వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -16
మల్లినాధుని రాజకీయ శాస్త్ర పరిజ్ఞానం
అనేక రాజకీయ శాస్త్ర పండితుల ప్రకరణాల నెన్నిటినో మల్లినాద సూరి ఉదహరించాడు .రాజ్య వ్యవస్థపై కామందకుడు రాసిన వాటిని బాగా పరిశీలించి అవసరమైన చోట రాశాడు. కామందకుని ‘’నీతి సారం ‘’లో రాజు ,రాజ్యం ,రాజ్య పాలన మొదలైన విషయాలపై పై విస్తృత చర్చ ఉన్నది .మహా కావ్య రచయితలు ముఖ్యంగా కాళిదాసు ,భవ భూతి లు భారతీయ రాజరిక వ్యవస్థలోని విషయాలను ఉదహరించారు .వారు చెప్పిన వాటి నిగ్గు తేల్చటానికే మల్లినాధుడు రాజకీయ శాస్త్రం పై ఉత్కృష్ట గ్రంధమైన’’ నీతి సారాన్ని’’ సహాయంగా తీసుకొన్నాడు .కాళిదాస భావభూతులకు తరువాతి కాలం వాడైన మల్లినాధుడు ఈ మహా కవులు చెప్పిన రాజకీయ సిద్ధాంతాలు పూర్తిగా సంప్రదాయంగా వస్తున్న ,అందరూ అంగీకరించిన రాజకీయ శాస్త్ర సిద్దా౦తాలేనని రుజువు చేసి చూపించాడు .మహాకావ్య శ్లోకాల పై పూర్తీ రాజకీయ శాస్త్ర పరిజ్ఞానం తోనే వ్యాఖ్యానం రాశాడు .శిశుపాల వధలో 3 కిరాతార్జునీయం లో 4 ,భట్టి లో 1 ,రఘు వంశం లో 26 ,నైషధం లో 2 ,శ్లోకాలపై నీతిసారం ఆధారంగా రాజకీయ శాస్త్ర వ్యాఖ్య చేశాడు .అలాగే రఘు వంశం లో 11 శ్లోకాలకు కౌటిల్యుని అర్ధ శాస్త్రం లోనుంచీ ప్రకరణలు ఉదాహరించాడు .కౌటిల్యుడు ,చాణక్యుడు ఒక్కరే అన్నభావనతోనే మల్లినాధుడు ఉదాహరించాడు –‘’క్రియాహి వస్తుపా హితా ప్రసీదతి’’అన్న రఘు వంశ వాక్యాన్ని వ్యాఖ్యానిస్తూ చాణక్యుడు చెప్పిన –‘’క్రియాహి ద్రవ్యం వినయతి న ద్రవ్యం ‘’తో సమర్ధించాడు ..బలవంతుని ముందు మోకరిల్లటం ను’’వైటాసుర వ్రుత్తి ‘’అంటారని ‘’అత్ర చాణక్యః శక్తానాం భూషణం క్షమా ‘’అన్నదానితో రఘు వంశ వ్యాఖ్య లో సమర్ధించాడు .రఘు వంశం లోనే మరో చోట మల్లినాధుడు –‘’అత్ర కౌటిల్యః బలీయసామభి యుక్తో దుర్బలః –సర్వత్రానుప్రణతో వేతసం ధర్మ మాతిస్టేత్ ‘’అన్న దానితో సమర్ధించి చాణక్య కౌతిల్యులు ఒక్కరే అన్నభావన కు బలం చేకూర్చాడు .అలాగే నియోగ ,వికల్ప ,సముచ్చయ శబ్దాల అర్ధాలను వివరించటానికి కౌటిల్యాన్ని వాడుకొన్నాడు-
‘’అత్ర కౌటిల్యః కార్యాణా౦ నియోగ వికల్ప సముచ్చయా భవంతి ‘’—అనేనైవోపాయేనవాన్యే నేతి నియోగః –అనేన వాన్యేన వేతి వికల్పః-అనేనచేతి సముచ్చయః ‘’
కామందుని నీతి సారం ప్రాచీన రాజ్య వ్యవస్థపై సాధికారం గా వ్రాయబడిన గ్రంధం కనుక మల్లినాధుడు ఎక్కువగా దీనినే ఉపయోగించుకోన్నాడని లాల్యే పండితుని అభిప్రాయం –‘’అత్ర కామందకః –శుశ్రూష శ్రవణం ధారణం తధా –ఊహాపోహోర్ద విజ్ఞానం చ ధీ గుణాః ఇతి –అన్వీక్షికీ జయీ దండ నీతిశ్చ శాశ్వతీ –ఏతా విదాశ్చ తత్రస్తు లోక సంస్థితి హేతవః ‘’అని మల్లినాద ఉవాచ .
ఇప్పుడు పేర్కొన్నవన్నీ మల్లినాధునికి రాజకీయ శాస్త్ర౦ లో ఉన్న లోతైన అవగాహనకు గొప్ప ఉదాహరణలే అన్నాడు లాల్యే .
తంత్ర శాస్త్రోపజ్నుడు మల్లినాధుడు
నైషధం లో24 సర్గ 85 వ శ్లోకం ఒక శ్లోకం అంతా తంత్ర పరిభాషలోనే ఉంది-
‘’ఆవామావా మార్ధే సకల ముభయ కార ఘటనా –ద్విధా భూతం రూపం భగవదిభి దేయం భవతి యత్
తదాంత మంత్రం మే స్మరహర మయం సేందు మమలం –నిరాకారం శస్వజ్జప నర పతే సిద్ధ్యతు సతే’’
దీనిపై విపులమైన వ్యాఖ్యానం రాస్తూ మల్లినాధుడు నారాయణ వ్యాఖ్యాత రాసిన’’ అర్ధ నారీ నటేశ ‘’రూపం అనేది హ్రీంకార రూపం అని తెలిపాడు అందులోని మంత్రం సరస్వతీ మంత్రమే నని అందులో ‘’కామ రాజ బీజం ‘’నిక్షిప్తమై ఉందని ఆ మంత్ర అర్ధాన్ని శివ రూపం,మంద్ర రూపం ,యంత్ర రూపం అనే మూడు దృష్టి కోణాలలో వివరించాడు .ఈ శ్లోకం లో ‘’చింతామణి మంత్రం ‘’-ఓం హ్రీం ఓం ‘’అనే మంత్రం ఉందని ,అందరికి అన్వయించే విధంగా ఉందని వివరించాడు .దీనిపై పూనా లోని దక్కన్ కాలేజి ప్రొఫెసర్ ‘’హాన్దోక్వి ‘’అనే విశ్లేషకుడు ‘’నైషద ఆఫ్ శ్రీ హర్ష ‘’గ్రంధం లో వివరణ నిస్తూ ‘’ఈ విశేషణాలు మంత్రానికి ,భగదభిదేయ రూపానికీ రెండిటికి వర్తిస్తాయి.సరస్వతి మంత్రం ఒక్కో సారి అర్ధ నారీశ్వర రూపం తో గుర్తించటానికి వీలుగా ఉంది .కారణం అందులో మార్మిక రూపం దాగి ఉంది ‘’అన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గ ప్రసాద్ -22-11-16 –ఉయ్యూరు
.