నేపధ్యం –పుష్పదంతుడు గాంధర్వ రాజు, శివ భక్తుడు .సంగీత ప్రవీణుడు .కామ రూపం లో ఎవరికీ కన పడకుండా ఆకాశమార్గం లో సంచరించ గలవాడు .ఇతని సంగీతవైదుష్యాన్ని మెచ్చి ఇంద్రుడు తనకొలువు అయిన దేవేంద్ర సభలో పుష్పదంతుని సంగీత విద్వాంసునిగా నియమిస్తాడు .
ఒక సారి పుష్పదంత ప్రభువు ఆకాశమార్గం లో అదృశ్యం గా సంచరిస్తూ చిత్ర రధుడు అనే రాజు పాలిస్తున్న నగరాన్ని సందర్శిస్తాడు .చిత్ర రధ రాజూ గొప్ప శివ భక్తుడే .పరమేశ్వర పూజకోసం ఒక గొప్ప పూల తోటను పెంచుతాడు .అది వివిధ పుష్పాలతో ఎప్పుడూ శోభాయమానంగా ఉంటుంది .పుష్పదంతుడు ఈ ఉద్యానవనాన్ని చూసి పరవశించి పోతాడు .అందులో ప్రవేశించి పూలు కోస్తాడు .అదృశ్య రూపం లో ఉండటం వలన ఆతనిని రక్షక భటులు చూడలేక పోతారు .రెండు మూడు రోజులు ఇలాగే గడిచాక చిత్ర రధ రాజు పరమేశ్వర పూజకుతన తోటలో పూలు లేక పోవటం గమనిస్తాడు .భటులను ప్రశ్నిస్తే వాళ్ళు రాత్రీ పగలు తాము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కాపలా కాస్తున్నామని పూలు ఎవరు కోసి మాయం చేస్తున్నారో అర్ధం కావటం లేదని రాజుకు విన్న వించారు .వారు అత్యంత విశ్వాస పాత్రులు కనుక వారి మాట నమ్మి రాజు పూల దొంగను ఎలా పట్టుకోవాలనే విషయమై చాలా మధన పడ్డాడు.
మర్నాడు రక్షక భటులను పిలిపించి రాజు అన్ని పూల చెట్ల కిందా మారేడు దళాలను వెదజల్లమని ఆజ్ఞాపిస్తాడు భటులు అలాగే చేశారు .మారేడు పత్రి శివునికి అత్యంత ప్రీతికరమైనది .దాన్ని కాలితో త్రోక్కితే పరమేశ్వరునికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుందని రాజు భావించాడు .ఆ రోజు పుష్పదంతుడు యదా ప్రకారం అదృశ్య రూపం లో పూదోట లో ప్రవేశించి నిర్భయంగా పూలు కోస్తాడు .అలాకోయటం లో అనుకోకుండానే మారేడు దళాలను కాళ్ళతో తొక్కుతాడు .అప్పుడు శివుని ధ్యానానికి భంగం ఏర్పడుతుంది .వెంటనే పుష్పదంతునిపై ఆగ్రహోదగ్రుడై దేవ జాతికి చెందిన గాంధర్వ రాజు పుష్పదంతుడు తనకు అత్య౦త ప్రీతికరమైన పవిత్రమైన మారేడు దళాలను తొక్కటం ,పూల దొంగతనానికి పాల్పడటం గొప్ప నేరంగా భావిస్తాడు .గంధర్వ రాజు పుష్ప దంతుని దివ్య సర్వ శక్తులను నశింప జేస్తాడు శివుడు .ఆకారణంగా అతడు రక్షక భటులకు కనిపించి దొరికి పోతాడు .వాళ్ళు బంధించి చిత్ర రధ మహారాజు సమక్షం లోకి తీసుకు వెడతారు .రాజు విపరీతమైన కోపం తో పుష్పదంతుడిని కారాగార శిక్ష విధిస్తాడు .
చెరసాలలో బంధింప బడిన పుష్పదంతుడు విచారంతో కుమిలి పోతూ,తానేదో అపచారం చేసి పరమేశ్వరునికి ఆగ్రహం కలిగించటం వలన తన దివ్య శక్తులన్నిటినీ కోల్పోయానని గ్రహిస్తాడు .పరమ శివుని సంపూర్ణానుగ్రహం సాధించటానికి చెరసాలలో ఉంటూనే పరమ భక్తి తో శివ మహిమలను వర్ణిస్తూ ‘’శివ మహిమమ్నః స్తోత్రం’’ రాశాడు .స్తోత్రం రచన పూర్తికాగానే పరమేశ్వరుడు, తన మహిమలను పరమాద్భుతంగావర్ణించినందుకు పరమ ప్రీతి చెంది ,అనుగ్రహించి పుష్పదంతుని దివ్య శక్తులన్నీ తిరిగి అనుగ్రహిస్తాడు .చెరసాల నుండి బయట పడిన పుష్పదంత గ౦ధర్వ రాజు చిత్ర రధ మహా రాజును దర్శించి తాను చేసిన అపరాధాన్ని మన్నింఛి ,క్షమించమని ప్రార్ధిస్తాడు .దయాళువు అయిన మహారాజు శాంతించి,క్షమించి పుష్పదంతుని విడిచి పెడతాడు .పుష్పదంతుడు మళ్ళీ తన గ౦ధర్వ లోకానికి చేరుకొంటాడు .
ఈ కద తర తరాలుగా ప్రచారం లో ఉంది .కాని ఈ కధకు ఆధారం కాని పుష్పదంతుని కాలం కాని ఇదమిత్ధం గా నిర్ణయించటానికి వీలు లేక పోతోంది .పుష్పదంతుని శాపం మాత్రం ,ఆస్తిక జనాలకు గొప్ప వరమై పుష్పదంత గ౦ధర్వ రాజు శివ మహిమలను వర్ణిస్తూ రాసిన మహా గొప్ప శివ స్తోత్రం ‘’శివ మహిమ్నః స్తోత్రం’’ దక్కింది .
దీనికి, సంస్కృతాంధ్ర ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుగులో అర్ధ తాత్పర్యాలు రాసి శివమహిమతోబాటు పుష్పదంత కవి కవితా సామర్ధ్యాన్ని తెలియ జేశారు .ఇదే ఈ నా రచనకు ఆధారం అని సవినయంగా మనవి చేస్తున్నాను .
1-మహిమ్నః పారంతే పరమ విదుషో యద్య సదృశీ –స్తుతి ర్బ్రహ్మా దీనామపి తదవసన్నా స్త్వయి గిరః
అధా వాచ్యస్సర్వః స్వమతి పరిమాణావధి గృణన్-మమాప్యేష సోత్రే హర నిరప వాదః పరికరః ‘’
తాత్పర్యం –పరమేశ్వరా !నువ్వు నన్ను పిలిచి ‘’పుష్పదంతా ! నాసంపూర్ణ మైన మహిమను స్తుతి౦చ టానికి పూనుకున్నావు .నువ్వు పండితుడవు కాదు .ఇది నీలాంటి వాళ్లకు తగిన పని కాదు ‘’అని అంటావేమో –అలాగైతే నీ మహిమ వర్ణించటానికి బ్రహ్మాది దేవతల మాటలూ శక్తిహీనాలే అవుతాయి కదా .వాళ్ళ స్తుతులూ అసమగ్రాలే .తమ బుద్ధి శక్తిని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రతివాడూ సామర్ధ్యం లేని వాడు అవటం వలన నిందింప దగ్గ వాడే అవుతాడు .కాబట్టి నేను నిన్ను స్తుతించటానికి చేస్తున్న ప్రారంభం ఎలాంటి ఆక్షేపణా లేనిదే .మహా మహుల స్తోత్రాలే సరితూగనప్పుడు ,నేను చేసే ఈస్తుతి ఏవిధంగానైనా దోషం లేనిదే అవుతుంది .
2-అతీతః పంధానం తవ చ మహిమా వాజ్మనసయోః -అదద్వ్యావ్రుత్యా య౦ చకిత మభిదత్తే శ్రుతి రపి
స కస్య స్తోతవ్యం ?కతి విధ గుణః ? కస్య విషయః ?-పదేత్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః ‘’?
భావం –పరమేశా !నీ మహిమ వాక్కులద్వారా ,మనసుద్వారా ,ఊహించటానికి అతీతమైనదే .వేదం కూడా నీమహిమ వర్ణించి చెప్పటానికి శక్యం కాక ఇది కాదు ,ఇదికాదు అంటూ భయం తో చెబుతోంది .అలాంటి నీ మహిమను ఎవరు స్తుతించగలరు ?గుణాల లెక్కకు అది అందదు .నీ మహిమ వర్ణించటానికి ఏదీ విషయమే కాలేదు .నీ మహిమ వర్ణించటం లో ఎవరి మనసైనా ,వాక్కైనా అధోగతి పాలుగాక తప్పదు .
3-మధుస్ఫీతా వాచః పరమమృతం నిర్మితవత –స్తవబ్రహ్మన్ కిం వాగపి సుర గురో ర్విస్మిత పదం ?
మమ త్వేతాం వాణీం గుణకధన పుణ్యేన భవతః –పునామీత్యర్దే స్మిన్ పుర మధన !బుద్ధి ర్వ్యవసితా .తాత్పర్యం –సర్వ వ్యాపీ ,పరబ్రహ్మ స్వరూపీ పరమేశ్వరా !అత్యంత శ్రేష్టమైన వేదవాక్కుల్ని నువ్వే కూర్చావు .అవి అమృత సమానాలు .తేనేలాగా మహా తియ్యనైనవి .అలాంటి వేదవాక్కుల్ని రచించిన నీపై దేవ గురువు బృహస్పతి స్తుతిస్తూ చెప్పిన మాట కూడా చాలా పేలవంగా ఉండి ఆశ్చర్యం కలిగిస్తుంది .అలాంటి నీ గుణాలను ఈ స్తోత్ర రూపం గా స్తుతించటం వలన కలిగే పుణ్యం వలన నా వాక్కును శుభ్రం చేసుకొంటాను .త్రిపుర సంహారీ ఈశ్వరా !ఈ విషయం లో నా బుద్ధి నన్ను ప్రోత్సహిస్తోంది .మన్నించు .
సశేషం
కార్తీక మాస శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-31-10-16 –ఉయ్యూరు