సేద దీర్చి హాయి గూర్చే ఉప్పలధడియం వారి ‘’దక్షిణా నిలం

సేద దీర్చి హాయి గూర్చే ఉప్పలధడియం వారి ‘’దక్షిణా నిలం ‘’

డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర నెట్ ద్వారాపరిచయమైన చెన్నై సాహితీ మిత్రులు .వారివీ వారి నాన్నగారివీ మనవీ పుస్తకాలు ఇచ్చి పుచ్చుకోవటం పోస్ట్ ద్వారా జరుగుతూనే ఉంది.కండ గల తెలుగు పద్యం చెప్పగల దిట్ట .మధ్యాక్కరలలో మక్కువ కూడా తీర్చుకొన్నారు .’తమ ’దక్షిణా నిలం ‘’అనే ఖండ కావ్య సంపుటిని జనని ప్రచురణలు ద్వారా ముద్రించి నాకు 27-7-16 న పంపారు . చూశాను కాని చదవ లేక పోయాను ఇవాళే అది బయట పడగా చదివి ఆనందిస్తూ మీతో ఆ ఆనందాన్ని పంచుకొంటున్నాను .

‘’గాలి వ్రేళులు కదిలి –అలల తీగల సాగి –రాగ ప్రస్తారమై ‘’ప్రపంచం సాగుతోంది అని ఖండ గతి లో ‘’దక్షిణానిలం ‘’కవితలో రాసి భావుకతకు అద్దం పట్టారు .అందులోనే మధ్యాక్కర లో –‘’జీవన మందొక కొన్ని వేళలు చిన్మయత్వంపు –తావలమై ఎన్ని జన్మలకును నైన దక్క కుండెడు మ –హా వైభవోపేతములయి దీపించు ,హ్రాదినీ తుల్య –కేవలానంద  తుందిల నిమేషముల్ క్రేళ్ళుగా చెలగు ‘’అంటూ జీవితం లోని మధుర స్మృతులను హృదయం లో భద్ర పరచుకొన్నారు .ఆయన చదివింది ఆంగ్లమాధ్యమం లో .14 వ ఏట నుంచి తెలుగు పద్యం రాయటం ప్రారంభించారు.హిందీ  భాష లోతులు తరచి రాష్ట్ర భాషా ప్రవీణ అయ్యారు .ఏలెక్ట్రికల్ ,ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ ఇంగ్లీష్ మాధ్యమం లో  డిప్లొమా పొంది పి హెచ్ డి కూడా చేశారు .అయినా కవిత్వాన్ని వదిలిపెట్టక శ్రీ పులికంటి కృష్ణా రెడ్డి గారి ప్రోత్సాహమే వెన్ను దన్నుగా తండ్రి గారి మెలకువలతో వేంకటేశ శతకం ,మృత్యు ద్వీపం ,పునరపి ,జనని శతకం ,వెంకటేశ్వర మధ్యాక్కరలు రాసి ప్రచురించిన దీమతి శ్రీ వెంకటేశ్వర.ఇప్పుడీ ఖండకావ్యం .

కవికి వర్షం మాంచి హర్షాన్నిస్తుంది .పులకించి రాస్తారు. బహుశా మద్రాస్ లో ఒకప్పుడు వర్షాభావ పరిస్థితులను చూసి అనుభవించి ఉండటమూ కారణం కావచ్చు .హిందీ కవులు తులసీదాస్ కబీర్ లను ఆపోసన పట్టారు .’’తులసీదళం ‘’పేరిట ‘’తనదు కవిత గొప్పదని ఎంచు ప్రతికవి –కాని పరుల కావ్యగానము విని –సంతసి౦చువారి సంఖ్య ను లెక్కింప –నొక్క చేతి వ్రేళ్ళే ఎక్కువగును ‘’అన్న తులసీ దాసుని రామ చరిత మానస్ లోని పద్యానికి సార్ధకనామధేయం తో అనువదించి పవిత్రత చేకూర్చారు . ‘’తెలుగు వాడను నేనను తలపు విడక –భరత పుత్రుడ ననుమాట మరువకుండ –విశ్వ మానవ శ్రేయమ్ము వెల్లివిరియ –జయ పదమ్మున ఆంధ్రుడా !సాగి పొమ్ము ‘’అని ప్రబోధం కవితలో అంతర్జాతీయతను సాదిచంచ మని కోరారు .తండ్రి శ్రీ ఉప్పలధడియం రామ మూర్తిగారు చిత్తూరు జిల్లా ఏకో పాధ్యాయ పాఠశాల అనుభవాన్ని ‘’విద్యా దీక్ష ‘’లో బంధించి –‘’బడియయ్యు కాన రాద –క్కడ తగు సదుపాయమేమి ,క్రమ శిక్షణ తో-నడచుకొను చాత్రు లు౦డిరి –ఒడి దుడుకుల ధ్యాసలేని ఒజ్జయు నుండెన్ ‘’అని గురు దీక్ష, శిష్య విద్యా దీక్షకు నీరాజనం పట్టారు .

బాలుడు త్రివిక్రముడు అంటూ ‘’వామనుని పోల్కి కనిపించు బాలకుండు –కాని నిక్కమరయ త్రివిక్రముడు గాదె ‘’అన్నారు .మద్రాస్ విశ్వ విద్యాలయం లో నిర్వహించిన 24 గంటల కవి సమ్మేళనం లో ‘’భగ్న హృదయం ‘’కవిత వినిపిస్తూ కవి –‘’కనులు నిరతమ్ము కాల రేఖ పయి నిర్ని –మేషముగ నిల్చు నొక లక్షమిషలు చెప్పి –వ్యవధి లేదను మాట నేపంబొ నిజమొ-పరుగే బ్రతుకైన హృదయమ్ము వ్రయ్యలవదె?అని ఉరుకుల పరుగుల జీవిత పర్యవసానం అంతమే నని హెచ్చరించారు .ప్రముఖ వైయ్యాకరణులు శ్రీ దువ్వూరు వెంకట రమణ శాస్త్రి గారి ఆత్మ కద అందరూ చదవాల్సిన పుస్తకం .హృదయ గతం చేసుకోవాల్సిన గ్రంధమూ కూడా .ఆ పుస్తకాన్ని డా రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు గారు పంపగా చదివి పులకిత హృదయం తో –‘’చిన్ననాటి ముచ్చట్లను చేదుకొన్న –చాలునది యొక కావ్యమై జాలువారు –స్వీయ చరితలు కొన్నింటి చేర్చి చదువ –సంఘ జీవనమెల్ల  సుస్పష్ట మవదె’’అని ఆ పుస్తకాను భూతిని కమ్మని తేటగీతి లో పలికించారు. శాస్త్రి గారి ‘’జానకితో జనా౦తికమ్ ‘’ఎన్నో సార్లు రేడియోలో పునః ప్రసారమై సాహిత్యాభిమానులకు వీనుల విందు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది .

27-8-20 07 హైదరాబాద్ ప్రేలుళ్ళ పై  స్పందిస్తూ –‘’నగర జీవనంపు నరక యాతన నుండి –ఊరడిల్ల నెంచి పౌరుడొకడు –వనము కేగగ పిత్రువన మాయెనది ,కాలు –డెచటి కైన వెంబ డించుగాదె’’అని యముని మహిషపు లోహ ఘంటలు తప్పించుకోలేనివన్న వేదాంతాన్ని పలికారు .దక్షిణానిలానికి ‘’పంచ చామరం’’ వీస్తూ కవి –‘’ఇజాలు పోయి దోపిడీయె ఏక మాత్ర సూత్రమై –బజారు తత్వమే ప్రధాన భావ జాల మాయెరా –నిజాయితీకి చోటు లేని నేటి లోకమందునన్ –ప్రజాధనమ్ము కొల్లగొట్టు వాడె వన్నెకెక్కురా ‘’అని దోపిడీ,  బజారు తత్వమే ప్రాదానమై నిజాయితీ నీఱు గారి పోయిందని ఆవేదన చెందారు .’’చెంచా కవుల గురించి చెబుతూ ఒక్కొక్క వాక్యమే ఒక కావ్యం అని భ్రమిస్తూ భ్రమింప జేస్తూ ,వాడినే ‘’నవ కవి ‘’అని గుగ్గురువులు ప్రోత్సహిస్తూ శిష్య కోటి జాబితాలో చేర్చుకొని సాగే గురు  శిష్య సంబంధాన్ని ఏవ గి౦చుకొన్నారు.’’ఉగాది లక్ష్మి ‘’కవితలో –‘’షడ్రుచులు కల్సి నట్టి పచ్చడిని మెసవ –బ్రతుకు నందలి మంచి సెబ్బరల  నొక్క-రీతిగా గ్రహియించు పరిణతి కలుగు –మన ఉగాది పచ్చడి నెంత మహిమ గలదొ’’అని ఉగాది పచ్చడి ప్రవచించే జీవిత పరమార్ధాన్ని బాగా చెప్పి మెప్పించారు .

‘’వచన కవిత్వం గొప్పతనాన్ని మెచ్చుకు౦టానుకాని పద్యం పనికి రాదు అనేదాన్ని ప్రతిఘటిస్తాను’’అంటాడు  కవి –‘’వచన కవిత లోని వైవిధ్య మెంతయు –శ్లాఘ నీయ మనుచు చాటగలను –పనికి రాదు నేడు పద్య కావ్యంబను –భషణము ను మిగుల  ప్రతిఘటింతు ‘’అని నొక్కి చెప్పారు .కవికి పద్యం నల్లేరుపై బండి .సొగసుగా ,సరళ పదాలతో పద్యం లోనే ఎంతటి గహనమైన భావాన్నైనా చెప్పగల సమర్ధులు .దక్షిణా నిలం ను అందరూ ఆహ్వానించి సేదదీరి హాయి చేకూర్చుకోవాలని కోరుతున్నాను .

డా వెంకటేశ్వర గారు 1-విద్వాన్ సుందర కృష్ణ మాచారి ధర్మ నిధి పురస్కారం 2-నాగ భైరవ స్పూర్తి పురస్కారం 3-ఉగాది విశిష్ట పురస్కారం అందుకున్న సాహితీ మూర్తి .

ఇలా 42 శీర్షికల  తరంగాలుగా ‘’దక్షిణానిలం  ‘’వీచింది .మద్రాస్ మనకు దక్షిణంగా ఉన్నందున అక్కడినుంచి వచ్చిన  కమ్మ తెమ్మెరగా దీన్ని మనం భావించవచ్చు .ఈ కవితా ఖండికల సంపుటిని రమ్య భారతి సంపాదకులు సరసభారతికి ఆప్తులు ,సరసభారతి పుస్తక ప్రచురణ కర్త అయిన శ్రీ చలపాక ప్రకాష్ ఎంతో అందంగా అర్ధ వంతమైన ముఖ చిత్రం తో ప్రచురించారు .అంతే కాదు ‘ ప్రకాష్ గారి ’రమ్య భారతి’’  ఉప్పలధడియం వారి  ‘’జనని’’ సంయుక్తంగా మద్రాస్ లో ‘’తెలుగు భాష కు ప్రాచీన హోదా –తక్షణ కర్తవ్యమ్ ‘’పుస్తకా విష్కరణ సభ జరిపారు కూడా .ఇది చూసిన నాకు సరసభారతి విజయవాడ ,మచిలీపట్నాలలో అక్కడి స్థానిక సంస్థల తోకలిసి కార్య క్రమాలు నిర్వహించిందికదా జనని తో కలిసి ఒక కార్యక్రమం చెన్నై లో చేసి అక్కడి సాహితీ మిత్రుల మధ్య గడిపితే బాగుంటుంది అనిపిస్తోంది .చూద్దాం .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-11-16-ఉయ్యూరు .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.