గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
11-పంచశతి రచించిన మూక కవి -2
మూక కవి గీర్వాణ కవితా వైభవం
విద్యాపతి కుమారుడైన మూకకవి మూక శంకరులుగా కాంచీ కామకోటి 20 వ పీఠాదిపతిఅయిన సంగతి తెలుసుకొన్నాం .ఇప్పుడు మూక పంచశతి లోని మొదటి దైన ఆర్యా శతక విశేషాలను తెలుసుకొందాం .
1- ఆర్యా శతకం
‘’కారణ పర చిద్రూపా-కాంచీ పుర సీమ్ని కామగత పీఠా
కాచన విహరతి కరుణా –కాశ్మీర స్తబక కోమలాంగ లతా ‘’అన్నది అందులో మొదటి శ్లోకం –కుంకుమ పూల గుత్తి లా కోమల మైన తీగవంటి శరీరం కలిగి ,కారణ పర చైతన్య స్వరూపిణిగా కామపీఠాన్ని ఆశ్రయించి న ఒకానొక దయారూపిణి కాంచీపురం లో విహరిస్తున్నది .
74 వ శ్లోకం –‘’వేదమయీం నాద మయీం –బి౦దుమయీం పరపదోద్య దిందు మయీం
మంత్రమయీం తంత్ర మయీం –ప్రకృతి మయీం నౌమి విశ్వ వికృతి మయీం ‘’
భావం –పరమ పదం(సహస్రారం ) లో ఉదయించే చంద్రుని స్వరూపంకలిగి ,వేద ,నాద బిందు రూపిణి,మంత్రం తంత్రమయినది ,విశ్వ వికార రూపిణిగా ఉన్నది అయిన ప్రకృతి –అంటే కామాక్షీ దేవి కి నమస్కరిస్తున్నాను .
99 వ శ్లోకం –‘’కళ మంజుల వాగనుమిత –గళ పంజర శుక గ్రహౌత్కంఠత్యాత్
అంబ రదనా౦బర౦ తే –బింబ ఫలం శంబరారి ణా న్యస్తం ‘’
భావం –చెప్పటానికి వీలు లేనంత మధుర మృదు సౌందర్య పలుకులు పలికే చిలక ,నీ కంఠం అనే పంజరం లో ఉందని తెలిసి ,మన్మధుడు ఆ చిలుకను పట్టుకోవటానికి యెర్రని పెదవి అనే దొండ పండుని ఎరగా ఉంచాడు .అంటే అమ్మవారి మాటలు మంజుల మనోహరం గా ఉన్నాయని అర్ధం .
ఈ శ్లోకాన్ని శ్రీ నాగ ఫణి శర్మ గారు ప్రతి విద్యాలయం లోని పిల్లలతో పాడించి గొప్ప వ్యాప్తి కలిగించి వారు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై గొప్ప విద్యా బుద్ధులు సాధించటానికి తోడ్పడ్డారు .
2-పాదార వింద శతకం
మొదటి శ్లోకం –‘’మహిమ్నః పంధానం మదన పరి పంధిప్రణయిని –ప్రభుర్నిర్నేతుం తే భవతి యత మానోపి కతమః
తదాపి శ్రీకాంచీ విహ్రుతి రసికే కోపి మనసో –విపాకస్త్వాత్పాదస్తుతి విదిషు జల్పాక యతిమాం ‘’
భావం –కంచి లో హాయిగా విహరించే మన్మధ విరోధి అయిన శివుని ప్రియురాలైన కామాక్షీ దేవీ !నీ దివ్యమహిమను తెలియ జెప్పే సమర్ధులో లోకం లో లేరు .నాపూర్వ జన్మ సుకృతం ఫలించి నీపాదార వి౦దా లను స్తుతించే కవిత్వాన్ని నాతో పలికిస్తున్నావు .
33 వ శోకం –
స్పురన్మధ్యే శుద్దే నఖ కిరణ దుగ్దాబ్ది పయసాం –వహన్నబ్జం చక్రం దరమపి చ రేఖాత్మ కతయా
శ్రితోమాత్ష్యం రూపం శ్రియమపి దధానో నిరుపమాం-త్రిదామా కామాక్ష్యాఃపద నళిన నామా విజయతే .
భావం-నీపాదాల గోళ్ళకాంతి అనే పాల సముద్రం మధ్యలో శంఖ ,చక్ర కమలాలను రేఖా మాత్రం గా ధరించి ,గొప్పదైన లక్ష్మీ దేవిని కూడా ధరించి ,కామాక్షీ దేవి వైన నీ పాదపద్మాలు అనే పేరుగలవిష్ణు మూర్తి చేప రూపంలో సర్వొన్నతుడుగా వర్ధిల్లు తున్నాడు .అంటే అమ్మవారి పాదాలలో శంఖ ,చక్ర ,కమల ,మత్స్య రేఖలున్నాయని అర్ధం .
64 వ శ్లోకం –‘’మహా భాష్య వ్యాఖ్యా పటు శయన మారో పయతి –స్మర వ్యాపారే ర్శ్వ్యాపి శున నిటలంకారయతి వా
ద్విరేఫాణామధ్యాసయతి సతతం వాధి వసితం –ప్రణమ్రాన్కామాక్ష్యాః పద నళిన మహాత్మ్యా గరిమా ‘’
భావం –నీపద కమలాలు మహిమాన్వితమైనవి వాటికి నమస్కరించేవాడిని మహాభాష్య వ్యాఖ్యాత గా కాని కామాన్ని తిరస్కరించే సన్యాసిగా కాని ,తుమ్మెదలకు ఆవాసమైన కమలాన్ని అంటే సహస్రార కమలానికి చేరే యోగాన్ని అధిస్టింప చేయటంకానీ చేస్తాయి .
96-వ శ్లోకం –‘’రణన్మంజీరాభ్యాంలలిత గమనాభ్యాంసుకృతినాం –మనో వాస్తవ్యాఖ్యాంమధిత తిమిరాభ్యాం నఖ రుచా
నిదేయాభ్యాం పత్యా నిజ శిరశి కామాక్షి సతతం –నమస్తే పాదాభ్యాం నళిన మ్రుదులాభ్యాం గిరి సుతే ‘’
భావం –అమ్మవారి పాదాలుచాక్కగా నాదం చేస్తున్న అందెలను ధరించి ,అందమైన నడకలతో ప్రకాశిస్తున్నాయి .ఆమె కాలి గోళ్ళ కాంతులు చీకట్లను నాశనం చేస్తున్నాయి .అవి కమలాలులాగా అతి కోమలంగా ఉన్నాయి .భర్త అయిన శివుని శిరసుపై ఉంచబడుతున్నాయి .అలాంటి దేవిపాదాలకు నమస్కారం .
చివరిదైన 103 వ శ్లోకం –‘’ఇదం యః కామాక్ష్యాః శ్చరణనళిన స్తోత్ర శతకం –జపేన్నిత్యం భక్త్వా నిఖిల జగదాహ్లాదజనకం
స విశ్వేషాంవంద్యస్సకల కవి లోకైక తిలక –శ్శిరం భుక్త్వా భోగా స్సరిణమపి చిద్రూప కలయా ‘’’
భావం –సకలలోకాలకు ఆనందాన్ని కలిగించే శ్రీ కామాక్షీదేవి పాదార వింద శతకం గా ప్రసిద్ధి చెందిన ఈ స్తోత్రాన్ని భక్తితో ప్రతి రోజూ పఠించే వారు అందరి చేత నమస్కరి౦పబడే గొప్ప కవీశ్వరులౌతారు .సకల సుఖ భోగాలు అనుభవించి చివరికి చిద్రూప కలగా మారి అమ్మవారిని చేరు కొంటారు అని ఫలశ్రుతి చెప్పాడు మూక కవి .
3-స్తుతి శతకం
1 వ శ్లోకం –‘’’పాండిత్యం పరమేశ్వరి స్తుతి విధౌ నైవాశ్రయంతేగిరాం –వైరి౦చాన్యపి గు౦ఫనాని విగళద్గర్వాని శర్వాణి తే
స్తోతుం త్వాం పరిఫుల్ల నీల నళిన శ్యామాక్షి కామాక్షి మాం –వాచాలీ కురుతే తదాపి నితరాం త్వత్పాద సేవాదరః ‘’
బావం –వికసిత నీలోత్పల కనుల కాంతితో ప్రకాశించే కామాక్షీ దేవీ !పరమేశ్వరీ,శర్వాణీ!నిన్ను స్తుతించే ప్పుడు బ్రహ్మ వాక్కులు కూడా రసహీనమై పాండిత్యం కనిపించటం లేదు .అయినా నీపాద సేవ రాధకుడినైన నేను నిన్ను కీర్తించా టానికి వాచాలత్వం ప్రదర్శిస్తూ కవిగా పేరురుపొండుతున్నాను.
29-‘’మునిజనమనః పేటీ రత్నం స్పురత్కరుణా నటీ –విహరణ కలాగేహం కా౦ ఛీపురీ మణి భూషణం
జగతి మహతో మోహ వ్యాధే ర్నృణా౦ పరమౌషధం –పురహర దృశాం సాఫల్యం మే పురః ప్రరిఝ్రుంభతాం’’
భావం –మునీశ్వరుల మనసు అనే పెట్టెలో ఉన్న రత్నం లాంటిది ,ప్రకాశించే దయ అనే నటి విహరించటానికి నిలయమైనది ,కా౦ఛీనగారానికి మణి భూషణం గా వెలుగొందుతున్నదీ ,ఈ జగత్తులో వ్యాపించిన మొహం అనే వ్యాధికి దివ్యౌషధమైనది ,శివుని నేత్రాల కు సాఫల్యమైనది అయిన కామాక్షి రూపం నా ముందు సాక్షాత్కరించు గాక .
96 –‘’త్వయైవ జగదంబయా భువన మండలం సూయతే –త్వయైవ కరుణార్ద్రయా తదపి రక్షణం నీయతే
త్వయైవ ఖర కోపయా నయన పావకే హూయతే –త్వయైవకిల నిత్యయా జగతి సంతత౦ స్థితం ‘’
భావం -అమ్మా ! నీ వల్ల ఈ సకల భూమండలం ప్రసవం చెందుతుంది .నీదయా రసం తో నే జగత్తు పాలింప బడుతోంది ,రక్షింప బడుతోంది .నీ తీక్ష్ణ కోపానికి ,నీ నేత్రాగ్నిలో హరించ బడుతోంది .నిత్యు రాలైన నీ చేతనే ఎల్లప్పుడూ జగత్తు నిలుస్తోంది .
100-‘’క్వణ త్కాంచీ పుర మణివిపంచీ లయ ఝరీ –శిరః కంపాకంపా వసతి రను కంపా –జలనిధిః
ఘనశ్యామా శ్యామాకఠిన కుచ సీమా మనసిమే-మృగాక్షీ కామాక్షీ హర నటన సాక్షీ విహరతాం’’
భావం –అందమైన వడ్డాణం ధరించి ,కాంచీపురం లో మాణిక్య వీణ లయ ప్రవాహానికి ఆనందంగా తలూపేది ,కంపా నదీ తీరమే నివాసంగా ఉన్నదీ దయసంద్ర మేఘంలా నల్లనైన నిండు యవ్వన కఠిన స్తనాలు కలదీ ,జింక కళ్ళవంటి విశాల కనుదోయి కలది ,పరమేశ్వరుని నటనకు సాక్షీ భూతమైనదీ అయిన కామాక్షీ దేవి నా మనసులో నిత్యంవిహరించు గాక .
101- ‘’సమర విజయ కోటీ సాధకానంద దాటీ –మృదు గుణ మణిపేటీ ముఖ్య కాదంబ వాటీ
మునిసుత పరిపాటీ మొహితాజాండకోటీ –పరమశివ వధూటీ పాతుమాం కామకోటీ .’’
భావం –రాక్షసులపై అనేక యుద్దాలో విజయం సాధించినదీ ,సాధకుల ఆనందానికి ఆవలి తీరమైనదీ ,మృదు రత్నాలకు పెట్టె లాంటిది ,కదంబ వృక్ష వనం కలదీ ,మునుల చేత స్తుతి౦పబడే సుగుణ రాశి అయినదీ ,కోట్లాది బ్రహ్మాండాల ను మోహింప జేసేదీ ,పరమేశ్వరుని అర్ధాంగి అయినదీ ,కామకోటి అనే పేరు తో విఖ్యాతమైనదీ అయిన కామాక్షీ తల్లి నన్ను కాపాడుగాక .
మూక కవి చిత్రం ఈ కింద జత చేశాను చూడండి
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-12-16 –ఉయ్యూరు