ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశి నే వైకుంఠ ఏకాదశి అంటారు .ఏకాదశి అంటే ఒక తిదిమాత్రమేకాడు ,ఒక దేవత పేరు ,10 ఇంద్రియాలను అదుపులో పెట్టేది ,ఉపవాసాలకు ముఖ్యమైన రోజు ,విష్ణువుకు పరమ ప్రీతి కరమైన రోజు . ఏడాదికి  శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చే ఏకాదశులు 24 .అధికమాసమైతే 26 వస్తాయి . ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి.భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన ఏకాదశి ,కార్తీక శుద్ధ ఏకాదశి బోధన లేక ఉత్ధాన  ఏకాదశి .మాఘ శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి .సూర్యుడు ధనుర్మాసం లో ఉన్నకాలం లో మార్గశిర లేక పుష్యమాసం లో వచ్చేదే ముక్కోటి ఏకాదశి .3 కోట్ల దేవతలతో కలిసి శ్రీ మన్నారాయణుడు ఈ రోజునే దర్శన మిస్తాడు .అందుకే ఆ పేరు .ఈ రోజు ఉపవాసం ఉంటె 3 కోట్ల ఏకాదశులలో చేసే ఉపవాస ఫలితం ,పుణ్యం వైకుంఠ ఏకాదశి నాడు చేస్తే లభిస్తుంది .

మనదేవతల సంఖ్య 33 కోట్లు .కాని ‘’అసహస్రాత్ ‘’అనే వేద ప్రమాణాన్ని బట్టి అసంఖ్యాకం అని అర్ధం అంటే అంతా దేవతామయమే .విష్ణు మయమే .ఒక్కడే పరమాత్మ ఇన్ని రూపాలలో ఉన్నాడని భావం .ఇక్కడ 3  కధలు తెలుసు కొందాం .ఒక మన్వంతరం లో ‘’వికు౦ఠ’’అనే తల్లికి  విష్ణువు కుమారుడిగా పుట్టాడు .అందుకే’’ వైకుంఠుడు’’అంటారు .రెండోకద –కృత యుగం లో చంద్రావతి నగరాన్ని’’ మురుడు’’అనే రాక్షసుడు పాలిస్తూ దేవతలను క్షోభ పెట్టాడు .అప్పుడు వైకుంఠంనుంచి విష్ణువు దిగి వచ్చి వాడిని చంపటానికి ప్రత్యేక అస్త్రం కావాలని బదరికాశ్రమం లోహైమావతి అనే  ఒక గుహలో ప్రవేశించాడు .ముర ఇక్కడే విష్ణువు దాక్కున్నాడని తెలిసి గుహలోకి ప్రవేశించాడు .అప్పుడు విష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి కంటి చూపుతో మురాసురుని కాల్చేసింది .సంతోషించిన విష్ణువు ఆమె కు ‘’ఏకాదశి ‘’అని పేరు పెట్టి  వరం కోరుకోమంటే ,ఏకాదశినాడు ఉపవాసం ఉన్నవారి పాపాలను సంహరించాలని కోరింది తధాస్తు అంటూ వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారికి మోక్షం కలుగుతుందని  మురారి వరమిచ్చాడు .(వ్రత చూడామణి ).ఈ ఏకాదశినాడు మురాసురుడు బియ్యం లో దాక్కుంటాడని అందుకే బియ్యం తో చేసిన పదార్ధాలు తినరాదని ,తులసి నీరు తాగుతూ ఉపవాసం ఉండాలని అంటారు .ముర అంటే తామసిక రాజసిక గుణాలకు ,అరిషడ్వర్గాలకు ప్రతీక . ఉపవాసం చేస్తే సత్వ గుణం పెరిగి ముక్తికి మార్గం అవుతుంది .3 వ కధ-కు౦భుని కొడుకైన మద మన్యుడు అనే రాక్షసుడు శివునికై తపస్సు చేసి ‘’అయోనిజ ‘’వల్లనే తాను చనిపోయే వరం పొందాడు .లోక కంటకం గా వాడు ప్రవర్తిస్తుంటే  విష్ణువు వాడిని సంహరించటానికి ‘’సింహా వతి ‘’అనే గుహలో ప్రవేశించాడు .ఆ గుహ అంచుల స్వామి శరీరం రాపిడి చెంది ఏకాదశి అనే స్త్రీ గా మారి ఆమె శక్తితో మదమన్యుడిని సంహరించాడు .

మధ్యలో ఈ అ౦చు లేమిటి?అవే జాగ్రత్ స్వప్న సుషుప్తి లు .కుట నుంచి కోటి శబ్దం పుట్టింది కుట అంటే కౌటిల్యం లేక వంకర .అంచులకు కోటి అనే పేరుంది .బాలకృష్ణుడు కొన గోట గోవర్ధన పర్వతాన్ని ఎత్తి నిలబెట్టాడు  అని మనం విన్నాం .  కనుక పై మూడు అవస్థల అంచుల్ని తాకి మనల్ని పునీతుల్ని చేసేది అని ముక్కోటి ఏకాదశి పరమార్ధం .

ఒక సారి శ్రీరంగం వెడదాం

‘’శ్రీ రంగ ద్వారస్థ భగవదాలోకన మహోత్సవం –ముక్కోటి ఏకాదశి ‘’అని పంచాగ కర్తలు రాస్తారు . శ్రీరంగం లో రంగ నాద స్వామి దక్షిణాభి ముఖం గా శయనించి  ఉంటాడు .ముక్కోటి నాడు ఉత్తర ద్వారం దగ్గర దర్శనం కలుగ జేస్తారు .స్వామిని వజ్రాలు అలంకరించిన వస్త్రాలతో అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణం లో ఉత్తర ద్వారం దగ్గర దర్శన మిప్పిస్తారు .ఇక్కడ 21 రోజుల ఉత్సవం చేస్తారు .ఉదయం పూట చేసే పూజను ‘’పాగల్ పట్టు ‘’అని రాత్రి చేసే పూజను ‘’ఇర పట్టు ‘’అంటారు .

అసలు శ్రీరంగం లో రంగ నాధుడు ఎలా వెలిశాడు?

ప్రళయం తర్వాత బ్రహ్మకు విష్ణు మూర్తి ఆది శేషునిపై పవళించి దేవేరులతో సకల దేవతలతో దర్శన మిచ్చి ‘’జ్యోతిశ్శాస్త్రం’’బోధించాడు .తరువాత బ్రహ్మ కోరిక మేరకు ‘’విమానం ‘’లో వెలిశాడు .ఆ మూర్తి స్వరూపమే శ్రీ రంగ నాధుడు . ఆ మూర్తి ఇక్ష్వాకు రాజులకు లభించింది .ఇక్ష్వాకు వంశ రాజుల ఇలవేలుపు రంగనాధుడు .ఆ వంశం లో శ్రీరాముని వరకు రంగనాధుని పూజించారు .శ్రీరాముడు అవతార సమాప్తి చేసేటప్పుడు ఆ మూర్తి ని విభీషణుడికి ఇచ్చాడు .దాన్ని లంకకు తీసుకు వెడుతూ దారిలో సంధ్యావందన కాలం అయిందని ,ఒక బాలుడి రూపం లో ఉన్న వినాయకుడికి అప్పగించి దాన్ని కిందపెట్టావద్దని బతిమాలి చెప్పాడు .కాని బరువు మోయలేక వాడు కింద పెట్టేశాడు .విభీషణుడు వచ్చి నెత్తీ నోరు కొట్టుకొన్నాడు .అక్కడే ఆలయం కట్టి ప్రతిష్టించి పూజించి ప్రతి ముక్కోటికీ వచ్చి దర్శనం చేసుకొనేవాడు .

ఉత్తర ద్వార దర్శనం దేనికి?

ధనుర్మాసం ప్రారంభం  లో మూసి ఉన్న స్వర్గ ద్వారాలు తెరుచుకొంటాయి .దేవతలకు 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి అని మనకు తెలుసు .దక్షిణాయణ౦  నుంచి ఉత్తరాయణ పుణ్య కాలానికి అంటే చీకటి లో నుంచి వెలుగులోకి అంటే పగలులోకి దేవతలు ప్రవేశిస్తారన్నమాట .స్వర్గ ద్వారాలు తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది .అందుకే ఉత్తర ద్వార దర్శనం .దేవతలు ఈ రోజు దివి నుండి భువికి దిగి వస్తారు .వైకుంఠ ద్వారమే సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచిక .ఈ  రోజు విష్ణు దర్శనం మోక్ష ప్రాప్తి .

ఇందులో శాస్త్రీయ భావన

ఉత్తర ద్వార దర్శనం అంటే ఆకాశం లో శ్రవణా నక్షత్ర మండలం లో 3 కోట్ల నక్షత్రాలు అంటే దేవతలు వెంట రాగా విశ్వ వ్యాపితుడైన శ్రీమన్నారాయుణుడిని దర్శించటం అన్నమాట .

మనిషి ముఖానికి ఎదురుగా ఉండేది తూర్పు (ఉదయం ) .వీపు వైపు పడమర .కాళ్ళ వైపు దక్షిణం .శిరసు వైపు ఉత్తరం .కనుక హృదయ కుహరం లో స్వామిని దర్శించాలని అర్ధం .-‘’నిహిత గుహా యాం విభ్రాజితే ‘’

ఉపవాసం ఎందుకు ?

శాస్త్రీయం గా దీనికి సమాధానం తెలుసుకొందాం –చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు రోజుకు 12 డిగ్రీల చొప్పున తిరుగుతాడు .పాడ్యమి నుంచి పౌర్ణమికి 180డిగ్రీలు. పౌర్ణమి నుంచి అమావాస్య కు 180డిగ్రీలు .మొత్తం 360డిగ్రీలు .దీనితో ఒక ఆవర్తనం పూర్తి అవుతుంది .ఏకాదశి తిదినాటికి 120 నుంచి 132 డిగ్రీలు ఉంటుంది.దీన్ని ‘’త్రికోణ ‘’సమయం అంటారు .పౌర్ణమి ,అమావాస్యలలో చంద్రుని ప్రభావం సముద్రం మీద అంటే నీటి మీద ఎక్కువ అని తెలిసిన విషయమే .అప్పుడే సముద్రానికి ఆటూపోటూ వస్తాయి .  మనశరీరం లో 80 శాతం నీరే .కనుక ఏకాదశినాడు చంద్ర ప్రభావం మన పొట్ట మీద బాగా ఉంటుంది .పొట్టలో ఆహారం ఉంటే చంద్ర కిరణాలు పడి జీర్ణ శక్తిని దెబ్బ తీస్తాయి .అందుకే ఉపవాసం చేయాలి .

ఉపవాసం తో పాటు ఇంకా ఏమేం చేయాలి ?

ముక్కోటి ఏకాదశినాడు తెల్లవారు ఝాముననే ‘’ఉసిరిక ‘’ముద్దతో శరీరం అంతా పూసుకొని సూర్యోదయానికి ముందే తలారా స్నానం చేయాలి .ఉపవాసముండాలి .తులసి దళాలు వేసిన నీటిని మాత్రమే త్రాగాలి .మౌనంగా ఉండటం మేలు .విష్ణు సహస్ర పారాయణ ఉత్తమం .సాధ్యమైనంత వరకూ ఎవరినీ తాకకుండా ఉండటం మంచిది .రాత్రి హరినామ స్మరణ తో జాగరణ చేయాలి .

పుత్రద ఏకాదశి

ముక్కోటి ఏకాదశిని ‘’పుత్రద ఏకాదశి ‘’అనీ పిలుస్తారు .ఒకప్పుడు సుకేతుడు అనే మహా రాజు భాద్రావతి  నగరాన్ని పాలిస్తున్నాడు .భార్య చంపక .పుత్ర సంతానం కోసం దంపతులు ఎన్నో తీర్ధ యాత్రలు చేశారు .అప్పుడు కొందరు ఋషులు వారిని ఏకాదశీ వ్రతాన్ని చేస్తే పుత్ర సంతానం కలుగుతుందని చెప్పారు .వ్రత విధానం వారి వలన తెలుసుకొని ఏకాదశీ వ్రతం చేసి ,భగవానుని అనుగ్రహం వలన పుత్రసంతానం పొందారు .అందుకే పుత్రద ఏకాదశి అనే పేరొచ్చింది .

తిరుమల ,భద్రాచలం లలో ఉత్తర ద్వారా దర్శనాలకు ప్రత్యేకత ఉంది .మిగిలిన అన్ని వైష్ణవాలయాలలో  స్వాములకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి తరింప జేసి ,మోక్ష ప్రాప్తి కలిగిస్తారు .

Inline image 1Inline image 2Inline image 3

8-1-17 ఆదివారం   ముక్కోటి ఏకాదశి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-17 –ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.