వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -15
మల్లినాధుని అద్వైత వేదాంత పాండిత్య గరిమ
మల్లినాధుడు అద్వైత వేదాంతాన్ని క్షుణ్ణంగా మదించిన వాడు .అందులో ఆయన పాండిత్య గరిమా ప్రదర్శనానికి సంబంధించిన కొన్నిటిని తెలుసుకొందాం .కుమార సంభవం లోని విష్ణు స్తోత్రాలలో ఎన్నో వేదాంత విషయాలున్నాయి .వాటిని అద్వైత వేదాంతానికి అనుసంధానం చేస్తూ మల్లినాధుడు ఉపనిషత్ వాక్యాలను ఉదాహరించి తన అద్వైత అవగాహనా సామర్ధ్యాన్ని నిరూపించాడు .-‘’కేవలాత్మనే ‘’కు ‘’ఏకః ఉపాయః ‘’అని చెప్పి ‘’ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ ‘’అనే ఐతరేయ ఉపనిషత్ వాక్యాన్ని పేర్కొన్నాడు . రఘువంశం లో ‘’హృదయస్థ మనాసన్నమకామం త్వాం తపస్వినం –దయాలు మనఘ స్పృష్టం పురాణ మజరం విదు’’ శ్లోకానికి మల్లినాధుడు ఉపనిషత్ ధోరణి లోనే వ్యాఖ్య రాశాడు .-‘’అకామం నిత్య పూర్నత్వాత్ నిష్కామం తధాపి-తపస్వినం లోక యాత్రార్ధ౦ తాపసం విదుః –సోకామయత –బహుస్యాం ప్రజాయే యేతి –త తపస్యత్వా ఇదం సర్వ మసృజత ‘’అనే తైత్తిరీయ ఉపనిషత్ భాష్యంగా వివరించాడు .మరొక శ్లోకం లో మాయ అనేదానికి శక్తి అనే అర్ధం తో వివరించాడు .అద్వైత వేదాంత మార్గం లో జ్ఞాన కర్మ భక్తికలిసి ఒక ఆధ్యాత్మిక యాంత్రిక వ్యవస్థ నేర్పరచి మోక్షమార్గానికి దారి చూపిస్తుంది .
నైషధీయ చరితం లో అనేక శ్లోకాలు అద్వైత భావ పరిమళాలను వెదజల్లుతాయి .అందులో ఆసక్తికర మైన విషయం ఒకటి ఉంది –అది మనుషులు అయిదవ ప్రత్యామ్నాయమైన సత్యాన్ని నమ్మరు అన్నది .మిగిలిన నాలుగు ఇతర సిద్ధాంతాలు అద్వైతాన్ని వేళ్ళూన కుండా చేస్తాయి .దమయంతికి నలమహారాజు పై అనుమానం ఉన్నందున ,ఆమె అయిదవ ప్రత్యామ్నాయమైన సత్యాన్ని నమ్మదు .నలుడు అత్యంత నమ్మదగిన పురుషుడు .మిగిలిన నలుగురు ఆమెను పొందాలనుకొంటారు .అందుకు పూర్తీ నమ్మకస్తుడైన నలుని ఆమె చేరనీయ కుండా నిలువరించే ప్రయత్నం చేస్తారు –‘’సాప్తుం ప్రయచ్చతి న పశ్చతుస్టయే తాం మల్లాభ శంసిన న పంచమ కోటి మాత్రే –శ్రద్ధాం దధే నిషాద రాణ్విమతో మతానా మద్వేతతత్వ ఇవ సత్యత్తరేషి లోకః ‘’(నైషధం ).
‘’ రఘు మహా రాజు తన జ్ఞానాగ్ని చేత దహి౦ప బడ్డాడు ‘’అనే రఘు వంశ శ్లోకం –‘’అపారే దహనే స్వకర్మణా౦ వవృత్తే జ్ఞాన మయేన వహ్నినా –‘’ అనేదానికి భగవద్గీత లోని ‘’య౦ యేయాంసి సనిద్రోగ్ని భస్మ సాత్ కురుతేర్జున –జ్ఞానాగ్నిః సర్వ కర్మాణి భస్మసాత్ కురుతే తధా ‘’అనే దానితో సమర్ధించాడు సూరి .కుమార సంభావంలోని ఒక శ్లోకం పరమాత్మను తెలియాలి అంటే తనలోకి తాను చూసి తెలుసుకోవాలి .బాహ్యే౦ద్రియాల చూసే చూపు ఆత్మను తెలుసుకోవటానికి పనికిరావు .అనే అర్ధం ఇచ్చేకుమార సంభావ శ్లోకం –‘’మనో నవద్వార నిస్టిద్ర వ్రుత్తి హృది వ్యవస్థాప్య సమాధి పశ్యం –యమక్షరం క్షేత్ర విదో విదుస్త మాత్మా నమాత్మత్య న్యవ లోక యంతిం ‘’
న్యాయ శాస్త్ర కోవిదుడు మల్లినాధుడు
తార్కికులు ఒక క్రమ విధాన వాదనలను ,వివాదాస్పద వాదనలను ఏర్పరచారు .అవి రెండు రకాలు .1-గతి తార్కిక వాదం(డయలేక్టికల్ ) 2-న్యాయ వాదం (సిల్లాజిస్టిక్ ).మొదటి దాని ప్రకారం రచయిత తన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు .తర్వాత దీనిపై అభ్యంతరాలను ముందే ఊహించి తన వాదాన్ని క్రమపద్ధతిలోమొదటి దాన్ని అనుసరించి వాటిని ఖండిస్తూ ,తన భావాన్ని సమర్ధిస్తూ కొనసాగిస్తాడు . వ్యతిరేకులు కొన్ని విషయాలను ప్రతిపాదిస్తారు ,వాటిని సిద్ధాంత కర్త తృణీకరించి పక్కన పడేస్తాడు .ముగింపు మాత్రం మొదటి దానికి పూర్తిగా పునరుక్తిగా నే స్థిరపడుతుంది .ఇదే గతి తార్కిక వాదం .
రెండవది అయిన న్యాయవాదం లో అందరికి తెలిసిన అయిదు సోపానాలుంటాయి 1-ప్రతిపాదన 2-కారణం 3-ఉదాహరణ 4-అనువర్తన (అప్లికేషన్ )5- ముగింపు .మల్లినాదునికి ఇవన్నీ కరతలామలకాలే .సాధారణ న్యాయవాదాన్ని మల్లినాధుడు అనుసరించాడు .’’అను మేయ శోభి ‘’ని వివరిస్తూ పార్వతీ దేవి తుంటి భాగాన్ని వర్ణిస్తూ అవి చాలా అందంగా ఉన్నాయని ,అవి శివుని అర్ధభాగం గా ఉన్నప్పుడు మరింత శోభించాయని –‘’గిరిజా నితంబ బింబం విశ్వాతి శాయి సౌ౦దర్యం –గిరీశాంక రూఢత్వాత్వ్యతిరేకేణ నార్యంత రాశర్నితంబ బింబ వత్ ‘’అని కాళిదాసు వర్ణించాడు .దీన్నే మల్లినాధుడు ‘’అనుమేయ శోభి ‘’అన్నాడు .
వరద రాజు రాసిన ‘’తార్కిక రక్ష’’కు సూరి రచించిన ‘’నిష్కంటక ‘’వ్యాఖ్య లో మల్లినాధుని తార్కిక గరిమ మహోత్క్రుస్టంగా ఉందని పి .జి లాల్యే పండితుడు విశ్లేషించాడు .మేఘం పై ‘’శైల భావన ‘’గుర్తుంచుకోవటానికి అనుకూలం .-‘’తస్యాత్తీరే —-ప్రేక్ష్యో పా౦తస్ఫురిత తాడితం త్వాంతమేవ స్మరామి ‘’అనేమేఘ దూత శ్లోకం పై వ్యాఖ్యానిస్తూ నిరుక్త కారుని మల్లినాధుడు విమర్శించాడు .భావన అనేది స్మృతికి సమానార్ధం కాదన్నాడు –దీనిపై స్పందిస్తూ సూరి –‘’నిరుక్త కారస్తు త్వాం తమేవ స్మరామి ఇతి యోజయిత్వా మీడే శైలత్వ రోప మాచస్టేసదా సంగాతం .శైలత్వ భావనా స్మ్రుతి రిత్యపి నొప పద్యతే .భావనాయః స్మ్రుతిత్వే ప్రమాణ భావాత్ –అనుభవ యోగాత్ సద్రుశ్యోపన్యాసస్య వైయర్దా చ్వ-విసద్రుశోపి సాలగ్రామే హరిభావ దర్శనోదితా ‘’అని చెప్పాడు .అలాగే ‘’మత్స దృశ్యం లిఖంతి’’అంటే ప్రేమలో మొదటిదశ అని –లవ్ యట్ ఫస్ట్ సైట్’’గా అర్ధం చెప్పిన వ్యాఖ్యాతలను విపరీతంగా విమర్శించాడు .దీనితర్వాత మల్లినాధుని రాజకీయ శాస్త్ర పాండిత్యాన్ని తెలుసుకొందాం.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-16 –ఉయ్యూరు
.
‘’