గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
12-నడయాడే దైవం ,ఆధునిక ఆదిశంకరులు -కంచిపరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి -3(చివరిభాగం )
పెరియ స్వామి వారి గీర్వాణ రచన
పెరియ స్వామి అని అందరి చేత పిలువబడే పరమాచార్యులవారు రచించిన ‘’మైత్రీం భజతా ‘’అనే సంస్కృత గీతాన్ని ఐక్య రాజ్య సమితిలో సమితి వార్షికోత్సవం నాడు శ్రీమతి ఎం ఎస్.సుబ్బు లక్ష్మి గానం చేసినట్లు చెప్పుకొన్నాం . ఆ గీత వైభవం దర్శిద్దాం –
‘’మైత్రీం భజతా అఖిల హృజ్జేత్రీం –ఆత్మా వదేవ పరానాపి పశ్యంతా
యుద్ధం త్యజతా స్వార్ధం త్యాజ్యతా –త్యాగతా పరేషు అక్రమమాక్రమణ౦
జననీ పృధ్వీ కామ దుఘాస్తే-జనకో దేవా సకల దయాళూ
దామ్యతా దత్తా దయాద్వం జనతాః-శ్రేయో భూయాత్ సకల జనానాం
శ్రేయో భూయా సకల జనానాం- – శ్రేయో భూయాత్ సకలజనానాం.
భావం –స్నేహం వినయం అందరి హృదయాలను గెలుస్తాయి –నీలాగా అందరినీ చూడు .యుద్ధం త్యజించు .స్వార్ధాన్ని త్యజించు .ఆవేశ పూరిత దాడిని ,ఆక్రమణను త్యజించు .భూమితల్లి మన కోరికలన్నీ తీరుస్తుంది .అందరికీ ఉన్న ఒకే ఒకతండ్రి పరమేశ్వరుడు .హద్దులో ఉండటం ,ఇతరులకు దానం చేయటం ,పరులపై కరుణ చూపటం అలవాటు చేసుకో.ప్రపంచ ప్రజలారా సుఖ సంతోషాలతో వర్ధిల్లండి .
మనకు భూ సూక్తం ఉన్నది .దానికి సాటిగా స్వామివారి రచన సాగింది .వారినోటి నుంచి వచ్చిన ప్రతి వాక్యమూ అమృత తుల్యమే .ఈ గీతం విశ్వ వేదిక పై గానం చేయబడటం భారతీయ ఆకాంక్ష కీర్తికి ఎత్తిన పతాక .ఇదే అంతర్జాతీయ గేయంగా వర్ధిల్లితే ఎంతో హృద్యంగా ఉంటుంది .
అదీ పరమాచార్యుల ఉత్తమోత్తమ ఉన్నతోన్నత భావ లహరి .అందుకే జగద్గురువు లయ్యారు .
శ్రీ వారు శ్రీ దుర్గా ప్రతిష్ట సందర్భం గా’’ శ్రీ దుర్గా పంచ రత్న స్తోత్రం ‘’ రచించినట్లు శ్రీ విశాఖ పేర్కొని దానిని ‘’జగద్గురు బోధలు -10 ‘’లో ఇచ్చారు .దానిని ఇప్పుడు దర్శిద్దాం –
1-తే ధ్యాన యోగానుగతా అపశ్యన్ –త్వా మేవ దేవీం స్వగుణై ర్నిగూఢతాం
త్వమేవ శక్తిః పరమేశ్వరస్య –మాం పాహి విశ్వేశ్వరి మోక్ష దాత్రి
2-దేవాత్మ శక్తిః శ్రుతి వాక్య గీతా –మహర్షి లోకస్య పురః ప్రసన్నా
గుహా పరం వ్యోమ సతః ప్రతిష్టా-మాం పాహి విశ్వేశ్వరి మోక్ష ధాత్రి .
3-పరాస్య శక్తిః వివిధవ శ్రూయతే –శ్వేతాశ్వ వాక్యోదిత దేవి డుర్గే
స్వాభావికీ జ్ఞాన బలక్రియాతే – మాం పాహి విశ్వేశ్వరి మోక్ష ధాత్రి .
4-దేవాత్మ శబ్దేన శివాత్మ భూతా –యత్కూర్మ వాయవ్య వచో వివ్రుత్యా
త్వం పాశ విచ్చేదకరీ ప్రసిద్ధా – మాం పాహి విశ్వేశ్వరి మోక్ష ధాత్రి .
5-త్వం బ్రహ్మ పుచ్చా వివిధా మయూరీ –బ్రహ్మ ప్రతిష్టా స్యుపదిస్ట గీతా
జ్ఞాన స్వరూపాత్మతయాఖిలానాం – మాం పాహి విశ్వేశ్వరి మోక్ష ధాత్రి .
స్వామివారు ‘’శ్వేతాశ్వవాక్యోదిత దేవి దుర్గే ‘’అన్నారు .శ్వేతాశ్వ తరుడు అనే రుషి ఉన్నాడని శ్రీ వారు చెప్పేదాకా చాలా మందికి తెలిసి ఉండదు .శ్వేతాశ్వ వాక్యోదిత దుర్గ ఎలా ఉన్నది –అన్నదానికి శ్రీ విశాఖ ఒక శ్లోకం ఉటంకించారు –
‘’భూతాని దుర్గా భువనాని దుర్గా –స్త్రియో నరా శ్చాపి పశుశ్చ దుర్గా –
యద్యద్ధి దృశ్యం ఖలుసైవ దుర్గా –దుర్గా స్వరూపా దపారం న కించిత్ ‘’
అంటే సర్వభూతాలు సర్వ లోకాలు ,స్త్రీ పురుష పశువులు అంతా దుర్గా స్వరూపమే .కనిపించింది ,కనిపించనిది అంతా దుర్గా స్వరూపమే .దుర్గా స్వరూపం కానిది ఏదీ లేదు .దుర్గ ఏక ప్రాభవ శాలిని ,అఖండ చైతన్య స్వరూపిణి.
పాల్ బర్టన్ వంటి పాశ్చాత్యులు మహా స్వామిని దర్శించి స్పూర్తిపొందారు .మన కళ్ళముందు నడయాడిన దైవం శతమానం జీవించి 8-1-1994 న శంకర సన్నిధికి చేరుకొన్నారు .వారి సంస్కృత రచనలు నాకు ఈ రెండు మాత్రమే లభించాయి .ఎవరి వద్ద అయినా వారి రచనలు ఉంటె నాకు పంపితే వాటినీ చేర్చి సంతృప్తి చెందుతాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-12-16- ఉయ్యూరు
.