గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి

ఆకాశం లో సగభాగం అయిన మహిళలు సాధించ రానిది ఏమీ ఉండదు అని నిరూపించిన  తెలుగింటి ఆడపడుచు డా అయ్యగారి ప్రభావతీ దేవి .చురుకైన మేధ,తలిదండ్రుల వారసత్వం ,తీర్చి దిద్దిన గురుదేవులు ,స్వయం కృషి ,పట్టుదల ,సాహసం తనను తానునిరూపించుకోవాలనే మనో నిశ్చయం వలన శ్రీమతి ప్రభావతీ దేవి గారు అనుకున్నవన్నీ సాధించారు . స్వయం సిద్ధ అయిన ఆమె జీవితం స్పూర్తి దాయకం .

దేవీ విలాసం –తాత తండ్రిల వారసత్వం

విద్వాత్కవులు ,పురాణ పరమేష్టి,ఆంద్ర వ్యాసులు ,సంస్క్రుతకళాశాల ప్రిన్సిపాల్ ,డీన్ శ్రీ  ఏలూరిపాటి అనంతరామయ్యగారు శ్రీమతి ప్రభావతీ దేవి గారి గురించి రాసిన ‘’దేవీ విలాసం ‘’వలన ఈమె  దేశభక్తుడు  ,స్వాతంత్రోద్యమం లో జైలుకు వెళ్లి,దానికి సంబంధించిన ఏ విధమైన ప్రతి ఫలం ప్రభుత్వం నుంచి ఆశించని త్యాగ శీలి అయిన శ్రీ  అయ్యగారి సుబ్బారావు గారి కుమార్తె అని , తల్లి శ్రీమతి శ్యామలంబ అని ,తండ్రి  ప్రయాగలో ఒక పుష్కర కాలం ఉండి సంస్కృతం ,హిందీ లలో ప్రావీణ్యం సాధించారని ,తాతగారు కుమార స్వామిగారు చతురాశ్రమ నిష్టా గరిస్టులని,వీరి సన్యాసాశ్రమ నామం ‘’కేశవానంద సరస్వతి ‘’అని స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా కొత్త పేట తాలూకా బండారులంక అని ,తాత ,దండ్రుల సంస్కృత భాషాభిమానం, అభినివేశం ఈమెకు సంక్రమించిందని తెలుస్తోంది .తండ్రికి ఈ కుమార్తెపై ఆ శ్రీదేవి మీద  భక్తి ఉన్నంత వాత్సల్యం ఉండేది ‘.ప్రాణం కన్నా ఎక్కువగా పెంచారు .వారి వ్యక్తిత్వమే ఈదేవిగారికి అబ్బింది  .తండ్రి గొప్ప గణిత శాస్త్రాభిమాని .ఆయన స్వయంగా రూపొందించి గ్రంధస్థం చేసిన ‘’దీరమ్స్ ‘’చాలా ఉన్నాయి  ప్రభావతీ దేవిగారి అన్నగారు శ్రీ భుజంగరావు ఆల్విన్ సంస్థలో ఉద్యోగించి స్వచ్చంద పదవీ విరమణ చేసిన కమ్యూనిస్ట్ అభిమాని .తనకు పదవీ విరమణ సమయం లో కంపెనీ ఇచ్చిన ధనాన్నంతా పార్టీకే సమర్పించి ,సఫిల్ గూడా లో ఉంటున్నత్యాగి .

దేవి విద్యా సోపానం

ప్రభావతీ దేవి 29-6-1955 లో జన్మించారు .  1988 లో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి  చదివి తెలుగు ఎం.ఏ.పొందారు . 1991 లో  ఇంగ్లీష్ లో ఎం ఏ .ను ప్రైవేట్ గా చదివి సాధించి ,తర్వాత అదే యూని వర్సిటీ ఆర్ట్స్ కాలేజిలో చదివి సంస్కృతం లోనూ ఎం. ఏ .అందుకొన్నారు .’’సంస్కృతాంధ్ర భాగవతాస్టమ స్కంధాను శీలనం ‘’పై ఎం .ఫిల్ పట్టా పొందారు .విద్యాదాహం తీరని దేవి 1996 లో జర్నలిజం కోర్సు చేసి, హైదరాబాద్ తెలుగు విశ్వ విద్యాలయం లో ‘’జ్యోతిషం ‘’డిప్లొమా తరగతులకు హాజరై జ్యోతిషం నేర్చారు కాని జాతకాలు వేయరు చెప్పరు .హిందీ తమిళ ,ఉర్దూలను అభ్యసించిన వీరు సెంట్రల్ ఇన్ స్టి ట్యూట్ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ లో 1998 లోస్పానిష్ భాషలో ప్రిలిమినరి కోర్సు చేశారు .ఆచార్య బూరగడ్డ నరసింహా చార్య వద్ద ఉస్మానియాలో ‘’సంస్కృత వాజ్మాయే నీతి కావ్యాని ‘’అనే విషయం పై పరిశోధన చేసి 2004 లో పి .హెచ్ .డి.పొందారు .

ఉద్యోగ సోపానం

ప్రభావతీ దేవి గారికి నాట్యం వ్రుత్తి కాదు కాని పాఠ శాల వార్షికోత్సవాలలో నాట్యం చేసేవారు .శ్రీ కృష్ణుడు వీరి అభిమాన పాత్ర .కాళిదాసు శకుంతల సంస్కృత నాటక౦ లో శకుంతల పాత్ర ,మరికొన్ని సంస్కృత నాటకాలలో ముఖ్య పాత్రలనూ పోషించారు .ఉపాధ్యాయ వ్రుత్తి పై అభిమానం ఉండటం తో కొంతకాలం రంగా రెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్స్ లో తెలుగు పండితులుగా పని చేసి స్వచ్చందం గా విరమించి , సికందరాబాద్ మెహబూబ్ డిగ్రీ కాలేజి లో సంస్కృతం లెక్చరర్ గా1996 లో చేరి  పని చేస్తూ ,సంస్కృత పరి చర్య చేస్తూ 2007 లో స్వచ్చంద పదవీ విరమణ చేశారు .2010 నుంచి అమెరికాలో ఉంటున్నారు .1988 లో హైదరాబాద్ లో ఆంద్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యం లో నేషనల్ ఓరియెంటల్ కాన్ఫ రెన్స్ లో 1-శ్రీ రాయప్రోలు సుబ్బా రావు ‘’అమలిన శృంగార తత్త్వం లోని ఔచిత్యం 2-సంస్కృత వాజ్మాయే ప్రహేళిక ‘’అనే రెండు పరిశోధన పత్రాలను సమర్పించారు ..1988 లో తిరుపతి లో జరిగిన విశ్వ హిందూపరిషత్ ధర్మ సమ్మేళనం లో ‘’హిందూ ధర్మ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ‘’పేపర్ ను,2002మార్చి  లో వారణాసి లో జరిగిన అఖిల భారత సంస్కృత సమ్మేళనం లో ‘’వైదిక ,లౌకిక సాహిత్య కరణా దృస్టౌ నారి ‘’పేపర్ ను సమర్పించారు .

దేవి సామాజిక సేవ

బహుముఖ ప్రజ్ఞాశీలి శ్రీమతి ప్రభావతీదేవి కి విద్యా తృష్ణ తోపాటు సాంఘిక సేవాభిలాష కూడా ఎక్కువే .తండ్రినుంచి సంక్రమించిన స్వతంత్ర దృక్పధం ఆమెను అన్నిరంగాలలో అగ్రేసర స్థానం లో నిలబెట్టింది .తండ్రి కాంగ్రెస్, అన్న కమ్యూనిస్ట్ అయితే దేవి గారు భారతీయ జనతాపార్టీ లో చేరి 1990 నుండి రెండేళ్ళు రంగా రెడ్డి జిల్లా స్త్రీ విభాగం లో అవిరామం గా పనిచేశారు .1993 లో భా జ.పా .కార్య వర్గసభ్యురాలిగా సేవలందించారు .ఆ భావ ధారఉన్న సంస్థలకు తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు .సఫిల్ గుడా లయన్స్ క్లబ్ చార్టర్ మెంబర్ గా ,ప్రెసిడెంట్ గా ఒక దశాబ్దం పైగాఉండి వివిధ సేవాకార్యక్రమాలను చేబట్టి నిర్వహించారు . బోలారం మహా కాళీ దేవాలయ ధర్మ కర్త్రుత్వసంఘ సభ్యురాలుగా చాలాకాలం ఉన్నారు .స్మార్తం క్షుణ్ణంగా అభ్యసించి కావాలనుకొనే వారికీ పౌరోహిత్యమూ నిర్వహిస్తున్నారు .

వివాహ బంధం

శ్రీ ఏలూరి పాటి వారి ‘’దేవీ విలాసం ‘’వలన ప్రభావతీ దేవిగారుసౌదీ అరేబియాలో ఇంజినీర్ గా పని చేసి ప్రస్తుత౦ అమెరికాలో సివిల్ ఇంజనీర్ గా ప్రముఖ పదవిలో ఉన్న పని  శ్రీ రాచపూడి హర గోపాల శర్మగారిని వివాహమాడి,సుగాత్రీ శర్మ ,లలితా సుహాసినీ అనేకుమార్తెలను ,కళ్యాణ చక్రవర్తి అనే కుమారుని ఆ దంపతులు సంతానంగా పొందారని.అందరకూ వివాహాలు చేసి బాధ్యతలు తీర్చుకున్నారని తెలుస్తోంది .

దేవి వ్యక్తిత్వ వికాసం

బహుముఖీన వ్యక్తిత్వ వైదుష్యాలు పెంచుకొంటూ పిల్లల విద్యాభి వృద్ధికి దోహదపడుతూ ,అన్ని రంగాలో అనుక్షణం ప్రశంసనీయకృషి చేస్తూ తన తన గురు పండితాదులకు   చేసే సేవనిరుపమానం అంటారు అనంత రామయ్యగారు  .ఒక చేతి తో చేసే దాతృత్వం రెండో చేతికి తెలియ కుండా చేసే గుణ సంపన్నురాలు .పాఠ శాల వ వార్షికోత్సవాలకు హాజరవుతూ వారి వికాసానికి దోహద పడుతూ ఆమె చేస్తున్న సేవ ఆమె నిరహంకార వ్యక్తిత్వానికి దర్పణం .ప్రాచీన పద్ధతిలో శాస్త్రాధ్యయనం చేసిన వారంటే ఆమెకు ప్రత్యేక గౌరవం .శ్రీ కేరళ సుబ్రహ్మణ్య శాస్త్రి సాహిత్య శాస్త్ర గురువుగా ,శ్రీ రామ స్వామి శాస్త్రి ఘన పాఠి గారు వ్యాకరణ శాస్త్ర గురువుగా ,ఆమె ప్రత్యేకంగా చెప్పుకొని గౌరవిస్తారు .అలాగే ఉస్మానియా లో తన గురువు, మార్గ దర్శి శ్రీ బి నరసింహాచార్య అంటే వల్లమాలిన భక్తీ వినయం ప్రదర్శిస్తారు .ఆమె ఆరాధ్యదైవం శ్రీ లలితా పరా భట్టారిక ను అనునిత్యం పూజింఛి సహస్రనామ పారాయణ చేయనిదే ప్రభావతీ దేవిగారు ఆహారం స్వీకరించరు .పారాయణ సమయం లో ఎవ్వరితోనూ మాట్లాడని దీక్ష ఆమెది దేవి ముందు చేసిన ప్రతిజ్ఞ అతిక్రమించదు .ప్రతి ఏడాది ఆమె నిర్వహించే చండీ హోమం రుద్రాభిషేకం చూసి తీరవలసి౦దేకాని మాటలతో  వర్ణించేది కాదంటారు ఏలూరి పాటి వారు .’’ఒకరు చెప్పింది చేయదు తనకు తోచింది చేయక మానదు .వట్టి ‘’చండిక ‘’‘’అంటారాయన .ఆపదలలో ఉన్న వారిని ఆడుకోవటానికి ఎంత దూరమైనా వెడుతుంది ఎంత ఖర్చైనా పెడుతుంది .సామాన్యులకు ఆమె మాట సుగ్రీవాజ్న .గుణ గ్రాహిణి,ఏక సంథ గ్రాహిణి .సంస్కృత సాహిత్య శాస్త్రం లో రసవంతాలైన శ్లోకాలెన్నో ఆమె జుహ్వాగ్రం పై నర్తిస్తాయి .ఆకాశవాణి కేంద్రం లో అమరవాణి కార్యక్రమాలలో ఆమె చేసిన ప్రసంగాలు ,స్వీయ కవితలు సమ్మోహనాలు, చిరస్మరణీయాలు అంటారు అనంతరామయ్యగారు .హైదరాబాద్ దూర దర్శిని లో ప్రసారమైన ‘’పద్యాల తో’’రణం’’కార్యక్రమం లో మూడు సార్లు ఆమె స్థాన నిర్ణేతగా వ్యవహరించి సమర్ధత చాటారు .అదే సంస్థ లో ఎర్రా ప్రగడ కవిత్వం పై ముఖా ముఖి కార్యక్రమం లోనూ పాల్గొన్నారు . ఒక ఓరియెంటల్ కార్యక్రమం లో ‘’అమలిన శృంగారం ‘’వాదాన్ని ఆక్షేపించి వచ్చిన ప్రతివాదాన్నీ ఎదుర్కొని సమాధానం చెప్పి నెగ్గిన తీరు మర్చి పోలేనిదంటారు శ్రీ  ఏలూరి పాటి .నల్లకుంట శంకర మఠం మొదలైన దేవతా స్థానాలలో ‘’దేవీ భాగవత సప్త శతి ‘’,మొదలైన ఆధ్యాత్మిక గ్రంధాలలోని పరమాద్భుత విశేషాలను వివరిస్తూ చేసిన ప్రసంగాలు స్తవనీయాలు ‘.పురుషాధిక్యాన్ని ధిక్కరించే తత్త్వం శ్రీ దేవిగారిది .శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ ,శ్రీ గరికపాటి నరసింహారావు శ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్ లవంటి లబ్ధ ప్రతిష్టులైన అవధానుల  తెలుగు సంస్కృత కవి  సమ్మేళనాలలో  పృచ్చకులుగా వ్యవహరించారు .శ్రీమతి ప్రభావతీ దేవిగారికి శ్రీ పుష్పగిరి పీఠాదిపతుల అమోఘ ఆశీస్సులున్నాయి.

రచనా ప్రభావతీయం

అభిజ్ఞాన శాకుంతలం పై సమీక్ష రాశారు .ఆంద్ర భూమి దినపత్రికలో 2001 -2002 కాలం లో శ్రీకృష్ణ కర్ణామృతం ‘’ధారావాహిక గా ప్రభావతీదేవి గారు రచించారు.1987 లో ‘’శ్రీ బోలారం మహా కాళీ సుప్రభాతం 2-2001 లో ‘’కుతోవా మానుష్యం ‘’?(మానవత్వం ఎక్కడ )3-2004 లో శశిరేఖా విజయం అనే నాటకం  4-బాలికా పంచాశికా 5కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి ‘’వేయి పడగలు ‘’నవల ను సంస్కృతం లోకి ‘’సహస్ర ఫణాః’’పేరుతొ అనువదించారు .దీని వ్రాత ప్రతి ఆవిష్కరి౦పబడింది .పుస్తక రూపం లో ఇంకా వెలువడలేదు .6 ‘గురు ధిక్కారం –శిష్య వాత్సల్యం’’ కూడా ముద్రణ పొందాలి .

దేవీ పురస్కార వైభవం

ప్రభావతీ దేవిగారి ప్రతిభకు తగిన పురస్కారాలు లభించాయి .1977 లో ‘’మధుర కవయిత్రి ‘’బిరుదును కంటోన్ మెంట్ టీచర్స్ యూనియన్ ప్రదానం చేసింది .1987 లో ‘’భారతీ ప్రభ ‘’బిరుదునిచ్చి ‘’సువర్ణ కంకణం ‘’బహూకరించి బోలారం మహా కాళి దేవాలయం సత్కరించింది .2003 లో ‘’గీర్వాణ భాషా సుభాషా ‘’నవ్య కళాసాగర్ సాహిత్య సంస్థ ప్రసిద్ధరచయిత శ్రీ పోతుకూచి సాంబశివరావు ,చేత సువర్ణ కంకణం ను రైల్వే మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా అంద జేసింది

ఆధారం –1-శ్రీమతి ప్రభావతీ దేవి గారి సంస్కృత రచన ‘’కుతోవా మానుష్యం ‘’లో శ్రీఏలూరి పాటి అనంత రామయ్య గారి వ్యాసం ‘’దేవీ విలాసం ‘’.

2-డా.బి నరసింహా చార్య గారిని నాకు ఫోన్ లో పరిచయం చేసిన వారు మా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు(అమెరికా ) .ఆచార్యులగారు తమ పుస్తకాలను నాకు పంపారు .వారితో సంభాషించేటప్పుడు వారు శ్రీమతి అయ్యగారి ప్రభావతీ దేవి గారి వైదుష్యాన్ని ఆమె వేయి పడగలు ను సంస్కృతం లో కి అనువదించటాన్ని,ఆమెఅద్భత కవితా సామర్ధ్యాన్ని  తెలియజేసి ఆమె పై కూడా 3 వ గీర్వాణం లో నన్నుతప్పక  రాయమని ప్రోత్సహింఛి ఆమె ఫోన్ నంబర్ ఇచ్చారు .వారితో సంభాషించాను .ఆమె వ్యక్తిత్వం నచ్చింది .ఫోన్ లోనే ఇంటర్వ్యు చేశాను .కొన్ని వివరాలు చెప్పారు .శ్రీ ఏలూరి పాటివారు విపులంగా తనను గురించి రాశారని ఆ పుస్తకం తనవద్ద ప్రస్తుతం లేదని చెప్పారు .ఆమె మెయిల్ అడ్రస్ కు సరసభారతి టపాలు పంపుతున్నాను .రెండవ గీర్వాణం ,మాణిక్యాలు ,సీతారామయ్య, దైవ చిత్తం ,మా అన్నయ్య పుస్తకాలు పోస్ట్ లో పంపాను డిసెంబర్ 26  న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆమె తనకు పుస్తకాలు అందాయని మెయిల్ రాశారు .సమాధానం గామేము హైదరాబాద్ లో నాచారం దగ్గర మల్లాపూర్ లో ఉన్నామని రాశాను .వెంటనే మమ్మల్ని మాకు దగ్గరలోనే ఉన్న మెట్టుగూడాలోని తమ అపార్ట్ మెంట్  కు రమ్మని ఆహ్వానించారు .సరేనని వెళ్లాం .గీర్వాణం మొదటిభాగం కూడా అప్పుడు వారికి అందజేశాను .అప్పుడు ఆమె రచనలు మూడు పుస్తకాలు ఇచ్చారు . నేను ఆమెను ఇంటర్వ్యు కూడా చేశాను. అన్నిటికీ చక్కని సంతృప్తికర సమాధానాలు చెప్పారు తమ పౌరోహిత్య పాటవాన్ని సెల్ ద్వారా రికార్డ్ చేసింది వినిపించారు . ఇవన్నీ కూడా ఈ రచనకు ఆధారాలే .దీనికి కంతటికీ కారణ భూతులైన  శ్రీ మైనేని శ్రీ నరసింహా చార్య శ్రీమతి ప్రభావతీ దేవి గార్లకు కృతజ్ఞతలు .

డా .శ్రీమతి అయ్యగారి ప్రభావతీ దేవి గారి గీర్వాణ కవితా వైదుష్యాన్ని తరువాత తెలుసుకొందాం .

Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-1-17 –ఆదివారం

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.