గీర్వాణం -2 లో ముందుమాటలు -నతి -నుతి డా తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు

నతి –నుతి –

డా .శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి

సజ్జన సాంగత్యం

బహు భాషా కోవిదులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు ,నా కంటే వయసులోనూ ,జ్ఞానం లోను పెద్ద వారు .ఏ పూర్వ పుణ్యమో ,వారితో పరిచయ భాగ్యాన్ని నాకు కలుగ జేసింది .’’సతాంస౦గస్సద్భిః కథమివహి పుణ్యేన ,భవతి ‘’అన్న భవభూతి వాణి అక్షరాలా నిజమని తెలిసింది .మన భారత దేశం యొక్క గొప్ప తనాన్ని చాటి చెప్పేవి సంస్కృతీ ,సంస్కృత భాష అని పెద్దలు వివరించారు .అవి వీరికి ప్రాణ నాడులై నిలిచాయి .

మాతృ దేవో పితృ దేవో భవ

గొప్ప సంప్రదాయ కుటుంబం లో పుట్టి ,ఉత్తములైన తల్లి దండ్రుల సంస్కార సంపద పుణికి పుచ్చుకొన్న శ్రీ దుర్గా ప్రసాద్ గారు ,వారిని దైవములుగా భావించి ,సేవించి ,తమ కృషికి ఫలితమైన ఈ గ్రంథాన్నివారికి భక్తితో సమర్పించటం చాలా సంతోషాన్ని కలిగించింది .చక్కని సంప్రదాయాన్ని పాటించి ,ఇతరులకు మార్గ దర్శకం గా నిలిచారు .వృత్తి రీత్యా సైన్సు ,లెక్కలు ,ఇంగ్లీషు భాష అభ్యసించి కృష్ణా జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో ఉపాధ్యాయులుగా కొంతకాలం ,ప్రదానోపాధ్యాయులుగామరి కొంత కాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ,ఉత్తమ ఉపాధ్యాయులుగా కీర్తి గడించి ,ఎందరో విద్యార్ధులకు జ్ఞాన దానం చేసిన మనీషి శ్రీ దుర్గా ప్రసాద్ గారు .                             సాహిత్యాభిలాష

స్నేహ సంపన్నమైన హృదయం కావటం చేత ,బంధువులతో ,మిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉండి ,జీవితాన్ని అన్ని విధాలా ,బహు పుష్ప ఫల భరితంగా పండించుకొన్న శ్రీ దుర్గా ప్రసాద్ గారు ,అమర సాహితీ నందనోద్యాన వనం లో ప్రవేశించి ,ఆ సౌందర్యాన్ని చూసి ,పరవశించి ,తన ఆనందాన్ని సమకాలీన సమాజానికి అందిస్తూ ,భావి తరానికి భద్ర పరచాలనే సంకల్పం తో ,ఎంతో శ్రమ కోర్చి ,వ్యయ ప్రయాసలను లెక్క చేయక ,నిత్యకృషీ వలులై బంగారు పంట పండించారు .అది వారి జీవ సంస్కారము .పూర్వ జన్మ వాసనా వాసితముగా బోధ పడుతుంది .

భాషా సేవ

ఆ కార్య క్రమం లో ఎందరో పండితులను స్వయంగా కలుసుకొని ,వారితో సంభాషించి ,వారిలో గల ప్రతిభ ను గుర్తించి ,అభి నందిస్తూ ,వారి కావ్య విశేషాలను అక్షర బద్ధం చేశారు .వీరు మరి కొన్ని గ్రంథములను కూడా తెలుగులో రచించి ,ప్రచురించి ,ఆంద్ర భాషామతల్లికి ఎనలేని సేవ చేశారు .ఇతరులు వ్రాసిన కొన్ని గ్రంథములకు  వెలుగు చూపించారు .

‘’సరసభారతి ‘’అనే పేరుతో సాహిత్య సంస్థనొక దానిని స్థాపించి ,సభలు ,సమావేశాలు ,సన్మానాలు నిర్వ హిస్తూ ,సంగీత సాహిత్యములను సమాదరిస్తున్నారు .సంస్థ పక్షాన ఇతర కవుల గ్రంథములను ప్రచురించి ,ప్రోత్స హిస్తున్నారు .

సాహిత్య ,విజ్ఞాన విశేషముల నెన్నింటినో నిత్యము అంతర్జాలము నందు విద్యుల్లేఖల ద్వారా అందరికి అందజేస్తూ ,అభినంద నీయులయ్యారు.ప్రపంచ ఇంగ్లీష్ కవులను ,వారి రచనలను కూడా పరిశీలించి ,,తెలుగు వారికి పరిచయం చేస్తూ గ్రంథములు రచించారు .77 సంవత్సరములు పైబడిన వయస్సును లెక్క చేయకుండా ,నిత్య నూతనమైన ఉత్సాహ౦తో చక్కని పని చేస్తున్నారు .శ్రమ వారిది ,ఫలితం మనందరిది .కాలాన్ని వృధా గా గడుపుతూ ,చింతలతో వంతలతో కృంగి,కృశించే వారికి మంచి స్పూర్తి నిస్తూ ,జగము వర్ధిల్లు వార్త నిస్తున్నారు .-ప్రగతి మార్గ దర్శనం చేస్తున్నారు .

ఇటు వంటి వారిని సత్పురుషులని కీర్తిస్తూ  పెద్దలు ఉన్నతవృక్షము లతో పోల్చారు .వృక్షములు ఎండలో ఉండి ,చెంత చేరిన వారికి నీడ నిచ్చి ,సేద తీరుస్తాయి . ఫలాల నిచ్చి ,తృప్తిని గూర్చి ,ఆనందింప జేస్తాయి .ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తాయి .పరోపకారమే ప్రకృతి పరమార్ధము

 

శ్లో –‘’ఛాయా మన్యస్య కుర్వంతి,తిస్ఠంతి స్వయ మాతపే

ఫలాన్యపి పరార్ధాయ వృక్షాస్సత్పురుషా ఇవ’’

వీరికి లభించిన మరో వరం ,మనసెరిగి మెలగే భార్యా ,బిడ్డలు .అది వారిని విజయ పథం లో పయనించటానికి మరింత బలవంతులను చేసింది .

ఉద్యమ స్పూర్తి

కోరిక మాత్రం చేతనే కాక ,ప్రయత్నం తోనే కార్యములు ఫలిస్తాయి .అది సింహమే అయినా ఎప్పుడూ నిద్ర పోతూ ఉంటే ,ఆకలి ఎలా తీరుతుంది .’’మృగ రాజు ‘’అనే పేరు ఎలా వస్తుంది ?

‘’ఉద్యమే నహి  సిద్ధ్యంతి కార్యాణి ,నమనోరథైః

నహి సుప్తస్య సింహస్య ,ముఖే ప్రవిశంతి మృగాః’’

సంస్కృత కవుల జీవిత విశేషాలను వివరిస్తూ ,కావ్య పరిమళాలను ఆస్వాదించటానికి పూను కొన్న శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి ప్రొఫెసర్ గారి సలహా ,మైనేని వారి సహాయం లభించాయి .చేతిలో నిఘంటువులు అంతర్జాలం ఉండనే ఉన్నాయి .చక్కని సమన్వయం తో ఇంతటి బృహత్కార్యాన్ని తలపెట్టి ,సాధించారు .సంస్కృత పరిరక్షణ ,సంస్కృత భాషా ప్రచారమే కాని ,స్వార్ధ మెరుగని వారు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు .తమ శక్తి యుక్తులన్నీ లోక హితం కొరకు వెచ్చించారు .ఇతరులకు సాయం చేయటం లోముందుంటారు .

గుణ గ్రహణ పారీణత

కవిలో ,కావ్యం లో గుణాన్ని గుర్తించి ,ప్రకటించే మంచి లక్షణం శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి వెన్నతో పెట్టిన విద్య .సద్విమర్శకునికి ఉండవలసిన ఉత్తమ గుణమది.శివుడు గరళమును కంఠము నందు నిలుపు కొని ,చంద్ర కళను శిరసున ధరించుట ఇందులకు నిదర్శనము .

శ్లో –‘’గుణ దోషౌబుధో గృహ్ణన్ ,ఇందు క్ష్వేడా వివేశ్వరః

శిరసా శ్లాఘ్యతే పూర్వం ,పరం కంఠే నియచ్ఛతి’’.

హనుమదుపాసన

ఇంతటి మహత్కార్యాన్ని అవలీలగా సాధించిన శ్రీ దుర్గా ప్రసాద్ గారికి  ఉపాస్య దైవమగు శ్రీ హనుమదనుగ్రహం పరిపూర్ణం గా ఉంది .ఇప్పటికి వారు 50 పైగా సుందర కాండ పారాయణలు పూర్తి చేసి ,,స్వామి పాదముల చెంత సమర్పించారు .ఉయ్యూరు లో గల శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం కేంద్రంగా చేసుకొని వారు పారాయణాలు వ్రతములు ,హోమములు ,ఉత్సవములు నిర్వహిస్తూ,భక్త కోటికి స్పూర్తి నిస్తూ ,ప్రీతిపాత్రులైనారు .దేశ ,విదేశాలలో ఉన్న ఆంజనేయ దేవాలయాలను ,దర్శనీయ స్థలాలనుతెలియ జేసి ,ప్రజలకు మహోపకారం చేశారు .

పరోపకారము

వారి విద్యా, ధన . శక్తి యుక్తులు ,జ్ఞానానికి ,దానానికి ,సంస్కృతి పరి రక్షణకు వినియోగ పడి ,లోకం లో శాశ్వతములయ్యాయి .

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

దేశం లో ,విభిన్న కాలాలలో ,భిన్న రాష్ట్రాలలో గల సంస్కృత కవులు ,వారి రచనలతో బాటు ,కవుల జీవిత విశేషాలను కూడా పరి శీలించి ప్రకటించారు .ఆయా కవుల చారిత్రిక నేపధ్యం వివరింప బడి ,చరిత్ర గ్రంధంగా కూడా ఇది పరిగణింప దగి ఉన్నది .విశ్వ విద్యాలయం వారు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికృషికి మెచ్చి,నిర్నిబంధంగా డి.లిట్.(డాక్టర్ ఆఫ్ లిటరేచర్ )పట్టము నిచ్చి ,గౌరవించ వలసి ఉంటుంది .ముందుముందు పి .హెచ్ .డి.చేసే విద్యార్ధులకు ఈ గ్రంధం పరిశీలింప దగిన ‘’ఆకర గ్రంధము ‘’గా  (రిఫరెన్స్ బుక్ )ఉంటుంది .ఈ గ్రంధము ద్వారా  నేను ఎన్నో నూతన విషయాలు తెలుసుకోగలిగాను . .ఇందులోని ప్రాచీన కవులు ,స్వాతంత్ర్యానంతర సంస్కృత కవులు ,ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు కూడా ప్రస్తావి౦ప బడ్డారు . ఎందరో మహాను భావులు అందరికి వందనాలు.

శ్రీ దుర్గా ప్రసాద్ గారు ఈ గ్రంధం లో ఉట్ట౦కించిన ‘’ఉప శీర్షికలు ‘’సహితం ,అన్వర్ధములై ,ఆలోచింప జేస్తూ వారి పరిశీలనా దృక్పధమునకు ,అభిరుచికి అద్దం పడుతున్నాయి .ఇందులోని విశేషాలను వివరిస్తూ వ్రాయటం మొదలు పెడితే మరొక గ్రంథం అవుతుంది .వారి కృషి కి ప్రత్యక్ష సాక్ష్యం మీ కరములను అలంకరించిన ఈ సాహిత్య లక్ష్మి అని చెప్పటం అతిశయోక్తి కాదు .సూర్యునకు దివిటీ పట్టటం ( దీపం చూపించటం ),భక్తి ప్రకటనము మాత్రమే అని  విన్నవిస్తూ ,వాత్సల్యంతో నాకీ అవకాశాన్ని  కల్పించిన బ్ర .వే .గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి ,సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను .వారి కృషికి జేజేలు పలుకుతున్నాను .

శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారిని ఒక వ్యక్తిగా కాక సాహితీ సంస్థ గా సంభావిస్తూ ,వారి బహుముఖ ప్రజ్ఞా విశేషములను ప్రస్తుతిస్తున్నాను .

డా. తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి

రిటైర్డ్ ప్రిన్సిపాల్ –శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల ,పొన్నూరు .

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.