16-తెలుగు వారి ప్రాతస్మరణీయుడు –చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్
బ్రౌన్ అనగానే మనకు ఆయన కూర్చిన బ్రౌణ్య నిఘంటువు ,వేమన శతకం మాత్రమే ముందుగా గుర్తుకొస్తాయి .ఆయన సేకరించిన అనేక తాళపత్ర గ్రంధాలు ,వాటిప్రచురణ తరువాత జ్ఞాపకమొస్తాయి .కాని తెలుగు భాషా సేవకుడు బ్రౌన్ మహాశయుడు శంకర భగవత్పాదులు వ్రాసిన ‘’సౌందర్య లహరి ‘’పై ఒక విపుల వ్యాఖ్యానం రాశాడని ,మనలో చాలామందికి తెలియదు .అలాగే భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానం పై ఎన్నో పరిశోధనలు చేసిన జాన్ ఉడ్రాఫ్ భారత దేశమంతా పర్యటించాడని, సౌందర్యలహరి పై ఆంగ్లం లో వ్యాఖ్యానం రాశాడని కూడా మనకు తెలియదు .సర్ విలియం బ్రౌన్ సౌందర్య లహరి లోని ప్రతి శ్లోకానికి చిత్రపటం సేకరించి ప్రచురించాడనీ,శాక్తేయ వాదం పై గొప్ప ఉపోద్ఘాతం రాశాడని ,అమెరికాలోని ఫిలిప్పైన్స్ యూని వర్సిటీ లో సౌందర్య లహరిపై అధ్యయనం జరుగుతోందని కూడా అతి తక్కువలో తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయాలు .ఈ విషయాలన్నిటినీ డా సామవేదం షణ్ముఖ శర్మ గారు’’ భక్తి మాసపత్రిక’’ 2016 జూన్ సంచికలో ‘’సౌందర్య లహరి’’వ్యాసం లో తెలియ జేశారు .
బ్రౌన్ దొర కూడా గీర్వాణ సాహిత్యాన్ని ప్రోత్సహించాడని అర్ధమైంది కనుక ఆయన భాషా సేవను తెలియ జేస్తున్నాను సంక్షిప్తంగా .చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ 10-11-1796న ఇండియాలోని కలకత్తా నగరం లో జన్మించాడు .తండ్రి డేవిడ్ బ్రౌన్ అనాధ శరణాలయ నిర్వాహకుడు ,సంస్కృత౦ తో సహా అనేక భాషలలో పండితుడైన మిషనరీ స్కాలర్ .తండ్రి మరణం తో ఇంగ్లాండ్ వెళ్ళిన బ్రౌన్ మళ్ళీ ఇండియాకు 18 17 చేరి మద్రాస్ లో ఇండియాలో సివిల్ సర్వీస్ ఉద్యోగానికి శిక్షణ పొందాడు .ఆనాటి గవర్నర్ ధామస్ మన్రో ఇండియాలో పని చేసే అధికారులందరూ విధిగా స్థానిక భాషను తప్పని సరిగా నేర్వాలని అప్పుడే పరిపాలన సవ్యంగా చేయగలుగుతారని ఆదేశామిచ్చాడు .దాని ప్రకారం బ్రౌన్ సివిల్ పరీక్ష ,తెలుగు పరీక్ష ఒకేసారి 1820లో పాసయ్యాడు .కృష్ణా జిల్లా మచిలీపట్నం ,గోదావరి జిల్లా రాజమండ్రి లలో పనిచేశాడు. గుంటూరు జిల్లాకు 18 24లో మహా కరువు వచ్చినప్పుడు అడ్మిని స్ట్రేటర్ గా సమర్ధంగా వ్యవహరించాడు .1834లోమళ్ళీ లండన్ వెళ్లి ,నాలుగేళ్ళు గడిపి 1838లో మద్రాస్ కు తిరిగొచ్చి పర్షియన్ భాషానువాదకుడుగా ఈస్ట్ ఇండియా కంపెనీకి పని చేసి ,మద్రాస్ కాలేజి బోర్డ్ మెంబరై ,అనారోగ్యం వలన 1854లో రిటైరై ,లండన్ కు తిరిగి వెళ్లి లండన్ కాలేజి లో తెలుగు ప్రొఫెసర్ గా పని చేస్తూ 12-12-1884న 88 వ ఏట లండన్ లో మరణించాడు .తండ్రిలాగానే బ్రౌన్ కూడా బహుభాషా కోవిదుడు .తెలుగు తో పాటు సంస్కృతం పర్షియన్ ,గ్రీకు లాటిన్ భాషలలో గొప్ప పాండిత్యం ఉన్నవాడు .
బ్రౌన్ భాషా సేవ
బ్రౌన్ కడపలో, మచిలీ పట్నం లో మేజిస్ట్రేట్ గా పని చేసినప్పుడు రెండేసి స్కూళ్ళను ఆ రెండు పట్టణాలలో స్థాపించి విద్యార్ధులకు ఉచిత భోజన వసతులు కల్పించి ఉచితంగా తెలుగుతో సహా విద్య నేర్పించాడు .బ్రౌన్ భాషా సేవ మూడు దశలుగా జరిగింది .తాను తెలుగులో రాశాడు ,పురాతన తెలుగు తాళపత్ర గ్రంధాలను సేకరించాడు .వాటిని ప్రచురించాడు .1824లో వేమన పై ద్రుష్టి పడి,ఆయన పద్యాల సేకరణ చేశాడు. తెలుగు ఛందస్సువ్యాకరణాలను శ్రీ తిప్పాభట్ల వెంకట శివ శాస్త్రి ,శ్రీ వఠ్యంఅద్వైత బ్రహ్మ శాస్త్రి అనే ఉద్దండ పండితుల వద్ద అధ్యయనం చేశాడు .1825లో రాజమండ్రి కి బదిలీ అయి తెలుగు సాహిత్యాధ్యయనాన్ని తీవ్రంగా కొన సాగించాడు .శిధిలమై పోతున్న తెలుగు కావ్యాల వ్రాత ప్రతులను ను సేకరించి ,సమర్ధులైన వ్రాయస గాళ్ళను నియమించుకొని కొత్త కాపీలను రాయించాడు .ఆంద్ర మహా భారతం ,మహా భాగవతం లను పునర్ముద్రించాడు .
తెలుగు నేర్చుకోవాలనుకొన్న ఆంగ్లేయులకు తేలికగా భాష అలవడటం కోసం తెలుగు వ్యాకరణ ,ఛందస్సు పుస్తకాలు రాశాడు .తెలుగు –ఇంగ్లీష్ నిఘంటువు తయారు చేశాడు .సాహిత్య పత్రికలలో ఎన్నో మొనోగ్రాఫ్స్ రాశాడు .చాలా కావ్యాలను అనువదించాడు .బ్రౌన్ రచనా సర్వస్వం అంతా మనకు మద్రాస్ ఓరియెంటల్ లైబ్రరీ లో దర్శనమిస్తుంది .
వ్రాత రూపం లో లేని జానపదుల నాలుకలపై నర్తించే లెక్కకు మించి వ్యాసాలూ, కవితలు ,కధలు సేకరించి ప్రచురించాడు .18 24 నుండి పోతన తిక్కన ,వేమన గ్రంధాలను సేకరించటం ప్రారంభించాడు .1835-నుండి 38వరకు లండన్ లో ఉన్నకాలం లో బ్రౌన్ దక్షిణ భారత భాషలలోని 2,106 వ్రాత ప్రతులను ఇండియన్ హౌస్ లైబ్రరీ నుండి సేకరించి ,ఇండియాలోని మద్రాస్ లైబ్రరీకి పంపాడు .
చాలా తెలుగు ,సంస్కృత గ్రంధాలను బ్రౌన్ సంపాదకత్వం లో వెలువరించాడు .మద్రాస్ జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్ కు బ్రౌన్ సంపాదకుడుగా ఉన్నాడు .లండన్ లోని ఏషియాటిక్ జర్నల్ లో తాను సేకరి౦చిన గ్రందాలపై ఆసక్తికరమైన కధనాలు రాశాడు .దాదాపు ౩౦ వేల రూపాయల స్వంత ధనాన్ని ఆనాడే బ్రౌన్ ఖర్చు చేసి చీకటిలో మ్రగ్గిపోతున్న తెలుగు ,సంస్కృత గ్రంధ ముద్రణకు తోడ్పడి వాటిని వెలుగులోకి తెచ్చాడు అందుకే బ్రౌన్ ను తెలుగు భాషా సూర్యుడు అంటారు .కనుకనే బ్రౌన్ మనకు డెల్టా శిల్పి సర్ ఆర్ధర్ కాటన్ లాగా ప్రాతస్మరణీయుడు .కాటన్ ఆనకట్టలు నిర్మించి పంటలకు సాయం చేసి సస్య శ్యామలం చేస్తే, అముద్రిత గ్రందాలనెన్నిటినో వెలికి తీసి బ్రౌన్ సాహిత్య పంట పండించాడు . ఒకరు కుక్షి నింపి సంతృప్తి పరిస్తే ,మరొకరు మనసుకు ఆనందాన్నిచ్చి పరవశింప జేశారు .
అగణిత బ్రౌణ్య భాషా సేవ
1-బ్రౌణ్య నిఘంటువు అనే తెలుగు –ఇంగ్లీష్ డిక్షనరీ
2-గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్
౩-ఎ డిక్షనరీ ఆఫ్ మిక్సేడ్డయలెక్ట్స్ అండ్ ఫారిన్ వర్డ్స్ యూజేడ్ ఇన్ తెలుగు
4-దితెలుగురీడర్( తెలుగు వాచకం)
5-ఏ లిటిల్ లెక్సికన్
6డయలాగ్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్
7-ఆంద్ర గీర్వాణ చందము
8-వేమన శతకం
9-లోకం చేత వ్రాయబడిన శుభ వర్త మానములు (బైబిల్ కధలు )
10-రాజుల యుద్ధములు
11-తెలుగు-ఇంగ్లీష్ ,ఇంగ్లీష్ –తెలుగు నిఘంటువు
12-నల చరిత్ర
13-హరిశ్చంద్రుని కస్టాలు
14-నన్నయ ఆంద్ర మహా భారతం
15- రామ రాజ భూషణుని వసు చరిత్ర
16-పోతన భాగవతం
17-తిక్కన భారతం
18-శ్రీనాధుని పల్నాటి భారతం
ఇవి కాక బ్రౌన్ 1-బసవ పురాణం 2-పండితారాధ్య చరిత్ర ౩-రంగ నాద రామాయణం 4-ఉత్తర రామాయణం 5-విజయ విలాసం 6-సారంగ ధర చరిత్ర 7-హరివంశం 8-కాశీ ఖండం 9- అని రుద్ధ చరిత్ర 10-కుచేలోపాఖ్యానం 11-రాధికా సాంత్వనం 12-విక్రమార్క చరిత్ర గ్రంధాలకు ప్రెస్ కాపీలు రెడీ చేశాడు .వీటిని బ్రౌన్ మరణానంతరం తమిళనాడు ఆంద్ర దేశం లలోని వివిధ సంస్థలు ప్రచురించాయి ‘
బ్రౌన్ ప్రత్యేకతలు
ప్రజలు పరంపరగా చెప్పుకొనే కధలు గాధలు పాటలు చాటువులు సేకరించి ప్రచురించటం బ్రౌన్ ప్రత్యేకత .పాండిత్య ప్రకర్ష ప్రకటించే రచనలపై ఎక్కువ అభిరుచి లేకపోయినా బ్రౌన్ ,చాలా తెలుగు బృహద్గ్రందాలు సేకరించి ప్రచురించాడు .తాను చేసిన అనువాద గ్రంధాలను ఇతరులతోచేయి౦చి నవీ ముద్రించాడు .ప్రతిపుస్తకం లో విషయ సూచిక ,పదాలకు అర్ధాలు ,వ్యాఖ్యానం ఉండేట్లు చేయటం బ్రౌన్ మరో ప్రత్యేకత .తాను వ్యాఖ్యానం రాయటానికి కారణం ఆ పద్యాలు ముఖతా వేరేవారితోఅర్ధాలు చెప్పించుకొని భావం తెలుసుకోవటం అనే అవసరం కుండా చేయాలనే ఉద్దేశ్యం తోనే అని చెప్పాడు .తన నిఘంటువులో చాలా వాడుక పదాలను చేర్చటం మరొక ప్రత్యేకత .
బ్రౌన్ కు సార్ధక బిరుదులు
‘’ఆంద్ర భాషోద్ధారకుడు’’ అనే సార్ధక బిరుదును తెలుగు ప్రజలే బ్రౌన్ మహాశయునికి ఇచ్చి గౌరవించి గుండె గుడిలో ప్రతిష్టించు కొన్నారు .ఆంద్ర భాషా సంరక్షకుడు బ్రౌన్ .
హైదరాబాద్ లో టాంక్ బండ్ పై ప్రభుత్వం బ్రౌన్ కాంశ్య విగ్రహాన్ని నెలకొల్పి గౌరవించింది .కడప లో బ్రౌన్ బంగాళా లో బ్రౌన్ కాలేజి ని బ్రౌన్ లైబ్రరీ ని ,సేవా సంస్థను ఎకాడేమి ఏర్పాటు చేసి ఆయన సేవలకు నివాళులు అర్పించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-12-16 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్