గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-2
శ్రీ గురుచరితం సంస్కృత శ్లేష మహాకావ్యం లో శ్రీ మేళ్ళచెర్వు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ‘’ఆత్మ నివేదనం ‘’శీర్షికలో ఈ కావ్య నేపధ్యాన్ని, తన రచనా ప్రణాళికను శ్లేష తత్వాన్ని వివరించారు .బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి శిష్యుడు శ్రీ గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి గురువుగారి జీవితంపై ‘’అగ్ని పరీక్ష ‘’అనే చిన్న నవల రాశారు .ఇది సెకండరీ స్థాయిలో ఉపవాచకం గా ఉన్నది .ఈ నవలికను ఆధారం గా చేసుకొని తాను మహా కావ్యంగా శ్లేషను జోడించి రాశానని తెలియ జేశారు .అయితే దీన్ని ఒక మామూలు కధగా కాకుండా అవకాశాన్ని బట్టి భక్తీ జ్ఞానం ,యోగాలను ఈ కావ్య పుష్పానికి కేసర త్రయం గా అమర్చి తన భక్తిని సౌరభం చేసి రచించానన్నారు .ఈ విధంగా తన కావ్యం లో మూడు రకాల ధ్వనులను సరళ వైఖరిగా పాటించానని .వీలుని బట్టి లలితా సహస్ర నామావళి ని ,ఉపనిషన్మకరందం పైన విశ్రమించేట్లు చేశానని ,అందువల్ల అది శ్రీ గురు చరితమై పాఠక జనాలకు ధన్యత చేకూరుతుందని భావించి నట్లు చెప్పుకొన్నారు .
అంతా గురు చరిత్రమేకనుక వర్ణనలకు అవకాశం తక్కువని ,నాయిక అయినా ,నాయకుడు అయినా శ్రీ గురువు మాత్రమేనని ,చరిత్ర అంతా మౌనమే నని ,కధాకాలం కేవలం 12 గంటలు మాత్రమేనని ,అదికూడా అంధకారం నిశీధ సమయం అని ,అయినా గురు కటాక్షం తో ముందుకు సాగి పోయానని చెప్పారు .ఇది ఎలా ఉందీ అంటే –‘’పాషాణాది పీయూషం స్య౦దతే యస్య లీలయా ‘’గా ఉందట .
కేసరాలను బట్టి ఈ కావ్యం గురువుగారు రాసిన ‘’దత్తాత్రయాష్టక గర్భిత ఆత్మ సుప్రభాతం ‘’ తో పాటు ‘’మత్స్వప్నః ‘’అనే గ్రంధాలకు పూజా పుష్పం అని చెప్పారు .అందులోనూ ముఖ్యంగా –
‘’సావత్పరో రజసి తత్సవితుర్వరేణ్యం –దేవస్య ధీమహి మహోమతి చోదకస్య –గాయత్ర మర్ధ మితి భావయతో దురంతా –సా౦తానిశా ప్రవిరలా మమ సుప్రభాత౦ ‘’అనే శ్రీ గురువుగారి సుప్రభాత శ్లోకమే ఈ కృతికి జీవ గర్ర అని గర్వంగా చెప్పుకొన్నారు .తరువాత కావ్యం అందరికీ అర్ధం కావటం కోసం అందులోని కధను సూక్ష్మగా తెలియ జేశారు .
నిశిరాత్రి చీకటి కధ
తండ్రిగారు శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు ప్రారంభించిన రచన ‘’శ్రీరామ కధామృతం’’ఆయన మరణం తో ఆగిపోతే కుమారుడు శ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారు పూర్తీ చేయ ప్రారంభించి పూర్తీ చేసి ,అధీతి బోదా చరణ ప్రచారణ చతుర్దశీ కృత వేద విద్యా స్వరూపులై ,’’బ్రహ్మశ్రీ వేదమూర్తులైన ‘’అనే మాటకు సార్ధకత్వం చేకూర్చిన గురు వరేణ్యుల జీవితం లో ఇదొక ఘట్టం మాత్రమే.రామ ప్రసాద్ అనే ఒక సంస్థానాధీశుని సన్మానం అందుకోవటానికి నరసింగ పురం బయల్దేరారు గురువు గారు .భీమవరం చేరే సరికే ప్రొద్దు గూకింది .చివరి బస్సు వెళ్లి పోగా ముందు ప్రయాణానికి ఆటంకం కలిగింది . ఏమి చేయాలో పాలుపోని సందిగ్ధ స్థితి .ఇంతలో ఒక అపరిచిత వ్యక్తీ గుర్రం బండి సిద్ధంగా ఉందని చెప్పి ,నడిపించి పోలి మేర దాటించి ఒక అడవిలో వదిలేసి అదృశ్యమైపోయాడు .ఇంతలో కొందరు దొంగలు గురువుగారిని ముట్టడించి ,వారి చేతనే వారి వస్త్రాలను ,ఆభరణాలను ఒలిపించి మూట కట్టించారు .ఒక్క అంగ వస్త్రంతో మాత్రమే ఉన్న గురువుగారి దగ్గరకు ఇద్దరు దొంగలు వచ్చి ,వాగు దాటించి ,మార్గ మాధ్యమం లో వదిలేసి వెళ్ళిపోయారు .ఆ కారు చీకట్లోనే కాలి నడకన దొరికిన దోవ పట్టుకొని సాగిపోతున్న గురువు గారిని ఒక వ్యక్తీ కలిసి తన బండిలో ఎక్కించుకొని ,క్రమంగా మాటల్లోకి దించి అనేక విషయాలు చర్చించాడు .గురువుగారి వేదాంత ధోరణి ,అసంగత్వ భావం ,,తెగింపు గమనించి వారిని ఒకమర్రి చెట్టు దగ్గర వదిలి మౌనంగా వెళ్లి పోయాడు .అక్కడే గురువు గారు కాసేపు ఆగి ఉండగా ,ఒక భీకరాకారుడు కాపాలికుని లాగా నటించి ,ఆయనను బలి అవటానికి సిద్ధంగా ఉండమని చేతి లోని పట్టా కత్తిని ఝళిపించాడు .బలి అవటానికి సిద్ధమైన గురువుగారు ధ్యాన నిమగ్నమయ్యారు .అప్పుడు వాడు ‘’మా దేవి వద్దు అంటోంది ‘’అని చెప్పి ,వధ ప్రయత్నం మానుకొని వెళ్ళిపోయాడు గత్యంతరం లేక గురువుగారు ఒక కంకర రోడ్డు పట్టుకొని, ఉన్న ఒకే ఒక అంగోస్త్రం తో ప్రయాణం సాగించారు .కొంత దూరం నడిచి పోగా వారికి ఒక దివ్య భవనం కనిపించింది .ఆ ఇంటి దగ్గరున్న బావి వద్ద స్నానం చేసి ,దైవ స్మరణ చేసి ,దప్పిక తీర్చుకొని ,మళ్ళీ ప్రయాణం సాగించే ప్రయత్నం లో ఉండగా ,ఒక ప్రక్కగా తులసికోట దగ్గర పూజ చేస్తున్న ‘’స్త్రీ ‘’కనిపించింది .ఆమె వారిని ఆహ్వానించి నూతన వస్త్రాలు సమర్పించి ,అతిధి సత్కారాలు చేసి ,గురువుగారి చేత ‘’భద్రాయురుపాఖ్యానం ‘’పురాణం చెప్పించుకొని ,శ్రద్ధగా విన్నది .తర్వాత వారిని తన అభ్యంతర మందిరానికి గౌరవం గా తీసుకొని వెళ్లి ,ఒక కుర్చీలో కూర్చో పెట్టింది .గురువు గారు కనులు మూసి ధ్యాన నిద్రలోకి జారిపోగా ,ఆమె హఠాత్తుగా వారి వామాంకం పై ఆశీనురాలైంది.ఈ హఠాత్ సంఘటనకు గురువు గారు భయపడక ,చిత్త స్వాధీనం లో ఉండి ,సహజ యోగికనుక ,ప్రాణ లయం చేసి ,నిర్వి కల్ప సమాధి లోకి వెళ్లి పోయారు .వెంటనే గురువుగారి శ్వాస ఆగి పోయింది .ఆయన పరిస్థితి చూసి నివ్వెర పోయిన ఆ స్త్రీ ,కిందికి దిగి ,నిలుచుని విసన కర్రతో విసరటం ప్రారంభించింది .కొంత సేపటికి గురువుగారు మామూలు స్థితి లోకి వచ్చారు .ఇంతలో వారి వెనక ఉన్న తెరల లో నుంచి నలుగురు మనుషులు వచ్చి క్షమాపణ వేడుకొన్నారు .రాత్రి అంతా గురువుగారిని పరీక్షించింది వీళ్ళే .పరీక్షించటానికి కారణం యేమని అడిగితే వాళ్ళేమి చెప్పారంటే మొదటి దొంగ వారితో అడవిలో నడిచినప్పుడు వాడి శరీరం అంతా నిప్పులు పోసినట్లు మండి పోయిందని ,అందుకే గురువుగార్ని ముట్టుకోవటానికే భయపడి ఆయన వస్త్రాలు ఆభరణాలను ఆయనతోనే ఒలిపించి మూట కట్టించాడని ,దీనివలన గురువుగారి మహిమ ఎలాంటిదో వాడికి తెలిసిందని అందుకే అందరూ రాత్రి అంతా శ్రీ వారిని పరీక్ష చేశారని చెప్పుకున్నారు .విన్న గురువుగారు ‘’ఇది ఆ త్రిపుర సుందరీ దేవి పరీక్షయే ‘’అని నమ్మి ,వాళ్ళను శాంత పరచి ,తెల్లవారిన తర్వాత తిరుగు ప్రయాణం చేశారు .ఈ కొత్త భక్తులు ఇక పై నుండి దొంగతనాలు చేయం అని ప్రతిజ్ఞ చేశారు .రాత్రి తాము దొంగిలించిన వస్తువులతో పాటు తమ వంతు కానుకలనూ గురువుగారికి సమర్పించి వీడ్కోలు చెప్పారు .
ఈ కధలో నిక్షిప్తమై ఉన్న యోగ సంఘటనా సామ్యాన్ని సూచన ప్రాయంగా తర్వాత మేళ్ళచెర్వు వారు తెలియ జేశారు .ఆ విషయాలు తరువాత గ్రహిద్దాం .
బ్రహ్మశ్రీ రాఘవ నారాయణ శాస్త్రి దంపతులఫోటో జత చేశాను చూడండి
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-16 –ఉయ్యూరు