వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -8

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -8

వ్యాఖ్యానాలు మల్లినాధుడు రాయలేదా ?

మల్లినాధుని కుమారుడు కపర్ది పండితుని ఆపస్తంభ గృహ్య సూత్రాలకు ‘’తాత్పర్య దర్శనం ‘’రాసిన సుదర్శనా చార్యుడు –‘’యత్కృతం వేద వద్భాష్య మాద్రి యంతే విపశ్చితః –స కపర్దీ చిరంజీయా ద్వేద వేదంగతత్వవిత్ ‘’అని ప్రశంసించాడు .మల్లినాధుని తమ్ముడు పెద్ది భట్టు అని వీరిద్దరూ కపర్ది కి కుమారులని పెద్ది భట్టు మహా మహోపాధ్యాయుడై నైషదాదులకు వ్యాఖ్యానం రాశాడని మాతులేయుని క్రతువులో సర్వజ్న సింగ భూపలునిచే సత్కరింప బడినాడని ,ఈ పెద్ది భట్టు కొడుకు కుమార స్వామి అని ,ఇతడే ప్రతాప రుద్రీయానికి రత్నాపన వ్యాఖ్య రాశాడని ,ఈతని కొడుకే  శంభువు  అని ,యితడు విశ్వజిద్యాగం చేశాడని ,ఇతని కొడుకు భాస్కరుడు ,అతనికొడుకు నాగేశ్వర యజ్వ సర్వ ముఖ యాగం చేశాడని ,నాగేశ్వరునికొడుకు కొండుభట్టు వేద వేత్త అని ,కొండు భట్టు కొడుకు నాగేశ్వరుడు ,అతని కొడుకు నారాయణుడు ,.నారాయణ పండితుడు చంపూ రామాయణానికి ‘’పద యోజనం ‘’వ్యాఖ్య రాశాడని ,అందులోని అవతారిక లో –

‘’కోలాచలాన్వయాబ్దీ ౦దు ర్మల్లినాధో మహా యశాః-శతావధాన విఖ్యాతో వీర రుద్రాభి వర్నితః

మల్లినాదాత్మజః శ్రీమాన్ కపర్దీ మంత్ర కోవిదః –అఖిల శ్రౌత కల్పస్య కారికావృత్తి మాతనోత్

కపర్ది తనయో ధీమా న్మల్లినాదోగ్రజః స్మృతః –ద్వితీయ స్తనయో దీమాన్పెద్ది భట్టో మహోదయః

మహోపాధ్యాయ ఆఖ్యాత స్సర్వ దేశేషు సర్వతః –మాతులేయ క్రతౌ దివ్యే సర్వజ్ఞే నాభి వర్షితః

గణాధిప ప్రసాదేన ప్రోచే మంత్ర వరాన్ బహూన్ –నైషద జ్యోతిషదీనాం వ్యాఖ్యాతా భూజ్జ గద్గురుః

పెద్ది భట్ట సుతః శ్రీమాన్ కుమార స్వామి సంజ్ఞకః –ప్రతాపరుద్రీ యాఖ్యాన వ్యాఖ్యాతావిద్వదిగ్రమః ‘’

దీన్ని బట్టి మల్లినాధుని తమ్ముడు పెద్దిభట్టు నైషదాది కావ్యాలకు వ్యాఖ్యానాలు రాశాడని ,కుమార స్వామి యజ్వ పెద్ది భట్టు కొడుకు అని ,మల్లినాధుని ఔరసుడుకాదని అనిపిస్తోంది .కాని ప్రతాప రుద్రీయానికి కుమార స్వామి రాసిన ‘’రాత్నాపణ ‘’వ్యాఖ్యలో ‘’శ్రీ మహా మహోపాధ్యాయ కోలాచల మల్లినాద సూరి సూనునా ,విశ్వజనీన విద్యస్య విద్వన్మణేః –పెద్ద యార్యాస్యాను జేన కుమార స్వామి సోమ పీథినా ‘’అని అతి స్పష్టంగా చెప్పేశాడు .కనుక కుమారస్వామి మల్లినాధుని చిన్న కొడుకే అని నిర్మొహమాటం గా చెప్ప వచ్చు .

శ్రీ మల్లాది సూర్య నారాయణ శాస్త్రి గారు ఈ రెండు వాదాలకు మధ్యేమార్గం గా పరిష్కారం చెప్పి పెద్ది భొట్టు కొడుకు కుమార స్వామి మల్లినాధుని దత్త పుత్రుడు అయి ఉండచ్చు అని, అందుకే కుమారస్వామి తాను మల్లినాధుని కొడుకునని చెప్పుకొని ఉండవచ్చునని ,జన్మ చేత సోదరుడైన పెద్దయార్యునికి తాను తమ్ముడిని అని రాశాడు అని ఉదాహరించారు .కాని ఇది సంగతమైన విషయం కాదని ,పొసగదని ,పెద్ది భట్టు అన్ని వ్యాఖ్యానాలురాస్తే తండ్రిపేరు చెప్పుకోక పోవటం ఆక్షేపణీయమని ఈవాదం తప్పు అని ,కుమార స్వామి పెద్దిభట్టు పేరు ఎక్కడా ప్రస్తావించలేదని ,అవతారికలో ‘’పద వాక్య ప్రమాణ పారావార పారీణుడైన మల్లినాదునికి తండ్రికి తగ్గ తనయుడుగా కోలాచలం పెద్దయార్యుడు జన్మించాడని ,ఆతని తమ్ముడినైన తాను రత్నాపణవ్యాఖ్య రచిస్తున్నానని  తెలిపాడు –ఆ శ్లోకాలు

‘’త్రిస్కంద శాస్త్ర జలదిం చులుకీకురుతేస్మయః –తస్య శ్రీ మల్లినాధస్య తన’’యోజని ‘’తాదృశః

కోలాచల పెద్ద యార్యః ప్రమాణ పద వాక్య పార దృశ్వా యః –వ్యాఖ్యాత నిఖిల శాస్త్రః ప్రబంధ కర్తా చ సర్వ విద్యాసుః

తస్యానుజన్మా తదనుగ్రహా త్త -విద్యోననవద్యో వినయావమ్రః-

స్వామీ విపశ్చి ద్వితనోతి టీకాం –ప్రతాప రుద్రీయ రహస్య భేత్రీం ‘’

అని చెప్పి అన్ని సందేహాలకు మంగళం పాడి మల్లినాధుని కొడుకులు పెద్దయార్య ,కుమార స్వామి అని ,స్వామి అన్నగారి వద్దే విద్యేనేర్చాడని అర్ధమౌతోంది .మిగిలిన వాదాలేవీ దీని ముందు నిలవవు .అంతేకాక ‘’తనయోజని తాదృశః కోలాచల పెద్దయార్యః ‘’అనటం వలన ‘’అజని ‘’అనే క్రియా పద సామర్ధ్యం చేత కుమారస్వామి మల్లినాధుని ఔరస పుత్రుడే అని నిర్దా రింప బడుతోంది అని డా.చెరువు సత్యనారాయణ శాస్త్రి తమ ‘’శిశుపాల వధ –ఆంధ్రీ కృతులు ‘’అనుశీలనం లో అన్నారు .అంతేకాక మల్లినాధుని తమ్ముడు పెద్దిభట్టు అనేక కావ్య గ్రంధాలకు వ్యాఖ్యానాలు రాసి అన్నగారిపై భక్తీ చేత మల్లినాధుని పేరుతొ వెలయించాడు అనే నానుడి లోకం లో ప్రచారం లో ఉన్నదని ,కాని అది క్షమార్హం కాదని ,కొన్ని అయినా పెద్దిభట్టు తనపేర రాసుకో కుండా ఉంటాడా అని ,కొన్ని మాఘ ,నైషద వ్యాఖ్యాన ప్రతులలో ‘’పెద్ది భట్ట కృతే ‘’అని ఉందని ,ఈ వ్యాఖ్యానాలను పూర్వం ‘’పెద్ది భట్టీయం ‘’పేరుతొ పిలిచేవారని అంటారు. ఇదీ అసంగతమైన విషయమేనని ,అలా అయితే పెద్ది భట్టునే  వ్యాఖ్యాత్రు శేఖరునిగా లోకంలో  ఎందుకు ప్రసిద్ధి చెందలేదని ప్రశ్నించి ,మల్లినాధుడు అంతటి మహా వ్యాఖ్యాన పండితుడు తమ్ముడు రాసిన  వ్యాఖ్యానాలకు తన పేరు పెట్టుకోవటానికి అంగీకరిస్తాడా అని కొట్టి పారేసి అవన్నీ కోలాచలం  మల్లినాద సూరి వ్యాఖ్యానాలే అని తేల్చి స్పష్టంగా చెప్పారు చెరువు వారు  .

మల్లినాధుడు వ్యాఖ్యాన ప్రారంభం ఎలా చేశాడు ?

మల్లినాద సూరి ప్రతికావ్య వ్యాఖ్యాన ప్రారంభం లో గణేశ ,సరస్వతి ,శివ ,కేశ వాదులను స్తుతిస్తూ ప్రార్ధనా శ్లోకాలు రాశాడు .అవి రమణీయాలై పండిత లోకం లో బహుళ ప్రచారం పొందాయి –అందులో మచ్చుకు కొన్ని –

‘’అంతరాయ తిమిరోప శాంతయే శాంత పావన మచింత్య వైభవం –

తం నరం వపుషి కుంజరం ముఖేన్మహే కిమపి తు౦దిలం మహః ‘’

‘’ఆశాసు రాశీ భవదంగవల్లీ భాసైవ దాసీకృత దుగ్ధ సింధుం –

మందస్మితై ర్నిందిత శారదే౦దు౦ ,వందేర విందాసన సుందరిత్వాం ‘’

‘’శారదా శారదాంభోజవదనా వదనాంబుజే –సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధి౦ క్రియాత్ ‘’

‘’ఇందీవర దళశ్యామ మిందిరా నంద వర్ధనం –వందారు జన మందారం వందేహం యదు నందనం ‘’

‘’జాహ్నవీ మూర్ధ్ని పాదే వా కాలః కంఠే వపుష్యధ్య –కామారిం కామతాతం వా కంచిద్దేవం భజామ్యహం ‘’

మాతా పితృభ్యాం జగతో నమో వామార్ధ జానయే –సద్యో దక్షిణ దృక్పాత సంకుచ ద్వామ దృస్టయే ‘’

ఈ శ్లోకాలు  మల్లినాధుని కవన పాండిత్య మాధుర్యాలణు వ్యక్త పరుస్తున్నాయి .ఇందులో సరస్వతీ దేవిపై రాసిన ‘’శారదా శారదాంభోజ ‘’శ్లోకం కృష్ణునిపై రాసిన ‘’నదీ వర దళ శ్యామ ‘’శ్లోకం అవి మల్లినాదునివే అని తెలియక పోయినా జనం నాలుకలమీద ఆనాటి నుంచీ నర్తిస్తూ నే ఉన్నాయి .

ప్రతి కావ్య వ్యాఖ్యాన ప్రారంభం లో ‘’అన్వయ ముఖం గా నే నేను వ్యాఖ్యానిస్తాను .మూలం లో లేని విషయాలు రాయను .అసంబద్ధ విషయాలను ప్రస్తావించను .’’అని నియమం ఏర్పరచుకొని అన్యూన్యాతిరిక్తం గా రచించాడు .మల్లినాద ప్రతిజ్ఞా శ్లోకం –

‘’’’ఇహాన్వయ ముఖే నైవ సర్వం వ్యాఖ్యాయతే మయా –నా మూలం లిఖ్యతే కించి న్నాన్న పేక్షిత ముచ్యతే’’ అదీమల్లినాధుని నిబద్ధత .ఈ విషయాన్నే అక్కడక్కడ ‘’అలమతి పల్లవితేన’’—‘’అలమతి విస్తరేణ’’-గ్రంధ విస్తరభయాన్న లిఖ్యతే’’  అనే మాటలతో ఎప్పటికప్పుడు జాగృతం అయ్యాడు .

నైషద వ్యాఖ్యానానికి జీవాతువు అనే పేరు పెట్టాడని తెలుసుకొన్నాం .జీవాతువుఅంటే జీవ నౌశాధం అని అర్ధం చెప్పాడు సూరి (జీవాతుర్జీవ నౌషధం );నారికేళ పాకమైన కిరాతార్జునీయానికి ‘’ఘంటా పాఠ’’వ్యాఖ్య రాస్తూ సూరి –చెప్పిన ప్రారంభ శ్లోకాలు –

‘’నారికేళ ఫలసమ్మితం వచో భారవే స్సపది తద్విభజ్యతే –స్వాదయ౦తు రస గర్భ నిర్భరం సారమస్య రసికా యధేప్సితం ‘’

‘’నానా నిబంధ విషయైక పదైర్నితాంతం సాశంక చంక్రమణ భిన్నధియామశంకం –కర్తుం ప్రవేశ మిహ భారవి కావ్య బంధే ఘంటా పధం కమపి నూతన మాతనిష్యే’’అని రాశాడు అంటే –‘’భారవి పలుకులు నారి కేళ ఫల సమానాలు వాటిని నేను పగుల కొడతాను .రసనిర్భరాలైన ఆ వాక్యాల సారం రసికులు ఆస్వాది౦చుదురు గాక ‘’అని భారవికవి గొప్ప తనాన్ని తెలిపాడు .’’’అనేక వ్యాఖ్యానాల ఎగుడు దిగుడు వలన భారవి గొప్పతనం జనాలకు దూరమై పోయింది .భారవి కవితలో నిస్సందేహంగా బుద్ధి ప్రసరించేట్లు రాచబాట లాంటి కొత్త వ్యాఖ్యానం రాసి దగ్గరకు తెస్తాను’’అని మరీ చెప్పి సుగమమైన వ్యాఖ్యానం రాశాడు .

’అలాగే నైషదానికి కూడా తన వ్యాఖ్యాన అవసరం కలిగిందనిచెబుతూ ‘’ మిగిలిన కావ్యాలకు ఎలాంటి దుర్గతి పట్టిందో ,నైషదానికి కూడా అలాంటి దుర్గతే పట్టి ,క్షుద్ర వ్యాఖ్యాన విష పీడితాలైన శ్రీ హర్ష కవి రాజ వాక్యాలకు బ్రతికి౦చ టానికి జీవాతువు (జీవాతుర్జీవ నౌషధం )అనే వ్యాఖ్య రాస్తున్నాను. రస భావ గుణార్ధ దోష ధ్వన్యలంకార రహస్యజ్నుల సంతోషం కోసం నైషద కద రూపమైన అమృత కావ్యాన్ని వ్యాఖ్యానిస్తున్నాను’’అని తెలియ జేసి మొదలు పెట్టాడు .దీనికి ఆయన శ్లోకాలు ఇవి-

‘’క్షుద్ర వ్యాఖ్యా విషార్తానాం శ్రీ హర్ష రాజ కవిరాడ్గిరాం –ఉజ్జీవనాయ జీవాతు ర్జీయా దేష మయాక్రుతం ‘’

‘’శ్రీ మల్లినాద విదుషా విదుషాం మతేన తేనైవ నైషద కదామృత కావ్య బంధః

-వ్యాఖ్యాస్యతే డ్య రసభావ గుణార్ధ దోష సాధ్వన్యలంక్రుతి రహస్య విదా౦ ముదేస్తు’’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-16 ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.