఆశనిపాతమైతే ,అభ్రగాలన్నీ అంతరించి కరువు కాటకాలవల్ల   గండ భేరు౦డాలు గగనమే అయ్యాయి ‘’అని విలపించి

‘’పచ్చదనము లేదు –పాప పుణ్యము లేదు –నీతి లేదు ,నిలువ నీడ లేదు –చల్లదనము లేదు -,శాంతి సౌఖ్యము లేదు –బ్రతుకు లేదు బ్రతుక భవిత లేదు ‘’అని దీన ప్రాణి బాధను కళ్ళకు కట్టించారుకవి .దడులు ,దప్పర్లపై దర్శనమిచ్చే కాలకంఠాలు,పందిరి పాకలపై వాలే బండారు పిట్టలు ,తుర్రుమనే బుర్రు పిట్టలు ,ముక్కుతో  చెట్టు కాండాన్ని  తొలిచే వడ్రంగి పిట్టలు ,కన్జరీటాలు,పొట్టి గిజిగాళ్ళు ,పాలపిట్టలు ,పూరేళ్లు ,కంటికి కనిపించటమే లేదని ఇదంతా మానవ స్వయం క్రుతాపరాధమేనని ప్రకృతి హనానమే దీనికి కారణమని కవి నిష్కర్షగా చెప్పాడు చివరికి

‘’శాస్త్ర వేత్త లార ,సంఘ సేవకులార –ధర్మ నిరతులార ,ధన్యులార –సుకృత కార్యము లచె ప్రకృతిని కాపాడి –పక్షి జాతికొరకు పాటు బడరె’’అని పక్షిజాతి తరఫున వకాల్తా తీసుకొని న్యాయం చేయమని ప్రజా కోర్టును వేడుకోన్నారుకవి .ఇక మూషికశోక కావ్యాన్ని  వినిపిస్తాడు కవి .  ‘’గజ ముఖ వాహనం అని పొగుడుతూ ఇంట్లో దూరితేమాత్రం బోనులు పెట్టి మందులుపెట్టి  పిల్లుల్ని పెంచి  పచంపుతారు .పొట్టిగా ఉన్న కారణం తో ‘’చిట్టెలుక ‘’అని చీదరిస్తారు ‘’కాని

‘’ముందుగ సూది మందులను మూషిక మూకల కిచ్చు చుండి ,మీ –రందరు వాడు చుండెదరు  హాయిగ జీవిత కాల మంతయున్ ‘’అని తమలను ఎలా వాడుకొంటున్నారో మనుషులు తెలియ జేసి ,’వ్రేలెడు లేని ఎల్కలనువేదనలకుం గురి జేతురేల,మీ-జోలికి రాని మమ్ము పరిశోధన పేర ప్రయోగ శాలలన్ –మూలుగ జేసి మా బ్రతుకు ముంచుట న్యాయమా ?’’అని ప్రశ్నించింది . ‘’మీ క్షేమం కోసం మా బ్రతుకు ఏమార్చటం ఏం న్యాయం ?అంది

‘’అవని యందు నరులు అవసానము వరకు –ఆధిపత్యము గను బ్రతుకు చుండ

అల్పప్రాణికిటుల అవకాశము లేక –స్వల్ప కాలమందె సమయు  చుండె’’’’అని గోడు గోడున బాధ  వెళ్ళగక్కుకొని అల్పప్రాణులను మానవులు ఎంత నీచంగా చూస్తూ స్వార్ధానికి వాడుకొంటు న్నారో తెలియ జెప్పింది .

సర్పాల కూ స్వగతాలుంటాయి .దాన్నీ ఆవిష్కరించాడుకవి సర్ప విలాపం లో .’’చీమల పుట్టల్లో దూరి ఎప్పటికైనా బయటికి వస్తే చావ చితక కొడతారు .భూలోక వాసులు భూత దయ లేక వెంటాడి వేటాడి చంపుతారు. మాలోకమే మేలు అనుకొంటే ఆ నాగ లోకం ఎక్కడో మాకు తెలీదు ఆదిశేషుని దగ్గర మొర పెట్టుకొందామంటే వైకుంఠ ద్వారం ఎక్కడుందో అంతు బట్టటం లేదు .శంకరాభరణాల వంక చేరుదామంటే కైలాసమార్గం తెలీదు .నాగ దేవత అని కొలుస్తారుకాని కనిపిస్తే మాత్రం కాల రాస్తారు .అడవుల్ని ఆరగించటం తో అజగరాలు ,కొండా కోనా పిండి చేస్తుంటే కొండ చిలువలు ,పుట్టలు పొదలు నాశనం చేస్తుంటే నాగులు ,చెట్టూ చేమా పోయి వాన కోయిలలు అరుదై పోయాయి .పొట్టకూటికోసం పెట్టెల్లో బంధించి ఆడిస్తున్నారు  మా జీవితాలతో నే ఆడుకొంటున్నారు –అని ‘’

‘’నాగిని నృత్యమంచు నవ నాడులు పొంగగ నర్తకీమణుల్ –భోగము వోలె హస్తములు మోమున కెత్తుచు ,మొగ్గ వేయుచున్

తీగెలు సాగగన్ తనువూ తీపులు బెట్టగ దొరలు చుందురే –నాగులు నేలపై నిటుల నాట్యము సేయగ జూచినారటే’’అని మానవ వికృత చేష్టలను ఎండ గట్టింది .పాముల్ని కోసుకు తింటూ కోరలు పీకి హింసిస్తూ ,విషం తో ఔషధాలు చేసి అమ్ముకొంటూ ,చర్మాలను ఒలిచి వేష భూషణాలు తయారు చేసి ధరిస్తూ ,చాదస్తంగా చలన చిత్రాలలో చపల చిత్తంగా నటింప జేయిస్తూ ,మొక్కులు చెల్లిస్తూ చలిబిడి పె, పాలు పోస్తూ పూజిస్తూ కూడా కనబడితే హత్య చేస్తున్నారు .పాలు తాగాలంటే పెదవులేలేవు పాయసం తిందామంటే నాలుక చీలి ఉంది ,సాధ్యం కాదు కనుక మీ నైవేద్య భాగ్యాలు మేము తినలేం .కలుగులో ఎలుకలే మా ఆహారం .ప్రయాణం చేసేటప్పుడు మేము ఎదురైతే దోషమా ,

‘’గరుడ పక్షులువెంటాడి తరుము చుండు –కరకు ముంగిసల్ తనువులు తురుము చుండు

నరులు దొరికించుకొని నెల జారుచు చుండ –బ్రతుకు సాగించు టెట్టులో భద్రముగను ‘’అని పాము విలపించింది .

‘’పక్షుల మయ్యి ,పై కేగురు పాటవ మెంత యు లేక నేలపై –రక్షణ లేని మమ్ము సుకరంబుగ పోషణ జేసి మానవుల్

భక్షణ జేయ  నెంచియు కృపాణము చేసేడిచెంత జేర మా –చక్షుల నీరు జారినది జాలిగ’’కుక్కుట శోక కావ్యమై ‘’అని కోడి విలాపం మొదలు పెట్టాడుకవి .’’కంచె చేను మేసినట్లు 21 రోజులు పెంచి పోషించి పండగకో పబ్బానికో చుట్టాలోచ్చారానో కోసుకు తింటారు .కోడికూర తింటే కొవ్వు పెరిగి గుండెపోటు వస్తుందని తెలిసినా తినటం మానరు .పు౦జుక్రీడలతో  జూదం ఆడుతారు .కోడిపుంజులాట కొంపలు ముంచినా మానలేరు

‘’బుద్ధుదహింస ధర్మమే బోధ జేసే –రామ కృష్ణు దాహిమ్సచే  ప్రేమ వడసె

గాంధి సత్యగ్రమహింస గాదె చూడ –హింస మానవ ,మానవ హితము కోరి ‘’అని కొక్కొరో కొ సూక్తి చెప్పింది .

‘’శ్వాన విలాపం ‘’లో కుక్క కూడా మనిషికి గడ్డిపెట్టింది .కనిపిస్తే రోకటితో కొడతారు .తాడుతో గొలుసుతో బంధించి పెంచుకొంటారు .విశ్వాసానికి మారుపేరని పొగడుతూనే ,కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటూ ,కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేయి౦చు కొంటారు .సంకరజాతి కుక్కలపై  ఉన్నమోజు స్తానికులమైన ఊరకుక్కలపై లేదు

‘’చిత్త కార్తె లో మాత్రమేచిత్తగించి –పిల్లలను గను చుండు మా పిచ్చి తల్లి

బిడ్డ లెట్లు బ్రతుకు నంచు బెంగ టిలుచు –ఒడిని పాలిచ్చి పెంచును కడుపు నిండ’’

అని తమ వీధి బాగోతం చెప్పుకొన్నది .జంతు ప్రేమికులకు తమపై జాలి లేదని ,జీవకారుణ్యం వారికీ పట్ట లేదని వాపోయింది –‘’

‘’పక్షి మృగ జాతు లన్నింటి ప్రాణమొకటే –అన్ని ప్రాణుల నుండేడి నాత్మ యొకటే

మహిని మనిషికి కుక్కకు మరణ మొకటే –జన్మ ఏదైన ప్రాణికి జనన మొకటే’’అంటూ శంకరాచార్యునిలా అన్నమయ్య లా తత్వ బోధ చేసింది .

‘’మేష విలాపం ‘’లో మేక మేమే అంటూ మౌన రోదనతో గుండెలోని బాధ కోడిలాగానే వెళ్ళ గక్కింది .’’క్షుద్ర పూజల్లో మమ్మల్ని నరకడం న్యాయమా ,జంతుబలి నిషేధం గా ఉన్నా పాటించక పోవటం పాడికాదు అని బుద్ధి చెప్పింది

‘’భక్తి మార్గము నందునె ముక్తి గనగా –శక్తి యుక్తుల యందు నాశక్తి ఏల

సాత్వికాహార మందునే సత్తువవుండ –మాంస భక్షణ పై మీకు మక్కువేల ?అనిచీవాట్లు  పెట్టింది .

‘’లేత చిగురు మేయు లేడి పిల్లల నైన –ఆకులలములు దిను మెకమునైన –

సాదు జంతువైన చంప బూనుదు రేల-కూటి కోసమేన వేట యకట ?’’అని మృగయా వినోదం పాపం అన్నది ‘’మృగ విలాపం ‘’లో లేడి .పంచ భూతాలూ కూడా తమ గోడును  ‘’భూత విలాపం ‘’గా వినిపించాయి

‘’ఆకస మందు వాయువు అందును అగ్నియు ,అగ్ని వాయువుల్ –ఏకము కాగ నందు జలమేర్పడయా జలమందు పృథ్వి ,ని

ర్వాకము నొంద, పృథ్వి పయి వ్యస్తముగా జనియించె నోషధుల్ –ఆకర మాయే దారుణి చరాచర సృష్టికి విశ్వ మందుననన్ ‘’అని ఉపనిషత్ లలోని  ,ప్రాణి అవిష్కారాన్ని ఒక్క పద్యం లో చక్కగా చెప్పాడు కవి .చివరగా

‘’విశ్వ శోధన జేయు మీ విజ్నులకును –విశ్వ కారణ మేమియొ విదితమైన

ఆత్మ సాధన యందు తాదాత్మ్య మొంద-అంతరంగము నందునే యరయ లేర’’అని విజ్ఞాన వేత్తలకు చక్కని సుద్ది చెప్పి బాహ్య శోధనం కంటే అంతరంగ శోధన మంచిదని హితవు చెప్పాడు కవి దక్షిణా మూర్తి .

ఈ కవికి పద్యం ఒక రసప్రవాహమై నడిచింది .సందర్భ భావ శుద్ధి తో ప్రతిపద్యం హృద్యమైనది .పదాల వెదుకు లాట లేదు .అవి వాటి కవసరమైన స్థానాల్లో కూర్చుని పద్యానికి అందం లయ ,సౌభాగ్యం కల్పించాయి. కవి సహజ కవి అనిపించాడు . సుమారు అయిదేళ్ళక్రితం ఇలాగే ఒక కవి కోడి మేక ఆవు లఅంతరంగం పై పద్య కవిత్వం రాస్తే ఆ నాటి విజయవాడ ఆకాశవాణి డైరెక్టర్ మాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు నాకు పంపి సమీక్ష చేయించి నాతో రికార్డ్ చేయించి రేడియో లో ప్రసారం చేయించిన సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చింది .సమస్త ప్రాణికోటి మీదా కవి కున్న దయా దాక్షిణ్యాలు చూస్తే ఆయన్ను ‘’దయా దాక్షిణ్య  దక్షిణా మూర్తి ‘’అనటం భావ్యమని పించింది .కవి స్వగ్రామ౦ తెలంగాణా లోని ఆదిలాబాద్ మండలం లో లక్సెట్టి పేట మండలం లోని ఇటిక్యాల . మరిన్ని అర్ధవంతమైన కావ్య రచన కవి నుండి ఆశిద్దాం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-16 –ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.