గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
20-జీవన సాఫల్య పురస్కారం పొందిన దేవర్షి –కాలనాధ శాస్త్రి
మార్గ దర్శి
.భాషా శాస్త్ర వేత్త అయిన శాస్త్రి సంస్కృతం ,ఇంగ్లేష్ హిందీ భాషలలో విస్తృతంగా రచనలు చేసిన బహుభాషా వేత్త . భారతీయ భాషలకు సాంకేతిక పదాలను సంతరించి ,హిందీకి గౌరవ స్థానాన్ని తన రాష్ట్రం లోను ,భారతదేశమంతటా చేకూర్చి ,హిందీని అధికార భాషగా చేయటం లో సఫలీకృతుడైన వాడు .
ప్రాచీన భాష సంస్కృతానికి ఆధునిక సాహిత్య ప్రక్రియలు ,నూతన భావ వ్యక్తీకరణ విధానాలను సంతరించిన తండ్రి మధురా నాద శాస్త్రి భట్ ఆధునిక సంస్కృత సాహిత్యానికి మార్గ దర్శి .దాదాపు 25 సంస్కృత గ్రంధాలను రచించి ,దాదాపుగా అన్ని సంస్కృత ఇంగ్లీష్ హిందీ గ్రంధాలకు సంపాదకం వహించాడు కాలనాధ శాస్త్రి .తత్వ శాస్త్ర ,సాహిత్య ఉద్గ్రందాలను అనువదించిన పండితుడు . ప్రాకృత ,వ్రజభాష , రాజస్థాని ,ఇతర భారతీయ భాషలలోని ఉత్తమసాహిత్యాన్నీ అనువదించిన భాషా ప్రియుడు .
కాలనాధ శాస్త్రి దాదాపు వెయ్యి వ్యాసాలను సంస్కృతం హిందీ భాషలోదేశ, విదేశ ప్రముఖ పత్రికలకు రాసిన సాహితీ సంపన్నుడు .సంస్కృత హిందీ ఇంగ్లీష్ లలో సుమారు 200కు పైగా రేడియో, టెలివిజన్ ప్రసంగాలు చేశాడు .శాస్త్రి సాహిత్య చరిత్రకారుడు విమర్శకుడు విశ్లేషకుడు .ఆధునిక సంస్కృత సాహిత్యం లో ఫిక్షన్ రాసి దారి చూపి ,నవలలు కధలు ,స్వీయ అనుభూతులు రచించి 20వ శతాబ్దపు సంస్కృత సాహిత్యానికి తుస్టి,పుష్టి చేకూర్చాడు .
.రాజస్థాన్ సంస్కృత అకాడెమి కి 1995 నుంచి 98 వరకు చైర్మన్ గాను,సంస్కృత విద్యా భాషా విభాగాలకు డైరెక్టర్ గాను 1976 నుండి 1994 వరకు 18 ఏళ్ళు సేవ చేశాడు .
జనన విద్యాభ్యాసాలు
ఆధునిక సంస్కృతానికి జవ జీవాలు చేకూర్చిన కాలనాధ శాస్త్రి
15-7-1936న రాజస్థాన్ లోని జైపూర్ లో రాష్ట్ర పతి పురస్కారాన్ని అందుకొన్న సంస్కృత మహా విద్వాంసుడు భట్ మధురా నాద శాస్త్రి ,గిరిధర్ శర్మ చతుర్వేది ,పండిట్ పట్టాభి రామ శాస్త్రి ,పండిట్ హరిశాస్త్రి పండిట్ జగదీశ్ శర్మ మొదలైన ఉద్దండ పండితుల శిష్యరికం లో కాలనాధ శాస్త్రి సంస్కృతం ,అలంకార శాస్త్రం ,వేదాలు సకల శాస్త్రాలు ,తులనాత్మక భాషా శాస్త్రాలు నేర్చాడు .సంస్కృత భాషా శాస్త్ర ,అలంకార శాస్త్రాలలో సాటిలేని మేటి అయ్యాడు .తరువాత హిందీ, ఇంగ్లీష్ సాహిత్యాలు చదివి దిట్ట అనిపించుకొన్నాడు .
ఉద్యోగ సోపానం
ఇంగ్లీష్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రధమ శ్రేణి లో సాధించి ,రాజస్థాన్ యూని వర్సిటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజిలో 8 ఏళ్ళు ఇంగ్లీష్ భాషా సాహిత్యాలను బోధించాడు .తరువాతరాజస్థాన్ ప్రభుత్వ విద్యా శాఖ లో డిప్యూటీ డైరెక్టర్ అయి ,భాషా విభాగానికి తరువాత డైరెక్టర్ గా పదోన్నతి పొంది 1994 లో రిటైర్ అయ్యాడు .రాజస్థాన్ ప్రభుత్వ సంస్కృత విద్యకు డైరెక్టర్ గా ,రాజస్థాన్ సంస్కృత అకాడేమికి చైర్మన్ గా , జైపూర్ లోని జగద్గురు రామచంద్రా చార్య సంస్కృత విశ్వ విద్యాలయం లో కవి శిరోమణి భట్ట మధురానాద్ శాస్త్రి సంస్కృత పీఠం సంస్థాపన చైర్మన్ గా , రాజస్థాన్ ప్రభుత్వ హిందీ లా కమిటీలో శాశ్వత సభ్యునిగా ,కేంద్రీయ సంస్కృత బోర్డ్ ,నేషనల్ బుక్ ట్రస్ట్ ,సాహిత్య అకాడెమి సభ్యునిగా సేవలు అందించాడు .అనేక ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలలో సంస్కృత హిందీ భాషలకు చాలా హోదాలలో పని చేశాడు .జైపూర్ లోని ‘’మంజునాద్ స్మృతిసంస్థాన్ ‘’కు సంస్థాపక అధ్యక్షుడుగా శాస్త్రి ఉన్నాడు . .2013 నుంచి ‘’దేవర్షి ‘’కాలనాధ శాస్త్రి భారత ప్రభుత్వసంస్కృత కమిషన్ సభ్యుడుగా ఉన్నాడు .
బిరుదులు అవార్డులు రివార్డులు
దేశ విదేశాలలోని అనేక యూని వర్సిటీలు సాహిత్య విద్యా సంస్థలు కాలనాధ శాస్త్రి త్రిభాషా పాండిత్యాన్ని గుర్తించి గౌరవించి సత్కరించాయి .2008లో రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదునిచ్చి సన్మానించింది .సాహిత్య మహోదధి ,సాహిత్య శిరోమణి ,లతోపాటు రాజస్థాన్ ప్రభుత్వం నుంచి , ఉత్తర ప్రదేశ్ సంస్కృత సంస్థాన్ నుంచి సంస్కృత భాషా సేవకుగాను ‘’జీవన సాఫల్య పురస్కారం’’ అందుకొన్నాడు .2004 లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ ను ,కేంద్ర మానవ వనరుల శాఖ చే గౌరవ పురస్కారాన్ని ,1998 లో సంస్కృతం లో విశిష్ట సేవ కు రాష్ట్ర పతి పురస్కారాన్ని రాష్ట్రపతి శ్రీ కే ఆర్ నారాయణన్ గారి చేతులమీదుగా అందుకొన్నాడు.సంస్కృత భాషా సేవలో పండిన కాలనాధ శాస్త్రిని ‘’రాజర్షి ‘’అన్నారు .
కాలనాధీయ భాషా శాస్త్రీయం
ఆఖ్యాన వల్లరి అనే సంస్కృత కవితల సంపుటి,జీవనస్య పృష్ట ద్వయం ,కవితావల్లరి ,కదానక వల్లరి ,విద్వజ్జన చరితామృతం ,భారతీయ సంస్కృతీ ,ఆధునిక సాంస్క్రిట్ సాహిత్య ,సంస్కృత నాట్య వల్లరి ,సుధీ జనావృత్తం ,సాంస్క్రిట్ కే యుగ పురుష్,మేకర్స్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ ,భారతీయ దర్శన్ కా ఇతిహాస్ ,వర్క్స్ ఆఫ్ పండిత జగన్నాధ పోయెట్రి, సాంస్క్రిట్ కే గౌరవ షికార్ ,ఆధునిక కాల్ కా సంస్కృత గద్య సాహిత్య ,వన్ హండ్రెడ్ యియర్స్ ఆఫ్ ఫిలాసఫీ –మొదలైనవి .’’భారతి ‘’ సంస్కృత పత్రికకు శాస్త్రి సంపాదకుడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-16-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్