పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -4
16-మహీ పాదా ఘాతా ద్వ్రజతిసహసా సంశయ పదం –పదం విష్ణోః భ్రామ్యద్భుజ పరిఘ రుగ్ణ గ్రహణం
ముహుర్ద్యౌ రౌస్ధ్యంయాత్య నిభ్రుత జాడా తాడిత తటా-జగద్రక్షాయై త్వం నటసి నను వామైవ విభుతా ‘’
భావం –ఉమాపతీ !సంధ్యాసమయం లో ఒక రాక్షసుడు లోకాలను బాధిస్తుంటే ,వాడిని భయపెట్టి ,లోకాలను సంరక్షించటం కోసం నువ్వు సంధ్యా నాట్యం చేస్తున్నావు .అప్పుడునీ అడుగుల ఒత్తిడికి భూమి హటాత్తుగా తానున్నానో లేనో ననే అనుమానం పొందుతోంది .ఆ నాట్యం లో అడ్డ గడియ లాంటి నీ భుజాల ను నువ్వు త్రిప్పు టూ ఉంటె విష్ణు స్థానమైన ఆకాశం విరిగిన గ్రహ సమూహాలై పోతోంది .చెదిరే నీ జటా జూటం చేత మాటి మాటికీ దెబ్బలు తింటున్న స్వర్గం ప్రతి దెబ్బకీ స్థితిని తప్పుతోంది .సహింప శక్యం కాని నీ తాండవనృత్యం నీకు గొప్ప ఆధిపత్యాన్ని కల్పించటం పరమ మనోహరంగా ఉంది .
17-వియద్వ్యాపీ తారా గణ గుణిత ఫేనోద్గమ రుచిః-ప్రవాహో వారాం యః పృషతలఘు దృస్టశ్శిరసితే
జగద్వ్యీపాకారం జలధి వలయం తేన కృత మి –త్యనే నైవోన్నేయం ధృత మహిమ దివ్యం తవ వపుః’’
భావం –రుద్రా ! గంగ ఆకాశమంతా వ్యాపించి ,నక్షత్ర సముదాయం చేత ఎన్నో రెట్లుగా ఆవిర్భవిస్తున్న గంగ నురుగు తెల్లగా ఉంది .ఆ గంగా ప్రవాహం నీ శిరసుపై చిన్న నీటి బిందువులుగా దర్శన మిస్తున్నాయి .జగత్తు అంతా ఆ గంగా ప్రవాహం చేత ఆవరి౦పబడి ఒక ద్వీపాకారంగా కనిపిస్తోంది .అంతటి శక్తిగల గంగా ప్రవాహం నీ శిరసుపై చిన్న చిన్న నీటి బిందువులుగా కనిపించటం చేత నీ దివ్య సుందర దేహం మహా మహిమాన్వితమైనదని స్పష్టంగా చెప్పకనే చెబుతోంది .
18-రధః క్షోణీ యంతా శతధృతి రగేంద్రో ధనురధో –రదా౦గే చంద్రార్కౌ రధ చరణ పాణిశ్శర ఇతి
దిధుక్షోభే కోయం త్రిపుర తృణ మాడంబర విధి –ర్విధేయైః క్రీడంత్యో న ఖలు పరతంత్రాః ప్రభుధియః’’
భావం –గంగాధరా !త్రిపురాసురులు నీకు గడ్డిపోచాలాంటి వారు .వాళ్ళను కాల్చాలని సంకల్పించావు .అప్పుడు భూమి అంతా నీకు రధమైంది .బ్రహ్మ సారధిగా ,మేరుపర్వతం ధనుస్సుగా ,సూర్య చంద్రులు రధ చక్రాలుగా అమరిపోయారు .ఆ అల్ప దుస్ట రాక్షస సంహారానికి నీకు ఇంతటి ఆడంబరం అవసరమే లేదు .సమస్త లోకాలను శాసించేవారి బుద్దులు ఇతరులపై ఆధార పడవు .ప్రభువుల బుద్ధులు విధేయులతో వినోదించాలని ఉబలాట పడుతూ ఉంటాయి .అందుకే త్రిపురాసుర దహనానికి కావాలనే నువ్వు ఇంతటి పటాటోపాన్ని ప్రదర్శించావు .
19-హరిస్తే సాహస్రం కమల బలిమాధాయ పదయోః –యదే కోనే తస్మిన్నిజ ముదహరన్నేత్ర కమలం
గతో భక్త్యుద్రేకః పరిణతమసౌ చక్ర వపుషా –త్రయాణా౦ రక్షాయై త్రిపుర హర జాగర్తి జగతాం ‘’
భావం – త్రిపురహరా హరా!విష్ణువు నీ పదద్వయాన్ని వెయ్యి కమలాలతో అర్చించాలని సంకల్పించి సేకరించి ఉంచితే అందులో లెక్కకు ఒకటి తగ్గింది .వెంటనే పద్మవంటి తనకన్నునే పెకలించి పద్మ౦గా సమర్పింఛి అర్చించాడు . .విష్ణుమూర్తి అచంచ భకక్తి యొక్క ఆవేశమే చక్రం గా మారి ఆయన హస్తాన్ని అలంకరించి విష్ణు చక్రమని పిలువ బడుతోంది .ఆ విష్ణు చక్రమే సమస్త లోక రక్షణకు జాగ్రుతమై నిత్యం మేలు కొనే ఉంటుంది .భక్త్యావేశం తో సమర్పి౦ప బడిని విష్ణు నేత్రమే చక్ర రూపం పొంది హస్తాన్ని అలంకరించి సర్వ లోక రక్షణలో నిత్య జాగృతంగా ఉన్నది .
20-క్రతౌ సుప్తే జాగ్రత్ త్వమసి ఫలయోగే క్రతుమతాం –క్వ కర్మ ప్రధ్వస్తం ఫలతి పురుషారాధన మృతే
అతతస్త్వాం సంప్రేక్ష్య క్రతుషు ఫలదాన ప్రతిభువం –శ్రుతౌ శ్రద్ధాం బధ్వా దృఢ పరికరః కర్మసు జనః ‘’
భావం –యజ్నేశా !ఏ యజ్ఞం అయినా ఎప్పుడో ఒకప్పుడు పూర్తి కావాల్సిందే. యజ్ఞం చేసినవాడికి ఫలాన్ని అందించటం లో నువ్వు ఎప్పుడూ సంసిద్ధంగా ముందే ఉంటావు. యజ్ఞం అనిత్యమైంది ,జడం కూడా .అది ఫలాన్ని ఇవ్వ లేదుకదా ఏకర్మకైనా ఫలదాతవు పురుషోత్తముడవైన నువ్వే .నిన్ను ఆరాది౦చకపోతే ఫలం ఎలా లభిస్తుంది ?జనాలకు ఈ విషయం బాగా తెలుసుకనుక ,యజ్ఞం ద్వారా నీ అనుగ్రహం పొందాలని వేదం పై పూర్తీ విశ్వాసం తో వేదోక్తాలైన యజ్ఞాలను నిర్వహిస్తున్నారు .
‘’పురి శరీరే శేతే పురి దేహే సీదతీతివా పురుషః ‘’అని పురుష శబ్దానికివాచకమైన పరమాత్మకు నిర్వచనం .అంటే శరీరం లో ఉండేవాడు .’’వేదో నిత్య మదీయతాం తదుదితం కర్మ స్వనుస్టీయతాం’’అని శంకర భగవత్పాదులు ఆదేశించారు .అంటే వేదోక్త కర్మలను ఆచరించమని భావం. వేద ప్రతిపాదిత యజ్న కర్మలకు ఫలప్రదాత పరమేశ్వరుడే .
సశేషం
నాగుల చవితి శుభాకాంక్షలతో