మా అన్నయ్య (కవితా సంకలనం)-పుస్తక సమీక్ష-పెరుమాళ్ళ రవికుమార్
శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ఈయన పేరు వినగానే 35 మంది యోగుల చరిత్రను తెలిపే ‘సిద్ధ యోగి పుంగవులు’,షేక్స్ పియర్ వంటి పూర్వ ఆంగ్లేయుల జీవిత చరిత్రకు నిలువుటద్దం ‘పూర్వాoగ్ల కవుల ముచ్చట్లు’’,మరీ ముఖ్యంగా యాబై మంది జాతీయ అంతర్జాతీయ మహిళా మణులను పరిచయం చేసే ‘మహిళా మాణిక్యాలు’ సాహితీ ప్రియులకు కరదీపిక లాంటిది. ఈయన గురించి ప్రముఖ రచయిత్రి ,ప్రరవే జాతీయ అధ్యక్షురాలు డా.పుట్ల హేమలత గారి ఇంటికి వెళ్ళినప్పుడు సాహిత్య సంభాషణల్లో గబ్బిట గారి పాండిత్య ప్రకర్షను,వారి అవిరళ కృషిని పరిచయం చేసారు.అప్పటినుండి ఆయన కృషికి తార్కాణాలుగా నిలిచిన గ్రంథాలను చదావాలనే ఆశ కలిగింది.
సరస భారతి ఉయ్యూరు వారు 3-4-2016 న 90 వ సమావేశంగా ”మా అన్నయ్య” పై కవిసమ్మేళనం నిర్వహించి పుస్తకాన్ని ఆవిష్కరించటం హర్షించదగ్గ విషయం.ఈ కవితా సంకలనం మొత్తం ముప్పై ఐదు కవితల సమాహారం.కుటుంబం లో అమ్మా,నాన్న తర్వాత అన్నయ్యకు అత్యంత ప్రాధాన్యత కలదు.గబ్బిట దుర్గా ప్రసాద్ తన అన్నయ్య పై పెంచుకున్న అభిమానాన్ని ‘మా శర్మన్నయ్య చిరంజీవి’ కవితలో అక్షరీకరించారు.ఇందులో ‘గోర్కీ సాహిత్యమంతా దాచాడు …..సినిమాలు నాకు చూపించి వాటిపై చక్కని విమర్శ చేసే వాడు అంటూ అన్న గారి జ్ఞాపకాలను దుర్గా ప్రసాద్ గారు కవిత్వీకరించారు.
‘ఆత్మీయ అనురాగ పుంభావ మూర్తి అన్నయ్య ‘అన్న కవితలో దండి భొట్ల దత్తాత్రేయ శర్మ అమ్మా నాన్నఇద్దరికీ ఉద్యోగo వల్ల దూరం గా ఉన్నప్పటికీ ‘అన్న అంటే అందుబాటులో వుండే నాన్నే అంటారు.అన్నతో గడిపిన అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ ‘అమ్మ గోరు ముద్దల్లోను ,నూతి చన్నీళ్ళ స్నానాలలోను/తిరునాళ్ళ తీపి జీడి కొనుగోళ్ళలోను /వేసవి వెన్నెల రాత్రుల ఆరు బయట పడకల్లోను జతకాడే కాదు /చదువు సందేహాలలో సరస్వతి సందేశం లా సంస్కరించే వాడు మా అన్నయ్య’అంటాడు.
అన్నయ్య అంటే కేవలం రక్త సంబoధం మాత్రమే కాదు ఏ సంబంధం లేకపోయినా ఆపదలో ఆదుకున్నవాడు అన్నయ్య అవుతాడని చెప్తూ శ్రీమతి మేరీ కృపాబాయి రాసిన ‘రక్షాబంధనమే అన్నయ్య’ అన్న కవితలో ‘విశాల సమాజంలో ఎందరో అన్నయ్యలు/అనాధ చిన్నారిని ఆదుకునే వేళ అతడే అన్నయ్య /పేదరికం లో మగ్గి పోయే వేళ అమ్మాయికి ఫీజు కడితే అతడే అన్నయ్య /చిమ్మ చీకటిలో చిక్కుకున్న స్త్రీకి దారి చూపి రక్షించే వేళ అతడే అన్నయ్య అంటూ అన్నయ్యకు నిర్వచనమిచ్చారు.
అమ్మా నాన్న కి పెద్దకొడుకు కొండంత అండ.ఇంటి వ్యవహారాలలోను, అన్నయ్య బాధ్యత ఎక్కువగా ఉంటుంది.తల్లిదండ్రుల గౌరవ ప్రతిష్టలు నిలపాల్సినది కూడా అన్నయ్యే.ఈ విషయాన్ని ‘మిన్నంటిన గౌరవం అన్న ‘అన్న కవితలో పంతుల వెంకటేశ్వరరావు సీస పద్యం లో చాలా చక్కగా వివరించారు.ఆ విధాత బ్రహ్మ అమ్మను సృష్టించే -ఆదరింప నెప్పుడు అవని యందు /అటులే నాన్న బదులు అన్నను పుట్టించే -ఆదరింపనెప్పుడు అవనియందు’అన్నను వర్ణించారు.
శ్రీమతి పెళ్లూరు శేషు కుమారి రాసిన ‘అన్నయ్య మనసు నిర్మలం’,శ్రీమతి సింహాద్రి వాణి రాసిన ‘అన్నయ్య అమల బంధం ,తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు రాసిన ‘అన్నయ్య పురుషోత్తముడు’శ్రీమతి కోపూరి పుష్పా దేవి రాసిన ‘అపురూప ఫలo అన్నయ్య’ అన్న కవితలు అన్నతో గల బంధం అనుభూతి చెందేలా వున్నాయి . వర్ణనలు అందరిని ఆకట్టుకుని ఏకబిగిన చదివించడానికి ఉపక్రమిoపజేస్తాయి
-పెరుమాళ్ళ రవి కుమార్
————————————————————————————————————————————-
—