వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -7

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -7

మల్లినాద మహా వైదుష్యం

అనితర సాధ్యమైన మేధస్సు ,పాండిత్య గరిమ శాస్త్ర పరిజ్ఞానం ,కావ్య ప్రతిభ విమర్శనా చాతుర్యం ,విశ్లేషణ సామర్ధ్యం,లోకజ్ఞానం  మల్లినాద సూరి ప్రత్యేకతలై ,ఇతార వ్యాఖ్యాతలు ఆయనకు ఆమడ దూరం లో ఉండిపోయారు .ఆయన పాండిత్య పారావారానికి అవధి లేదు .అన్ని నిఘంటువులు ,పదకోశాలు , ,,సర్వ శాస్త్రాలు ,పాణిని సూత్రాలు ,ధర్మ శాస్త్రాలు ఆయనకు కరతలామలకాలు వాచో విదేయాలు .రెండు చోట్ల మాత్రం తనను గురించి చెప్పుకొన్నాడు .రఘు వంశ వ్యాఖ్యానం లో తనను ‘’పద వాక్య ప్రమాణ పారావార పారీణ’’అని ,తనకున్న అపార శాస్త్ర పాండిత్యాన్ని సంజీవిని వ్యాఖ్య ప్రారంభం లో ఒక శ్లోకం లో తెలియ జేశాడు –

‘’వాణీం కాణభుజీ మజీగణదవాసా సీచ్చ వైయాసికీ –మంత్రస్తంత్ర మరంస్త పన్నాగ గవీ  గు౦భేషు చాజా గరీత్

వాచామాచకల ద్రహస్య మఖిలం యశ్చాక్ష పాద స్ఫురాం –లోకే భూద్యదుపజ్న మేవ విదుషాం సౌజన్య జన్యం యశః ‘’

దీనిభావం –కణాద,గౌతమ తర్క శాస్త్రాలను ,వ్యాసకృత బ్రహ్మ సూత్రాలను ,మీమాంసా వ్యాకరణాలను క్షుణ్ణంగా అభ్యసి౦చాను ,కనుక మహా మహోపాధ్యాయ బిరుదు సార్ధకం .అన్ని శాస్త్రాలలో సిద్ధాంత స్థాపనం చేసేవారినే మహా మహోపాధ్యాయులు అంటారు .శంకర భగవత్పాదులు ‘’ఈక్షితేర్నా శబ్దం ‘’అనే సూత్రానికి వ్యాఖ్యానం రాస్తూ ‘’తత్ర పద వాక్య ప్రమాణజ్నేనాచార్యేణ వేదాంత వాక్యానాం బ్రహ్మావగతి ప్రదర్శనాయ వాఖ్యాభాస ప్రతి పత్తయః పూర్వ పక్షీయ నిరా క్రియ౦తే’’అని రాసే సందర్భం లో ‘’పద వాక్య ప్రమాణజ్న ‘’బిరుదు ను బాదరాయణ మహర్షికి(వ్యాసర్షి ) విశేషంగా ప్రయోగించారని శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ గారు ‘’ఆంద్ర మాఘ కావ్య పీఠిక ‘’లో తెలియ జేశారని డా చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు తమ శిశుపాల వధ ఆంధ్రీ కృతులు అనుశీలనం లో రాశారు .

వరద రాజ కృత ‘’తార్కిక రక్షా సార సంగ్రహం ‘’కు నిష్కంటక వ్యాఖ్య ,కుమారిల భట్టు రాసిన ‘’తంత్ర వార్తికం ‘’కు వ్యాఖ్యానం ,జితేంద్ర సిద్ధి రచన ‘’న్యాస గ్రంధం ‘’కు ‘’న్యాసోద్యోతం వ్యాఖ్యతోపాటు ఒక జ్యోతిష గ్రంధాన్ని మల్లినాధుడు రాశాడని శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి రాశారని  చెరువు వారు  చెప్పారు . కాళిదాస కావ్య వ్యాఖ్యానం చేస్తూ ‘’కాళిదాస గిరాం సారం ,కాళిదాస స్సరస్వతీ –చతుర్ముఖో ధవా సాక్షా ద్వేత్తి నాన్యేతుమాద్రుశాః ‘’అని వినయం తోపలికాడు సూరి .’’’భారతీ కాళిదాసస్య దుర్వ్యాఖ్యా విష మూర్చితా –ఏషా సంజీవినీ వ్యాఖ్యా తామద్యో జ్జీవ ఇష్యతి ‘’అంటే కాళిదాస మహా కవి వాక్కులకు అనేక దుర్వ్యాఖ్యానాలు వలన అర్ధ ప్రసన్నత  కోల్పోయి  మూర్చిల్లాయనీ, సార్ధకమైన నా సంజీవినీ వ్యాఖ్య వాటికి ప్రాణం పోసి వికసింప జేస్తాయి .అని భావం.’’మల్లినాద కవిస్సోయం మందాత్మా నుజి ఘ్రుక్షయా –వ్యాచస్టే కాళిదాసస్య కావ్య త్రయ మనాకులం ‘’అని ప్రతిజ్ఞ కూడా చేశాడు మల్లినాధుడు .అల్ప బుద్ధికలవారికి అతి సునాసంగా కాళిదాస హృదయం అర్ధమయ్యేట్లు చేయటం నా విధి ‘అని భావం .

మల్లినాధుడు తొక్కిన కొత్త దారి

సామాన్యుడికి కావ్య శాస్త్రాలు చేరువవ్వాలంటే అసలు అప్పటిదాకా ఉన్న వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయి ,మల్లి నాధుని కొత్త మార్గం ఏది ?తెలియాలి .కేవలం కద తెలుసుకోవటానికి కావ్యం చదవక్కరలేదు .ఇతిహాస పురాణాలలో ఈ కధలన్నీ ఉండనే ఉన్నాయి .కావ్యం లోని విశేషాలను మనసుకు అందజేసి,ధ్వని భావ చమత్కారాలకు మురిసి ,రసాందాన్ని పొందటమే కావ్య పరమార్ధం .పండితులకు తత్వజ్నులకు ఈ రహస్యాలు తెలుస్తాయి .సామాన్యులకు అవి కరతలామలకాలు కావటం లేదు .కనుకనే వ్యాఖ్యానాల అవసరం కలిగింది  .పైకి రావాలనే విద్యార్ధులకు అందుబాటులో లేని ప్రబంధాది కావ్యాలకు కరదీపికలై మార్గదర్శనం చేస్తాయి వ్యాఖ్యానాలు ..

సాధారణ వ్యాఖ్యానాలలో అన్వయ క్రమం లో పదాలను కూరుస్తారు వీటిని అన్వయ వ్యాఖ్యలు అంటారు .మరికొన్నిటిలో కర్త ,కర్మ ,క్రియ లను ముందుగా చెప్పి తర్వాత ఆకాంక్షను బట్టి ఆ యా పదాల విశేషాలను వివరించబడుతాయి వీటిని ‘’సాకా౦క్ష వ్యాఖ్యానాలు ‘’అంటారు .అంటే పదాలకు ,పదా౦తరాలకు ఉన్న సంబంధాన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పి సంబంధాన్ని నిరూపించటం అన్నమాట .

రెండు రకాల వ్యాఖ్యానాలలో సమన్వయ ముఖ వ్యాఖ్యానం కావ్యాల విషయం లో సమన్వయ సారళ్యాలకు  సులభంగా అర్ధం చేసుకోవటానికి ఉపకరిస్తుంది .ఇలాంటి వ్యాఖ్యానాలనే టీక అంటారు .వీటిలో పదాలకు సంబంధించి అర్ధాలకు సంబంధించి విశేషాలు సమాసాలకు విగ్రహ వాక్యాలు ,ప్రకృతి ప్రత్యయ విభాగాలు ,కఠిన పదాలకు అర్ధాలు ,వాటికి నిఘంటు ప్రమాణాలు ,అలంకార విశేషాలు ,వాటి లక్షణాలు ,అందులో చెప్పబడిన శాస్త్ర విషయాలణు వివరించే ప్రమాణ వాక్యాలు మొదలైన వాటితో సమగ్రంగా ఉంటుంది .ఇవన్నీ లేకుండా కేవలం పద సమన్వయము మాత్రమే ఉంటె ‘’లఘు వ్యాఖ్య ‘’అంటారు .సమన్వయము లేకుండా కఠిన పదాలకు అర్ధం మాత్రమే చెప్పే వాటిని ‘’గచ్చద్వాఖ్యలు ‘’అంటారు .కావ్యం లోని విశేషాలను మాత్రమే చెప్పి ,అందుకు సంబంధించిన శాస్త్ర ,లక్షణ గ్రంధాది ప్రమాణాలతో ,ఉదాహరణలతో వివరించే వాటిని ‘’టిప్పణి’’అంటారు .ఇందులో ఉన్న లాఘవాన్ని బట్టి లఘు టిప్పణి అన్నారు ఇలా వ్యాఖ్యానాలలో ఉన్న రకాలను చెరువు వారు వివరిచారు .

సంస్కృత కావ్య నాటకాదులలో అన్వయం ద్వారా సమగ్ర వ్యాఖ్యానంతో వాటిలోని విశేషాలను పాఠకుడు తేలికగా గ్రహిస్తాడు .ఇలాంటి పరిజ్ఞానాన్ని ‘’సాహిత్యం ‘’అంటారు .సాహిత్యం అంటే సహి తత్త్వం .శబ్దార్ధ ,గుణాలంకార ,రసభావ వివిధ శాస్త్ర విషయ సహితం కనుక ఇది సాహిత్యమయింది .సాహిత్యం అంటే ఇవన్నీ ఉన్నది . సాహిత్య పండితుడు అంటే ఇవన్నీ పూర్తిగా తెలిసినవాడు అని  అర్ధం .మల్లినాధుడు అన్వయ ముఖ సవ్యాఖ్యాన మార్గమే తొక్కి మార్గ దర్శియై ,ఆదర్శ ప్రాయమైనాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-16 –ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.