గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3
17-బలదేవ చరిత్ర మహాకావ్య రచయిత-శ్రీనివాస రధ్
మధ్యభారతం లోని ఉజ్జయినికి చెందిన సంస్కృత కవి శ్రీనివాస రధ్ .కాళిదాస అకాడెమి సంరక్ష బాధ్యతలను సమర్ధ వంతంగా నిర్వహించాడు .1930లో ఒరిస్సాలోని పూరీలో జన్మించాడు .మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ ,మారేనా లలోను ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోను విద్య నేర్చాడు .తండ్రి సంప్రదాయ సంస్కృత పండితుడు .తండ్రి వద్దనే వ్యాకరణాది శాస్త్రాలు నేర్చాడు .ఆయన అభిమాన ముఖ్య గురువు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం లోని ప్రొఫెసర్ బలదేవ ఉపాధ్యాయ. రధ్ సాహెబ్ అని అందరి చేతా ఆప్యాయంగా పిలువబడే రధ్ ఉజ్జయిని లోని మాధవ కాలేజి లో సంస్కృత అధ్యాపకునిగా ఉద్యోగం లో చేరి విక్రం యూని వర్సిటిలో సంస్కృత ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాడు . ఆయన వద్ద చాలా యూని వర్సిటీ విద్యార్ధులు పరిశోధనలు చేసి డాక్ట రేట్ లు పొందారు .అనేక జాతీయ ,అ౦తర్జాతీయ సెమినార్లు నిర్వహించాడు .ప్రతి ఏడాది ఉజ్జయినిలో జరిగే’’ కాళిదాస సమారోహ్ ‘’ను అత్యంత వైభవం గా నిర్వహించటం లో సమర్ధుడు అనిపించుకొన్నాడు .ఉజ్జయిని నాటక శాలను ఏర్పాటు చేయటం నాటక ప్రదర్శనలు నిర్వహించటం లో ప్రత్యేక శ్రద్ధ చూపించాడు .అనేక సంస్కృత నాటకాలను ప్రదర్శన యోగ్యంగా మలచి ప్రదర్శించి ప్రజారంజనం చేశాడు .
యవ్వనం లోనే కవిత్వ రచన ప్రారంభించాడు .తన కవితలను అన్నిటినీ కలిపి ’’తదేవ గగనం సా ఏవ ధరా ‘’ (అదే ఆకాశం అదేభూమి ) కవితా సంపుటిని రాస్ట్రీయ సంస్కృత సంస్థాన్ 1990లో ప్రచురించింది .ద్వితీయ ముద్రణ పొందిన దీనికి 1999లో సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది . భారత రాష్ట్ర పతి ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నాడు .సంస్కృతం లో అసమాన గీత రచయిత(లిరిసిస్ట్ )గా ప్రసిద్ధి చెందాడు .ఆయన పాటలలో సంస్కృత మహాకావ్యాల అనునాదం,నవీన భావనల నేపధ్యంగా ,మహా కళాత్మకం గా నూతన అనుభూతి ని కలిగిస్తుంది . ఆయన మధుర కంఠస్వరం తో సంస్కృత కావ్యాలను చదివి వినిపిస్తుంటే తన్మయులమై వినే మహా భాగ్యం కలుగుతుంది .కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు తన కావ్యాలు చదువుతుంటే కలిగిన అనుభూతి గా ఉంటుంది . ఆయన ఒక సంస్కృత కవి దిగ్గజం .యువ తరం పై ,యువకవులపై ఆయన ప్రభావం ప్రబలంగా ఉన్నది .
రధ్ బృహద్రచన ‘’బలదేవ చరిత ‘’అనే మహా కావ్యం .
శ్రీనివాస రధ్ కవితలలో మన సంస్కృతీ వైభవం ,దేశ భక్తీ ,సాంఘిక సంస్కరణ ,మానవత్వ విలువలు ,దాతృత్వ విశేషాలు ఉన్నాయి .కవిత్వం సహజ సుందరంగా సరళం గా సూటిగా మనసుకు హత్తు కోనేట్లు రాయ గల నైపుణ్యం రధ్ ప్రత్యేకత .మాధుర్యం శ్రోతృ ప్రియత్వం ,మనోహర శైలి ,రధ్ కవిత్వానికి ముఖ్య లక్షణాలు .ఆధ్యాత్మిక అనుభూతికి విలువ నిచ్చాడు .సంఘం లో ఉన్న దురాచారాలు ,మూఢ విశ్వాసాలను ఖండించాడు.సాంఘిక రాజకీయ కాలుష్య నివారణే ధ్యేయంగా ఆయన కవిత్వం సాగుతుంది .
ఉజ్జయిని విక్రం యూని వర్సిటి నుండి సంస్కృత ప్రొఫెసర్ గా, కాళిదాస అకాడెమీ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు .10 వ అంతర్జాతీయ సంస్కృత కవి సమ్మేళనం 7-1-1977 నబెంగుళూరు లోని తరలబాబు కేంద్రం లో జరిగినప్పుడు శ్రీనివాస రధ్ దానికి చైర్మన్ గా వ్యవహరించాడు . ఎడిన్ బర్గ్ లో 13 వ అంతర్జాతీయ సంస్కృత సభ జరిగినప్పుడు ‘’కవి సమవాయ ‘’కార్యక్రమం లో శ్రీనివాస రధ్ తన సంస్కృత గేయాన్ని పాడి నందుకు తన్మయులై విని మురిసిపోయిన రసిక ప్రేక్షకజనం గౌరవంగా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభి నందించటం చారిత్రాత్మక విషయమైంది . 2002డిసెంబర్ 14-16 తేదీలలో పూరీలోని జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయం లో 41 వ అఖిల భారత ఓరి ఎంటల్ కాన్ఫ రెన్స్ లో శ్రీనివాస రధ్ కవిత్వం పై పరిశోధన పత్రం సమర్పించ బడింది .సంస్కృత మహా పండితులైన డా.హర్ష దేవ మాధవ్ ,డా హరే కృష్ణ మెహర్ లు రధ్ కవిత్వ౦ పై విశ్లేషణాత్మకమైన వ్యాసాలను ‘’దృక్’’అనే సంస్కృత సాహిత్య పత్రికలో రాశారు .రధ్ పై ఉన్న అపార గౌరవం తో ఆయన జీవిత సాహిత్యాలపై ముద్రించిన ప్రత్యేక అభినందన సంచికకు ఎస్.పి.నారంగ్ సంపాదకత్వం వహించాడు .
ఆధునిక సంస్కృత సాహిత్య వ్యాప్తికి అసమాన ,అమూల్య కృషి చేసిన శ్రీనివాస రధ్ సాహెబ్ ఉజ్జయినిలో 30-6-2014 న 84వ ఏట కవితా ‘’రద్’’ లో’’ శ్రీనివాస ‘’ధామం చేరుకొన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-12-16 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబా
—