గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పుస్తకావిష్కరణ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పుస్తకావిష్కరణ

అతిధుల పరిచయం

2-డా.శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి

కృష్ణాజిల్లా పామర్రు దగ్గర ఎలమర్రు గ్రామానికి చెందిన శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి కృష్ణా జిల్లా నందిగామలో డా . శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి శ్రీమతి పద్మావతి దంపతులకు 3-10-1983 న జన్మించారు . ,తిరుపతిలో నే చదువు ప్రారంభించి ,శాస్త్రాధ్యయనం  కొనసాగించారు . .తర్క శాస్త్రం లో మహా పండితులైన తండ్రి శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి వద్దనే తర్క భాష్యాన్ని అధ్యయనం చేసి ,శ్రీ ప్రద్యోత్ కుమార్ ముఖోపాధ్యాయ శ్రీ సుధాంశు శేఖర్ శాస్త్రి గార్ల వద్ద లోతులు తరచి నిష్ణాతు లయ్యారు .మూడు  గ్రంధాలు -1-తర్కామృతం-మాణిక్య ప్రభ కు హిందీ వ్యాఖ్యానం 2-కారికావళి గురుకృపకు హిందీ వ్యాఖ్యానం 3-సామాన్య నికృతి కి క్రోడపత్రం రాశారు . .ఇవికాక 3  గ్రంధాలు 1-శాస్త్ర దీపిక 2-చైతన్య  3- కాళికా స్తుతి సంస్కృత వ్యాఖ్య లకు సంపాదకత్వం వహించారు .

శ్రీ మాణిక్య శాస్త్రి గారి విద్వత్ కు తగిన పురస్కారాలు పొందారు  .1- బెనారస్ హిందూ యూని వర్సిటి నుండి 20 06 శాస్త్రి ఆనర్స్ పరీక్షలో ప్రధమ స్థానం  సాధించినందుకు స్వర్ణ పతాకాన్ని భారత రాష్ట్ర పతి శ్రీ ఎ.పి.జే.అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అందుకొన్నారు .2-మరొక బంగారు పతాకాన్ని 20 07 లో ఆచార్య పరీక్ష లో మొదటి స్థానం పొందినందుకు ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి నుండి స్వీకరించారు .3 మహా మహోపాధ్యాయ గోపీనాధ పురస్కారం 4-సంస్కృత భారతి నుండి మనోరమ పురస్కారం అందుకుని విద్యా’’ జయ’’కేతనం ఎగురవేసి తర్క న్యాయ శాస్త్రాలలో ‘’మాణిక్య౦’’ గా ప్రకాశిస్తున్నారు శాస్త్రిగారు .నిజంగా విద్వత్ లో’’ శాస్త్రి’’అనిపించారు ..

శ్రీ మాణిక్య శాస్త్రి గారు 40 జాతీయ సెమినార్లలోను,10 అంతర్జాతీయ సెమినార్లలోను పాల్గొని తమ అనుభవాలను ఇతర మేధావులతో  పంచుకొని సెమినార్ల కే విలువ పెంచారు ..ప్రముఖ సంస్థల ఆహ్వానంపై తర్కం, మీమాంస ,వేదాంత శాస్త్రాల పై 10 దాకా మహోపన్యాసాలనిచ్చి రాణించారు  ప్రస్తుతం పూరీలోని  శ్రీ జగన్నాధ సంస్కృత  విశ్వ విద్యాలయం లో న్యాయ శాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ గా సేవల౦దిస్తున్నారు  .

సరస భారతి నిర్వహిస్తున్న ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవ భాగం ‘’గ్రంధా విష్కరణ సభకు విశేష అతిధిగా  శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి గారి ని వేదికపై కి సాదరం గా ఆహ్వానిస్తున్నాము .

 

2-    శ్రీ గుండు హనుమంత రావు

విజయవాడలో జన్మించి ,పెరిగిన శ్రీ గుండు హనుమంతరావు గారికి విజయవాడలో చాక్లెట్ ,బిస్కట్ కంపెని తోపాటు వ్యాపారం లో రాణిస్తున్నారు  .1974 నుంచి స్టేజ్ షో లు నిర్వ హించటం ప్రారంభించి ,రావణ బ్రహ్మ పాత్రతో మొదటిసారి రంగ ప్రవేశం చేశారు . .అనేక టి వి .సీరియల్స్ లో నటించారు .వీటిలో  జెమినీ  టి వి వారు 2001 నవంబర్ నుండి 2007  నవంబర్ వరకు 313ఎపిసోడ్ లుసీరియల్ గా వచ్చిన ‘’అమృతం ‘’సీరియల్ మహా హాస్య భరితమై కమ్మని ఆహ్లాదభరిత ఆరోగ్యకర  హాస్యానికి నిర్వచనంగా ,ఒక లెజేండ్ గా మిగిలిపోయింది. అందులో ఆముదాల ఆంజనేయులు ఉరఫ్ ‘’అంజి ‘’పాత్ర ధారి గా అత్యద్భుత నటన ప్రదర్శింఛి అందరి అభిమానం పొందారు .అన్ని ఎపిసోడ్ లలో ఉన్న ఏకైక పాత్ర దారి  దాదాపు హీరోలాంటి పాత్రధారి   శ్రీ హనుమంత రావు ఒక్కరే అవటం గర్వ కారణం .అమృతం సీరియల్ కోసం కనీసం 32 సినిమాలను తిరస్కరించి ఆ సీరియల్ లో అంతటి అంకిత భావం తో నటించి అపూర్వ విజయం చేకూర్చిన ఘనత శ్రీ గుండు హనుమంత రావు గారిదే .అందుకే ఆయన ‘’అమృతం ఫేం ‘’అయ్యారు .

1985 లో ‘’ఇదేమిటి ‘’నాటకాన్నినటించి  ప్రదర్శించారు . దీన్ని చూసిన ప్రముఖ హాస్య దర్శకులు శ్రీ జంధ్యాల , శ్రీ హనుమంతరావు గారి నటనా ప్రతిభ గుర్తించి ‘’అహ నా పెళ్ళంట ‘’సినిమాలో అవకాశమిచ్చారు . ఈ సినిమాలో మొదటి సారిగా నటించి  సినీ అరంగేట్రం చేశారు.సపోర్టింగ్ యాక్టర్ గా  వందలాది సినిమాలలో ప్రముఖ హాస్యనటులుగా ప్రముఖ దర్శకులు జంధ్యాల ఎస్ వి కృష్ణా రెడ్డి వంటి హాస్య దర్శకులవద్ద చాలా సినిమాలలో నటించి హాస్యనటనకు తమదైన ఒరవడి  సృస్టిం చారు .

అమృతం సీరియల్ లో నటించినందుకు ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ‘’నంది అవార్డ్ ‘’ను తొలిసారి అందుకొని , రెండవ సారి ‘’శ్రీ మతి శ్రీ సుబ్రహ్మణ్యం ‘’సీరియల్ కూ మూడవది ‘’ఆది తాళం ‘’లో నటనకు  పురస్కారాలు అందుకొన్న ఘనత శ్రీ హనుమంత రావు గారిది .’’నవ్వుల నారప్ప ‘’,కెవ్వు –కేక ‘’హాస్య ప్రోగ్రాం లను బుల్లి తెరకు చేసి నవ్వులు పూయించి పండించారు . .సుమారు 30 ఏళ్ళ నటనానుభవం వారిది .దాదాపు 300 చిత్రాలలో నటించి మెప్పించారు .తన కృషినే అభిమానించి ,ప్రేమించి సంతృప్తి చెందే మనస్తత్వం శ్రీ హనుమంతరావు గారిది . .ఆరోగ్య ప్రదమైన సున్నిత హాస్యం తో ప్రజలను నవ్వి౦చ టమే  రావు గారి ధ్యేయం .

కమ్మని సునిసిత హాస్యానికి చిరునామాగా నిలిచిన  అమృతం ఫేం శ్రీ గుండు హనుమంత రావు గారిని సరసభారతి నిర్వహిస్తున్న ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవ భాగం ‘’గ్రంధా విష్కరణ సభకు ఆత్మీయ అతిధిగా వేదిక నలంకరించ వలసినదిగా  సాదరం గా ఆహ్వానిస్తున్నాం .

3-  యాంకర్ ఝాన్సి

ఝాన్సీ లక్ష్మి టెలివిజన్ యాంకర్ గా ,సినీ నటిగా ,దర్శకురాలిగా ,నిర్మాతగా ,రచయిత్రిగా ,కాలమిస్ట్ గా సుప్రసిద్ధులు .20 ఏళ్ళ సుదీర్ఘ బుల్లి తెర అనుభవం ఆమెను బహు పాత్ర పోషణ చేయించింది .8 నందీ పురస్కారాలు అందుకొన్న ఘనత ఆమెది .సాధారణ యాంకర్ గా మాత్రమేకాక సాంఘిక ,మానవతా విషయాలలో చాలా క్రియాశీల వ్యక్తీ అని  నవీన ,చేతన ప్రదర్శనల ఆమె  ద్వారా నిరూపించుకొన్నారు .1997 నుండి 2007 వరకు పదేళ్ళు సుదీర్ఘంగా ఆమె జెమిని టి వి .లో సమర్పిచినసీరియల్  ‘’టాక్ ఆఫ్ ది టైం’’ఆమెను విజయ శిఖరాలకు చేర్చింది .లింగ విచక్షణ ,సమాన హక్కులు వంటి సమస్యలపై టివి 9 లో సమర్పించిన ‘’నవీన ‘’ సీరియల్  రామనాధ గోయెంకా అవార్డ్ ను సాధించి పెట్టింది .పట్టణ పేద ప్రజల జీవిత చిత్రణగా విప్లవాత్మక భావాలతో సమర్పించిన ‘’చేతన’’సీరియల్ ఝాన్సీ సాహస ధైర్యాలకు ప్రతీక .2014 ఎన్నికలలో టి. వి. 9 కోసం చేసిన  ‘’ఓపెన్ హార్ట్ ‘’కోసం తెలంగాణా ,ఆంధ్రా ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి రాజకీయ చర్చలలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి మనముందు నిలిపారు …ఇవేకాక ‘’బ్రెయిన్ ఆఫ్ ఆంద్ర ‘’,’’పెళ్లి పుస్తకం ‘’,’’సండే సందడి ‘’,కనకవర్షం ‘’ కొ అంటే కోటి ,లక్కూ –కిక్కూ ‘’ధారావాహికలు బాగా ప్రాచుర్యం పొందాయి .జెమిని టి .వి. లో ‘’అమృతం ‘’హాస్య ధారావాహికలో సంజు ‘’గా గొప్పనటన ప్రదర్శించి ప్రేక్షకాభిమానం పొందారు .

తెలుగు మా౦డలీకాలన్నింటి లోను   ధారాళంగా మాట్లాడే ఝాన్సి ప్రతిభకు అమితాశ్చర్యమేస్తుంది.ఈ అనుభవం సినీ రంగ ప్రవేశానికి రాచ బాట వేసిఅందులోను స్థిరపడటానికి దోహదం చేసింది .తులసి సినిమాలో ‘’కొకాపేట కనకం ,’తో దూసుకు వచ్చిన ఝాన్సి ,అష్టాచెమ్మా ‘’,సింహ ,.పంజా ,జయం మనదేరా మొదలైన చిత్రాలలో తనదైన నటననతో సినీ ప్రేక్షకులను మై మరపించారు .పత్రికా రంగం లోనూ ఆమె ప్రవేశించి ‘’సాక్షి ‘’పత్రికలో ‘’ఝాన్సీకి వాణి’’కాలం ఆమెలోని రచయితను ప్రజల దగ్గరకు చేర్చింది .

‘’ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవిరి ధింగ్ ‘’అనే ఆంగ్ల చిత్రాన్నిశీతల్ మొర్జారియా దర్శకత్వం వహించగా  రేఖా పప్పు తోకలిసి నిర్మించారు ఝాన్సి .ఈ సినిమా అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడి ప్రశంసలు పొందింది .వంటల పోటీ కై ఆమె డైరెక్ట్ చేసి సమర్పించిన ’’చెఫ్ నంబర్ వన్’’ చాలా ఉత్తేజంగా కొన సాగింది .

బాలల విద్య ,ఆరోగ్యం ,హక్కులు ,పరిసరాలపై ఝాన్సి చాలా ప్రోగ్రాములు చేశారు .తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాల పిల్లల విద్య కోసం ఆమె సహాయ సహకారాలు ‘’వుమెన్ ఇన్ నెట్ వర్క్ ‘’ద్వారా అందిస్తూ సేవ చేస్తున్నారు .బాల్య వివాహాలు , వినికిడి సమస్య తీర్చే సంస్థ,ఆర౦భ్,లెప్రా ఇండియా వంటి సంస్థలకు కు ఝాన్సి ‘’బ్రాండ్ ‘ఎంబా సడర్ ‘’గా ఉన్నారు .’’రైన్ బొ హోమ్స్ ‘’,విశ్వ ద్రక్ష ‘’చేయూత ‘’వంటి స్వచ్చంద సంస్థలకు ఝాన్సి వెన్ను దన్ను గా నిలిచారు .

1997 లో ‘’తోడు’’సినిమాలో సహాయ పాత్రధారణకు మొదటి సారిగా నందీ అవార్డ్ అందుకొన్న ఝాన్సి వరుసగా ‘’జయం మనదేరా ‘’లోనూ 2007 ,2010 లలో తులసి ,సింహా లలో  ఉత్తమ హాస్య నటిగా ,శారద టీ వి సీరియల్ లో ఉత్తమనటిగా ,పెళ్ళిపుస్తకం సీరియల్ లో  ఉత్తమ యాంకర్ గా’’ ఎ..టి ఎం .టి వి షో’’లో బెస్ట్ యాంకర్ గా నందీ పురస్కారాలు అందుకున్నారు .ఇవికాక ‘’యాంకర్ ఆఫ్ ది డికేడ్ ,వార్తా వాసవి అవార్డ్ ,యునిసెఫ్ వారి లాడ్లీ అవార్డ్ ఢిల్లీ తెలుగు అకాడెమి అవార్డ్ లవంటి వి ఎన్నో ఆమె కీర్తి కిరీటం లో కలికితురాయిలుగా వెలిగిపోతున్నాయి .

బహుముఖ ప్రజ్ఞావంతురాలై అమృతం ఫేం అయిన  ‘’యాంకర్ కీ రాణి ఝాన్సీ’’ గారిని సరసభారతి నిర్వహిస్తున్న ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘-రెండవభాగం ‘’గ్రంధా విష్కరణ సభలో ఆత్మీయ అతిధిగా వేదిక నలంకరించావలసినదిగా ఆత్మీయం స్వాగతం పలుకుతున్నాం .

 

3-  డా .శ్రీ ధూళిపాళ రామ కృష్ణ

డా ధూళిపాళ రామ కృష్ణ గారు కృష్ణా జిల్లా విజయవాడలో 23-11 -1964 న శ్రీ ధూళి పాళ అచ్యుత రామయ్య ,శ్రీమతి సీతారామమ్మ  దంపతులకు జన్మించారు .బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి వద్ద గురుకుల పద్ధతిలో తర్క ,వేదాంత శాస్త్రాలను ,కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా స్వాముల వారి వద్ద  బ్రహ్మ సూత్ర శంకర భాష్యాదులను అధ్యయనం చేసిన అదృష్ట వంతులు శ్రీ రామ కృష్ణ గారు . 1987 నుంచి సంస్కృతాధ్యాపనం చేస్తూ ,విజయవాడ  మేరిస్ స్టెల్లా కళాశాల సంస్కృత విభాగాధ్యక్షులుగా ఉన్నారు . ఆంద్ర దేశం లో స్వాతంత్ర్యానంతర౦ గత 60 ఏళ్ళలో  సంస్కృత సాహిత్య రచన’’పై  –యు జి .సి ఆధ్వర్యం లో విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజిలో  డా ధూళిపాళ రామకృష్ణ  గారి ఆధ్వర్యం లో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ హరే కృష్ణ శతపధి ,శ్రీ వెంకటేశ్వర వేదిక్యూని వర్సిటి  వైస్ చాన్సెలర్ శ్రీ సన్నిధానం సుదర్శన శర్మ ,మద్రాస్ యూని వర్సిటి వైష్ణవిజం ప్రొఫెసర్ శ్రీ నరసింహా చార్యులు ,రాజస్థాన్సంస్కృత యూని వర్సిటి వైస్ చాన్సెలర్ శ్రీ . వి.రామ కృష్ణమాచార్యులు వంటి ఉద్దండుల సమక్షం లో  ,2008 ఆగస్ట్ 11 ,12 తేదీలలో జరిగినసదస్సు లో పత్ర సమర్పకుల రచనల కదంబాన్ని ‘’సంహూతిః’’అంటే ‘’సామూహిక పిలుపు ‘’ గ్రంధంగా వెలువరించటం లో శ్రీ రామ కృష్ణ గారి పాత్ర అద్వితీయం . .ఇది గొప్ప ఆకర గ్రంధంగా ,సంస్కృత కవుల గురించి తెలుసుకోవాలనే ఆధునికులకు చాలా ఉప యుక్తంగా ఉంది.

మంచి కవులు, అధ్యయన శీలురు అయిన శ్రీ రామ కృష్ణ గారు సంస్కృతం లో ‘’శ్రీ మద్భాగవతే అద్వైత మత ప్రతిష్టా’’ రచించి భాగవతపురాణం లోని అద్వైత మత ప్రతిస్టాపనం గురించి గొప్ప పరిశోధన చేసి ఎరుక పరచారు .’’వందే కాశ్మీర భారతం ‘’అనే 14 శ్లోకాలు, కార్గిల్ లో 2016 సెప్టెంబర్ 26 ,27 తేదీలలో కేంద్ర సాహిత్య అకాడెమి నిర్వహించిన ఉత్తర భారత మరియు ఈశాన్య భారత రాష్ట్రాల  రచయితల గోష్టి లో కాశ్మీర్ పై స్పందించి రాసిన గీర్వాణ  కవిత .

ఆంగ్లం లో ‘’ఎ స్టడీ ఆఫ్ సాంస్క్రిట్ ఇన్ స్క్రి ప్శన్స్ ఇన్ ఆంద్ర ప్రదేశ్ ‘’అనే గ్రంధాన్ని ఆంద్ర దేశం లోని శాసన అధ్యయనం పై తమకున్న గాఢ పరిశీలనకు దర్పణంగా రచించారు .కొన్ని సంస్కృత కావ్యాలను తెలుగు లోకి అనువాదం చేసి వాటి లోని భావ పరంపరను తెలుగు వారికి పరిచయం చేసి సంస్కృత సాహిత్యం లో ఉన్న తమలోతైన పాండిత్యాన్ని తెలియ జేశారు .అందులో ‘’శ్రీ రామ కీర్తి మహా కావ్యం ‘’,శివ కర్ణామృతం ‘’,’’శివ మహిమ కలికా స్తుతి ‘’,సుమనో వాగ్విలాసః ‘’,కృష్ణ లీలా తరంగిణి ‘’ముఖ్యమైనవి .ఇవన్నీ ముద్రితాలే.

డా రామ కృష్ణ గారి గీర్వాణ పాండిత్య ప్రతిభా  విశేషాలను గుర్తించిన ధాయ్ లాండ్ ప్రభుత్వం రాకుమారి చే 2013 లో రాజ సత్కారం చేసి గౌరవించింది .2014 సెప్టెంబర్ 5 వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘’ఉత్తమ సంస్కృతాధ్యాపన పురస్కారం’’ అందజేసి వారి విద్వత్ కు నీరాజనం పట్టింది .

సరసభారతి నిర్వహిస్తున్న ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవ భాగం ‘’గ్రంధా విష్కరణ సభకు గౌరవ అతిధిగా శ్రీ ఉత్తమ సంస్కృతాధ్యాపన పురస్కారం అందుకొన్న డా ధూళి పాళ రామ క్రష్ణగారిని సగౌరవం గా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం .

1-    మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్

శ్రీ బుద్ధ ప్రసాద్ కృష్ణా జిల్లా దివితాలూకా నాగాయలంకలో 26-5-1956 ఆంద్ర ప్రదేశ్ మాజీ విద్యామంత్రి ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించిన శ్రీ మండలి కృష్ణా రావు శ్రీమతి ప్రభావతీ దేవి దంపతులకు జన్మించారు .తండ్రిగారి సుగుణ సంపత్తి పూర్తిగా పుణికి పుచ్చుకొన్న వ్యక్తి శ్రీ బుద్ధ ప్రసాద్ .అవనిగడ్డలో సెకండరీ విద్య పూర్తి చేసి ఉస్మానియా యూని వర్సిటినుండి డిగ్రీ పొందారు .

తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పొందిన శ్రీ ప్రసాద్ 1919 లో మొదటి సారిగా అవనిగడ్డ నుంచి  శాసన సభకు ఎన్నికయ్యారు .2014 లో మరల ఎన్నికై దాదాపు 700కోట్ల రూపాయలతో ప్రజాభి వృద్ధి కార్యక్రమాలు చేశారు .2007 లో మొదటి సారిగా మంత్రి పదవిని పొంది పశు సంవర్ధక శాఖ బాధ్యతలు చేబట్టి ‘’పశుక్రాంతి ‘’’’మత్స క్రాంతి ‘’పధకాలను అమలు చేసి రైతుల ,మత్సకారుల జీవితాలలో వెలుగులు నింపారు .పులి వెందలలో పశు సంవర్ధక శాఖలో ‘’అడ్వాన్సేడ్ రిసెర్చ్ సెంటర్ ‘’ను ఏర్పరచారు .హైదరాబాద్ విజయవాడ ,పులి వెందలలో సూపర్ స్పెషాలిటి పశువుల హాస్పిటల్స్ నెలకొల్పారు. పులిగడ్డ వద్ద మండలి వెంకట కృష్ణారావు  పెనుమూడి వంతెన నిర్మించి గుంటూరు జిల్లాను అతి సమీపానికి తెచ్చారు .కృష్ణా జిల్లా అన్ని అభివ్రుద్ధికార్యక్రమాలలో ఆయన సలహా సంప్రదింపులు ఉన్నాయి .2005 సునామీకి సర్వస్వం కోల్పోయిన వారి పునరావాస కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు .తండ్రిలాగా మాటలో, నడవడిలో, అచ్చమైన  గాంధేయ వాది.శ్రీ ప్రసాద్ . కృష్ణా మహోత్సవ, దివిమహోత్సవ నిర్వహణ,శ్రీకాకుళం లో శ్రీకృష్ణ దేవరాయ ,కాసుల పురుషోత్తమ కవి విగ్రహ ప్రతిష్ట సాగర సంగమం అభి వృద్ధి ,ఘంటసాల లో బౌద్ధ ఆరామ నిర్వహణ ,పరిరక్షణ , కూచిపూడి కళాక్షేత్ర  అభివృద్ధి ,లండన్ లో సి పి బ్రౌన్ సమాధి ఆధునీకరణ ,విజయవాడలో క్షేత్రయ్య కళాక్షేత్ర ఆవరణలో  లబ్ధ ప్రతిస్టులైన  మహనీయుల కాంశ్య విగ్రహాల ఏర్పాటు ,బందరు కోట పునర్వైభవం ,కృష్ణావిశ్వ విద్యాలయం,  అందులో తెలుగు శాఖ ఏర్పాటు  కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో జాతీయ , అంతర్జాతీయ తెలుగు మహా సభలనిర్వహణ ,రిఫరెన్స్ గ్రందాల ప్రచురణ  ఘనం గానిర్వహించారు .,కోర్టులలో తెలుగు లో తీర్పు కోసం విశేష కృషిచేశారు .తండ్రిగారరి పేరిట ప్రతి ఏడాది పురస్కారాలను అందిస్తున్నారు .  .లండన్ లోని తెలుగు హిస్టరీ సదస్సుకు అధ్యక్షులుగా ఉన్నారు .వ్రుత్తి రాజకీయమే అయినా ప్రవ్రుత్తి సాహిత్యం,సంస్కృతీ  అయిన మనీషి శ్రీ బుద్ధ ప్రసాద్ . ప్రపంచ౦ లో చాలా దేశాలు పర్యటించి విశేషాలను అక్షర బద్ధం చేసి యాత్రా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు .వారి పుస్తకాలలో ముఖ్యమైనవి మారిషస్ లో తెలుగు తేజం ,ప్రజలు –ప్రగతి ,ఇంగ్లాండ్ లో తెలుగు వైభవ స్మృతులు .అధికార భాషాసంఘ అధ్యక్షులుగా పనిచేసి తెలుగు అమలుకు గొప్ప కృషి చేశారు .తెలుగుకు  ప్రాచీన హోదా కై ఉద్యమించి అందరి సహకారం తో  సాధించారు .భువన విజయాలలో కృష్ణదేవరాయలుగా వన్నె తెచ్చారు .2014నుండి నవ్యాంధ్ర ప్రదేశ్ శాసన సభకు ఉప సభాపతి గా  పదవికే గౌరవం తెచ్చారు .భాషా సంస్కృతుల పరిరక్షణ అభి వృద్ధి పకోసం శ్రీ బుద్ధ ప్రసాద్ గారిలాగా  అంకిత భావం తో పని చేసే రాజకీయ నాయకులు లేరు అని నిస్సందేహంగా చెప్పవచ్చు .

, సరసభారతి నిర్వహించిన తెలుగు భాషా సదస్సులో,ఉగాది వేడుకలలో ,గురజాడ ,రవీంద్రుల 150 వ జయంతి సభలలోశ్రీ బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా  పాల్గొని స్పూర్తి నిచ్చి ప్రోత్సహించారు .

వారి సమర్ధతకు తగిన మరిన్ని ఉన్నత పదవులలో రాణించి వర్ధిల్లాలని ఆశిస్తూ  సరసభారతి నిర్వహిస్తున్న ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవభాగం ‘’గ్రంధా విష్కరణ సభకు సంస్కృతీ సంపన్నులు ,మాన్య ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారిని ముఖ్యతిధిగా వేదిక నలంకరించి ,తమ అమృత హస్తాలతో పుస్తకావిష్కరణ చేయవలసినదిగా సగౌరవంగా వేద్దికపై కి ఆహ్వానిస్తున్నాం .

 

గీర్వాణ భాషా వైభవం –కవి సమ్మేళనం –డా రామడుగు వెంకటేశ్వర శర్మ (గుంటూరు )గారి కవిత

1-సీ –రామ నీరద  సుదర్శన మాత్ర కవన నృత్యతా కేకి వాల్మీకి !అంజలు లివె

శ్రుతి పురాణార్ధ భారత పద్మ వికసనోల్లాస  వేద వ్యాస !ప్రణతి వినుతి

ప్రతిభా సమేత రూపక దీపికా వాస ! భాసా నమోస్తు

కమ్రోపమాన సత్కవితా విలాస శ్రీ కాళిదాసా!నమస్కార శతము

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి– ,నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మ యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

2-సీ-‘’కవి భారవే రర్ధ గౌరవ ‘’ఖ్యాతి చేకొన్న భారవి !ఏటి కోళు లివియె

శబ్ద లాలిత్యైక సంపస్సముద్దండి!దండి మహా కవీ దండమయ్య

మల్లినాద ప్రశంసా ‘’మాఘ మేఘేతి’’ వాక్య కారక మాఘ !ప్రణతి శతము

శివ మహిమ్న స్తోత్ర కవి గాఢ భక్తాగ్ర గణ్య సత్కీర్తి సౌజన్య !నతులు

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

3-సీ –నవ విద్వ దౌషధ  నైషద కవితా ప్రవర్ష ,హర్షా !ఇదే ప్రణుతి శతము

కాదంబరీ రసజ్ఞాన దాయక బాణ !బాణ భట్టారకా  వందనములు

‘’సరస పద్మావతీ చరణ చారణ చక్ర వర్తి ‘’యౌ జయదేవ  వందనములు

‘’ కృష్ణ కర్ణామృత లీలాశుకా ‘’!జ్ఞాన చింతామణి కవీంద్ర !చేతు నతులు

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

4-సీ –కరుణా రసైక సత్కవన గోదావరీ వర భూతి ,భవ భూతి !వందనములు

గుణ్య సామాన్య నైపుణ్య జీవన రూపకా !మృచ్చ కటికాఖ్య కర్త !నతులు

చాణక్య రాజ్యాంగ చతురతా పూర్ణ ‘’ముద్రారాక్షస ‘’విశాఖ దత్త నతులు

తృతీయ పంథా ప్రధానా !’’అనర్ఘ రాఘవ రూపకా !నమస్కార శతము

బంధుర రసానంద పరీమళ’’!కుందమాలా కార! వందనములు

నిర్మల ప్రియదర్శినీ రూప నవ్య నాగానంద హర్షాధిపా నమోస్తు

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

 

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవభాగం

గ్రంధ పరిచయం –పద్య మందార మాలతో అభినందన చందనం  -డా తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి

1-జయశీలంబును ,కార్య శూరతయు ,సౌజన్యంబు రూపంబు దా

ల్చి ,యపూర్వంబుగ దీర్చి దిద్దిన గీర్వాణ కళాక్షేత్రంబు’’ గీర్వాణ వా

ణి’’,యమూల్యంబగు భావ సంపదల నున్మేషింప,సారస్వత

ప్రియు లిద్దాని గుణంబులన్ గని ,ప్రహర్షింపన్,సమర్ధంబగున్ .

2- ఘనులై సంస్కృత భాష నధ్యయనమున్ గావించి ,కావ్యాలు వ్రా

సిన ,ఆయా కవి జీవితంబుల ప్రశస్తిన్ ,జ్ఞాన విజ్ఞాన భా

వనలన్, బ్రోది యొనర్చి ,భావి తరముల్ భద్రంబు లై వర్దిల౦

గను ,గీర్వాణ కవి ప్రణీతములు  సద్గ్రంధంబులన్ దెల్పుచున్ .

3-తరువుల్ బూచిన పుష్ప సౌరభము ,లుత్సాహంబు తో, వాయు

వెల్లరకున్ బంచిన రీతి ,సంస్కృతుల సంలాపంబు ,లాంద్రోక్తి సుం

దరమై  భాసిల జేయు సత్కవులు ,సత్కారార్హులాత్మోన్నతిన్

బర మార్ధంబు గ్రహించి ,లోకులకు జెప్పన్ ,సద్విర్మంబగున్ .

4-అభినందించు బ్రపంచ మీ కృతికి ,నత్యంతంబు సత్య౦బు ,దు

ర్లభౌ ,సంస్కృత కావ్యముల్ విబుధు లౌరా !యంచు గీర్తింప ,ద

చ్చుభ సందర్భ,ముదాహరి౦చుచు ,కవీశుల్ మెచ్చ సాహిత్య ,సౌ

రభ ముల్,దిక్కుల నింపు మీ కృషి ,సువర్ణం బై విరాజిల్లెడున్  .

5-తినబోవన్ రుచి గూర్చి చెప్పవలెనా ?తియ్య౦దన౦ ,భిక్షుఖా

దన మన్నన్ బునరుక్తి కాదొకొ ?ప్రసాదంబిట్టి దౌనంచు ,వ

ర్ణన గావి౦పగ శక్యమే ?సవిత నారాధింప ,దీపంబు జూ,

పిన చందంబిది,గబ్బిటాన్వయ మణీ!విద్వద్విమర్శాగ్రణీ’’.

డా .తూములూరు శ్రీ దాక్షిణా మూర్తి శాస్త్రి

రిటైర్డ్ ప్రిన్సిపాల్

,శ్రీ భావనారాయణ స౦స్కృత కళాశాల –పొన్నూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.