—
ఇది విన్నారా ,కన్నారా !-2
గాన గ౦ధర్వ శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ
-శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ అసలు పేరు మురళీ కృష్ణ .కాని బాల్యం లోనే 9వ ఏట మొదటి సంగీత కచేరీలు చేయటం తో ‘’బాల’’మురళీ కృష్ణ అని పిలవటం తో అదే స్థిరపడి పోయింది .-బాల్యం లో బాలమురళి విజయ వాడలో చేస్తున్న సంగీత కచేరీ లో ప్రేక్షక స్థానం లో కూర్చున్న తిరుపతి కవులలో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు ‘’ఆగు ‘’అని కిందనుంచే అని ,వేదిక నెక్కి ‘’నా వలెనే వృద్దుడవై-నా వలెనే కీర్తి కాంచి –నా వలెనే శ్రీ దేవి పద భక్తుడవై –భూ వలయము తిరుగు మోయి ‘’అని మూడు పద్యాలలో ఆశీర్వదించారు .అది పూర్తిగా ఫలించిందన్న సంగతి మనకు తెలిసిందే ..
-బాలమురళి 12వ ఏట తిరువయ్యూర్ లో సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి వారి ఆరాధనోత్సవం లో కచేరీ చేసి ‘’బాల గ౦ధర్వ ‘’బిరుదు పొందారు .
-‘’చాలా మంది కర్నాటక సంగీత విద్వాంసులు ఒప్పు కోలేని ఒక గొప్ప అంశం ఒకటి ఉంది .అది కర్నాటక సంగీతం కన్నా హిందూ స్థానీ సంగీతం లో శ్రోతలు ఎక్కువగా రక్తిని అనుభ విస్తారు అన్నది .అయితే కర్ణాటకలోని ప్రౌఢత్వాన్నిహిందూ స్తానీలోని రక్తిమను జోడించి పాడగల మేటి గాయకుడు శ్రీ బాల మురళీ ఒక్కరే ‘’అన్నారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .
-‘’ఆచార్య వీరభ్ద్రయ్యగారికి వీణ అన్నా వీణ విద్వా౦సులన్నా మహాప్రేమాభిమానాలున్నాయి .అందుకే శ్రీ పుదుక్కోటై వీరిని ‘’వీణ ‘’భద్రయ్య అన్నారు .శ్రీ ఎస్ .బాల చందర్ గారిలో ఉండే బరువైన ‘’మీటు ‘’వీరి వాయిద్యం లో కనిపిస్తుంది ‘’అన్నారు వరంగల్ ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ దుడ్డు సీతారామయ్య .-‘’సాహిత్యం స్పష్టంగా పాడితే లలిత సంగీతమని వెక్కిరిస్తారు .స్వర స్థానం మీద నిలిపి పాడితే హిందూ స్థానీ అని వేళాకోళం చేస్తారు .హిందూ స్తానీని మిక్స్ చేసి పాడుతున్నాను అంటారు నన్ను .అసలు మిక్స్ చేయటం ఏమిటి ?హిందూ స్థానీ మన పిల్లల్లో ఒక పిల్ల సుమా ‘’అంటారు బాలమురళి .
-‘’దాక్షిణాత్య సంగీతాన్ని కర్నాటక సంగీతం అని యే శాస్త్రం లో ఉంది ?సంగీత రత్నాకరం లో ఉందా ?త్యాగ బ్రహ్మ చెప్పారా ?’’అని ప్రశ్నిస్తారు బాలమురళి .దీనికి వీరభద్రయ్యగారు వివరణ ఇస్తూ ‘’వాగ్గేయకారులైన ముత్తు స్వామి దీక్షితులవారి కీర్తనలలో హిందూ స్థానీ బాణీలు లేవా,ఆ బాణీలలోని రాగాలను వారు తీసుకోలేదా ?స్వాతి తిరుణాల్ రచనలలోను ఈ లక్షణం లేదా అంటూ ‘’వాతాపి గణపతిం భజే ‘’అన్న కీర్తన రచింప బడిన ‘’హంసధ్వని రాగం ‘’హిందూ స్థానీ నుంచే వచ్చిందని ఒక సంగీత మహా మహోపాధ్యాయులు అనలేదా ?అని చెప్పారు .అంతేకాదు దీక్షితులవారి ‘’నీరజాక్షి కామాక్షి ‘’ని పూర్తిగా హిందూ స్థానీ పద్ధతిలో ఒక విద్వాంసుడు పాడగా వీణ పై వాయించగా తానూ విన్నానని మరి అలాంటప్పుడు బాల మురళిని ఎందుకు తప్పు పడుతున్నారో అర్ధం కావటం లేదని ఆచార్య వీణ(ర )భద్రయ్య అన్నారు .
-‘’మనకున్న మంత్రాల సంఖ్య 7 లక్షలట..అందులో తొంభై తొమ్మిది శాతం మృత మంత్రాలే నట .అంటే జీవన్మంత్రాలు కొన్ని వందలే నన్నమాట .అవతార పురుషులు అవతరించి అనేక మృత మంత్రాలకు ప్రాణం పోస్తారట .అలాగే రాగాలన్నీ ప్రాణప్రదాలు కావు .గాయకుని ప్రతిభా విశేషం వలన నే వాటిల్లో జీవం కలుగుతుంది .ఈ విధంగా బాలమురళి అనేకానేక రాగాలకు నూతన ప్రాణ దానం చేశారు .అంతేకాక72మేళ కర్త రాగాలలోను కీర్తనలను సంగీత యుక్తం గా కట్టి వాగ్గేయ కార చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకొన్నారు బాల మురళి ‘’అని బాలమురళిలోని వైశిస్ట్యాన్ని ఆవిష్కరించారు ఆచార్య .
-‘’ఆయనను మహా గాయకునిగానే చూస్తాం కాని ఆయన తనను ‘’వాగ్గేయ కారుని ‘’గా చూడమంటారు బాల మురళి .నిజమే వారు 400దాకా రచనలు చేశారు. వర్ణాలు ,కృతులు జావళీలు తిల్లానాలు రచించారు .బాలమురళి తిల్లానా వంటిది’’ నభూతో న భవిష్యతి’’ .గ్రహ భేదం తో వారొక తిల్లానాలో సాధించిన అందం అంతాఇంతా కాదంటారు ఆచార్యులవారు .ఏ పాఠశాల విద్యా లేకుండా ఎవరివద్దా సంస్కృతాంద్రాలు నేర్వకుండా శతాధిక కృతులు రాశారు .సంగీతాన్ని మాత్రం త్యాగ రాజ స్వామి ప్రశిష్యులైన శ్రీ పారుపల్లి రామ కృష్ణయ్య పంతులుగారి వద్ద నేర్చారు దట్ ఈజ్ బాలమురళి .సంగీత సాహిత్యాలు రెండూ బాలమురళికి దైవ దత్తాలే .
-త్యాగ బ్రహ్మ నుంచి గురు పరంపరలో నాలుగవ తరం వారు పారు పల్లివారు .త్యాగయ్య గారి పాఠమే,పారుపల్లి వారు పాడినది దానినే బాలమురళి అనుసరించారు .
-‘’మీరు ముందుగా సాహిత్య రచన చేసి దానికి సంగీతం కూరుస్తారా “”?అని అడిగితే ‘’సాహిత్య ,సంగీత రచనలు రెండూ ఏకకాలం లోనే చేస్తాను .పాట పాడాక అది యే రాగం లో వచ్చిందో చూసుకొంటాను ‘’అన్నారు స్వరబ్రహ్మ బాలమురళి .
-‘’ఏ పర్వీన్ సుల్తానా ‘’లాంటి మధుర గాయనీ మణులో తప్ప ఇతరులు పాడలేని ‘’అతి తార షడ్జమ స్థాయి ‘’ని అలవోకగా అధి రోహించి రాగల నేర్పు బాలమురళీ కృష్ణ గారికి వెన్నతో పెట్టిన విద్య .ఇతర గాయకులు తార పంచమం చేరటానికే విపరీతంగా రొప్పుతారు ‘’అన్నారు ఆచార్య వీర భద్రయ్యగారు.
-‘’సంప్రదాయమొక బ్లూ ప్రింట్ మాత్రమే .బ్లూప్రింట్ రాగానే ఇల్లు దొరికినట్లు కాదు .అందులో ఎవరూ నివసించ లేరుకదా .బ్లూ ప్రింట్ ప్రకారం ఇల్లు కట్టుకొని అందులో ఉండాలి .కళాకారులు కావటం అంటే అదే .కేవలం సంగీత పుస్తకాలు చదవటం కాదు .సంగీతాన్ని తెలుసుకోవటం వేరు .సంగీతానికి నీవు తెలియటం వేరు .’’అన్నారు పద్మ విభూషణ్ బాలమురళి .
-సాధారణం గా అయిదు స్వరాలైనా లేనిది రాగం విశదం కాదు .కాని బాలమురళి ప్రయోగాత్మకంగా నాలుగు స్వరాలతోనే రాగం సృష్టించారు .లవంగి ,మహతి ,మనోరమ ,ఓంకారి ,ప్రతి మధ్యావతి ,రోహిణి, సర్వశ్రీ ,సుముఖం సుషమ వంటి కొత్త రాగాలు సృష్టించి ప్రాణం పోశారు .
-గాత్రం తో పాటు బాలమురళి వీణ వయోలిన్ ,వయోలా మృదంగం వాయించటం లోనూ ప్రసిద్ధులు .
-‘’సంగీతసరస్వతిని సంకుచిత పరిధుల లో నుంచి విముక్తం చేసి ‘’భారతీయ సంగీతం ‘’అనే వినూత్న పంధానేర్పరచిన మార్గ దర్శి శ్రీ బాలమురళీ కృష్ణ ‘’అన్న ఆచార్యుల వారి విశ్లేషణ నూటికి వెయ్యి శాత0 య దార్ధం .
ఆధారం –ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య రచించిన ‘’మన గాత్ర ,తంత్రీ వాద్య సంగీతవిద్యానిధులు ‘’గ్రంధం.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-16-ఉయ్యూరు